Previous Page
మిసెస్ కైలాసం పేజి 49

 

    కొన్ని నెలలు గడిచాయి. మిసెస్ కైలాసం భయాలన్నీ తీరిపోయాయి. రోజూ ఒక గంటయినా కూర్చొని ఆఫీసు విషయాలు విన్నవించుకుంటూ వుంటుంది.
    ఒకరోజు ఆఫీసరు పిలుస్తున్నాడనగానే ఆగమేఘాలమీద వాలిపోయింది ఆఫీసరు గదిలో.
    నవ్వుతూ 'పిలిచారా' అతి మృదువుగా అడిగింది. అంత పెద్దావిడ అంత మృదువుగా మాట్లాడినప్పుడు ఆఫీసరుకు అదోలా అనిపించి చిరాకు వేసింది.
    "కూర్చోండి. మీకో ముఖ్య విషయం చెప్పాలి" అన్నాడు ఆఫీసరు.
    ముఖ్య విషయం తనతోనే చెప్పలట. తనకంటే సీనియర్ ఆఫీసర్లు వుండగా అంత ముఖ్య విషయం తనతోనే చెప్పలంటున్నాడు ఎంత మంచివాడు.
    "సర్!" వణుకుతున్న స్వరంతో కృతజ్ఞత ఉట్టిపడుతూ అంది.
    "చూడండి! గవర్నమెంటు నుంచి ఎకానమీ మెజర్స్ అబ్జర్వ్ చెయ్యాలని ఇన్ స్ట్రక్షన్స్ వచ్చాయి. పది పర్సెంటు కట్ చూపించాలి."
    ఆఫీసరు అందించిన కాగితం చూస్తూనే మిసెస్ కైలాసం ముఖం ఆనంద భరితం అయింది.
    "సమయానికి వచ్చింది సర్! పనికి మాలిన వాళ్ళు చాలామంది వున్నారు" అంది ఉత్సాహంగా .
    "పనికి మాలినవాళ్ళను గురించి కాదు, పనిలేని వాళ్ళను గురించి ఇప్పుడు ఆలోచించాల్సింది" అన్నాడు ఆఫీసరు కొంచెం విసుగ్గా.
    తను అన్నదానికీ, ఆఫీసరు అన్నదానికీ తేడా ఏమిటో మిసెస్ కైలసానికి వెంటనే బుర్రకు ఎక్కలేదు. అదేదో జోక్ అనుకోని పకపక నవ్వింది. ఆఫీసరు తెల్లబోయి చూశాడు.
    "అవును సర్ ! ఆ రకం ఈ రకం రెండు రకాల వాళ్ళూ వున్నారు సర్!" మళ్ళీ విరగబడి నవ్వింది.
    ఆఫీసరు ముఖం చిట్లించుకోవటం చూసి సర్దుకుని కూర్చుంది మిసెస్ కైలాసం.
    "ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి?"
    మిసెస్ కైలాసం సీరియస్ గా ఆలోచిస్తున్న ముఖం పెట్టింది. ఆమె మెదడులో "జానకీ" ఇంకా కొందరు గిరగిరా తిరుగుతున్నారు.
    "మనకున్న ఎనిమిది సెక్షన్లలో రెండింటికి పూర్తిగా పనిలేదు. అవి రెండూ ఎత్తేస్తే సరిపోతుంది సర్"
    "పూర్తిగా రెండు సెక్షన్లు ఎత్తేయాల్సిందే నంటారా ?" సాలోచనగా అడిగాడు ఆఫీసరు.
    "సందేహమెందుకు సర్. ఆ రెండు సెక్షన్లు చూస్తుంది నేనేగా ?" అంది కైలాసం.
    "అయితే సరే! అలాగే రాసి పంపించండి. గవర్నమెంటుకు రాసేద్దాం!" అన్నాడు ఆఫీసరు.
    మిసెస్ కైలసానికి డిన్నర్ పార్టీకి వెళ్లి వచ్చినట్లనిపించింది తృప్తిగా. తనకు ప్రమోషన్ వచ్చినరోజు ఉన్నంత సంతోషంగా వుంది - అనుకుంది. సెక్షన్లలోకి ఓసారి గర్వంగా అందరి ముఖాల్లోకి చూస్తూ తనలో తనే నవ్వుకుంది.
    "అందరి తిక్కా కుదురుతుందిలే?" అన్నట్లుంది ఆమె నవ్వు.
    మిసెస్ కైలాసం ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. ఆఫీసరు ఆమెను పిలిచి గవర్నమెంటు ఆర్డర్లు అందించాడు. ఆత్రంగా చదివింది. అనుకున్నట్లు రెండు సెక్షన్లు పోయాయి. ఆ సమయంలో జానకి ముఖం చూడాలనే కోరిక తన్ను కొచ్చింది ఆమెలో.
    "జానకిని పిల్చి వెంటనే పుటప్ చేయిస్తాను సర్" అంది ఉత్సాహంగా.
    ఆఫీసర్ తల ఆడించారు ఆమె వైపు జాలిగా చూస్తూ. జానకి వచ్చి ఆఫీసరుకు వినయంగా నమస్కరించింది. "సారీ! జానకీ! పది మంది దాకా మన ఆఫీసులో రిట్రెంచి అవుతారు. ఆర్డర్లు వచ్చాయి. నీక్కూడా రివర్షన్ వస్తుందనుకుంటాను." సానుభూతి ఉట్టిపడే స్వరంలో అంది మిసెస్ కైలాసం. కాని ఆమె స్వరంలోని హేళన జానకికే కాదు ఆఫీసరుకు కూడా వినిపించింది.
    "పదిమందితో నాకూ రివర్షన్ వస్తుంది, అంతేగా ?" తాపీగా తొణక్కుండా అంది జానకి.
    ఆఫీసరు జానకిని కూర్చోమన్నాడు. జానకి కూర్చుంది. మిసెస్ కైలసానికి మతిపోయినట్టయింది. "ఏమిటి ఈవిడ ధీమా! రివర్షన్ వస్తున్నా ఖాతరు లేనట్టే మాట్లాడుతుంది" అనుకుంది. "మీరంతా కష్టపడి పనిచేస్తే ఈ కర్మ పట్టేది కాదుగా ?" జానకిని బల్లెంతో పొడిచి పైకెత్తటానికి వీల్లేదు కనుక అలా అంది.
    సమాధానంగా జానకి కైలాసం కేసి తిరిగి చిరునవ్వుతో , "గాడిదా చేస్తుంది చాకిరి, కాని దానికి బుద్ది లేదుగా" అంది.
    మిసెస్ కైలాసానికి అర్ధం కాలేదు ! కోపంతో అంది "అలాంటి మాటలు ఆఫీసర్ల ముందు మాట్టాడకూడదు. మోస్టు ఇన్ డిసిప్లెన్ అంటూ ఆఫీసరు ముఖంలోకి చూసింది.
    "యస్ యస్! యూ ఆర్ కరెక్ట్!" అన్నాడు ఆఫీసరు. కాని అతని ముఖంలో, స్వరంలో ఎలాంటి భావమూ స్పురించలేదు.
    "చూడమ్మా! ఆ పేపర్ వెంటనే పుటప్ చేసేయ్?" అన్నాడు జానకితో.
    "అలాగే సర్!" అంటూ మిసెస్ కైలాసం చేతిలోని పేపర్ని అందుకుంది జానకి. మిసెస్ కైలాసం జానకి ముఖంలోకి చూస్తూ కూర్చుంది.
    జానకి రిట్రెంచ్ మెంట్ ఆర్డరు ముందు పేజీ చదివి రెండో పేజీ తిప్పింది. ఆశ్చర్యంగా ఓ క్షణం ఆమె ముఖంలోకి చూసి "సారీ ! మిసెస్ కైలాసం!" అంది జానకి.
    "మిసెస్ కైలాసం!" ఉలిక్కిపడింది మిసెస్ కైలాసం. ఎంత పొగరు ! ఏదో అనబోయి జానకి ముందు పెట్టిన కాగితం చూసిన మిసెస్ కైలాసం నోరు తెరిచే ఉండిపోయింది. మనిషి కొయ్యబారిపోయింది.
    సెక్షన్స్ పోయాయనే ఆనందంతో ఆర్డరు కాగితాన్ని తిప్పి చూడటానికి కూడా తీరిక లేకపోయింది మిసెస్ కైలసానికి.
    మిసెస్ కైలాసం చేస్తున్న గజెటెడ్ పోస్టుపై గొడ్డలి దెబ్బ తగిలింది. రెండు సెక్షన్లతో పాటు వాటికి సంబంధించిన ఆఫీసరు పోస్టు కూడా పోయింది.
    గెజెటెడ్ నుంచి ఎన్.జీ.ఓ గా మళ్ళీ మారిన మిసెస్ కైలాసం ఏమయిందీ, ఏం చేసిందీ తెలుసుకోకపోవడమే మంచిది.

                                               ---అయిపోయింది---


 Previous Page

WRITERS
PUBLICATIONS