Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 47


    కొంతసేపటికి శంకరం క్రిందికి భోజనానికి బయలుదేరాడు. క్రిందికి దిగినాడో లేదో ప్రక్క గదిలోని కిటికీనుండి తన చూపులు వెళ్ళాయి. ఏమి చూశాడో ఏమో కాని మన దృష్టులు మళ్ళించుకోలేక పోయాడు. ఇంటి యజమానురాలంటే తనకు మొట్టమొదటినుండి గౌరవమే. కాని ఆమె మొదటి భర్త గతించినట్లు తెలిసిన తర్వాత, కిటికీలోనుండి ఒక్క దృశ్యము చూచిన వెనుక అక్కడే నిలబడి ఒక్క సంభాషణము రహస్యముగా విన్న తర్వాత అతని మనస్సు చివుక్కుమంది. కొంత సేపుదాకా అట్టే మతిపోయినట్లు నిలబడిన పిదప హఠాత్తుగా ఆకలిమాట జ్ఞాపకము రావడముచేత ఆలోచించుకొంటూ భోజనాలగదిని చేరుకొన్నాడు.
    భోజనం చేస్తున్నంతసేపు శంకరం యజమానురాలి గురించే ఆలోచన మొదలు పెట్టినాడు. ఆ రోజు అతని భోజనానికి ఒక వింత పదార్ధము సహాయమయింది. మనలో దాపరిక మెందుకు! ఆ పదార్ధానికి మత్తుకలిగించే దుర్గుణముంది. కొన్ని కారణాలచేత ఆ పదార్ధము కూడా ఆ రోజు వారి యింట్లో ఉపయోగపడుతున్నది. అది త్రాగుతూ మన శంకరం ఆలోచనలో పడ్డాడు.
    కిటికీనుండి తాను సంగ్రహించగలిగిన వృత్తాంతము మననము చేసుకొంటున్నాడతను త్రాగుతున్నది రుచిగానే వున్నట్లు కనబడడముచేత ఒకమారు మారు వేయించుకొన్నాడు మరొకమారు - యింకొక మారు వేయించుకొని చూశాడు! ఇంకా మరొక మారు వేయించుకొన్నాడని దృఢముగా చెప్పలేను కాని త్రాగుచున్నంతసేపు అతనికి గదిలోని సంగతులే జ్ఞాపకము వస్తున్నవి.
    "యజమానురాలిని ఎవరి మనుష్యుడు అతిపరిచయముతో ఆమెను వితంతువుగా ఉండవద్దని ప్రార్ధిస్తున్న విషయము శంకరం జ్ఞాపకము తెచ్చుకొంటున్నాడు. ఆమెకు కూడా ఆ మనుష్యుని మీద మనస్సులో యిష్టమున్నట్లు శంకరం కిటికీలోనుండి చూడ గల్గినంత మటుకు బోధపరచుకొన్నాడు. ఈ సంగతే యిప్పుడతడిని బాధిస్తున్నది. ఈర్ష్యా గుణమున్నది శంకరానికైతే అట్టే లేదు కాని ఈ మనుష్యుడు ఆ ఉన్న చిన్న నిప్పునే రగిల్చివేస్తున్నాడు కాబట్టి శంకరానికి కళ్ళనిండా కోపము రాకతీరింది కాదు!
    వాడి మొఘం మండా! అంత అందవికారపు వాడుకదా! ఇక్కడికి రావడానికి వాడికి ఏమి హక్కుంది? అసలు, యజమానురాలికి మతిలేనట్టు కనబడుతుంది! చేసుకోగా చేసుకోగా రెండవ పెళ్ళి ఆ అభాజనున్నే చేసుకోవాలా? ఎవడూ అంతకంటే మంచివరుడు దొరకడూ ఆమెకి! అని శంకరం తనలో తలపోసుకున్నాడు. త్రాగుతున్నది పూర్తిచేసి మళ్ళీ మరి కొంచెము తెమ్మని అది కూడా ఆఖరుచేశాడు కోపంతో.
    బ్రహ్మచారి అయిన శంకరానికి ఒక యింటివాడిని కావాలన్న కోరిక చిరకాలము నుండి ఉన్నది. ఇక తానున్న ఇంటికి పెద్దకావడం అతనికి పట్టరాని కోరిక అని ఎవరు చెప్పగలరు? పాత్రలోనిది తాగుచున్నంతసేపు అతడు నిర్మించుకొంటున్న ఊహలివే! కాని ఆ దుర్మార్గపు మనిషి అడ్డుగా అవాంతరం కల్గిస్తున్నాడే! ఆ అమాయకపుటిల్లాలి హృదయం చెడగొట్టినందులకు వాడిని గట్టిగా కొట్టి బుద్ధి చెప్పగూడదా అని శంకరం ఆలోచించాడు-అయినా వాడు మరీ పొడుగు కద! అందువల్ల శంకరం నిస్పృహతో తుదిపర్యాయం పాత్రలో సగమువరకే పోయించుకొని పూర్తిచేసి ఛీ! ఈ లోకంలో దేవుడు నాకెంత అన్యాయము చేశాడు! నా బ్రదుకెంత కానిదైపోయింది! నాకిక నేమిటి గతి అనుకొనేసరికి నిద్రపోవడమే గతి అని తోచింది.
    అట్టి ఉద్దేశముతో శంకరం తనగదికి మెట్లెక్కి వెళుతున్నాడు. అపుడే మేడ మీద దీపాలు వెలిగించి దాసీది ఒక చేతితో కొవ్వువత్తి పట్టుకొని రెండవచేతితో అది ఆరిపోకుండా కాపాడుతూ మెట్లు దిగుతున్నది. ఎంత కాపాడుతున్నా శంకరం ఆమెను సమీపించేసరికి దీపం ఆరిపోయింది. నిజం ఈ మాత్రమే. కాని కిట్టనివాళ్ళు శంకరం గురించి లేనిపోని మాటలు చెప్పుతూ ఆ దీపాన్ని ఆర్పినది శంకరమేగాని గాలి కాదని మళ్ళీ దీపం వెలిగించే ప్రయత్నంలో అతడు అందు విడిగా ఉన్న దాసీని ముద్దు పెట్టుకున్నాడని కారు కూతలు కూయబోయారు. శంకరం మాత్రం నేరమంతా గాలిదేనంటాడు ఇప్పుడీ తగవు నేను పరిష్కరించలేను కాని మెట్లెక్కిన తర్వాత శంకరం ఒక్కడే తన గదిలోకి పోయి నిద్రకోసము ధ్యానము చేశాడని మా తాత చెప్పిన ప్రకారము స్థిరముగా చెప్పగలను.
    శంకరం గది విశాలమైనదేగాని మంచ మొక్కటే సగము స్థలము మ్రింగి వేయడముచేత ఇతరులకు కొంచం ఇరుకు తోచవచ్చు. ఐనా శంకరం ప్రాజ్ఞుడు గాబట్టిన్నీ-అతడిలో కొన్ని వేదాంతలక్షణాలు ఉండటంవల్లనూ దీనికి లక్ష్యపెట్టలేదు. ముఖ్యంగా గదిలోని వస్తువులలో శంకరం దృష్టిని ఆకర్షించింది. ఒక విచిత్రమైన కుర్చీ దానిలో కూడా వేదాంతుల లక్షణాలే వున్నవి. వీపు వంగిపోయి, కాళ్ళకు కట్లతో, అధమం సహస్రమాసాల ప్రాయంగల్గి ఉన్నదా వింత కుర్చీ మరే వింత వస్తువును చూచినా శంకరం అది వింతవస్తువుని ఒప్పుకొనేవాడు. సంగతి సమాప్తమయ్యేది కాని యీ కుర్చీ! ఇదెంత అంద వికారముగా ఉన్నది! ఎంత వికృతముగా కూర్చున్నది. వెనుక దిండ్లతో కుట్టబడి, కాళ్ళకు వాతం పట్టినట్లు కట్లతో యిది ఎంతైనా అసహ్యంగా వుంది. దీనిలో ఏదో తన్ను బాధిస్తున్నది జీవితంలో అతడు చాలా కుర్చీలు చూచినాడు. కాని యిట్టిదానిని ఎప్పుడు చూడలేదు. దాని వేపే పాపం శంకరం ఒక అరగంట తీక్షణంగా చూశాడు. కళ్ళు మరల్చుకోలేక పోయాడు. "ఇదేమిటో చాలా తమాషాగా వుంది." అన్నాడతడు. అప్పుడే అయిదు పాత్రల సామాగ్రి అత్ఘనిలో కల్లోలము లేపింది. జ్ఞానదృష్టులతో దానివంకేచూస్తూ పై మాటలు ఉచ్చరించాడతడు. కానీ ఏమీ తత్వం బోధపడలేదు. అతి చిత్రంగా, అతి అగాధంగా కనబడుతున్నది. చాలా తెలివిగా తల ఊపుతూ వెనుకటి మాటలే మళ్ళీ పలికినాడతడు. కాని అతడికి తలా తోకా అందలేదు. సరే నా కెందుకీ ఘోష అని నిండా కప్పుకొని నిద్రపోయాడు.
    "ఒక అరగంట గడిచింది. చప్పున తెలివి వచ్చింది శంకరానికి. ఏదో కలలో ఉలికిపడ్డాడు. పానపాత్రలూ, దాసీకన్యలూ కలలో కానవచ్చారు. కన్నులు విప్పి చూడగానే ఎదురుగా కనబడ్డది కుర్చీ! శంకరం 'దానివేపు చూడను' అని కళ్ళు మూసుకొన్నాడు. నిద్ర రాదు-లాభం లేదు. ఒక లక్ష కుర్చీలు కళ్ళముందర నాట్యం చేశాయి. బాగుంది. కళ్ళు మూసుకొని యిన్ని కుర్చీలతో బాధపడుటకంటే కళ్ళు విప్పి ఒక్క కుర్చీనే చూడటం నయమనుకొన్నాడు. కళ్ళు తెరిచాడు. పూర్తిగా తెరిచి చూశాడు. కాని ఎదురుగా కుర్చీలేదు అకస్మాత్తుగా ఏదో చెప్పరాణి మార్పు వచ్చి కుర్చీ యిప్పుడు శతవృద్దురూపం దాల్చింది. ఇదివరకు కుర్చీకి కానవచ్చిన చెక్కడపు లతలలోస్ఫుటంగా యిప్పుడొక ముడుతలుపడ్డ ముసలి మొగము కానవస్తుంది. పట్టుదిండ్లు వీపుగా మారినవి. కట్లతో నిండిన కాళ్ళు వృద్ధుని రెండు కాళ్ళయి వంకరటింకరపొంది వార్ధక్యము సూచిస్తున్నవి. మొత్తము మీద అంత కుర్చీ కూడ మారిపోయి వికారపు వెనుక శతాబ్దపు ముసలి మనుష్యుడుగా కానవస్తుంది. దిగ్గున లేచి శంకరం మంచంమీద కూర్చుండి మాంద్యము పోవడానికి కళ్ళు నలుపుతూ మళ్ళీ తేరిచూశాడు. అబ్బే కుర్చీకాదు. ముసలివాడు! పైగా శంకరంవంక కన్ను గీటుతున్నాడు.
    "అసలే శంకరం అసహాయ శూరుడు - ఆ మీద అయిదు పాత్రల సొమ్ము అతడికి బాసటగావుంది. అందుచేత అతడు మొదట ఎంతగా ఉలికిపడినా ఇపుడు కొంత నిర్లక్ష్యంగా ఆ ముసలివాడిని చూశాడు. వృద్దుడు గూడ వెక్కిరిస్తున్న చూపులతో శంకరం గూర్చి నిర్లక్ష్యం కనబరుచ మొదలుపెట్టినాడు. ఇక భరించలేక "ఎందుకురా అలా కన్ను గీటుతావు!" అని శంకరం కోపంతో కేకవేశాడు.
    "అదో సరదావోయ్ శంకరం!" అన్నది కుర్చీ! ఉహు ముసలాయన. ఏమన్నా అనుకోవచ్చును. మీ యిష్టము ఇప్పుడతడు కన్ను గీటడం మాని విరగబడి నవ్వుతున్నాడు.
    "వెఱ్ఱిమొగమా! నాపేరేం తెలుసునూ నీకు?" అని శంకరం త్రుళ్ళిపడి కూడా మనోభావన కప్పిపుచ్చుతూ కనుక్కొన్నాడు.
    "వద్దు సుమా! శంకరం! పెద్దవాణ్ణి గౌరవం చూపించు, దేవదారు కర్రసుమా ఇది అంటూ వృద్ధుడు భయంకరంగా ఉరిమినాడు. దానితో కాస్త ధైర్యమూ పోయి శంకరం భయంతో పూర్వంకంటే వినయపూర్వకమైన గొంతుతో "అబ్బే అబ్బే లేదండీ నేనేమీ మిమ్మల్ని అగౌరవించడానికి ఉద్దేశించడము లేదండి."
    "సరే! మంచిది! శంకరము!...."
    "చిత్తం...."
    "నీ గురించి నాకంతా తెలుసు సుమా! పాపం నువ్వు చాలా బీదవాడివి!
    "చిత్తం! చాలా పేదవాడినండి! కాని మీకెలా తెలుసునండి?"
    "దానికేం కాని శంకరం! తాగడమంటే నీ కిష్టమే కదూ? మనలో తప్పలేదులే"
    శంకరం ఈ మాటకి వ్యతిరేకంగా క్రిందటి పెద్దపండుగ మొదలు ఒక్క చుక్కైనా ముట్టుకోలేదని ఒట్టువేసుకోబోయాడు. కాని వృద్ధుడి చూపులు చూడగానే వాడికీ సంగతి తెలుసుననిబోధపరచుకొని నవ్వి ఊరుకున్నాడు-చూడు! శంకరం! యజమాని ఎలా ఉంటుందేమిటి? బాగుండదూ చూడూ! అని వృద్ధుడు కాలు కదిలిస్తూ షోకుగా చూస్తూ శంకరాన్ని కదలించాడు. ఇదేమీ శంకరానికి మనస్కరించింది కాదు. కానీ ఏమనగలరు మనస్సులోనే "వెధవా! నీకొచ్చిన ఏళ్ళు ఎవరికొచ్చాయి! ఈ ఘోషంతా నీకెందుకు?" అనుకొన్నాడు.
    "శంకరం! నేను యజమానికి యజమాన్ని సుమా!" అన్నాడు వృద్ధుడు.
    "ఆ! అలాగండి!" అని శంకరం ఆశ్చర్యపోయాడు.
    "ఈవిడ తల్లి నెరుగుదును బాగా! ఆ తల్లి తల్లితో కూడ నాకు పరిచయమే? దానికి నా మీద ఎంత ప్రేమ అనుకొన్నావు! అదే నాకీ వీపుకి పట్టుగుడ్డ కుట్టింది. అని పాతవాడు అభిప్రాయ గర్భితంగా పలికినాడు.
    "అలాగేం!" అని మరొకమారు శంకరం ఆశ్చర్యం ప్రకటించినాడు.
    "మరీ కాళ్ళకు మాత్రం! ఈ జోళ్ళు అది కొన్నావే కదూ! పోనీ ఆ సంగతులన్నీ అనుకున్నామంటే ప్రజలు మా మీద అనుమానపడిపోతారు-" అని పలుకుతూ వృద్ధుడు చూచిన చూపులకి శంకరం తర్వాత తర్వాత చెప్పేవాడు కదా వాడిమీద అమాంతం కూర్చోవలెనన్నంత కోపం తనకి కలిగిందట-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS