ప్రముఖమయిన ఒక వార్తా పత్రిక తీసుకుని వచ్చింది పార్వతి. పోర్టికోలో కారు ఆపి లోనికి వచ్చింది. అంత మాత్రాన భారీశరీరానికి ఆయాసం కలుగుతోంది.
"మాలతీ మనహీరో పత్రికల్లోకి ఎక్కేశాడు. గుడ్ గాడ్! మజిల్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడు" అంది వగర్చుతూ. మాలతి అతని ఫోటోగ్రాఫ్ చూచి నవ్వసాగింది.
"అంత అందంగా కన్పిస్తున్నాడా పార్వతీ" అంది.
"అవును అబ్బ ఎంతందమోప్చ్" అంటూ పత్రికలో ఉన్న అతని ఫోటోనో ముద్దు పెట్టుకుంది పార్వతి. మాలతి విరగబడి నవ్వుతోంది.
తోటలో ఎత్తుగా ఒత్తుగా పెరిగిన ఒక పొద చాటున విశ్రాంతియోగంలో ఉన్న అర్ధ మానవుడికీ అలికిడి విన్పించింది. పార్వతి గొంతు విన్పించింది.
వెంటనే అక్కడనించి లేచి రావాలని అన్పించింది. అతడు లోనికి వచ్చాడు.
పార్వతి అతనికి ఎదురు వెళ్ళి "చూడు నీ ఫోటో పేపర్లో పడింది" అంటూ పేపరు అతని ముందుంచింది.
అతడు తన ఫోటోని గుర్తించలేక పోయాడు. కాని దొంగల ఫోటో గ్రాఫ్ ని గుర్తించాడు.
"ఓ....ఓ....ఆ" అన్నాడు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అవును వాళ్ళే అంటూ అతని జ్ఞాపకాన్ని మరొక మారు నిరూపించింది కెప్టెన్ మాలతి. అలానాగరిక ప్రపంచంలో తన గురించి ఘనమయిన వార్తలు చెప్పుకుంటున్నారని కాని, చదువు కుంటున్నారని కాని అర్ధ మానవునికి తెలియదు.
అతనికి తెలిసిందల్లా తాను ఆరాధించే కెప్టెన్ మాలతి తన గురించి తృప్తికరంగా సంతోషంగా ఆలోచిస్తోందని మాత్రమే! పార్వతి కూడా తనకు అనుకూలమయిన వ్యక్తి అని అర్ధమయింది.
అలా అతని మనఃపటలం మీద ముద్రితాలవుతున్న మనుషులు జ్ఞాపకాలు వినూత్న అనుభవాలు అతని ఆలోచనా ప్రపంచాన్ని పెంచి వినూత్నమయిన మార్పులకు కారణాలయినాయి.
ప్రతిరోజు ప్రతిగంట, ప్రతినిముషం అతడు నాగరిక లోకం వైపుగా వేగంగా ప్రయాణించాడు. అర్ధమానవుడు ఆదశనించి బయట పది క్రమ క్రమంగా చిన్న చిన్న మాటలు అనటం నేర్చుకున్నాడు.
ఎపపుడెవరు కనిపిస్తారో వారితో ఎలా ప్రవర్తించాలో ఆలోచించటం ప్ర్రారంభించాడు.
౦ ౦ ౦
"మాలతీ! ఈ పూట షాపింగ్ వెళ్ళేందుకు పర్మిషన్ కావాలోయ్" అంటూ అర్ధించింది పార్వతి. మాలతి అందంగా నవ్వింది.
"నువ్వు షాపింగ్ వెళ్ళాలంటే మీ డాడీ పర్మిషన్ కావాలి. పెళ్ళియితే రేపు మీ శ్రీవారి పర్మిషన్ కావాలి. అంతే కాని యిప్పుడు నా పర్మిషన్ నీకు అనవసరమను కుంటాను" అంది గుంభనంగా నవ్వుకుంటూ.
"నా కోసమయితే నిన్నెవరడగొచ్చారు? ఏవ్ మాన్ ది గ్రేట్ ని కూడా నా వెంట తీసుకుపోతాను" అంది పార్వతి అర్దింపుగా.
"అతన్ని షాపింగ్ తీసుకుపోతావా? నీకేమయినా పిచ్చిపట్టిందా?" అంది మాలతి.
"ఏమిటట అంత ప్రమాదం. నీ వెంట అయితే ఎక్కడికయినా తీసుకుపోతావు. మా వెంట పంపాలంటే నీకు అన్నీ అనుమానాలే! అవున్లే మా వెంట ఎందుకు పంపుతావు. పెళ్ళికాకుండానే నీకంటే చేయెత్తున్న మనిషికి తల్లి వయ్యావు. నీ కొంగుపట్టి తిరగమను. నేను పోతున్నాను" అంటూ నిష్టూరాలాడటం ప్రారంభించింది పార్వతి.
మాలతి రవంత బాధ పడింది.
పార్వతి అతని పట్ల ఎంత ఆసక్తిగా ఉందో ఆమెకు తెలియనిది కాదు. అయినా అతన్ని మరొకరి వెంట పంపటం చాల ప్రమాదం. కొన్ని విషయాలు అర్ధమవుతాయి. మరి కొన్ని విషయాలు అతనికి అర్ధంకావు.
ఆలోచించటం ప్ర్రారంభించాడు.
కాని అతని అనుభవాలు పరిమితమయినవి కావటం నించి కొన్ని విషయాల్లో అపార్ధాలు చేసుకుంటాడు. ఒకసారి ఎక్సయిట్ అయాడంటే ఇంక ఎవరుచెప్పినా వినడు. చేయదలుచుకున్నది చేసి తీరుతాడు.
అతడు ఎలాంటి తీవ్రమయిన మానసికసంక్షోభంలో ఉన్నానిలువరించగల శక్తి తనకి మాత్రమే ఉంది. ఆ పని చేయగల అధికారం మరొక రెవ్వరూ సాధించలేక పోయారు.
అందునించి మరొకరితో బయటకు పంపాలంటే మాలతి ఎంతో ఆలోచించాల్సి ఉంది. కాని పార్వతి నిష్టూరాలు ప్రారంభించటంతో ఆమె మనసు జాలితో నిండిపోయింది.
"పార్వతీ! నువ్వు అతనితో చాల అవస్థపడతావనే నేను వద్దంటున్నాను. నన్ను అర్ధంచేసుకో! కాదు కూడదంటే తీసుకుపో నాఅభ్యంతరం లేదు. అయినా ఈ విషయంలో మనం ఆలోచించటం కన్నా అతన్ని అడగటం మంచిది" అన్నదామె.
"రాజా యిలారా ఓసారి" అనిపించింది. విమల్ సూటింగ్ లో చాల హుందాగా రెజిలింగ్ చిత్రంలో హీరోలా ఉన్న అర్ధమానవుడు గదిలోంచి బయట కొచ్చాడు. ఈ మధ్య కాలంలో అతనిలో వచ్చిన మార్పులు పార్వతికి మరింత ఆశ్చర్యం కలిగించినాయి.
మంచి ఎత్తరి కావటంనించి సూటింగ్ లో చాల హుందాగా కన్పిస్తున్నాడు. కాని అలా శరీరభాగాల్ని వస్త్రాల్లో యిరికించేసుకోవటం అతనికి చాలా అసౌకర్యంగా అన్పిస్తోంది చేతులు కట్టిపడేసినట్లు అన్పిస్తున్నాయి. కాళ్ళు కరుచుకున్న షూ అతనికి చాల బాధ కలిగిస్తోంది.
ఈ బాధ అసౌకర్యం అతనికి కళ్ళ వెంట నీరు తెప్పిస్తోంది.
కాని అది మాలతి యిచ్చిన ఆదేశం. అందునించి జవదాటరానిది. సభ్య సమాజానికి అనుకూలంగా సూటు ధరించటం, తెలియని తనాన్ని దాచుకుంటూ పరిమితంగా మాట్లాడటం అతను అలవాటు చేసుకోవాలని ఆదేశించిందామె.
