అతనికి అసౌకర్యంగా బాధా కరంగా ఉన్నా ఆమె ఆదేశం మేరకు అన్నీ ధరించాడు. చక్కగా షేవ్ చేసుకున్నాడు. స్ప్రే చేసుకున్నాడు కాబోలు ఘుమఘుమలాడుతూ గదిలోంచి బయటకొచ్చాడు.
రెజిలింగ్ చిత్రంలో హీరోలని మరిపించేలా ఉన్నాడు.
"మీట్ మిస్ పార్వతి" అంది మాలతి.
"గుర్డ్ మ్రానింగ్" అంటూ చేయి అందించాడు అర్ధమానవుడు రాజా.
"నో! గుడ్ మార్నింగ్" అంటూ సవరించింది మాలతి.
"గ్రుడ్ మార్నింగ్" అన్నాడతడు.
"ఎగైన్" అది మాలతి.
"గుడ్ మార్నింగ్" అంటూ ఆయాస పడిపోయాడు అర్ధ మానవుడు. అతనికి పది కిలోమీటర్లు షూట్ మీద పరుగెత్తినా, ఒక సింహంతో పోరాడినా అంతట అలసటరాదు. కాని ఒక మాటని ఖచ్చితంగా తప్పులేకుండా పలకాలంటే మాత్రం ఎక్కడ లేని ఆయాసం వస్తుంది.
"వెరీగుడ్ మార్నింగ్" అంటూ అతని చేయి అందుకుంది. "షాపింగ్ వెళదాం. మీకభ్యంతరం లేదనుకుంటాను" అందామె.
రాజా మాలతి వంకచూచాడు. ఆమె అంగీకార గాచనంగా తల ఊగించింది. అతనికి ఉత్సాహం వచ్చింది.
"ఎస్ ఎస్" అన్నాడు ఉత్సాహంగా. ఈ మధ్య మాలతి యిస్తున్న క్రమశిక్షణ అతనికి బాధ కలిగిస్తోంది. వెలుపలికి పోయే అవకాశం కలిగిస్తే అతని కదొక విముక్తిలా అన్పించింది.
కారుముందు టైర్లు బాగా క్రుంగిపోతున్నాయి. పార్వతి తొంభయ్యారు కిలోల బరువుంది. అర్ధ మానవుడు నూటయాభై. ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు కారాగింది.
ఇద్దరూ కారుదిగి లోనికి నడిచారు. షాపులో పనిచేస్తున్న వాళ్ళకి షాపింగ్ కోసం వచ్చిన వాళ్ళకి అర్ధమానవున్ని చూచేందుకు రెండు కళ్ళు చాలటల్లేదు. పార్వతి అతనితో నడిచేందుకు ఆయాసంతో రొప్పుతోంది.
అతనికోసం ఏదయినా మంచి బహుమానం కొనాలని ఆమె కోరిక. పూర్తి వేషధారణ అయింతరువాత అతనికి రిష్ట్ వాచీ లేకపోవటం ఒక పెద్దలోపంలా అన్పించింది.
మంచిఖరీదయిన వాచీ తీసుకుని అతనిచేతికి అమర్చింది పార్వతి. అప్పటికే శరీరమంతా సూట్ లో, షూల్లో కట్టడి అయింది. దానికితోడు మరొక వాచీ తెచ్చి చేతికి బిగించ టంతో అతనికి మరింత చిర్రెత్తుకొచ్చింది, దాన్ని లాగి పారెయ్యాలని ప్రయత్నించాడు రాజా!
"ప్లీజ్! అది నా ప్రజంటేషన్ దాన్ని లాగిపారెయ్యకు" అంటూ గడ్డం పుచ్చుకుని బ్రతిమాలింది పార్వతి. అతనికి అర్ధ మయిందో లేదో కాని ఇంక ఆ ప్రయత్నం విరమించుకుని హాయిగా నవ్వేశాడు.
పార్వతి ఆనందం పట్టలేక అతని చేతిని ముద్దుపెట్టింది.
అక్కడ నించి ఒక స్టార్ హోటల్ కి దారితీసింది. అక్కడ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతున్నాయి. వస్తాదులు కండలు ప్రదర్శించి పల్టీలు కొట్టినానా హడావుడి చేసి ప్రదర్శనలిస్తున్నారు.
పోటీల్లో విజేతకు యాభై వేలు బహుమానం. ఎంట్రెన్స్ ఫీజు అయిదు వందలు ఆ మొత్తాన్ని కట్టేసి రాజాని కూడా లిస్ట్ లో చేర్పించింది పార్వతి. మిగిలిన వస్తాదులు ప్రదర్శనలిస్తున్నారు కాని రాజా మాత్రం గోదాలోకి వెళ్ళలేదు. చివరిసరిగా ఫీజు కట్టటంనించి అతని పేరు చివరలో ఉంది.
వస్తాదులందరూ వస్తాదుల వేషధారణలో ఉన్నారు.
కాని రాజా సూట్ ధరించి ఉన్నాడు.
అందరి వంతు అయిపోయి అతని వంతు రాగానే సూట్ తో గోదాలోకి వచ్చాడు అర్ధమానవుడు. అదిచూచి అందరూ నవ్వటం మొదలెట్టారు క్రొత్త బిచ్చగాడు అయి వుంటాడని కొందరు, ఔత్సాహికుడు అయి వుంటాడని కొందరు, తెలియక దిగాడని కొందరు అనుకున్నారు.
అందాకా మిగిలినవారు చేసేపద్ధతిని పరిశీలించిన అర్ధమానవుడు గోదాలో నిలబడ్డాడు. కసరత్తు చేయలేదు. క్రాఫ్ చెరగలేదు. బట్టలు నలగలేదు. కనీసం చెమట అయినా పట్టలేదు.
ఒంగి ఎడంచేత్తో బార్ పట్టి విసిరివెనక్కు పడేశాడు. రెండోచేతిని కూడా ఉపయోగించలేదు. క్లాప్స్ మిన్నుముట్టి నాయి. ఆటోగ్రాఫ్ లకోసం జనం ఎగబడ్డారు.
ఈ సభ్య సమాజంలో అతని భవిష్యత్తు వెయిట్ లిఫ్టర్ గా అయితే ఊహించిన కన్నా ఎక్కువ స్థాయిలో ఉంటుందని అర్ధమయింది పార్వతికి. యిప్పుడతని ప్రక్కన నడవటం చాల గర్వంగా అనిపిస్తోంది.
౦ ౦ ౦
నుదుట కళ్యాణ తిలకం తీర్చుకుని అందంగా, సందడిగా, ఆయాసాన్ని మరచి తిరుగుతోంది. మిత్రమండలి అందరూ కలిసి అరుదైన మనిషిగా మారిన అర్ధమానవుడు రాజాని అలంకరించారు.
పార్వతి రాజా దండలు మార్చుకున్నారు. మిత్రబృందాల మధ్య ఆనందసందోహం ఆకాశాన్ని అంటింది.
"పార్వతీ! కన్న బిడ్డలకు అంతోయింతో సంపాదించి యివ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పెళ్ళికాకుండానే నాకు దైవమిచ్చిన ఈ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను అతన్ని ప్రాణంగా చూచుకో. ఇది నా ప్రజంటేషన్" అంటూ ఒక పెద్ద భవనాన్ని రాజా పేరుమీదకు మార్చిన దస్తావేజులు అందించింది మాలతి.
పెళ్ళికాని ఆ తల్లికి పాదాభివందనం చేశారు రాజా దంపతులు. లేని పెద్దరికాన్ని తెచ్చుకుని "చిరంజీవ" అని ఆశీర్వదించింది మాలతి!
(అయిపోయింది)
