"అన్నీ తెలిసిన మనిషి అయితే దీని బద్దకాన్ని భరించలేడు. అందునించి స్నేహానికి అతన్ని ఎంచుకుంటుంది. మంచి బాయ్ ఫ్రెండే!" అన్నది మరొకామె.
పార్వతికి ఈ జోక్స్ వొళ్ళు మండించినాయి. కాని తాను ఇతః పూర్వమే చేసిన చిలిపి తప్పు ఒకటి కెప్టెన్మాలతి దృష్టిలో పడి ఉండటంనించి మౌనంగా ఊరుకుంది.
అలావొదిలేస్తే వాళ్ళమాటలు అలా ఎంతసేపు కొనసాగుతాయో, ఎంతదూరం పోతాయో మాలతికి తెలుసు.
"ఫ్రండ్స్! మీరింక మాట్లాడటం మానేయండి. అతనితో స్నేహం చెయ్యాలని కోరుకోవటం పార్వతి తప్పు కాదు. అంతమాత్రానికే దాని భారీశరీరం గురించి మాట్లాడటం అన్యాయం" అందామె. మిత్రమండలి గప్ చుప్ అయింది.
"పార్వతీ! అర్ధ మానవుడు నిన్ను కోపగించుకుంటున్నాడనుకోవటం నీ పొరపాటు అతనికి ప్రేమించటం ఒక్కటే తెలుసు. అపకారం అనుకున్నప్పుడు ఎదురు తిరగటం కూడా తెలుసు. అంతేకాని ప్రత్యేకంగా ఒక మనిషి మీద కోపం అంటూ అతనికి ఉండదు. వీళ్ళందరి మాటలకేం గాని నిజంగా నువ్వు స్నేహం చెయ్యదలిస్తే అర్ధ మానవునికన్నా మంచి మిత్రుణ్ణి నీ జన్మలో నువ్వు సంపాదించలేవు" అంది.
ఇంతకు మునుపే తనకున్న విశ్వాసాన్ని మరింత చేసినందుకు ఎంతో ముచ్చట పడిపోయింది పార్వతి. తనకు అనుభవంలో లేని విచిత్రమయిన స్థితి ఎదురయినప్పుడు తల్లి మీద ఆధారపడతాడు చంటిపాపాయి.
అలాగే అర్ధమానవుడు తన నిర్ణయంకోసం ఎదురుచూస్తున్నాడని కెప్టెన్ మాలతికి తెలుసు. పార్వతి చేయి అందుకుని అతని చేతులలో ఉంచింది మాలతి. నవ్వుతూ అతని వంక చూచిందామె. ఎవరి చేయి తన చేతులలోకి పెట్టబడిందో ఆ మనిషి తన శతృవుకాదని గ్రహించాడు అర్ధమానవుడు.
"గుడ్ లక్" మాలతి ఆ మాట అనమని అర్ధమానవుడ్ని ఆదేశించింది.
"గు.....గు.....గూట్.....లాక్" అన్నాడతడు.
"థాంక్యూ" అంది పార్వతి ఆమెకు తన ఆశతీరే అవకాశం కన్పించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
దూరంనించి డిస్కోపాటలు విన్పిస్తున్నాయి. అందరూ హాలువైపు నడిచారు. కొందరు కళ్ళుమూసుకుని హమ్మింగ్ చేస్తున్నారు. అతని చేయిగట్టిగా పట్టుకుని హాలు అంతా తిప్పిచూపిస్తోంది పార్వతి. వాళ్ళుద్దరూ బాగా కలిసి పోయారు.
ఏ మూల తిరుగుతున్నా మాలతి ఒక కంట అతన్ని గమనిస్తూనే ఉంది. ఫిజో రెప్పవేయక అతన్నే చూస్తున్నాడు మధు ఏదో మాటాడుతున్నాడు. కాని ఫిజో సరిగావినటల్లేదు ఎక్సయిట్ అయే సరికొత్త వాతావరణంలోకి వచ్చాడు అర్ధమానవుడు. అతని రియాక్షన్స్, ఎలా ఉంటాయనే ఫిజో మాలతి పరిశీలిస్తున్నారు. మిగిలిన వాళ్ళు మ్యూజిక్ తో పాటు హమ్మింగ్ చేయటంలో తన్మయులవుతున్నారు.
సరిగా ఆ సమయంలో హాలులో ఒక మూల చిన్న కలకలం బయలు దేరింది. క్షణాలమీద అది విజ్రుంభించి గాలీ వాన అయింది.
ఆ వంకకు తల త్రిప్పిచూచింది మాలతి.
నలుగురు సాయుధులయిన వ్యక్తులు అందర్ని ఒక వరుసలో నిలబడమని ఆదేశిస్తున్నారు మహానగరం నడిఒడ్డున స్టార్ హోటల్ లో సామూహిక దోపిడీ.
దేశంలో పరిస్థితులు దిక్కుమాలిపోతున్నాయి. ఆడవాళ్ళ నగలన్నిటిని దోచుకుంటున్నారు దుండగులు. ఒకడు చాలా విసురుగుగా వచ్చి కెప్టెన్ మాలతి మెడలో చేయి పెట్టాడు.
అంతే టప్ మని శబ్దం వినిపించింది. అర్ధ మానవుని ముష్టి ఘాతానికి అతని తల రెండుగా బ్రద్దలయింది. పెద్దగా కేక పెట్టి నేలమీద పడ్డాడు అతడు. మిగిలిన ముగ్గురు అతని మీదకి వచ్చారు.
వాళ్ళు ముగ్గురినీ ఒకేసారి పట్టి వెపన్స్ తో సహా విసిరి గోడ కేసి కొట్టాడు అర్ధమానవుడు. నడుములు విరిగాకుప్పకూలి దొరికి పోయారు దుండగులు.
స్టార్ హోటల్ యజమాని వచ్చి అర్ధ మానవుడి కాళ్ళ మీద పడ్డాడు.
18
వాస్తవానికి అది యాదృచ్చికమయిన సంఘటన అయినా దానికి విశేషమయిన ప్రచారం లభించింది. అర్ధమానవుడు తన శారీరక బలాన్ని ప్రదర్శించి బందీల్ని చేసిన దుండగులు చాల కీలకమయిన నేరాలతో సంబంధాలున్న వాళ్ళు.
పోలీసులు వారికోసం ఎంతోవ్యయప్రయాసలకుఓర్చి గాలింపు కొనసాగిస్తున్నారు. వారి ప్రయత్నాలు విఫలమవుతున్న సమయంలో అర్ధమానవుడు వారిని పట్టి యిచ్చాడు.
బహుశా వారెలాంటి భయంకరమనుషులో అతనికి అర్ధమయివుండదు. తన ఆరాధ్యదేవత అయిన కెప్టెన్ మాలతి మీద చేయి వేశాడు కాబట్టి అరచేత్తో అతని కపాలం పగిలిపోయేలా దెబ్బకొట్టాడు, అంతే!
తన చేతిలో ఆయుధం ఉండగా నిరాయుధుడయిన మరో వ్యక్తి దాడి చేయగలడని ఒక్కదెబ్బతో తనని మట్టి కరిపించగలడని అతడు ఊహించి ఉండడు.
నిజంగా అతడెంత భయంకరమయిన వ్యక్తి అయిందీ తెలిసిన వారెవరయినా అంతసాహసానికి పూనుకోలేరు. అందునించి అర్ధమానవుడి చర్య మెరుపు దాడి లాంటిదే అయింది. దాంతో వారు చిక్కిపోయారు.
మరో కోణంనించి ఈ వార్తకి చాల ప్రాధాన్యత వచ్చింది. ఆ వార్తతోపాటుగా మరో విశేషంగా అర్ధమానవుని గురించిన వివరాలు కూడా పత్రికలలోకి ఎక్కాయి. అతని స్టిల్స్ పత్రికలలో ప్రచురితా లయినాయి.
