Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 47


    ఇదంతా జగ్గమ్మ అనుమానాన్ని మరింతగా రేకెత్తించింది. తల్లి చేయిని విడిపించుకుని వెళ్ళి గుంపులో కలసింది. మల్లమ్మ వెనుకకు నడుస్తున్న ఆడవాళ్ళలో సందు చేసుకుని దూరిపోయింది.
    తల్లి కేకలు గది నాలుగుగోడలకి తగిలి యెగిరిపోయినాయి.
    మల్లమ్మను అలా తీసుకుపోయి ఒక వాకిలి ముంగిట ఆగారు. దగ్గరకు వేసివున్న తలుపుని రవ్వంత సందుచేసి కమలక్క మల్లమ్మను లోపలకు నెట్టి తలుపులు యధాప్రకారం మూసివేసింది.
    ఆమె యీపనిని యెంత చాకచక్యంగా చేసినా తలుపు సందుల్లోంచి లోపల యెవరున్నదీ చూడనే చూచింది జగ్గమాంబ.
    ఎన్నో అలంకారాలు చేసిన మంచంమీద యెంతో అలంకారం చేసుకుని కూర్చునివున్నవారు గోపాలకృష్ణ రంగారావు బావ.
    పెళ్ళికి యెదిగిన ఆడపిల్లకు అర్ధం కాకుండా యెలా వుంటుంది? అర్ధమయింది. తల వంచుకుని అందరితోపాటు గదిలోకి వచ్చింది ఆమెకు దుఃఖం వచ్చింది. యిహనించీ అక్క యిదివరకటి అంత చనువుగా వుండదు కాబోలు తనతో ఆమె బావగారి స్వంతమయిపోయింది. యిక ముందు తాను ఒక్కతే గుర్రపుస్వారీకి పోవాలి. తన వాగుడు అంతా ఓర్పుతో భరించి, తప్పులు సరిచేసి తను కోపగించుకుంటే బ్రతిమాలి మంచి చేసుకునే అక్క యికనించీ వేరు అయిపోయింది.
    "పోతే పోయింది. నాకేం భయమా!" అనుకుంటూ కన్నీరు తుడుచుకుంది జగ్గమాంబ. ఆ మాటతో మనసులోని బాధనంతా నిద్రపుచ్చుకోవాలని అనుకుని తెల్లవార్లూ జాగారమే చేసింది.
    మధ్య మధ్య యెన్నోసార్లు అక్క యేం చేస్తూ వుంటుందో లోపల అనుకుంది.
    ఏం చేస్తూ వుంటుంది?
    లోపల కాలు పెట్టగానే వెనుకనించి తలుపులు బిగుసుకు పోయాయి. ముందుదారే కాని వెనక్కు పోయేదారి మూసుకుపోయింది. ఆడపిల్ల జీవితంలో యిట్లా ఒకసారి తలుపులు మూసుకుపోయినాయి అంటే- యిహ యింతకుముందు తనవాళ్ళు అంతా పరాయివాళ్ళు అయినట్లే! ఆ వెనుక చూపు వస్తే భర్తకు క్రొత్తగా వచ్చిన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. అలా జరగకూడదని యిహ వెనుక చూపు వుండకూడదనీ అర్ధమే యీ తలుపు ముయ్యటం కాబోలు.
    కన్నవాళ్ళు, తోడబుట్టినవాళ్ళు అందరూ యికనించీ బంధువులే క్రొత్తగా జీవితంలోకి వచ్చినవాళ్ళే తన స్వంత కుటుంబం.
    మల్లమ్మ మనసులో దిగులుని ప్రక్కకు నెట్టింది. ఆమె రాచబిడ్డ, ధైర్యంగా అడుగులేస్తూ ముందుకిపోయింది. గోపాలకృష్ణ రంగారావు జీవితంలో యెన్నడూ లేనంత, యిహ రానంత ఆనందంగా నవ్వుతూ ఆమెను ఆహ్వానించాడు కౌగిలిలోకి ఆమె తన శరీరాన్ని కౌగిలిలోకి కానుకగా యిచ్చింది.
    వాళ్ళ శరీరాలు, మనస్సులు, ఆత్మలూ పరవశంతో పెనవేసుకుపోయి ఒకటి అయినాయి. మల్లమ్మదేవి మనోమందిరంలో గోపాలకృష్ణ రంగారావుగారి రూపం చెరిగిపోనీ ముద్రపడింది.
    "మహాదేవీ!" అంటూ స్వాగతవచనంగా పలకరించాడు రంగారావు.
    "ఊఁ"
    "మహారాణీ!"
    "ఆ పిలుపు మీకోసం కాదు. నా ప్రజలకోసం."
    "నా ప్రజలు అనే పదంలో నేనుకూడా కలుస్తాను."
    "నేను మీకు దాసిని."
    "నేను నీకు దాసుడని కదూ!"
    "అలా అనటం యెందుకూ?"
    "మహారాణి దాసుడికి వరాలివ్వాలి. బహుమానా లివ్వాలి. అందుకోసం."
    "స్వార్ధంకోసం అన్నమాట."
    "కాదు, సేవ చెయ్యటంకోసం."
    "మీరు నాకు సేవచేస్తారా? నవ్వు వస్తోంది."
    "నిజాన్ని వింటూ నవ్వటం యెందుకూ?"
    "అది నిజం యెలా అయింది?"
    "చెప్పమంటారా?"
    "చెప్పండి వినాలనే అడిగాను."
    "ఈ దండ చెయ్యి వుంది చూశావూ?"
    "ఊఁ"
    "ఇది యెన్నో సాముగరిడీలు నేర్చింది."
    "ఇంకా......"
    "ఈ దండ చెయ్యి రాజ్యభారాన్ని మోస్తోంది"
    "అవును."
    "ఈ దండ చెయ్యిచూస్తేనే విరోధులకు భయం"
    "అవునట. విన్నాను వీరత్వం."
    "కాని యీ దండ చెయ్యే నీకు తలదిండు అయింది."
    "గొప్ప రశికులే సుమా!"
    "ఇది నీ సేవ చెయ్యటం కాదూ!"
    "ఇక చాలించండి."
    "ఇంకా యిటువంటి సేవలు నేను యెన్ని చెయ్యాలో ...."
    "చెయ్యకండి."
    "ఇవి కోరి చేయించుకునే సేవలు కావు. కావాలని చేసేవి."
    "రాజుల మాటలు యిలాగే వుంటాయి."
    "నమ్మలేకపోతున్నావా?"
    "లొంగదీసుకోవటానికి చెప్పే మాటలు" అంది ముఖం ప్రక్కకు తిప్పుకుని.
    "నన్ను నమ్మాలంటే నేనేమి చెయ్యాలి."
    "కాస్త దూరంగా జరిగితే చాలు నమ్ముతాను."
    "మీ ఆడవాళ్ళ మనసు కఠినమయింది."
    "ఎందుకట?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS