Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 47


    "నేనిచ్చే దేమిటి? అంతా వాడిదే! నా సర్వస్వం వాడిదేగా? నేనే వాడివాడ్ని అయిపోయాను. వాడు పెరిగి పెద్దవాడయి నాకేమిస్తాడో చూడాలి." సాంబయ్య కంఠం వణికింది. సాంబయ్య ఇంత ఇదిగా తీసుకుంటాడని కనకయ్య అనుకోలేదు. వరూధిని, వెంకటపతి మౌనంగా వుండిపోయారు.
    "నీ ఆస్తిని మూడింతలు చేస్తాడు. కలెక్టరో, గవర్నరో అవుతాడయ్యా నీ మనమడు. కుర్రాడి జాతకం బ్రహ్మాండంగా వుంది. నీ పేరు నిలబెడ్తాడు." కనకయ్య అన్నాడు.
    సాంబయ్య కనుపాపల్లో పసివాడి నీడలు ప్రతిఫలించాయి.
    "భోజనాలకు లేవండి. ఆలస్యం అయిపోతుంది." మామగార్నీ కనకయ్యనూ చూసి అన్నది వరూధిని.
    సాంబయ్య వెంకటపతికేసి తిరిగి "ఏరా ఎప్పుడూ ప్రయాణం?" అని అడిగాడు.
    వెంకటపతి భార్యకేసి చూశాడు. వరూధిని అదేమీ వినిపించుకోనట్టే ముఖం పెట్టింది. "బారసాల కూడా మన వూళ్ళోనే చేసుకుంటే బాగుండేది. సరే, అయిందేదో అయిపోయింది. రేపు వర్జ్యం చూసుకొని బయలుదేరితే బాగుంటుంది."
    "డాక్టరమ్మగారు బాబుకు మూడోనెల వచ్చేదాకా ఇక్కడే వుంటే మంచిదన్నారు. పైకి ఇట్లా కనబడుతున్నానేగాని నాకు వంట్లో అంత బాగుండడం లేదు. ఏమీలేదు. ఇన్నాళ్ళున్నాం. ఇంకా రెండునెలలు, బాబు కొంచెం వళ్ళు చేసిందాకా వుంటే ఏం పోతుంది? అంత తొందరేమొచ్చింది?" అన్నది వరూధిని.
    సాంబయ్య కొడుకు అభిప్రాయం కోసం చూశాడు. వెంకటపతి నిస్సహాయంగా తండ్రి ముఖంలోకి ఓ క్షణం చూసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
    "సాంబయ్యగారూ! అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు భోజనానికి పదండి!" అన్నాడు కనకయ్య, భోజనాలు వడ్డిస్తున్న గదిలోకి దారితీస్తూ సాంబయ్య భోజనాల గది దాటి వరండాలోకి వచ్చాడు. కనకయ్య "ఇటు! ఇటు! అటెక్కడికీ?" అంటూ హడావిడి చేస్తూ సాంబయ్య వెనకపడ్డాడు.
    "బస్పందదు. నే వెళ్తాలే!" అన్నాడు సాంబయ్య.
    "ఏమయ్యోయ్ వెంకటపతీ! అమ్మాయ్ వరూధినమ్మా! నీ మామగారు భోజనం చెయ్యకుండా వెళ్తున్నారమ్మా!" అని కేక పెట్టాడు కనకయ్య.
    "పోయేవాళ్ళను పట్టుకొంటే ఆగుతారా ఏం?" ఉక్రోషపడుతూ అన్నది వరూధిని.
    వెంకటపతి గబగబా పరుగెత్తుకొచ్చాడు. అప్పటికే సాంబయ్య గుమ్మందాటి వీధిలోకి వచ్చాడు.
    "మీరెక్కడికి? ఇంకా ఇంతమంది భోజనాలకు వున్నారు? ఆయనవెంట పోతారేం?" గుమ్మం దిగబోతున్న వెంకటపతి వరూధిని గొంతు విని ఆగిపోయాడు. తిరిగి ఇంట్లోకి వచ్చాడు.
    కనకయ్య భోజనం చేసి, వరూధినికి చెప్పి బయలుదేరాడు. బస్సుస్టాండ్ లో పిట్టగోడమీద కూర్చొని బస్సుకోసం వేచివున్న సాంబయ్య కన్పించాడు.
    "ఏం సాంబయ్యా, అట్టా చేశావ్? నీ కొడుకూ కోడలూ ఎంత బాధపడ్డారో తెలుసా?"
    "ఏమోనయ్యా! ఆ కొంపలో పచ్చిగంగ ముట్టబుద్ది కాలేదు." తగ్గిపోయి అన్నాడు సాంబయ్య.
    "మీ కోడలు తిండికూడా తినకుండా బాధపడుతున్నదయ్యా!"
    "ఈ కల్లబొల్లి కబుర్లకేం గాని - వాళ్ళు బస్తీలో కాపురం ఎత్తేసేదాకా వాళ్ళ ముఖం చూడదలచుకోలేదు. ఈ బస్తీలో కాపురం పెట్టి నా కొంప ఆరుస్తున్నారు!"
    "ఏమిటయ్యా, నీ కొంప ఆర్పింది? ఏభైవేలకు స్థలం కొన్నారా? ఇప్పుడు దాన్ని ఎనభై వేలకు అడుగుతున్నారు. చిటికెల మీద ముఫ్ఫైవేల లాభంకొట్టారు. ఎన్నేళ్ళు పొలంలో రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు  చేసుకొంటే ముఫ్ఫైవేలు వస్తాయయ్యా?" సాంబయ్యను దులిపెస్తూ అన్నాడు కనకయ్య. సాంబయ్య ఆలోచనలో పడ్డాడు.
    "ఎక్కడంటా వాళ్ళు కొన్నది?" సాగదీస్తూ ఇష్టం లేనట్టే అడిగాడు.
    "రా, చూపిస్తా!"
    "బస్సు వస్తదేమో!"
    "వస్తే రానియ్. నిన్ను చిన్నకార్లో ఊళ్ళో దింపుతాగా? రా." కనకయ్య అన్నాడు.
    సాంబయ్య కనకయ్యవెంట మంత్రించినవాడిలా నడిచాడు.
    "ఇదే స్థలం!"
    "ఆ రాయిదాకా వుందా?" సాంబయ్య కన్నార్పకుండా చూసి అడిగాడు.
    "అదే హద్దు. ఎకరం ముఫ్ఫైసెంట్లు." చెప్పాడు కనకయ్య.
    "రోడ్డు కానుకొనే వుంది." అన్నాడు సాంబయ్య.
    "ఇది పెద్ద సెంటరయ్యా! ఈ బస్తీ మొత్తం మీద ఇట్లాంటి సెంటరు లేదు." అన్నాడు కనకయ్య.
    సాంబయ్య సంతోషపడ్డాడు. కాని, పైకి కన్పించకుండా "ఇప్పుడది ఎనభై వేలకు కొంటారంటావా?" అని అడిగాడు.
    "అమ్ముతారా! రేపే నేను కొంటాను. మీ కోడల్ని ఒప్పించండి!"
    "కోడల్నా? పెళ్ళాం పేర కొన్నాడా వాడు?" కనకయ్యకేసి సూటిగా చూస్తూ  అడిగాడు సాంబయ్య.
    కనకయ్య ఇరుకున పడ్డాడు. పొరపాటుగా నోరు జారాననుకొన్నాడు.
    "బస్తీల్లో ఆడవాళ్ళ పేర్లనే వుంటాయి స్థలాలూ, ఇళ్ళూ, ఆస్తులూ."
    "పల్లెటూరు విడిచి బస్తీకెక్కిన ఆడది మొగవాడై పోతుందా ఏం?" సాంబయ్య ప్రశ్నకు కనకయ్యకు సమాధానం దొరకలేదు.
    "మగాడు ఆడదాని కొంగుపట్టుకు తిరుగుతాడా ఏం ఇక్కడ?"
    "ఊరుకోవయ్యా నువ్వు మరీను! ఆడదాని కొంగుపట్టుకు తిరిగేవాడు పల్లెలో వున్నా, బస్తీలో వున్నా అదేపని చేస్తాడు. తెలివితేటలున్న మగాడు ఎక్కడున్నా రాజసంగానే వుంటాడు. పద! పద! మళ్ళీ కారెక్కడికన్నా బాడుగకు పోతుందేమో!" అని కనకయ్య దూరంగా, రోడ్డుకు అవతలవున్న షెడ్డుకేసి నడిచాడు.
    "ఆమధ్య అడిగితే కారు నీదికాదని చెప్పావుగా?"
    "అవును! అప్పుడు ఆ మాట నిజమే!"
    "అయితే ఇప్పుడు?"
    "ఈ మాట నిజం!"
    "వీడిది నాలుకా, తాటిపట్టా?" అనుకున్నాడు సాంబయ్య.
    కనకయ్య అంగలు పంగలేస్తూ సాంబయ్యను వెంటపెట్టుకొని షెడ్డుదగ్గిరకొచ్చాడు.
    
                            19
    
    కలుపుతీసేరోజుల్లో వెంకటపతి ఉగ్గం కట్టిన వెన్నపూస తపేళా పట్టుకొని రైలుపేటలో మేడముందు దిగాడు. రిక్షావాడు బియ్యం బస్తా ఎత్తుకొచ్చి మెట్లమీద దించాడు. రిక్షావాడికి డబ్బులిచ్చి వీధి తలుపు తట్టాడు. మళ్ళీ తలుపు తట్టబోతున్న వెంకటపతికి తలుపుకు వేసి వున్న తాళం కన్పించింది. ఈవేళప్పుడు ఎక్కడికి వెళ్ళారా అనుకుంటూ, వెన్నపూస తపేళా కింద దించి, బియ్యం బస్తా పక్కగా, మెట్లమీద గొంతుక్కూర్చున్నాడు.
    పొద్దుపోయి ఆఖరు బస్ దిగొచ్చిన వెంకటపతికి ఆకలి వేస్తూంది. ఇంట్లో పనిపిల్ల కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? వెంకటపతి వీధిలో వచ్చే పోయేవాళ్ళను చూస్తూ కూర్చున్నాడు. రాత్రి పదిగంటలు అయింది. సినిమాకు వెళ్ళిన జనంకూడా తిరిగి వస్తున్నారు. ఇంతవరకూ రాలేదు. వీళ్ళంతా ఏమైనారు? ఇంత పొద్దుపోయిందాకా ఏం చేస్తున్నట్టు?
    కారులైట్లు వెంకటపతి ముఖంమీద పడ్డాయి. కళ్ళు చిట్లించి చెయ్యి అడ్డం పెట్టుకొని చూశాడు. మరుక్షణంలో కారు వచ్చి ఇంటిముందు ఆగింది. పనిపిల్ల, నిద్ర పోతున్న కుర్రాడ్ని ఎత్తుకొని ముందు సీట్లోనుంచి దిగింది.
    వరూధిని వెనకసీట్లోంచి దిగింది. వెనక సీట్లో కూర్చొని వున్న రామనాథబాబు దిగటానికి సందేహించాడు.
    "అదేమిటి? ఇంట్లోకన్నా రాకుండా పోతారా ఏం?" అన్నది వరూధిని డోరుమీదగా కార్లోకి వొంగిచూస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS