మా స్టార్ ప్రారంభమయ్యిందనే చెప్పాలి. నేను కూడా నాకున్న తెలివి తేటలు ఉపయోగించి డబ్బింగ్ సూత్రాలు, ట్రిక్స్ తెలుసుకొని, శ్రీశ్రీగారి ట్రయినింగ్ తో మాటలు కూడా రాసే శక్తిని సంపాదించుకోవడం ప్ర్రారంభించాను.
ఇక ఈ విధంగా మా సినిమా జీవితం గురించి రాయడం మొదలుపెడితే అంతం వుండదు. కనుక, ఇక చకచకా కథలోకి సాగిపోతాను.
'గంధర్వకన్య' పిక్చర్ రిలీజయి, అట్టర్ ప్లాప్ అయింది. మూడు రోజుల్లో భద్రంగా డబ్బాలు వెనక్కి వచ్చేశాయి. కొన్నిచోట్ల స్క్రీన్ కూడా చింపేశారని విన్నాం. ఆ బాధ డబ్బు పెట్టిన వాళ్ళకి కానీ తెలీదు.
ఏం చేస్తాం? మన మొదటి పిక్చరే ఇలాగయిందేమిటని బాధపడినా, సెంటిమెంట్ గా, ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ అవడం మంచిదే అనుకోని తృప్తి పడ్డాను.
నా సెంటిమెంట్ కరెక్టే అన్నట్టు తర్వాత వచ్చే ప్రతి ఒక్క పిక్చరూ యబహయి రోజులూ, డెబ్బై అయిదు రోజులకి తక్కువ లేకుండా రన్నయ్యాయి.
'సాహసవీరుడు' పిక్చరయ్యేసరికి అన్నామలైపురంలో శ్రీశ్రీగారు జాగాకొని ఇల్లు కట్టడం ప్ర్రారంభించారు. అదే టైంలో నేను కూడా బీరువాలు, వగైరా పెద్ద సామానులు కొనుక్కోవడంతోపాటు, అయిదువందల రూపాయల అద్దె ఇంటికి శ్రీరాం నగర్ కి మకాం మార్చేశాను.
ఒక్క క్షణం తీరక వుండేది కాదు. మధ్యలో స్ట్రయిట్ పిక్చర్ పాటలు ఎక్కువగా వచ్చేవి. డబ్బింగ్ లో నన్ను వదిలేసి శ్రీశ్రీగారు కంపెనీలకి వెళ్ళి పోయేవారు.
శ్రీశ్రీగారు ఇల్లుకడుతూండగా తరచు వెళ్ళడం జరిగేది. ఆవిడ చాలా ఆప్యాయంగా ఆదరించేవారు. ఈ మార్పుకి నేనే ఆశ్చర్యపోయాను.
వారు కడుతున్న యింటికి పక్క వీధిలోనే శర్వాణి పిక్చర్స్ వుండేది. అప్పుడు వాళ్ళు 'అక్కచెల్లెళ్ళు' తీస్తున్నారు ఆ కంపెనీకి శ్రీశ్రీగారితో వెళ్ళినప్పుడల్లా వారు కడుతుండే ఇంటికి కూడా వెళ్ళి సూపర్ వైజింగ్ చేసేదాన్ని అందుకు కారణం - శ్రీశ్రీగారి భార్య రమణమ్మగారు చూపే అభిమానమేనని చెప్పాలి.
రోజూ శ్రీశ్రీగారింటికి వెళ్ళి ఆవిడని చూసి వెళ్ళేదాన్ని ఆ చనువు ఎంతవరకూ వచ్చిందంటే ఆవిడని అమ్మా అని పిలిచేతంత వరకూ వచ్చింది.
నాకు బాగా జ్ఞాపకం - మా యిద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వుండేవికావు. అన్యోన్యంగా వుండేవాళ్ళం. పని లేని రోజుల్లో అక్కడే వుంటూ వుండేదాన్ని శ్రీశ్రీగారు మాత్రం కంపెనీలకి పాటలు రాయడానికి వెళ్ళేవారు.
ఆవిడా నేనూ కలసి బట్టల షాపుకి, నగల కొట్టుకి వెళ్ళేవాళ్ళం.
'మొత్తానికి శ్రీశ్రీ దగ్గర నిలబడిందిరా! ఈ అమ్మాయి అడుగుపెట్టింది మొదలు ఆర్ధికంగా శ్రీశ్రీగారి జాతకమే మారిపోయింద'ని మద్రాసు సినీఫీల్డులో బహిరంగంగా ఒకరితో ఒకరు చెప్పుకోడం ప్రారంభించారు.
"ఆ శ్రీశ్రీయే కాదు. శుచీ, శుభ్రం....అన్ని విషయాల్లో బాగా మార్పు వచ్చింద"ని కొందరూ, 'ఇప్పటికీ ఆ అమ్మాయి ఎన్నో అవస్థలు పడుతోంద"ని కొందరూ, 'ఎన్ని పడితేనేమండీ. లక్ష్మీకటాక్షం ప్రాప్తించింది. ఈ అదృష్టం అంతా ఆ అమ్మాయిదే' అని కొందరూ చెప్పుకోసాగారు. ఈ విధంగా నేను శ్రీశ్రీగారి దగ్గర ప్రవేశించిన కొత్తలో చిన్న సంచలనం బయలుదేరింది.
ఈ వార్తలు ఆనోటా ఈ నోటా వెళ్ళి శ్రీశ్రీగారి భార్య చెవిలోపడి, ఆమెను హర్ట్ చేశాయి. దాంతో మాలో కలతలు ప్రారంభమయ్యాయి.
నేను అడుగుపెట్టిన తర్వాత ఆర్ధికంగా శ్రీశ్రీగారు బాగుపడ్డారు. నావల్లే అదృష్టం వచ్చిందన్న మాట ఆవిడకి నచ్చలేదు.
"నా కూతురు అదృష్టం, నా అదృష్టం మా అమ్మాజీ (అంటే పెంపుడువ కూతురు.) వచ్చింది మొదలు మా యింటి పరిస్థితులే మారాయి. ఇదంతా దాని అదృష్టం" అని ఆవిడ వాదం.
కూతురు అదృష్టమే కావచ్చు. కాదని కానీం తప్పని కానీ ఎవరన్నారు?
ఎలాగో దరిద్ర బాధలేకుండా సుఖంగా ఉండడమే కావాలని నా వాదన. కానీ ఆవిడ ఎవరి మాటా వినిపించుకొనే స్థితిలో లేరు. ఇవేవీ నేను పట్టించుకోకుండా వచ్చిపోతూ వుండేదాన్ని.
ఈ అదృష్టం నాదని అందహ్రూ అనుకొనే మాటమీద, భార్యాభర్త లిద్దరి మధ్యా గొడవలు ప్రారంభమయ్యాయన్న విషయం నా చెవిన పడింది.
ఎలాగంటే - డి.ఎల్.గారి భార్య ఆవిడకి చాలా మిత్రురాలు. డి.ఎల్.గారి భార్యతో నాకు వాళ్ళు చేస్తున్న డబ్బింగ్ చిత్రంతో (రత్నగిరి రహస్యం) పరిచయమయ్యింది. ఆవిడకి నేనంటే విపరీతమైన అభిమానం.
"అమ్మాయి సరోజా! ఈ అదృష్టమంతా నీదేనే! ఆ మాట శ్రీశ్రీగారి పెళ్ళాంతో అంటే ఆవిడకి ఎంత కోపం వచ్చిందంటావ్?" అని తరచుగా నాతో అంటూ వుండేదావిడ. "చూడండమ్మా! నేను వారి దగ్గర పనిచేస్తున్నాను. అక్కడి విషయాలు మీరు చెప్పడం, నేను వినడం నాకు మంచిది కాదు. ఆవిడ కోపగించటంలో తప్పేముంది తన అదృష్టంకాక, అది ఇంకొకరివల్ల వచ్చిందంటే, ఏ ఆడదానికైనా భరించడం కష్టమే" అన్నాను.
దానికావిడ, "అది కాదు నాకూ ఆవిడకీ ఈ మాటమీద చాలా ఘర్షణయ్యింది. తన కూతురి అదృష్టం అంటుందావిడ. "నీ కూతుర్ని చేరదీసి పది పదకొండేళ్ళు అవుతోంది. అప్పటినుండి లేని అదృష్టం ఇప్పుడు వచ్చిందా' అని అడిగాను సుమీ! మేమిద్దరం మంచి స్నేహితులం. ఆ చనువుమీదే అడిగాను. నా నోరు నొక్కిందిగానీ, ఇదేమాట అందరూ అంటున్నారు. వాళ్ళ నోరు నొక్కమను" చూద్దాం అనేవారావిడ.
అదృష్టం మాట దేవుడెరుగు! కలసిమెలసి వున్నామని సంతోషిస్తూ వుంటే ఇదేం శాపం? వారిద్దరి మధ్యా గొడవలొస్తున్నాయన్న మాట ఎంతవరకూ నిజమో వారినే అడిగి తెలుసుకుంటే సరిపోతుందనుకున్నాను.
ఆరోజు డి.ఎల్.గారి ఆఫీసులోనే పని కారు తీసుకొని శ్రీశ్రీగారు వచ్చారు. బయలుదేరాం. సాధారణంగా దారిలో ఏదైనా మాట్లాడే ఆయన, ఆరోజు దమ్ము లాగుతున్నారేకానీ నోరు విప్పలేదు.
"ఏవండీ" అని పిలిచా.
వెనక్కి తిరిగి చూశారు.
"ఏదోలా వున్నారే? ఒంట్లో బాగుంది కదా?" అనడిగాను.
"ఊఁ!" అన్నారు.
"ఇంట్లో అంతా బాగున్నారుగా?".
"ఆఁ" అన్నారు.
"ఇంట్లో గొడవలేవీ లేవుగా".
"అబ్బ! ఇక్కడ కూడా ఇంటి గొడవలెందుకులే సరోజా!".
"అవే కావాలండీ నాకు తెలియాలి. నావల్ల మీ పచ్చని సంసారంలో చిచ్చురగలకూడదు".
"ఏడిసినట్లుంది. నీవల్ల ఎందుకు రగులుతుంది సరోజా!".
"అయితే మీరు చిరాకుగా ఎందుకున్నార"ని అడిగాను. ఆయన మాట్లాడలేదు.
ఇంతలో ఆఫీసు వచ్చేసింది. ఈ రోజు ముఖ్యమైన పాట రాయాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ నేను అనుకున్న విషయం తెలుసుకుంటే కానీ నాకు తోచడంలేదు.
"సరోజా! పాట రాద్దామా?" అనడిగారు.
"తప్పకుండా రాద్దాం. కానీ, ఇంట్లో ఏమిటి గొడవలు? దయచేసి చెప్పరా" అన్నా.
"ఏముంది సరోజా! మీ ఆడవాళ్ళతో వున్న గొడవే! అది ఏదో వాగుతూ వుంటుంది. ఇప్పుడు ఎందుకులే? నీ బుర్ర కూడా పాడైపోతుంది" అన్నారు.
"ఫరవాలేదండీ నేను పాడుచేసుకోను. చెప్పండి" అన్నాను.
రెండుసార్లు అడిగిన తర్వాత ఇలా చెప్పారు.
"నువ్వు కారులో మా యింటికి రాకూడదట. నేను చెప్పడం, నువ్వు రాయడం, ఈ డబ్బింగుల వల్ల మన ఇద్దరి అనుబంధాలు పెరిగిపోతున్నాయట. నీ వల్లే అదృష్టం పట్టి బాగా డబ్బులు వస్తున్నాయని అందరూ అంటున్నారట.
నిన్న ఇంటావిడ కూడా, 'ఏమైనా అనండి రమణమ్మగారూ! ఆ అమ్మాయి అదృష్టవంతురాలు వచ్చి ఇంకా ఆరునెలలైనా కాలేదు. అప్పుడే గృహప్రవేశం చెయ్యబోతున్నారు' అని అందిట.
ఆమాట కీవిడ మండిపడి 'అదృష్టం ఆవిడది కాదండి. మా అమ్మాజీది' అందిట. 'మా యింటికొచ్చి మీరు పదమూడేళ్ళయింది. మీ అమ్మాజీని పెంచుకొని పదకొండో, పన్నెండో ఏళ్లవుతోంది. ఇన్నాళ్ళూ కలసిరాంది. ఇప్పుడు వచ్చిందా?' అని అనేసరికి, మా ఆవిడ ఆవిడమీద దండయాత్ర చేసినంత పనిచేసిందట.
* * *
కొత్త కారు కథ
'ఇంతవరకూ చేసిన పిక్చర్లు చాలు. ఆ అమ్మాయినిక మీ దగ్గర పనికి పెట్టుకోవద్దు. మీకు మరీ కష్టంగా ఉందంటే మగ అసిస్టెంట్ ను పెట్టుకోండి. మరీ దానిమీద అంత ఆశగా ఉంటే.....ఎంతమంది దగ్గరో మీ ఆశ తీర్చుకున్నారు....నాకేమీ అభ్యంతరంలేదు. కానీ ఆమెను ఇకమీద పనిలో పెట్టుకుంటే మాత్రం నేను ఒప్పుకొనేది లేద'ని నన్ను చంపుతోంది.
'నీ యింటికి రావద్దని చెప్పమంటే చెప్పేస్తాను. కానీ పనిలోనుండి నేను ఆమెను తియ్యను. ఏమైనా సరే సరోజ నా అసిస్టెంట్ గా పనిచెయ్యాల్సిందే. అయినా ఊళ్ళోవాళ్ళ మాటలు విని నీకీ పాడు బుద్దులేఁవిటి? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటారు. దానికి సరోజేం చేస్తుంది. ఈ అదృష్టం అంతా తనదని నీతో అందా?' ని అడిగాను. 'దాని పేరు నా ముందు అంటే ఒప్పుకోను. మీకు నేను కావాలా, అది కావాలా' అని అడుగుతోంది. ఈ గొడవలతో బుర్ర వేడెక్కిపోతోంది సరోజా!" అన్నారు.
