Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 47


    ఇది ఇలావుంటే నా కక్షకి కారణం చెబుతాను. ఆడపిల్లలతో ఆటలాడుకునే కిరణ్ నా ప్రాణప్రధమయిన ఒక్కగానొక్క చెల్లెల్ని నమ్మించి వంచించాడు. అదిచేసిన నేరమల్లా నల్లని నలుపుతో పుట్టడమే. దాన్ని ప్రేమించానని నటించి వంచించి చివరికి నల్లబొగ్గు అని తిట్టి దూరంగా వెళ్ళిపోయాడు కిరణ్. ఆ విషయమంతా లెటర్ రాసిపెట్టి నిద్రమాత్రలుమింగి ఆత్మహత్య చేసుకుంది.
    వెంటనే వెళ్ళి కిరణ్ ని షూట్ చేద్దామని అనుకున్నాను. అలా చేయటంవలన నేనే చిక్కుల్లోపడతానని గ్రహించుకుని సమయం చూసి దెబ్బతీయాలని కిరణ్ ని నీడలా వెంటాడాను. ఒకారి ఒక ఆడపిల్లతో వాదులాడుతుండగా చాటుగా కూర్చుని వాళ్ళ మాటలు విన్నాను. అదే సమయంలో కిరణ్ హత్య చేస్తుంటే ఫోటోలు తీశాను. ఆ ఫోటోలు కామిని చేతిలో పడ్డాయి. కామిని ఏవి ఎక్కడ దాస్తుందో నీకు తెలుసుకాబట్టి నీవు వాటిని సంపాదించి నాకు తెచ్చి ఇస్తే, నేను అన్నమాట ప్రకారము మూల్యం సంతోషంగా చెల్లించుకుంటాను. ఆ సాక్ష్యాధారాలతో ఆ తండ్రీ కొడుకులు అటు చావు ఇటు బ్రతుకు కాకుండా నరకం చూపిస్తాను. టూకీగా ఇదీ విషయం. నీకేమన్నా అనుమానాలు వుంటే తీర్చుకో" అంటూ కథ ఇంట్రస్టింగ్ చెబుతూ విస్కీ దామోదరం గ్కాసులో మధ్య మధ్య పోస్తూనే వున్నాడు.
    కథలో లీనమయిన దామోదరం తనకు తెలియకుండానే మొత్తం విస్కీ త్రాగేసాడు. ముందు ప్రశ్నలు వేశాడు. ఆ తరువాత తనకి తెలియకుండానే ఆ మత్తులో పాండే అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ పూర్తిగా నోరు జారాడు.
    పాండే తనకి కావలసినవి స్వీకరించుకున్నాడు. అప్పటి కది చాలు. దామోదరం చేతికి అయిదు వేలు ఇచ్చి, తన కారులో దామోదరాన్ని అతని ఇంటివద్ద దిగబెట్టి వచ్చాడు పాండే.
    క్రొత్తగా రంగప్రవేశం చేసిన ఈ క్రొత్తబాబు తక్కువ వ్యవధిలో ఎక్కువ సమాచారం సేకరించగలిగాడు.
    క్రిమినల్ అండ్ లాయర్ అయిన బ్లాక్ మెయిలర్ పాండే సామన్యుడు కాదు. గంటన్నర కాలంలోనే దామోదరాన్ని తన దారికి  తీసుకు రాగలిగాడు.
    అన్నీ సవ్యంగా వుంటే గెలుపు పాండేదే అవుతుంది. దామోదరం చాకచక్యంగా చేసే పనినిబట్టి అది ఉంటుంది.
    పాండే అంతటివాడు దామోదరం మీద ఆధారపడ్డాడు తప్పదు.
    
                                       28
    
    కామినీకి తన బాబాయిమీద చాలా అనుమానాలు వచ్చాయి. డానికి కారణం దామోదరం ప్రవర్తన.
    దామోదరం ఈ మధ్య డబ్బు అడగకపోవటము రెక్ లెస్ గా ప్రవర్తించడమే కాక. ఈమధ్య తన మావగారైన రావుగారితో కలసి కారులో వెళ్ళటం కనిపించడము, వాళ్ళిద్దరూ పకపక నవ్వుకుంటూ మాట్లాడు కోవటమూ చూసింది. దీనికి తొడు కిరణ్ కూడా నువ్వంటే నాకేం లెక్క అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. యిదంతా ఏమిటో, దీనికి కారణం ఏమిటో కనిపెట్టి చూడాలనుకున్నది కామిని.
    ఐదు లక్షలు యిచ్చినా అయిదు నిమిషాలలో స్వాహా చేయకల సమర్ధుడు దామోదరం. అలాంటిది కామినీ ఇచ్చిన డబ్బంతా అవచేసి మళ్ళీ డబ్బు అడిగాడు. కామినీ ఇవ్వలేదు అయినా ధారాళంగా డబ్బు ఖర్చు చేస్తున్నాడు. అంటే ఎవరో దామోదరానికి డబ్బు అందిస్తున్నారన్నమాట. దామోధరానికి డబ్బు అందించడమూ అంటే విషయం చిన్నది అయి వుండదు.
    ఈ ఆలోచన చేసిన కామిని, దామోదరాన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టడం చేసింది. ఏ చిన్న పొరబాటు జరిగినా తన భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. కామినీకి ఆ విషయం బాగా తెలుసు. అందుకనే అతి జాగ్రత్తతో వ్యవహరిస్తున్నది.
    "ఈ డబ్బంతా ఎక్కడిది?" అని ఒకరోజు దామోదరాన్ని అడిగితే, "మనసుంటే మార్గమేలేదా! నేరాలు చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకూ నాలాంటి వాడి రోజులకి ఢోకాలేదు." అన్నాడు దామోదరం.
    మరో రోజు తను వెళ్ళేసరికి తనూ బాబాయి కలసి వున్న యిల్లు, దేనికో వెతికినట్లు సామానంతా చిందర వందరగా పడేసి, కెలికినట్లుగా వుంది. "యిదేమిటి? బాబాయ్!" అంటే  "రాత్రి బాగా త్రాగి ఒళ్ళు తెలియక నేనే ఈ పని చేశాను" అన్నాడు.
    దామోదరం తప్ప తాగితే మత్తుగా పడుకుంటాడు. లేకపోతే పిచ్చి గంతులు వేస్తాడు. కాని ఇంత చక్కగా అన్ని వస్తువుల్ని కెలికాడు. దామోదరం చెప్పింది నమ్మినట్టు నటించి అసలు విషయం రాబట్టడానికి నవ్వుతూ దామోదరంతో కబుర్లు వేసుకుని కూర్చుంది కామిని.
    దామోదరం అప్పటికే ఫోటోల కోసం, క్యాసెట్ కోసం వెతకని చోటంటూలేదు. వెతికి, వెతికీ కానరాక విసిగిపోయి ఉన్నాడు. లక్షలు సంపాదించే గోల్డెన్ ఛాన్స్ తప్పిపోతుంది ఏమో అని దిగులుగా ఉన్నాడు. సరీగా అలాంటి సమయంలోనే కామిని అతనితో మాటలు పెట్టుకుంది.
    "బాబాయ్! ఈ రోజు నాకు అత్తా, మామ, భర్త అంటూ ఒక యిల్లు ఏర్పడ్డా, నీ తరువాతనే అవన్నీ నిన్ను విస్మరించను. నేను అడగంగానే నా భర్త నాకు డబ్బు ఇవ్వక పోవటంవల్ల నేను నీకు సమయానికి డబ్బు అందించలేకపోయాను. అంతమాత్రంచేత అపార్ధం చేసుకోకు. ఎంతైనా నా మనం మనం ఒకటి.
    మన మధ్య రహస్యాలు వుంటే మనకే చేటు తెస్తాయి. ఈ డబ్బు ఎవరు ఇచ్చారు? ఎందుకు యిచ్చారు?" అడిగింది కామిని.
    "అదో పెద్ద దేవరహస్యం!" అన్నాడు దామోదరం.
    "నేను వినకూడనంత దేవరహస్యాలు ఏమి ఉన్నాయి? నా దగ్గర నువ్వు రహస్యం దాయటమా!"
    "తప్పేమి వుంది. నా దగ్గర నీవు మటుకు దాయలేదా! కిరణ్ చేసిన హత్యా రహస్యాన్ని" అన్న దామోదరం నాలుక గట్టిగా కొరుక్కున్నాడు.
    "యింతవరకూ కామిని కిరణ్ తాలూకా రహస్యము అని మాత్రమే చెప్పింది కాని, హత్య అనే మాట అసలు చెప్పలేదు. మరి దామోదరానికి ఈ విషయం ఎలా తెలిసినట్లు? కామినీకి ఒక్క క్షణం తల గిర్రున తిరిగింది.
    హత్య ఏమిటి"? అనాల్సింది పోయి తనూ నోరు జారి "ఈ విషయం నీకెట్లా  తెలుసు బాబాయ్?" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS