Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 47


    "ఇది రిస్కు అని నాకు తెలుసు. అయినా అంగీకరిస్తున్నాను ఎందుకంటే నా కోసం మీరు యిప్పటికే చాలా రిస్కు తీసుకున్నాడు కాబట్టి."
    అది కృతజ్ఞతో లేక అపహాస్యమో ముందు అర్ధంకాలేదు సుకృతికి. అసలు శివలాంటి సంస్కారం గల వ్యక్తి అపహాస్యంగా మాట్లాడడని తెలిసినా తన మనసులో పేరుకున్న గిల్టీనెస్ ఆమె చేత అలా ఆలోచించేట్టు చేసింది.
    "నేనేం రిస్కు తీసుకోలేదే" మరెటో చూస్తూ అంది.
    "అంటే నేను నా ప్రతిభతోనే యీ అవకాశాన్ని దక్కించుకున్నా నంటారు."
    ఏ జవాబు కోసం యిలాంటి ప్రశ్నవేస్తున్నదీ ముందామెకు అర్ధం కాలేదు.
    "కొన్ని పరిచయాలు జీవితం మీద రోత పుట్టిస్తే, మరికొన్ని అనూహ్యమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి మిస్ సుకృతీ.....అలాంటి గొప్ప ప్రభావాన్ని నా మీద చూపించిన వ్యక్తి మీరు."
    నిర్లిప్తంగా చూస్తుంది సుకృతి.
    "అందుకే మీరు నాకో అవకాశం యిప్పించటానికి చాలా శ్రమపడ్డారని తెలిసిన క్షణంలో ముందు ఆనందపడ్డాను. ఏ స్థాయి రిస్కు తీసుకున్నదీ అర్ధమౌతుంటే సిగ్గుపడుతున్నాను. డిటైల్స్ వదిలేద్దాం. కానీ...." మనసులోని భావాలని భాష్యం చెప్పటం చాలా కష్టంగా వుంది.....ఎందుకో ఆ విషయం ముఖాముఖీ ఆమెతో చర్చించాలంటే మనసొప్పడం లేదు. ఆమె మీద యిప్పుడెలాంటి భావం ఏర్పడిపోయిందీ అతడూ స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నాడు.
    సుకృతి మనసెంత విలవిల్లాడిపోతున్నదీ అతడికి తెలీదు. ఇంతకాలమూ తప్పు చేసినందుకు కాదు, అతడికి ఆ తప్పు తెలిసిపోయినందుకు బిడియంగా తలవంచుకుంది.
    "ఎందుకు సుకృతీ....మీ స్థాయి ఆడపిల్ల అనవసరంగా యిలాంటి రొంపిలోకి ఎందుకు అడుగు పెట్టారు? ఆ రొంపిని జీవితంగా మార్చుకుని అలాగే బ్రతకాలని ఎందుకనుకుంటున్నారు?"
    "ప్లీజ్" ఉద్విగ్నంగా అంది సుకృతి. "మీరు యిప్పుడు జరిగిందాని గురించి మాట్లాడాలనుకుంటే నేను వినడానికి సిద్దంగా లేను."
    భావరహితంగా చూశాడు. "మీరు హర్టయ్యారనుకుంటాను" నవ్వింది అదోలా. "హర్టయ్యేది అవమానం జరిగిందని ఆలోచించే క్షణాలలో శివా.....మానాభిమానాలు కోల్పోయాక కాదు.... ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకోవడం మార్చురీ జరిగిన శరీరాన్ని చూస్తూ మరోలా జరిగితే బ్రతికి వుండేదే ఆ అమ్మాయి అని ఆలోచించడం లాంటిది. అయినా నేనేం చేశాను.....అన్ని మార్గాలూ మూసుకుపోయాయని ఖచ్చితంగా తెలిశాక అందమైన ఆడపిల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అనుసరించే మార్గంలోకి అడుగుపెట్టాను. అదీ నా యిష్టంతో కాదు అదొక్కటీ మీరు గుర్తిస్తే చాలు.....గుర్తించకపోయినా నాకు అభ్యంతరంలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే నేను ద్వేషించే యీ సినీ ప్రపంచంలో ద్వేషించ కూడని ఒకే ఒక్క మనిషిగా మీరు అనిపించబట్టి."
    "థాంక్స్" పైకి లేచాడు శివ.
    అలా లేవడంలో అణువంత కోపం కనిపించినందుకేమో అలివేలు ముందుకొచ్చింది. "కాఫీ తీసుకుంటారా?"
    "లేదు అలివేలుగారూ.....భోంచేశాను."
    "వెళ్ళిపోతున్నారేం?"
    "మాట్లాడాల్సింది అయిపోయింది కాబట్టి."
    "అసలెందుకొచ్చినట్టు?"
    "నాకొచ్చిన యీ అవకాశం సుకృతిగారి ద్వారానే అని తెలిసి నిజమో, కాదో తెలుసుకోవాలని.....తెలిసిపోయింది"
    "సుకృతితో మాట్లాడేకేనా?"
    "కాదు శెట్టిగార్ని యిక్కడ చూశాక."
    సుకృతి నివ్వెరపోయి చూస్తుండగానే ద్వారం దాటి బయటకు వచ్చాడు.
    సుకృతి కాదు. అలివేలు అనుసరించింది.
    "కోపం తెచ్చుకోకు శివా....మీ మీద తనకున్న యిష్టమో, అభిమానమో లేదూ అంటే మీరో గొప్ప దర్శకుడు కాగలరన్న నమ్మకమో సుకృతి తన హద్దు దాటి వెళ్ళటానికి కారణమైంది. ఆ పసిపిల్లని అపార్ధం చేసుకోకండి."
    "అపార్ధం దేనికి?"
    "తనమీద తనకు నమ్మకమున్న మీలాంటి వ్యక్తి అవకాశం వచ్చినది యిలా అని తెలిస్తే భరించలేడు కాబట్టి."
    క్షణమాగి అన్నాడు- "నిజమే అలివేలుగారూ....మీరన్నది నూరుపాళ్ళ నిజం....కేవలం అవకాశమే ముఖ్యమనుకుంటే నేను సుదర్శనరావు తోనే రాజీపడేవాడ్ని. రమ్యశ్రీ పరంగా సుకృతికి సమస్య ఎదురైనప్పుడు రమ్యశ్రీ స్థాయి నటితో పేచీ పెట్టుకోకుండా బ్రతకనేర్చినవాడిలా మిగిలి పోయేవాడ్ని. నాకు నచ్చినది జీవితంలో రాజీపడటమని అన్నాను కాని అవసరానికి మించి రాజీ పడటాన్ని అసలు హర్షించను. అందుకే సుకృతి గురించి యింత తెలిసిన నేను ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS