36
ఇద్దరిమధ్యా ఏకాంతం తొలిసారిగా.
ఇద్దరిమధ్యా నిశ్శబ్దం.
ఓ నిమిషం గడిచింది. చప్పున అతనివైపు చూసింది స్వప్న. అదే సమయంలో రవి కూడా ఆమెవైపు చూశాడు.
గడిచిన రోజులు వేరు.
ఇప్పటి స్థితి వేరు.
"స్నానం చేస్తావా?"
తలూపి సూట్ కేస్ నుంచి డ్రస్ తీసుకుని వెళ్ళిపోయింది స్వప్న.
రవి లేచి గదంతా పరిశీలించసాగాడు. గోడ గోడకి ఓ రంగు. ఆ కలర్ కూడా కంటికింపైంది. కన్ను చెదిరేది కాదు. అందంగా వడ్డాది పాపయ్యగారు చిత్రించిన బొమ్మలకి బ్లో అప్ ఫోటోలు...మంచి ఆర్టిస్టిక్ విలువలు తెలిపేవి. టీ పాయ్, దానిమీద ఫోన్. ప్రక్కనే ఫ్రిజ్. దానిపై రేడియో రికార్డర్. మరోవైపు యింకో టీపాయ్ మీద టేప్ రికార్డర్.
మెల్లగా స్విచ్ నొక్కేను. బిస్మిల్లాఖాన్ షవానాయ్. చాలా మంద్ర స్వరంలో పసిపిల్లవాడికి జోల కొట్టే విధంగా వుంది. రెండు నిమిషాల తర్వాత ఆపుచేశాడు.
ఇన్ని వున్నా ఏదో లేనట్టుగా తోచిందతనికి.
వెళ్ళి మెల్లిగా మంచంపై పడుకున్నాడు. ఫారిన్ ఫోం బెడ్ అది. మృదు తల్పం అనేందుకి ఉదాహరణగా వుంది. ఓ నిమిషం గడవగానే వీణా వాదన మొదలైంది. ఎక్కడ దేనికి సంబంధం పెట్టేదో అంతా సంగీతమయమై గంధర్వ లోకంలా వుంది!" అనుకున్నాడు.
అన్నీ ఆనందమయ రాగాలే! చిట్టిబాబుగారి చేతిలో వీణ వెన్నకంటే మృదువుగా పలుకుతుంది.
స్వప్న స్నానం చేసి అప్సరసలా వచ్చింది. సోనా అండ్ సోనా చీరకి ఆమె కట్టుకోగానే అందం వచ్చిందా అనిపించింది.
"నువ్వు వెళ్ళొస్తావా?"
బాత్ రూమ్ లోకి వెళ్ళి షవర్ తిప్పేడు రవి.
జల తరంగిణి!
అతని ఆనందానికి అంతులేక పోయింది. "మాయా మహల్!" అనుకున్నాడు.
"ఇలాంటి రూమ్ నీకూ కట్టిస్తాను!"
బాత్ రూం నుంచి బయటికి వచ్చి టవల్ తో తుడుచుకుంటూ అన్నాడు రవి.
కండలు తిరిగిన అతని భుజాలని చూస్తూ, వీపున ముత్యాల్లా మెరుస్తోన్న నీటి చుక్కల్ని చూస్తూ వుండిపోయింది స్వప్న. దాదాపు ఆరడుగులకి ఓ అంగుళం అటుగానే వుంటాడు రవి. మొదటి నుంచి మంచి ప్లేయరతను. పైగా రోజూ వ్యాయామం చేస్తాడు. ఎక్కడి కక్కడికి శిల్పి మలచినట్టుగా, చిత్రకారుడు కుంచెతో దిద్దినట్టుగా వుంటాయి శరీర భాగాలు. ముక్కూ, కళ్ళు, పెదాలు మోడల్ కి దిద్దుకోవచ్చు. అతని తలకట్టు కూడా రింగులు తిరిగి దూకుతోన్న జలపాతం వంపుల్లా వుంటుంది.
"ఏమిటి?"
చప్పున ఊహల్లోంచి బయటపడిందామె.
"ఏం లేదు!" తడబడుతూ అంది.
"నీ కోసం ఇలాంటి గది కట్టించనా?"
"ఉఁ ఎందుకు?"
తెల్లబోయాడు రవి. ఒక్క క్షణం పాటు అతనేం అనలేదు.
"మీరు మీ స్వార్జితంతో కట్టించండి. అప్పుడే నాకు తృప్తి!"
"ఆల్ రైట్! ఏడాది తిరిగేలోగా కట్టిస్తాను!"
"థాంక్స్!"
"స్వప్నా! మీ యింటి పై భాగంలో యిలాగే కట్టిద్దాం!"
"ఊహూ"
"మరెక్కడా కట్టించాలి?"
"రవీ! నువ్వంత అందంగా కట్టించాలంటే ఆ గది మన వూళ్ళో ఎలమావి తోటలో కట్టించు!"
ఆశ్చర్యంగా అడిగాడు "అక్కడే ఎందుకు?"
"నాకు పట్టణ వాతావరణం అంటే గిట్టదు బొత్తిగా. నా మనస్సు ఎప్పుడూ పైరు పచ్చమీద, పల్లెగాలి మీదా, కాలవ నీటి మీదా పరిగెడుతూ వుంటుంది. వీలయితే నన్ను తీసికెళ్ళి అక్కడే వుంచెయ్."
ఒక్క నిమిషంపాటు షాకయ్యాడతను. ఇది నిజమా? లేక తన అంతరంగం కనుక్కునేందుకు అలా అడుగుతోందా? అనుకున్నాడు.
చప్పున మాట మార్చి "టిఫిన్, కాఫీ! తెప్పిస్తావా?" అంది.
అతను సోఫా వద్దకి వెళ్ళి బజర్ నొక్కేడు. వెంటనే కిచెన్ నుంచి "హలో!" అన్న జవాబు వినిపించింది.
"యస్! ఇద్దరికీ టిఫిన్, కాఫీ..."
అక్కడి నుంచి సమాధానం రాగానే మళ్ళీ బటన్ నొక్కేడు. అంతదాకా లయబద్దంగా వినిపిస్తోన్న మృదు సంగీతం ఆగిపోయింది.
"ఇక్కడ వినిపించని రాగం ఏమిటో తెలుసా?"
"ఏమిటి?"
"వెస్ట్రన్ మ్యూజిక్!"
"అవును!"
"నాయుడు గారికి యిష్టం లేదేమో!"
"కావచ్చు!"
అంతలో బయట బోయ్ ఏదో స్విచ్ నొక్కినట్లుంది. గదిలో మృదు మృదంగనాదం వినిపించింది.
వెళ్ళి తలుపు తీశాడు రవి.
సప్తస్వరా విన్యాసం వెంటే వచ్చాడు బోయ్. అతని చేతిలో ట్రే, మరో చేతిలో కాఫీ పాట్! లోపలికి వచ్చి టీపాయ్ మీద అన్నీ సర్ది తిరిగి బయటికి వెళ్ళేడు. ఫలహారం ముగించుకుని కాఫీ తాగి తలుపు తెరిచాడు రవి. బోయ్ వచ్చి అన్నీ ఖాళీచేశాడు.
"మీరు బయటికి వెళతారా?"
రవి స్వప్నవైపు చూశాడు. ఆమె అడ్డంగా తలూపింది.
"నో! రెస్ట్ తీసుకుంటాం."
"మీకు లంచ్ ఎప్పుడు తెమ్మంటారు?"
చేతి వైపు చూసుకుని "ఒంటి గంటకి" అన్నాడు రవి.
బోయ్ వెళ్ళిపోయాడు. తిరిగి తలుపు మూశాడు రవి లోపలికి వచ్చి.
స్వప్న మంచంపై పడుకుని వుంది. లల్లబీలాగా సంగీతం చెవులకి సోకుతూనే వుంది.
