Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 47


    ఈయన ఎవరో ఆ ప్రమాదాన్ని తప్పించబోయి తమకారు కింద పడ్డాడు.
    ఆదుర్దాగా ముందుకు నడిచి వంగి చూసింది సీత.
    ఆ వ్యక్తి తాలూకు శరీరం సగం కారుకింద ఉంది. మొహం మాత్రం స్పష్టంగా కనబడుతోంది.
    ఈయన......?
    కళ్ళుచిట్లించి చూసింది సీత?
    తర్వాత వెర్రికేకపెట్టి ఆయనపక్కనే కూలబడిపోయింది.
    టాక్సీకిందపడిన ఆ వ్యక్తి "సృజనా!" అన్నాడు కలవరిస్తున్నట్లు ఆయన కళ్ళు మూతలుపడిపోయి ఉన్నాయి.
    ఆయన రమణమూర్తి! సీత తండ్రి!
    "నాన్నగారూ!" అంది సీత పొంగిపొరలివస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ.
    ఆమెగొంతు వినబడగానే చటుక్కున కళ్ళు తెరిచాడు రమణమూర్తి. ఆయన మొహంలో పట్టలేనంత ఆశ్చర్యం ఆనందం తొంగిచూశాయి.
    "సృజనా!" అన్నాడు అనుమానంగా.
    "సృజనా! నువ్వు నిజంగా నువ్వేనా! నా తల్లీ! నా సృజీ"
    "అవునునాన్నగారు! నేనే! మీ సృజనని!" అంది సీత రుద్దమైపోతున్న గొంతుతో.
    "సృజనా! ఎక్కడకు పోయావమ్మా ఇన్నాళ్ళూ మాకు కనబడకుండా?" ఆరాటమూ, సంతోషమూ, దుఃఖమూ సమపాళ్ళలో కలిసి తడబడుతూ వస్తోంది ఆయనమాట.
    ఆయన ప్రశ్నకు బదులేమి చెప్పాలో తెలియదు సీతకి. నీళ్ళునిండిన కళ్ళతో ఆయనవైపు చూసింది. ఆయన శరీరం సగం కారుకిందే ఉంది.
    గుండెలు గుబగుబలాడాయి సీతకి. టైర్లకింద నలిగినుజ్జునుజ్జయిపోయి ఉంటుందా ఆయన వళ్ళు?
    గుండెలు చిక్కబట్టుకుని ఆయన పాదాలవైపు దృష్టి సారించింది సీత.
    వెంటనే ఆమె మొహంలో రిలీఫ్ కనబడింది.
    రమణమూర్తి కారుకింద పడ్డాడుగానీ, పెద్దగా గాయాలేమీ కాలేదు.
     అదృష్టవశాత్తూ, రెండు చక్రాల నడుమా నిలువునా పడుకున్నట్లు పడిపోయాడు ఆయన. ఆ పడటంలో వళ్ళు అక్కడక్కడ డోక్కుపోయి ఎర్రగా కనబడుతోంది.
    అంతే!
    తేలిగ్గా ఊపిరి తీసుకుంది సీత. ఆమె చెయ్యి ఆసరా అందిస్తే లేచి కూర్చున్నాడు రమణమూర్తి. ఆపుకోలేని ఉద్వేగంతో వణికిపోతోంది ఆయన శరీరం.
    "ఇవాళ లేచిన వేళ ఎంత మంచిదమ్మా! నిజంగా ఎంత అదృష్టం ఇది! బతికి ఉండగా మళ్ళీ నిన్ను చూడగలనోలేదో అని ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా సృజీ! నా బంగారు తల్లీ!" ఆమె మళ్ళీ తన కంటికి కనబడకుండా దూరమైపోతుందేమో అని భయపడుతున్నట్లు ఆమెని దగ్గరకు తీసుకునిపొదుపుకున్నాడు రమణమూర్తి. ఆప్యాయంగా ఆమె శిరస్సుని చుంబించి "దేవుడు చాలాదయామయుడు సృజనా!" అన్నాడు అస్పష్టంగా.
    పెదిమలు కొరికి పట్టుకుని దుఃఖాన్ని ఆపుకుంది సీత.
    "పదమ్మా! ఇంక మనం మన ఇంటికీవెళ్ళిపోదాం పద! మీ అమ్మ నీ కోసం ఎంత బెంగపెట్టుకుందో తెలుసా? తమ్ముడూ చెల్లీ కూడా నీ కోసం కలవరించిపోతున్నా పద తల్లీ!" అన్నాడు రమణమూర్తి.
    విశ్వప్రయత్నంమీద దుఃఖాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగింది సీత. ఆ తర్వాత లేచికళ్ళు తుడుచుకుని టాక్సీ తలుపు తెరిచింది.
    ఇంజను  స్టార్ట్ చేశాడు డ్రైవరు.
    "ఎక్కండి నాన్నగారూ!" అంది సీత.
    ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. టాక్సీ కదిలింది.


                                           11


    సీత తన తండ్రిని గుర్తించగానే పెట్టిన వెర్రికేక చావు మంచంమీద వున్న అహల్యకి వినబడింది. టాక్సీ ఆగిన స్థలానికి సరిగ్గా ఇరవై గజాల దూరంలోనే ఉంది అహల్య ఇల్లు.
    సీతగొంతు చెవిన బడగానే తన వంట్లో ఉడిగిపోయిన శక్తి అంతా తిరిగివచ్చినట్టు అనిపించింది అహల్యకి.
    సృజన! తన సృజన! తన సీత! తన బేఠీ!
    తిరిగివచ్చేసింది తనకోసం!
    ఆనందం ఆమె నరనరాల్లో ప్రవహించింది!
    ఇంక ఫర్వాలేదు! తను చనిపోయేముందు ఒక్కసారి కళ్ళారా సృజనని చూడగలుగుతుంది ఇప్పుడు! నోరారా ఒక్కసారి మాట్లాడుతుంది సృజనతో! చెవులారా ఆమె మాటలు వింటుంది!
    అది చాలు ఈ జీవితానికి! ఆ తర్వాత ఇంక ఈ ఘటం వెళ్ళిపోయినా ఫర్వాలేదు.
    మంచంమీదనుంచి లేవడానికి ప్రయత్నించింది అహల్య. సాధ్యంకాలేదు. ప్రయత్నపూర్వకంగా పక్కకి పొర్లింది. అతికష్టంమీద ఒక కాలు నేలకి ఆనించి, ఒక చెయ్యి నేలమీదమోపి, మెల్లగా కిందికి జారింది. తర్వాత నేలమీదే దేకుతూ ముందుకు సాగి, గుమ్మం దగ్గరికి చేరుకుంది.
    ఆకాస్త శ్రమకే ఆమెకు వళ్ళంతా చెమటలుపట్టేశాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. చెవులు దిబ్బెళ్ళు వేశాయి.
    పాకుతూనే గుమ్మందాటి బయటకు రాబోయింది అహల్య.
    అప్పుడు ఆపేశాయి ఆమెని రెండు ఎలక్ట్రిక్ వైర్లు! అక్కడే ఇంటికి ఎదురుగా రోడ్డుమీద ఉన్న ఎలక్ట్రిక్ పోల్ మీదనుంచి జారి గుమ్మానికి అడ్డంగా వేళ్ళాడుతున్నాయి అవి.
    "బయటకు రాకు! వైర్లు తగిలితే షాక్ కొడుతుంది!" అని అరుస్తున్నారు అక్కడ మూగిన మనుషులు.
    సందిగ్ధంగా ఆగిపోయింది అహల్య. ఆమె నుదుటిమీద నుంచి స్వేదంకారి కళ్ళలోకి జారుతోంది. ఆ నీటితెరవల్ల చూపుమసక మసగ్గా అయిపోయింది.
    ఆమసకలో తన కళ్ళముందు వేళ్ళాడుతున్న వైర్లు రెండూ రూపాంతరం చెంది ఇద్దరు అమ్మాయిలుగా మారినట్లు భ్రమ కలిగింది అహల్యకు.
    రెండు వైర్లలో ఒకటి సృజనలాగా, ఒకటి కామాక్షిలాగా కనబడటం మొదలెట్టాయి.
    సృజనా, కామాక్షీ! సంతలో పశువులనుకొన్నట్లు తనుకొన్న సృజనా, కామాక్షీ!
    డెలిరియమ్ ఆవహిస్తోంది అహల్యని. హాల్యూసినేషన్స్ కలుగుతున్నాయి.
    ఆహాల్యూసినేషన్స్ లో---
    తనకళ్ళ ఎదుట కనబడుతున్నసృజనా, కామాక్షీ తన పరిస్థితిని చూసి విరగబడి నవ్వుతున్నారు. నవ్వాపుకోలేకతీగెల్లాగ ఊగిపోతున్నారు.
    పకపకనవ్వుతున్న కామాక్షి ఉన్నట్టుండి నవ్వు ఆపేసింది. సీరియస్ గా అయిపోయింది ఆమె మొహం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS