"బానే వున్నాను" అంది క్లుప్తంగా.
"ఏంటి బడికెళుతున్నారా? ఒంటరిగా వెళ్తున్నారెంటి? మీ స్నేహితులేరి?" అన్నాడు ఆశ్చర్యంగా.
"వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. నాకీ రోజు ఆలస్యమైంది" అంది నవ్వుతూ.
"మీ కోసం ప్రతిరోజూ అక్కడ చేను దగ్గిర చూస్తున్నాను. కానీ మీరు కనిపించలేదు. బడి మానేశారా ఏంటి మావాడి గొడవతో అని భయపడ్డాను. ఏంటి ఈ దారిలో వెలుతున్నారా రోజు" అన్నాడు నవ్వుతూ.
"అవునండి....మేము ప్రతిరోజూ వెళ్ళేది ఈదారే. ఆరోజు ఆలస్యమయిపోయిందని దగ్గిర దారని అటు వచ్చాము" అంది నవ్వుతూ.
"అరెరే అలాగా...అది విషయం! నేనక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే ఎలా కనిపిస్తారు?' అన్నాడు నవ్వుతూ.
"ఎందుకు నా కోసం ఎదురుచూడటం దేనికి?" అంది జయంతి ఆశ్చర్యంగా.
"ఊరికినే! ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించి......" అన్నాడు మహేంద్ర నవ్వుతూ.
జయంతి నవ్వింది.
మహేంద్ర నవ్వాడు.
"వస్తానండి. మా స్కూల్ టైం అయింది" అంది జయంతి.
"మంచిది, వెళ్ళిరండి" అన్నాడు మహేంద్ర.
జయంతి వడివడిగా అడుగులేస్తూ వెళ్ళిపోయింది.
వాళ్ళిద్దర్నీ దూరం నుంచి ఒక జత కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి.
* * * *
"ఏంటే జయంతి! ఈరోజు ఇంత ఆలస్యమైందేంటి?" అడిగింది రాధ క్లాసు రూంలోకి వెళ్ళిన వెంటనే.
"ఇంటిదగ్గరే ఆలస్యమయిపోయిందే! అసలు ఈరోజు డుమ్మా కోడదామనుకున్నాను. ఆఖరి క్షణంలో మనసు
మార్చుకుని బయలుదేరాను" అంది జయంతి నవ్వుతూ.
"ఫస్ట్ పిరియడ్ భలే ఎంజాయ్ చేశాం....తెలుగుకి కొత్త టీచరు వచ్చింది. అందర్నీ పేరు పేరు వరుసగా పేర్లు అడుగుతూ అన్ని విషయాలు అడిగింది. నువ్వు రాలేదు" అంది దిగులుగా రాధ.
"పోనిలే నా పేరు రేపు చెపుతాలే" అంది జయంతి నవ్వుతూ.
"ఇప్పుడెంటి , లెక్కల పిరియడ్ కదూ?" అంది నోటు పుస్తకంలో టైం టేబుల్ చూస్తూ.
"అవునుకానీ ఈరోజు లెక్కల మాష్టారు రాలేదు" అంది విద్య ఆనందంగా.
"అవునా! మరింకేం ఎంచక్కా చుక్కలాట ఆడుకుందాం" అంది జయంతి.
"సరే చుక్కలు పెట్టు" అంది రాధ.
జయంతి నోటు పుస్తకం తీసి చుక్కలు పెట్టటం ప[ప్రారంభించింది.
"పరిక్షలు అయిపోయిన వెంటనే నా పెళ్ళి చేస్తారటే, దిగులుగా వుంది" అంది రాధ.
"దిగులెందుకు? చేసుకో నీ కిష్టమెగా" అంది జయంతి.
"నోర్ముయ్! నాకిష్టమని నేనెప్పుడు చెప్పాను" అంది రాధ.
"నీ మాటలనుబట్టి అలా అనుకున్నాలే...." అంది జయంతి నవ్వుతూ.
"పెళ్ళికొడుకు ఏమి చేస్తుంటాడట?" అడిగింది విద్య.
"భోజనం" అంది కసిగా రాధ.
"అదేంటే?!" అడిగింది జయంతి ఆశ్చర్యంగా.
"అవునే, ఉద్యోగం ఏమి లేదు....యాబై ఎకరాల పొలం ఉందట, పొలం పనులన్నీ వాళ్ళ నాన్నగారే చూస్తారట. ఈయన బాలాదూరు తిరుగుతుంటాడట" అంది రాధ.
"మన మహేంద్ర లగానా?" అంది విద్య.
"మహేంద్ర ఎవరు?" అడిగింది రాధ.
"అతన్నప్పుడే ఎలా మర్చిపోయావే....ఆరోజు మన జయంతిని రక్షించిన హీరో" అంది విద్య.
"ఓ! నిజమే కదూ! అవునే అదే బాపతు. అతను అంతేగా, తండ్రి సంపాదించిన ఆస్తి వుందని ఊరుమీదపడి తిరుగుతుంటాడు" అంది రాధ.
"ఛ! పాపం అతన్ని అంత దారుణంగా అవమానించకండే. మంచి వ్యక్తీ" అంది జయంతి.
"ఏంటమ్మా మంచి....నిన్ను రక్షించగానే మంచివాడయిపోయినట్టేనా?" అంది విద్య.
"కాదనుకో! ఏమో, ఎందుకో అందరూ అనుకున్నట్లు అతను రౌడి వెధవ కాదనిపిస్తుంది" అంది జయంతి.
"వామ్మో! ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కొంపతీసి ప్రేమిస్తున్నవా ఏంటి? సావిత్రిలా?" అంది రాధ.
"ఇది సావిత్రి అయితే అతను నాగేశ్వరరావా?" అంది విద్య.
"ఏమో, నాగేశ్వరరావో....రాజనాలో?" ముందు ముందు తెలుస్తుంది" అంది రాధ.
జయంతి నిశ్శబ్దంగా నవ్వింది వాళ్ళ మాటలకు.
"ఆ! చుక్కలు పెట్టటం అయిపోయింది. ఇదిగో నేను ఇక్కడ గీత గీసాను" అంది జయంతి.
"అయితే నేను ఇక్కడ...." అంటూ చిన్న గీత కలిపింది రాధ. జయంతి గీసిన గీత పక్కనే, ఇద్దరూ చుక్కల అట ఆడుకుంటుంటే విద్య ఆసక్తిగా చూస్తుంది.
* * * *
సురేంద్రను చూడగానే సుబ్బయ్యా, సీతాలు ఇద్దరూ ఎదురొచ్చారు.
"ఏంటి బాబు, పెద్దయ్యగారు రాలేదా?" అంది సీతాలు.
"రాలేదు సీతాలు! మావయ్యకు జ్వరంగా వుంది" అన్నాడు.
"అయ్యో అలాగా! మరి వైద్యం చేయిస్తున్నారా?" అంది అందోళనగా.
"ఆ..ఆ....మందులిప్పిస్తూన్నాంలే.....బంతిపూలు కోశారా? ఎన్నోచ్చాయి?" అన్నాడు.
