Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 48

 

    ప్రేమంటే ఇదో కాదో తనకి తెలీదు. కానీ ఇదే ప్రేమయితే అపురూపమే అనుకున్నాడు.


    
    "ఆనందంగా వుందా ధన్వీ?" సామ్రాజ్యం అడిగింది అతడి జవాబు వినాలనే ఉత్సుకతతో.

 

    "ముందు తెలీదు. కానీ ఇలాంటి అందమైన స్వప్నం పేరే ప్రేమని ఇప్పుడు తెలుసుకున్నందుకు ఆనందంగా వుంది సామ్రాజ్యం......నా లక్ష్యం ఏమైనా గానీ జీవితాన్ని అలక్ష్యం చేసే మనిషి అనిపించుకున్న నేను.....స్పందన తెలీని మనిషిగా అందరిచేత ద్వేషించబడుతూ బ్రతుకుని నందనవనంగా మలుచుకోలేని అసమర్దుడిగా కన్న తండ్రిచేత కూడా నిందించబడ్డ నేను, కన్నవాళ్ళకి తొణికిన స్వప్నంలా కావాలనుకున్న వాళ్ళకి తొలగని చికటిలా అనిపించిన నేను....."క్షణం ఆగేడు మధూళీ రూపం అతడిలో రేపుతున్న సంచలనానికి అణువంత కదిలినట్టుగా "నన్ను ఆకర్షించిన ఒక అమ్మాయి ప్రేమకి అర్హుడినైనందుకు గర్వపడగలనే తప్ప జీవితాన్ని పంచుకోవటానికి ఎలా సిద్దపడగలను?"

 

    అర్ధం కానట్టు చూసింది సామ్రాజ్యం. "నీ సమస్య పరిష్కరించా' నని మధూళీకి ఫోన్ చేసి వెంటనే చెప్పాలి అనుకుంటే మళ్ళీ ఇలా మాట మారుస్తున్నాడెం....." మధూళీ ప్రేమని అంగీకరిస్తూన్న నువ్వు జీవితాన్ని ఎందుకు పంచుకోలేనంటున్నావ్?"

 

    "ఈ రాత్రికి నీతో అనుభవాన్ని పంచుకోబోతున్నాను కాబట్టి"

 

    అడిరిపడింది సామ్రాజ్యం. పగిలిన ఆలోచనలు మిణుగురులై ఆమె అహాన్ని దెబ్బతీస్తుంటే ఉద్రేకంగా అంది. "మధూళీ నిన్నెంతగా ప్రేమించింది అంటే నువ్వు తప్పు చేసినా తను క్షమించేయగలనంది."

 

    "కానీ ఆ క్షమని భరిస్తూ బ్రతకడం నాకు సాధ్యం కాదు."

 

    సామ్రాజ్యం అవాక్కయి చూస్తుంది.

 

    "ఇలా మాటాడ్డం నీకు నచ్చకపోతే దానికి కారణం నేను కాదు సామ్రాజ్యం. ఇలా ఆలోచించడం నాకు అలవాటని నీకూ తెలుసుగా.....అందుకే తప్పుచేసి ఆత్మద్రోహంతో మధూళీతో కలిసి బ్రతకడం కన్నా నీతో ఈ రాత్రికి కలిసి నా మాట నిలబెట్టుకోవడం న్యాయంగా భావిస్తున్నాను."

 

    "అవసరంలేదు" అరిచింది సామ్రాజ్యం.

 

    "అదేం?"

 

    "మనం కాచుకున్న పందేనికి ఇంకా నెల గడువుంది" మధూళీ నూరేళ్ళ జీవితానికి తను ప్రతిబింబం కావడం ఇష్టంలేనట్టుగా , అక్కా అని పిలుస్తానన్న మధూళీ ప్రేమ కధ సుఖాంతం కావాలని ఆలోచిస్తున్నట్టుగా అంది సామ్రాజ్యం. "అయాచితంగా వచ్చిన అనుభవం నాకూ అవసరం లేదు ధన్వి. జూలై ఇరవై మూడు మన గడువుకి ఆఖరి రోజు. కాబట్టి ఆలోగా నీ ఓటమని కళ్ళారా చూసి అప్పుడు నీ మీద గెలుపు సాధిస్తాను."

 

    మధూళీ ప్రేమని గెలిపించాలనుకున్నప్పుడు ధన్విని అప్పుడైనా ఓడించడం ఎలా సాధ్యమో అప్పటికి ఆలోచించని సామ్రాజ్యం ఆవేశంగా వెళ్ళిపోయింది.

 

    నవ్వుకున్నాడు ధన్వి.

 

    ఒక అత్మియుడిగా తనను కలిసిన సంజీవికిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలా అని ఇంతసేపూ చాలా అంతర్మధనానికి గురవుతుంటే మధూళీ ప్రేమ విషయం గురించి చెప్పి సామ్రాజ్యమే ఓ గొప్ప సాయం చేసింది.

 

    అలా ఓ సమస్యని పరిష్కరించింది మధూళీ 'ప్రేమో' లేక ప్రేమనే పదాన్ని ఇంకా గౌరవించే సామ్రాజ్యం సహృదయమో ధన్వికి తెలీదు కానీ మొత్తానికి ఒక రాత్రి అనుభవంతో స్నేహం అపవిత్రమయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు.

 

    ఇది రాజీపడటం అయితేనేం.....

 

    ఎదుటి మనిషి జీవితాన్ని నిలబెట్టటానికి కేవలం రాజీపడటమే కాదు, ఆత్మవంచన చేసుకుంటే మాత్రం అది తప్పేలా అవుతుంది?

 

    మసక వెలుతురులో నిలబడ్డ ధన్వి ఉన్నట్టుండి గుండెల్లో మొదలైన నొప్పికి తట్టుకోలేక గోడకి జారగిలబడిపోయాడు.

 


    శక్తిని కూడగట్టుకుంటు గోడకున్న స్వేచ్ నొక్కి కళ్ళు భైర్లు కమ్ముతుంటే విద్యుద్దిపపు కాంతిలో డ్రెస్సింగ్ టేబుల్ కేసి చూసాడు. పెదవులు నీలంగా మారిపోతున్నాయి. ఏ క్షణంలో అయినా కులిపోయేట్టు అనిపిస్తుంటే తల్లి ముందు దొరికిపోవడం ఇష్టంలేనట్టు అలాగే బడలికగా బయటికి నడిచాడు తడబడుతూ.


    
    పదినిమిషాల వ్యవధిలో అటో ఎక్కిన ధన్వి ఓ కార్పోరేట్ హాస్పిటల్ కి ఎలా వచ్చాడో గుర్తులేదు.

 

    కానీ మెట్లమీద తూలిపడుతూ డాక్టర్ అంటూ ఎవరో పెట్టిన కేకని వింటూ ఆసరా ఇస్తున్న మనుషుల్ని చూస్తూ స్పృహ తప్పాడు.

 

    అయితే స్పృహ తప్పే ముందు కూడా ధన్వి అప్రతిభుడైంది స్టేతస్కోప్ తో అతడి ముందుకొచ్చిన మధూళీని చూసి , రచయిత్రి మధూళీ డాక్టర్ మధూళీ అని కూడా తెలిసింది అప్పుడే.

 

    ఇంతకాలము మధూళీ తన వృత్తిని గోప్యంగా వుంచింది కావాలని కాదు, చెప్పాల్సిన అవసరం లేక.

 

    అయితే ధన్వితోనే ప్రతి క్షణమూ గడపటాన్ని ఇష్టపడే మధూళీ యాదృచ్చికంగా ఈ స్థితిలో కలుసుకోవటం కోరుకోలేదు.

 

    ఇంకా స్పృహలోకి రాని ధన్వి గురించి వ్యక్తిగా ఆమె ఎంత కలవరపడింది అంతా చూస్తూనే వున్నారు......బ్రెయిన్ స్కానింగ్ మొదలుకుని మాములు బ్లడ్ టెస్ట్ దాకా అన్ని తనే దగ్గరుండి చేయించింది......ముందు సమస్య ఎవరికి అంతుపట్టలేదు.

 

    ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి నగరంలోని ప్రముఖమైన డాక్టర్లందర్ని రప్పించింది. అందులో న్యూరోసర్జెన్స్ మొదలుకుని చెస్ట్ స్పెషలిస్ట్ దాకా వున్నారు. రిపోర్స్ చూస్తూ సుమారు గంట చర్చించుకున్నాక అంతా ఓ నిర్ధారణకి వచ్చారు.

 

    "సిస్టిక్ ఫైబ్రోసిస్."


    
    అతి ప్రమాదకరమయిన నయం కాని జబ్బది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS