అది కూడా చివరి దశ. అతడు మహా బ్రతికితే రెండు నెలలు.....అత్రుత్తంగా చూస్తోంది డాక్టర్ మధూళీ.
ప్రాణాలివ్వగల క్రౌంచపక్షిగా మారి ఇంకా రాయని రామాయణానికి శ్లోకం కాలేకపోయినా శోకంగా అయినా తను మిగలాలి అనుకుంటే.....
కూలిపోతున్న అశోకంలా ధన్విని కాలం యిలా పరిచయం చేసిందేం?
మబ్బుకి భూమిక ఆవిరైతే ప్రేమకి మాతృక మనసుని అతడి కళ్ళలోకి చూస్తూ ఎన్ని కబుర్లో చెప్పాలనుకుంటే, వైద్యశాస్త్రం అంతా కలిపి ధన్విని 'కాలం చెల్లిన' మనిషిగా నిలబెట్టి తనని ఇలాంటి శాపానికి గురి చేసిందేం?
* * * *
అర్ధరాత్రి కావటానికి మరో గంట వుందనగా స్పృహలోకి వచ్చిన ధన్వికి ముందు కనిపించింది మధూళీ.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోని బెడ్ మీద వున్న ధన్వి ముందు నిరవంగా నవ్వాడు. "కలుసుకున్నాను.....నిజంగా మీరే అన్నమాట."
మధూళీ తల వంచుకుంది.
"థాంక్స్."
"దేనికి?" అడిగింది తడికళ్ళు కనిపించకుండా జాగ్రత్తపడుతూ, కొంప మునిగే జబ్బోచ్చిందని మా అమ్మకి కబురు పెట్టనందుకు.....మీకు తెలిదు మధూళీ.....ఒక్కగానొక్క కొడుకునని- నాకు కాస్త తలనొప్పిగా వున్నా మా అమ్మ దేవుళ్ళకి ముడుపులు కట్టి మొక్కుకుంటు వుంటుంది. అయినా మీరేమీటి అలా బిక్కమొహం వేసుకు చూస్తున్నారు?"
"అబ్బే....." తడబడింది.
"ఓ.కె! అసలు విషయానికోస్తా......ముందు సామ్రాజ్యానికి చెప్పాలనుకుంటే వీలుపడలేదు......ఆ తర్వాత మీ దగ్గరకొచ్చి మీ అభినందనల్ని అందుకోవాలనుకున్నాను. ఈలొగా నాకు ఒంట్లో ఏదోలా అనిపించడం. మీ దగ్గరికి రావడం, అంతా ఓ ఇన్సిడేన్స్ . నేను ఇంతసేపూ మాట్లాడింది డిల్లీలో నాకు వచ్చిన జాబ్ గురించి. కంగ్రాట్స్ చెప్పరేం?"
ఏమని అభినందించాలి ధన్వి....? మాటలతో మొత్తం విశ్వాన్ని గెలవగల ధీశక్తిని ప్రదర్శించే నువ్విపుడు తాకితే చాలు పగిలిపోయే పాత్రవని తెలిశాక ఎలా అభినందించగలను?
"మీరలా మాట్లాడకుండా తలవంచుక్కుచోవడం నాకేం నచ్చలేదు డాక్టర్ మధూళీ......" తనకే తెలీని అపశ్రుతుల శకలాల్ని అందంగా శృతి చేసి ఆమెను ఒదార్చుతున్నట్టుగా మాట్లాడుతుంటే ఆమె తట్టుకోలేకపోయింది. "నేనేమన్నా తప్పులా మాట్లాడితే క్షమించేయాలి......చాలా ఆరోగ్యవంతుడిలా కనిపించిన నాకు కాస్త నలతగా వుంటే టేకిట్ ఈజీ అంటూ ధైర్యం చెప్పాలి గానీ మీరే ఇలా ఫీలయితే ఏం బాగుంటుంది?"
"లేదు...." అర్దిక్తిగా అతడి మాటల్ని ఖండించింది.
"మనం అలా బయటికి వెళదామా?"
"ఓ.కె......!"
'ప్రేమ' అనే భావం ఓ ఆడపిల్లని అంత ముగాదానిలా మార్చుతుందా?
అయిదు నిముషాల వ్యవధిలో హాస్పిటల్ ఆవరణలో వున్న పార్కులోకి వచ్చారిద్దరూ.
* * * *
చీకటి కాగితంపై మెరుసున్న రవ్వల గేయల్లాంటి విద్యుద్దీపాల కాంతి....అలసిన ప్రకృతి విశ్వాసాల్లా వీస్తున్న గాలి, నేల గుండెని కోసుకుని ఎదిగిన మొక్కలు అందిస్తున్న నిశ్శబ్దం.....కనిపించకుండా తమ ఉనికిని చెప్పుకుంటున్న చీకటి పూలపరిమళం.
ఓ బెంచిపై కూర్చున్న ధన్వి మధూళీ మౌనాన్ని భరించలేనట్టుగా అనేశాడు. "అంటే నేను డిల్లీ వెళ్ళడం మీకు ఇష్టం లేదన్నమాట ఇప్పుడు. అయితే ఇందాకే నాకు కంగ్రాట్స్ చెప్పేవారుగా మధూళీ.....మీరు వెళితే నాకేంటి నష్టం అనకండి. నాకు సామ్రాజ్యం అంతా చెప్పేసింది."
ఇప్పుడు ధన్వి గొంతులో ఇందాకటి ఉద్వేగం లేదు. "విషయం తెలిసిన నేను ఎంత గర్వపడ్డానో మీకు తెలిదు మదూళీ......మీ ప్రేమకి అర్హతని సంపాదించుకున్న నన్ను నేను అభినందించుకున్నమాట నిజమే! కానీ ఎందుకో మీతో పర్సనల్ గా మాట్లాడాలని వుత్సాహం చూపించలేకపోయాను. బహుశా ఏ అపరాత్రిదాకో ఆనందమో, అంతర్మధనమో తెలీని స్థితిలో నలిగిపోయిన నేను రేపైనా మీతో మాట్లాడేవాడ్నేమో కానీ ఇదిగో ఇలా హాస్పిటల్ కి వచ్చాను."
తలవంచుకుని నేల చూపులు చూస్తోంది మదూళీ.
"ఇంతకాలము కొన్నింటిని నమ్మని నేను మన మధ్య చిగురించిన ప్రేమే మనల్ని ఇలా హాస్పిటల్లో కలుసుకునేట్టు చేసిందని ఎవరైనా అంటే ఇప్పుడు అంగికరించటానికి సంకోచించను మదూళీ......అసలు ఇలా ఒక అనుభూతి గురించి మాట్లాడ్డం కూడా పూర్వం నాకు చేతనయ్యేదికాదు.....చేతనవడం మాట అటుంచితే మాట్లాడటాన్ని నేనే ఇష్టపడేవాడ్ని కాదు" అమృతాన్ని దోసిళ్ళతో తగినంత ఆనందాన్ని అందించే శక్తిగల దాని పేరే ప్రేమయితే--అలాంటి అనుభవానికి తలవంచనినాడు అది జీవితమే కాదన్నంత స్పూర్తితో అన్నాడు ధన్వి. "థెంక్స్ మదూళీ.....మీ నుంచి ఇలాంటి అదృష్టాన్ని పొందినందుకు కాదు-మీరు నన్నింత అదృష్టవంతుడ్ని చేసినందుకు మీకు మెనీ మెనీ థెంక్స్."
అప్పుడు చూశాడు మదూళీ కళ్ళ నుంచి రాలిపడుతున్న అశ్రువులను.....
"అరె ఏమయింది మీకు?" ఉద్విగ్నత ధన్వి గొంతులో. "మీకు శ్రమ లేకుండా మాన్ ప్రేమ గురించి అంతా నేనే మాట్లాడినందుకు ఆనందించాలి అలా కంట తడి పెట్టుకుంటారేం?"
"ఎందుకు ధన్వి...." మదూళీ మాట్లాడ్డంలేదు.....ఇంచు మించు వెక్కిపడుతున్నట్టుగా అంది. "ఇంత ఆలస్యంగా నాకెందుకు పరిచయమయ్యారు.....పరిచయమైనా గానీ ఎందుకు.....నన్నెందుకు ఇంత బలంగా ఆకట్టుకున్నారు? ఇప్పుడు అర్ధంతరంగా...."
చెప్పలేనట్టుగా మదూళీ ఆగిపోయింది.
