"అండి అంటూ నన్ను బహువచనంతో అడ్రసు చెయ్యడం మీరు మానేయాలి. నువ్వు అంటూ పిలవాలి."
ఎదుగుతున్న ఓ మంచి రచయిత్రి, పైగా ఓ గొప్పింటి ఆడపిల్ల నిజంగా తనకి అంతటి స్థానం యివ్వడం అనందమనిపించిందో లేక చెంపకి ఆనించి ప్రేమగా చిరుకోపాన్ని ప్రదర్శించే చెల్లెలే కనిపించిందో, ఆనందాన్ని దాచుకోలేకపోయింది.
"ఓ.కె.! అలాగే మధూళీ......ఈ క్షణం నుండి నిన్ను నేను నువ్వుగానే వ్యవహరిస్తాను.....మరి నువ్వు నన్ను కూడా నువ్వు అనాలి...."
"అంటాను.....ఇప్పుడు కాదు."
"ఎప్పుడు?"
"నేను మిరనుకున్నట్టు ధన్వికి నిజంగా దగ్గరయినప్పుడు."
"దానికి దీనికి సంబంధమేమిటి?" అడిగింది సామ్రాజ్యం.
"చాలా వుంది సామ్రాజ్యంగారూ....."
మధూళీ రచయిత్రిగా మాట్లాడింది. "మీరు నన్ను అభిమానిగా మీ ఇంటికి ఆహ్వానించి ధన్విని పరిచయం చేశారు. ఆ తరువాత నేను ధన్వికి అభిమానిగా మారాను. రేపు మీద్వారా పరిచయమైనా ధన్విని నా మనిషిగా మార్చుకోగల అవకాశమే వస్తే అప్పుడు మిమ్మల్ని నువ్వంటాను.....అక్కయ్య అని పిలుస్తాను సరేనా?"
"నీకు తెలిదమ్మా" నిజాయితీగా అంది సామ్రాజ్యం.
"అందినట్టు కనిపిస్తూ అందకుండాపోయే ధన్వి ప్రేమనే పదానికి అతితుడేమో అనిపిస్తూ వుంటుంది."
"కానివ్వండి సామ్రాజ్యంగారూ" మధూళీ నిర్వేదంగా అంది రెప్పలార్పకుండా.
"అయన ప్రేమించకపోతేనేం సామ్రాజ్యంగారూ.....అయన కాదన్నా గానీ ఆయనపట్ల నాకున్న ప్రేమని ప్రేమించుతూ బ్రతికినంత కాలం ఇలాగే వుండిపోతాను."
ఆ తర్వాత కొంతసేపటికి మధూళీ వెళ్ళిపోయింది.
అంతసేపూ జరిగిన చర్చని మననం చేసుకుంటూ కళ్ళు మూసుకుంది సామ్రాజ్యం.
ఏదైనా భావం అందోళనపరుస్తుందో ఆమెకి తెలీదు.
కానీ ఆమె నేత్రాంచలాల నుంచి నీళ్ళు రాలుతున్నాయి నిస్త్రాణంగా.
* * * *
మరుసటి రోజు సాయంకాలం అయిదుగంటల సమయం.....ముగింపు లేని మనిషి సమస్యలకి కొంచపడుతూ సాంద్రత కోల్పోతున్న సూర్యకిరణాలు పడమటి దిక్కుకి ప్రయాణిస్తున్న వేళ.....
ఆ గదిలో ఒంటరిగా కూర్చుని వున్నాడు ధన్వి.
ఉదయం నుంచి నీరసంగా వుంది....అది సహజమైన శారీరక అనారోగ్యమో లేక నిన్న ఉదయం కలిసిన సంజీవి అభ్యర్ధన నిన్న రాత్రి సామ్రాజ్యం ప్రవర్తన మూలంగా మనసు పాడై అలా అనిపిస్తుందో అతడికి తెలీడంలేదు.
"హలో" సామ్రాజ్యం గొంతు వినిపించింది. అందంగా అలంకరించుకువచ్చిన సామ్రాజ్యం ఆ రాత్రికి జరగబోయే అనుభవాన్ని గుర్తు చేయడానికి వచ్చిందో లేక ఆశల అక్షరాల్ని కాంక్షల కలంతో పెదవులపై రాసుకుంటూ పరామర్శించాలని వచ్చిందో మరి!
ముందు ఎర్రబడుతున్న ఆలోచనలా అనిపించింది.
అరక్షణం తర్వాత నీతుల్ని చెరిపేసిన సమాజపు వంతెనపై నడుస్తూ ఏ పాషాణ ప్రణయ క్రీడ కోసమో నిన్నటి రాత్రి నుంచీ స్వహస్తాలతో రాసుకుమ్తున్న ఇతివృత్తంలా కనిపించింది.
"చాలా టెన్షన్తో వున్నావ్ ధన్వి."
ధన్విలో చలనం లేదు.....
"వీరావేశంలో రాత్రి ఇచ్చిన మాటకి బాధ పడుతున్నావ్ కదూ?"
దానికి జవాబు చెప్పలేదు ధన్వి.
"ఇప్పుడు నువ్వెలా వున్నావో చెప్పనా?"
నవ్వింది పరిహాసంగా......
"మగాడి నీడ కూడా పడకుండా పెరిగిన ఓ ఆడపిల్ల పెళ్ళికాగానే తొలిరాత్రి భర్త గదిలోకి అడుగు పెట్టటాన్ని గుర్తుచేస్తున్నావ్."
సామ్రాజ్యం సామాన్యంగా మాట్లాడే పద్దతి ఇదే. అయినా ఇప్పుడు ఆమె చిలిపితనాన్ని ఎంజాయ్ చేసే ముడ్ లో లేడు.
"మొహం మాడ్చుకుని కూర్చోవడం కాదు ధన్వి! జవాబు చెప్పు" ధన్వి మౌనం సామ్రాజ్యాన్ని బాధ పెడుతుంది. "నేను తాగివున్న క్షణంలో నా దగ్గరికి వచ్చి పొరపాటు చేశానని బాధపడుతున్నారా?"
"లేదు సామ్రాజ్యం.....భావరహితంగా అన్నాడు. "అలా రావడమే నేను చేసిన పొరపాటుగా నేను అనుకుంటే నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం నావల్ల కాదు అని నేను ఇప్పుడు చెప్పగలను.....కానీ నేను అన్నమాట నిలబెట్టుకోవటానికే సిద్దపడ్డాను. ఇలా చేయడం తప్పా-ఒప్పా అని కాదు నేను ఆలోచిస్తున్నది.....నా మీద యింత ప్రభావం నీకుందని ఇప్పటి దాకా తెలుసుకోలేకపోయినందుకు ఆశ్చర్యపోతున్నాను.....అసలు ఆ రోజు నువ్వు పందెం కాసింది నన్ను రెచ్చగొట్టాలని నువ్వు చేసిన ప్రయత్నంగా నన్ను నలుగురిలో ఒకడిగా మలిచి అందరూ నడిచే మార్గంలోకి నన్ను మళ్ళించటానికి నువ్వు ఉపయోగించిన అస్త్రంగా ఎందుకు అనుకున్నానో ఇప్పటికి నాకు అర్ధంకావడంలేదు గానీ, ఇప్పుడు మాత్రం నీ తోవలోకి రావటానికే నిర్ణయించుకున్నాను."
తను ఓ అనుభవం కోసం ఆరాటపడే వయసులో వుండి కూడా ఇది అనుభుతిలా కాక జీవితంలో ఎదురైనా ఓ కూడని సంఘటనగా అనుకోటానికి ప్రిపెరవుతున్నట్టు మాట్లాడుతున్నాడు ధన్వి.
"అందుకే నిన్ను మధూళీ అంతగా ఇష్టపడుతుంది ధన్వి" ఉక్రోషాన్ని అణుచుకుంటు అంది సామ్రాజ్యం.
"నీలోని ఈ భిన్నమైన వ్యక్తిత్వమే ఆమెను చాలా ఆకట్టుకుంది." నవ్వింది నిర్లిప్తంగా. "ఇచ్చిన మాట తప్పలేదు, ఇష్టపడి నన్ను దగ్గరకు తీసుకోలేవు. కానీ నువ్వున్న మాటకి కట్టుబడి ఈ రాత్రికి నాతో గడపటానికి సిద్దపడుతున్నావ్. ఎలా ఒకడివయ్యుండి రెండుగా ఎలా చీలిపోగలవు? ఆ తర్వాత రెండు ప్రవృత్తుల్ని ఎలా సమర్ధించుకుంటావ్? అదలా వుంచు."
ఆ క్షణంలో మధూళీ గురించి మాట్లాడాల్సిన పని లేదు. కానీ అసంకల్పితంగా నోరుజారింది సామ్రాజ్యం.
"నాతో అనుభవాన్ని పంచుకునే నువ్వు రేపు నీకు దగ్గరవ్వాలని కోరుకుంటున్న మధూళీకి ఏం జవాబు చెబుతావ్?"
విస్మయంగా చూశాడు ధన్వి.
"నేను నోరుజారిన మాట నిజమే ధన్వి. కానీ మధూళీ నిన్ను ప్రేమిస్తుంది, ఆ విషయం తనే స్వయంగా నాతో అంది."
సామ్రాజ్యం ఏం చెబుతుంది.?
అలలా అల్లపల్లన కదిలివచ్చిన మధూళీ ముందు ఆకతాయిలా పైకతాలపై దూకే లేడిపిల్లలా అనిపించినా గానీ, ఆ తర్వాత సెలయేరుగా వినిపించి మరుక్షణం మిన్నేరుని తలపించింది. కలంతో రేపని కలకలాన్ని మౌనబలంతో చలనంలానో జ్వలనంగానో మలిచి వడిగా సుడిగా తన ఆలోచనల్లో ఎదిగింది. శ్వాసకోశంలోకి ఎగజిమ్ముతున్న ఆవిరై ఎందుకింత అలజడిని రేపుతుంది అని అనిపించేటంతగా ఆకట్టుకుంది. అలాంటి మధూళీ తనను ప్రేమిస్తుందా....?
"నమ్మలేకపోతున్నావా ధన్వి?"
"అవును" అనలేదు ధన్వి. "నన్ను ఇష్టపడుతున్నట్టు మధూళీ నిజంగా నీకు చెప్పిందా?" అడిగాడు సాలోచనగా.
"చెప్పడమే కాదు ధన్వి.....అక్కగా నన్ను ఆశీర్వదించమంది. నిన్ను పొందగలిగే అదృష్టం కోసం తను బ్రతికినంత కాలమూ ఎదురుచుస్తానంది."
ధన్వి నిశ్శబ్దంగా చూస్తున్నాడు.
వసంతం హసించడమంటే ఇదేనా?
కళ్ళు ఆలపించే స్వాప్నిక యుగళగీతాన్ని చెక్కిళ్ళపై తారాడే కలం నీడలో తెలియచెప్పే మధూళీ మనసులో తనకి అంతటి స్థానం వుంది అని తెలియగానే గుండె అక్వారియం దిగువున వున్న ఆలోచనల గులకరాళ్ళు ముత్యాల వరాలై మనసుకి ఇంతటి వూరటని అందిస్తున్నాయేం......
