భాగవతారిణిని కుదిర్చే భారం నాయుడు తనమీదే వేసుకున్నాడు.
హరికథ పెట్టించాలని నిర్ణయం జరిగిన రోజున టౌన్ కి వెళ్ళాడు. తనకు తెలిసిన తబలా మాస్టారు సూరిబాబుకు కలుసుకున్నాడు.
"హరికథ బాగా చెప్పడంతో పాటు కాస్తంత క్లోజ్ గా వుండే మనిషి వుంటే చెప్పు" అన్నాడు అదో విధంగా నవ్వుతూ.
ఆ నవ్వుకు అర్ధం తెలిసిన సూరిబాబు "వుంది" అని ఓ క్షణంసేపు తిరిగి 'పద్మ' అన్నాడు.
"పద్మా! ఎవరామె!"
"ఇక్కడే క్వార్టర్స్ లో వుంటుంది. భర్తను ఈమె వదిలేసిందో, లేక అతను ఆమెను వదిలేశాడో తెలియదుగానీ ప్రస్తుతానికి ఒంటరిగా కాలక్షేపం చేస్తుంది. పెళ్ళికి ముందు నేర్చుకున్న హరికథను ఉదర పోషణార్ధం తిరిగి చేపట్టింది. కాబట్టి ఆమెను ఫిక్స్ చేద్దాం- పద" అని సూరిబాబు లేచాడు.
ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్ళారు.
పెద్ద కళ్ళు అంత పెద్దదిగానే వున్న నుదుటిమీద బొట్టు ఎత్తుగా గుండ్రంగా వున్న ఎద నవ్వుతూ వుండే పెదవులు. సన్నటి నడుంతో వున్న పద్మ కనబడగానే నాయుడికి పెదవులు ఎండిపోయాయి. తను ఎంత దాహంతో వున్నాడో ఆయనకి తెలిసింది.
అమృత భాండాల్లా వున్న ఆమె ఎదవైపు ఆయన దాహంగా చూడడం సూరిబాబు కనిపెట్టనే కనిపెట్టాడు.
పరిచయాలయ్యాయి!
నాయుడు విషయం చెప్పి అడ్వాన్స్ ఇచ్చాడు.
నిజానికి అప్పటికప్పుడు విషయం తేల్చేసి తనకూ ఆడపిల్లల్ని ఆకర్షించే వయసు పోలేదని అతనితోనే సమాధానం చెప్పుకోవాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు నాయుడు.
సూరిబాబు లేకపోతే అంతపనీ చేసి వుండేవాడు.
పక్కన సూరిబాబు వుండడంతో తన దాహాన్నంతా ఆమెకి కళ్ళతోనే తెలియజేసి వచ్చేశాడు.
పద్మ సాయంకాలం ఆరుగంటలకల్లా వూర్లో దిగింది. ఆమె రావడంతోనే నాయుడు హడావుడి ప్రారంభించాడు. ఆమెని సరాసరి తన ఇంటికి తీసుకెళ్ళాడు. డాబా మీదున్న ఏకైక గదిని ఆమెకు కేటాయించాడు. బాత్రూమ్ లో కొత్త కేమీ సోప్ దగ్గర్నుంచి చార్లీసెంట్ వరకు పెట్టాడు.
ఆమెకి ఎప్పుడు ఏం అవసరమొస్తుందోనని ప్రతిక్షణం ఆమెను అంటి పెట్టుకునే వున్నాడు.
ఎప్పటికప్పుడు తన మనసులోని మాటను ఆమెకు చెప్పాలని ప్రయత్నించాడు. కాని కుదిరి చావడం లేదు.
చివరికి ఆమెను తన ఇంటినుంచి దేవాలయానికి తీసుకు వస్తున్నాడు.
ఆ దారి సన్నగా వుంటుంది. అటూ ఇటూ ముళ్ళపొదలు చీకటిని చీల్చుకుని నడుస్తున్నట్టు వుంటుంది.
ఇదే మంచి సమయమనిపించింది నాయుడికి.
"పద్మా" అన్నాడు అలా పిలిచేటప్పుడు మళ్ళీ ఆయనకి నిన్న రాత్రిలాగా బాగా దాహమేసింది. ఆమె ఎదవైపు చూశాడు.
"ఏమిటండి నాయుడుగారు" ఆమె అడిగింది.
"హరికథ అయిపోయాక నువ్వు" అంటూ సడెన్ గా ఆగి, ఆమె ముందు భాగంవైపు తిరిగి చేతులు పట్టుకున్నాడు.
ఆమె ఈ హఠాత్ సంఘటనకు జడుసుకుంది. అంతలోనే సర్దుకుంది. అందుకే సుతారంగా చేతులు విడిపించుకుంటూ "నాకు తెలుసు మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారని మీ అంత వయసున్న వాళ్ళు మరో ఉద్దేశ్యంతో నాలాంటిదాన్ని పట్టుకోరని తెలుసు. మీకుగానీ, మీ ఆలయ ధర్మకర్తల్లో మరెవరికీ గానీ నావల్ల ప్రమాదం రాదులెండి" అంది నవ్వుతూ.
ఠక్కున చేతులు వదిలేశాడు నాయుడు.
ఆ క్షణంలో ఆయనకు మరో పదేళ్ళు మీద పడ్డాయి. ఇక జీవితంలో తనకు స్త్రీ సుఖం లేదన్న నిరాశ ఆయన్ని కృంగదీసింది.
"నువ్వెళ్ళి హరికథ ప్రారంభించు- వస్తాను" అని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేశాడు.
ఇంత జరగడం వల్లే ఆమె అరగంట ఆలస్యంగా హరికథను ప్రారంభించవలసి వచ్చింది.
జితేంద్ర చివరి వరుసలో కూర్చున్నాడు. శారీరకంగా అతను అక్కడ వున్నా మనసు మాత్రం లిఖిత చుట్టూ తిరుగుతూ వుంది. పన్నెండు ఎప్పుడవుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్నాడు.
మధ్యమధ్యలో జనం గోవిందాలు పెడుతున్నారు.
టైమ్ పదకొండున్నర అయింది. హరికథ చివరి ఘట్టంలో పడింది.
చాలామంది నేలమీదే పడుకుని నిద్రపోతున్నారు. కుర్రకారు మాత్రం భాగవతారణిని చూస్తున్నారో లేక హరికథ వింటున్నారో తెలియదు గానీ చాలా ఉత్సాహంగా మాత్రం వున్నారు.
ఇక తన టైమ్ అయిందని జితేంద్ర పైకి లేచాడు.
నల్లటి ఆకాశానికి ఎర్రటి పూత పూయడానికి ప్రయత్నిస్తున్నాయి విద్యుత్ దీపాలు. గాలికూడా హరికథ దగ్గర కూర్చొనేసినట్టు వుక్కగా వుంది. అక్కడక్కడా వున్న నక్షత్రాలు చలిని మరీ మునగదీసుకున్నట్టు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
జితేంద్ర అడ్డదారిన నడుస్తున్నాడు.
చీకటి కళ్ళను పొడిచేసినట్టు ఏమీ కనిపించడం లేదు.
కాళ్ళ కింద నలుగుతున్న ఎండుపుల్లలు భయంకరంగా చప్పుడు చేస్తున్నాయి.
దారికి ఇరుపక్కలా పెరిగిన ముళ్ళపొదలు చీకటి బస్తాల్లా వున్నాయి.
జితేంద్ర సగం దూరం వచ్చేసాడు.
ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు.
విద్యుత్ వెలుగులు తాకి మెరిసిపోతున్న దేవాలయం చీకటి కొలనులో తేలుతున్న తెప్పలా వుంది.
కీచురాళ్ళ రొద గుండెను తాకుతోంది.
జితేంద్ర నడక వేగాన్ని పెంచాడు.
చిన్న కాలువ అసందర్భమైన ఆలోచనలా అడ్డొచ్చింది.
