Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 47

 

    పద్మజ అలా ప్రవర్తించబట్టే నేను సందేహం లేకుండా ఆమె గోకుల్ ప్రేయసి అని గుర్తించాను.
    
    అందువల్ల ప్రేయసీ ప్రియులు ఇతరులున్నప్పుడు ఒకరంటే ఒకరికి ఏమీ ఇష్టం లేనట్టు ప్రవర్తించాలి. ప్రేమంతా నాలుగు గోడలకే పరిమితం చేయాలి. అప్పుడిక రంగనాయకి లాంటిది కూడా కనిపెట్టలేదు" అంటూ నవ్వుతూ ముగించింది రంగనాయకి.
    
    లిఖిత ఇంటికొచ్చిందిగానీ ఏమీ పాలుపోవడం లేదు. జితేంద్ర ఇచ్చిన డబ్బు ఇంకా ఆమె చేతుల్లోనే వుంది. రంగనాయకి చేతికిచ్చి జితేంద్రకి చేర్చేయమని చెప్పాలనుకుంది గానీ చివరి క్షణంలో ఆ ఆలోచనను విరమించుకుంది. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేరకం రంగనాయకి. అలాంటి ఆమెకి పని అప్పజెపితే మొత్తం తీగంతా లాగి డొంకను కదిలిస్తుంది. అందుకే ఆమెతో ఏమీ చెప్పకుండా ఇంటికి వచ్చేసింది. ఇంటికైతే వచ్చిందిగానీ సమస్య అలాగే వుంది. ఆ డబ్బు తన చేతుల్లో వుండగా తనకు మరో పనిమీద మనసు పోదు. మరో ఆలోచనరాదు.
    
    కానీ ఇప్పుడేమిటి చేయడం?
    
    అప్పుడు టైమ్ ఎనిమిది దాటింది వూరు వూరంతా హడావుడిగా వుంది. పండగ కాబట్టి గందరగోళంగా వుంది సినిమాలకు వెళ్ళేవాళ్ళు, పక్కవూర్లో వున్న గుడి దగ్గర జరిగే హరికథకు వెళ్ళే వాళ్ళతో వీధులు సందడిగా వున్నాయి.
    
    లిఖిత ఏదో తిన్నానంటే తిని వీధి అరుగుమీద కూర్చుంది. జితేంద్ర కనిపిస్తాడేమోనని కళ్ళను సాగదీసుకుని చూస్తోంది.
    
    చిన్నస్వామి యిల్లు పక్కవీధిలో వుంది. కాబట్టి జితేంద్ర ఇటొచ్చే అవకాశాలు తక్కువ. కానీ తనకు రోజూ దేవాలయం దగ్గర కూర్చుని చూస్తుంటానని చెప్పాడు. కాబట్టి దేవాలయం దగ్గర వున్నాడేమోనని చూసిందిగానీ అక్కడ అతను వున్నట్టు లేడు.
    
    ఆమె అలా వీపుని గోడకు ఆనించి పడుకుంది.
    
    సాయంకాలం నుంచి జరిగిన ఒక్కొక్క సంఘటన కళ్ళ ముందు మెదులుతోంది. తనతో మాట్లాడడానికి మాటకు వందరూపాయల చొప్పున ఇవ్వాలని అడగడం, జితేంద్ర తన చేతిలో రెండు వందలు వుంచి 'నేను మిమ్మల్ని' అనడం ఆ తరువాత చెప్పాలంటే అతని దగ్గర డబ్బు లేకపోవడం ఇవన్నీ గుర్తు వచ్చాయి.
    
    ఇంతకీ అతను చెప్పదలుచుకున్నదేమిటి?
    
    అదేదో అతని నోటివెంటే వినాలి. ఈ డబ్బును అతనికి ఇచ్చెయ్యాలి. కానీ అతను కనపడడం లేదే ఎలా?
    
    ఇక మిగిలింది అతన్ని వెదుక్కొంటూ చిన్నస్వామి యింటికి వెళ్ళడమే.
    
    తిన్నె మీదనుంచి లేచి స్లిప్పర్స్ వేసుకుని బయల్దేరింది. చిన్నస్వామి ఇల్లును సమీపిస్తున్న కొద్దీ రకరకాల ఆలోచనలు. 'ఎవరికోసం వచ్చావ్' అని ఎవరయినా అడిగితే ఏం చెప్పాలి? అతనుంటే ఏం మాట్లాడాలి?
    
    ఇలాంటి ఆలోచనలతో అడుగులు సరిగా పడడం లేదు.
    
    ఇంటిముందు ఎవరో మగవాళ్ళున్నారు. వాళ్ళలో జితేంద్ర లేడు.
    
    ... అందుకే యింట్లోని ఆడవాళ్ళతో పని వున్నట్టు వేగంగా లోపలికి నడిచింది.
    
    చిన్నస్వామి కూతురు లిఖితను చూడగానే "రారా.... ఎన్నాళ్ళకు" అంటూ ఆహ్వానించింది.
    
    డైరెక్ట్ గా అడగడం బావోదనిపించింది.
    
    అందుకే అవీ ఇవీ మాట్లాడుతూ కూర్చుంది.
    
    చివరికి లేవబోతుండగా "జితేంద్ర అలా హరికథా కాలక్షేపానికి వెళ్ళాడు. ఏమైనా చెప్పాలా?" అని అడిగింది ఆమె.
    
    ఇంతకీ ఆమె ఎలా కనిపెట్టినట్టు? తను జితేంద్ర కోసమే వచ్చానని? తన నుదుటున రాసినట్టు మాట్లాడుతోంది ఈ పిల్ల.
    
    "కాదు" అన్నట్టు రెండుసార్లు తల అడ్డంగా ఊపి అక్కడ్నుంచి బయటపడింది.
    
    అంతే జితేంద్ర హరికథా కాలక్షేపానికి వెళ్ళాడన్న మాట. ఇప్పుడతన్ని కలుసుకోవాలంటే పక్క వూరు దేవాలయం దగ్గరికి వెళ్ళాలి.
    
    కానీ ఇంత రాత్రి వెళ్ళాలంటే ఎవర్నో ఒకర్ని తోడు తీసుకుని వెళ్ళాలి. అందుకు అమ్మానాన్న కూడా పంపడానికి ఒప్పుకోరు.
    
    సో... రేపు కనిపించగానే డబ్బులివ్వడమే మంచిది.
    
    అలా నిర్ణయించుకోవడంతో తన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుని పడుకుంది.
    
    దేవాలయంలో జరుగుతున్న హరికథ గాలిలో తేలుతూ వచ్చి మెల్లగా విన్పిస్తుంది.
    
    లిఖిత తన ఇంట్లో నిద్రపోవడానికి విశ్వప్రయత్నం చేస్తుండగా దేవాలయం దగ్గర జితేంద్ర నిద్ర పోకుండా వుండడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
    
    రాత్రి పన్నెండు గంటలకి అతను ఓ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఉదయం నుంచి పనిచేయడం వల్ల శరీరం అటు వాలగానే నిద్రలోకి జారుకుంటుంది అందువల్లే అతను హరికథకు వచ్చాడు.
    
    హరికథ వింటూ నిద్రపోకుండా వుండాలన్నది అతని ప్రయత్నం.
    
    తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన హరికథ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
    
    కారణం ఆలయ ధర్మకర్తల ప్రెసిడెంట్ నాయుడు వల్లే.
    
    ఆయనకి ఏభై ఏళ్ళు అంత వయసు రావడంతో ఇక తనను చూసి ఏ ఆడపిల్లా మోహించదని ఈ మధ్య అతనికి ఒక శంక పట్టుకుంది. ఎంతసేపూ అదే దిగులు.
    
    దీన్ని బయటికి చెప్పుకోలేక అంత కఠినమైన వాస్తవాన్ని జీర్ణించుకోలేక సతమతమవుతూ వున్న సమయంలో దేవాలయంలో హరికథను ఫిక్స్ చేసే పని పడింది.
    
    భాగవతార్ అంటే భాగవతారిణి అయితే బావుంటుందని ధర్మకర్తగా అన్నారు. నాయుడు అటువేపే మొగ్గాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS