Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 49

 

    ఎగిరి దాటాడు.
    
    ఇసుకలో పడిన పాదం మెలికపడి నొప్పి పుట్టింది.
    
    గట్టు ఎక్కుతున్నాడు.
    
    పాదం వేశాడో లేదో ఏదో సర్రున కదిలిన శబ్దం మరో అడుగు వేశాడు. ఈసారి శబ్దంతో పాటు పాదాన్ని ఏదో పట్టుకుని కొరికింది.
    
    అతను ఆగాడు.
    
    పాదాన్ని ఎత్తి పట్టుకుని చూశాడు.
    
    కొరికినచోట మంట ప్రారంభమై రక్తంలో కలిసిపోతుంది.
    
    అతనికి ఏదో అనుమానం వచ్చింది.
    
    అటూ ఇటూ చూశాడు.
    
    మళ్ళీ కదిలిన చప్పుడు. ముళ్ళ పొదలోకి పోతున్న పాము తోక కనపడింది.
    
    అతని అనుమానం నిజమైంది.
    
    అంటే పాము కరిచిందన్న మాట.
    
    అది నిజంగా పామో కాదో, అది తనను కరిచిందో లేదో నిర్దారించుకునేందుకు ఆగలేదు అతను. కారణం పన్నెండు గంటలకల్లా ఊరికి చేరుకోవాలి.
    
    అందుకే అతను దాన్ని గురించి పట్టించుకోకుండా ముందుకి కదిలాడు.
    
    అడుగులు ఇంతకు ముందంత ధాటీగా పడడం లేదు. ఒక పాదం నొప్పితో వంకర్లు పోతుంది.
    
    క్షణక్షణానికీ నొప్పి ఎక్కువవుతోంది. నొప్పి నిముషాలతో హెచ్చించినట్టు తీవ్రమైన బాధ శరీరమంతా తిరుగుతోంది.
    
    కళ్ళు బైర్లు కమ్ముతున్న భావన.
    
    పాదం దగ్గిర మంట మరింత పెరిగింది. రక్తంలో కలిసిపోయిన మంట శరీరాన్ని మండిస్తోంది.
    
    అతను వీలయినంత వరకు దాన్ని పట్టించుకోకుండా నడుస్తున్నాడు.
    
    ఊరు సమీపిస్తుంది.
    
    హరికథ ఇంకా ముగిసినట్టు లేదు, భాగవతారిణి గొంతు చెవుల్లో వినిపిస్తోంది.
    
    అతను నడక వేగం మరింత పెంచాడు.
    
    ఊరి మొదట్లో ఇంకా నిద్రరాని కుక్క అతన్ని చూసి మొరిగి, అంతలోనే అతను తన ఊరివాడిలాగా గ్రహించి తోక ఆడించుకుంటూ ముందుకి వచ్చింది.
    
    అతను రెండో వీధిలోకి మలుపు తిరిగాడు.
    
    మరో పది అడుగులు వేస్తే లిఖిత ఇల్లు వచ్చేస్తుంది.
    
    వూరు వూరంతా నిశ్శబ్దంగా వుంది.
    
    అతను నడుస్తున్నాడు గానీ మెదడంతా మొద్దుబారినట్టు భారంగా తయారైంది.
    
    అతను లిఖిత ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటిలో ఏది ఎక్కడుందో అతనికి బాగా తెలుసు.
    
    అతను ఆ ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఆమె మీద వున్న ఇష్టం వల్ల ఆమెకు సంబంధించిన ప్రతిదాన్ని తెలుసుకున్నాడు.
    
    ఇంటికి తూర్పువేపు వున్న సందులోకి నడిచి కిటికీ దగ్గర ఆగాడు.
    
    ఆ గదిలోనే లిఖిత పడుకునేది.
    
    కిటికీ పైరెక్కల్ని మూసి వుంచలేదు.
    
    మంచంమీద సౌందర్యం విశ్రాంతి తీసుకుంటున్నట్టు లిఖిత పడుకుని వుంది.
    
    నిద్రలో కదలడం వల్ల కాబోలు పైట కాస్తంత పక్కకు జరిగింది. చందమామ ఆకాశంలో ఎందుకు లేదో గుర్తుకు వచ్చింది అతనికి. వెన్నెలంతా ఆమె ఎదమీద రెండు భాగాలుగా ఘనీభవించినట్టు తోచింది.
    
    బెడ్ లైట్ మంచి వెలుగు ఆ గదిలోకి సన్నగా జారుతున్నట్టుంది.
    
    గోడమీద గడియారం పన్నెండును చూపుతోంది.
    
    'హమ్మయ్య ఆలస్యం కాలేదు' అనుకున్నాడు ఇంకా కొంతసేపు అలా ఊచల్ని పట్టుకుని పైకి చూడడానికి వీలు కావడం లేదు.
    
    కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఒళ్ళంతా తేలిపోతుంది. శ్వాసపీల్చడం కష్టమయిపోతుంది. ఏదో మగత శరీరాన్ని పడదోయడానికి ప్రయత్నిస్తోంది.
    
    అతను తన శరీరంతో తనే పోట్లాడుతున్నట్టు కాళ్ళు చేతులు విదుల్చుకున్నాడు. కళ్ళను అరచేతులతో రుద్దుకున్నాడు. పాము కరిచిన చోట చేత్తోరాశాడు. నొప్పి మరింత ఎక్కువైందే తప్ప తగ్గలేదు.
    
    మరో రెండు నిముషాల్లో తనకు ఏదో అయిపోతుందని అతను గ్రహించాడు. తను స్పృహ తప్పవచ్చు. లేదా చచ్చిపోవచ్చు. అంతలో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. సరిగ్గా పన్నెండు గంటలకు ఆమె పుట్టినరోజులో ప్రవేశిస్తుంది.
    
    అతను శక్తినంతా చేతుల్లోకి తీసుకుని ఊచల్ని పట్టుకున్నాడు.
    
    శ్వాస పీల్చడం కష్టమైపోతుంది. అయితే అతని ధ్యాస ఆమె మీదే వుంది.
    
    "ఏమండీ లిఖితగారూ!" మెల్లగా పిలిచాడు.
    
    ఆమె కూడా కలత నిద్ర పోతుండడం వల్ల మేల్కొంది.
    
    శబ్దం వచ్చిన వైపుకి తల తిప్పింది.
    
    కిటికీ వూచలకి రెండు కనుగుడ్లు అతుకున్నట్టయి కనిపించగానే భయంతో కెవ్వున అరవబోయి ఆపై తమాయించుకుంది.
    
    "ఎవరూ"
    
    మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి ముఖాన్ని తెచ్చిపెట్టి అడిగింది.
    
    "నేను జితేంద్రను"
    
    ఆమెకు ఠక్కున మగతంతా ఎగిరిపోయింది.
    
    చివాలున మోకాళ్ళమీద కూర్చుని "నువ్వా" అంటూ ఆశ్చర్యపోయింది.
    
    "ఏమిటి ఇంత రాత్రిపూట" ఆమె ఏవేవో వూహించుకుంటోంది. అందువల్లే భయంలాంటిది గుండెల్లో పుట్టింది.
    
    "మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. టైమ్ పన్నెండు దాటింది. కదా అందుకని" అతను చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS