"నమస్తే!" అని వినిపించి పక్కకి తిరిగిచూశారు.
"నా పేరు ధర్మానందరావు."
"ఆ పేరు వినగానే, ఇద్దరూ లేచి అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడ్డారు.
"కూర్చోండి!" అంటూ ఆయనా ఓ కుర్చీ జరుపుకుని వాళ్ళపక్కనే కూర్చున్నారు.
"ధృతి మీ కూతురవడం మీ అదృష్టం" ఆయన నోటినుండి ఆ మాటలు రాగానే, అందాకా చిన్నబోయిన సీతారామయ్య మొహం చేటంత అయింది. కూతురు వున్నవైపు అపురూపంగా చూశాడు.
"ధృతీ! ఆవిడ మిసెస్ చౌదరి, ఈవిడ డాక్టర్ కామాక్షి కరుణాకరన్, ఈవిడ...." అంటూ గబగబా ఒక్కొక్కరినీ ఆమెకి పరిచయం చేయాలన్న ఆలోచనకన్నా, తన స్నేహితులంతా ఎంత గొప్పగొప్పవాళ్ళో చెప్పాలనే ఆరాటమే ఎక్కువగా కన్పిస్తోంది గాయత్రీ దేవిలో.
అవతలివారు కూడా ధృతివైపు ఎక్కువ ఆసక్తిగా చూడకుండా తలలు వూపి వూరుకున్నారు. అందుకు బహుశా ఆమె ఆహార్యమే కారణమేమో!
"ఈ ఏడు ప్రేమ్ కి పెళ్ళి చేసేస్తారనుకుంటాను" ఎవరో ఆడపిల్ల తల్లి కామోసు ఆరాగా అడుగుతోంది.
"ఔను! చేసేద్దామనే అనుకుంటున్నాను. మంచి సంబంధాలుంటే చూడమని అన్నయ్యకి ఉత్తరం కూడా రాశాను" గాయత్రీదేవి జవాబిచ్చింది. ఆవిడ ధర్మానందరావుగారిని "అన్నయ్య" అని సంబోధిస్తూ వుంటుంది.
"మంచి సంబంధం అంటే బాగా కట్నం యిచ్చే సంబంధం అనా?" ఇంకో ఆవిడ పరచికంగా అడిగింది.
"కట్నమా! మాకేం తక్కువని ఇంకోళ్ళని యాచించడం? మా ప్రేమ్ ఇష్టపడటం మాకు ముఖ్యం" ఆ చెప్పడంలో కూడా ఎంతో గర్వం.
"ఇంతకీ మీ ప్రేమ్ ఇష్టపడ్డ అదృష్టవంతురాలెవరైనా వున్నారా? లేకపోతె మా వంతు ప్రయత్నం చెయ్యమంటారా?" ఇందాకటి ఆడపిల్ల తల్లి ఆశగా అడిగింది.
సరిగ్గా అప్పుడే ప్రేమ్ అటుగా వచ్చాడు.
"ప్రేమ్ ఇలారా" పిలిచింది గాయత్రీదేవి.
"వాట్ మమ్మీ?"
"వీళ్ళందరూ నీ పెళ్ళి గురించే అడుగుతున్నారు. సంబంధాలు చూడమంటావా? లేక నీకు నచ్చినమ్మాయి ఎవరైనా వున్నారా?" అంటూ క్రీగంట చూసింది.
ప్రేమ్ చిన్నగా నవ్వి తలతిప్పి పక్కకి చూశాడు.
ధృతి తల వంచుకుని నిలబడ్డది కాస్తా అప్పుడే తలెత్తి దూరంగా ఆరి వెలుగుతున్న రంగురంగుల బల్బులను చూడసాగింది.
"నాకు నచ్చిన అమ్మాయి ఒకరునంరు" అంటూ ఆగి ఓసారి అందర్నీ చూసి, నెమ్మదిగా ధృతివైపు రెండడుగులు వేసి "ధృతీ!" అంటూ చెయ్యి చాపాడు.
అప్పుడే ధృతి కూడా ముందుకు వచ్చింది. ఎంత వేగంగా అంటే అమాంతం ప్రేమ్ ని పక్కకి నెట్టేస్తూ ఎక్కుపెట్టి విడిచిన బాణంలా తిన్నగా పరుగులు తీసింది.
ఆశ్చర్యంగా ఆమె వెళుతున్నవైపు చూస్తుండిపోయాడు ప్రేమ్.
ఆమె తిన్నగా గేటు దగ్గరకెళ్ళి ఆగింది.
నవీన్ క్రింద కూర్చున్నట్లుగా వున్నవాడు నెమ్మదిగా లేస్తున్నాడు. అతని నుదుటికయిన గాయంనుండి రక్తం స్రవిస్తోంది.
"అరే నవీన్! రక్తం" అంటూ మరొక్క సెకను కూడా ఆలోచించకుండా సర్రున కొంగు చింపి అతని గాయానికి కట్టు కట్టసాగింది.
"చిన్నదెబ్బేలే! నువ్వెందుకు వచ్చావు?" ఆమె చేతిని దూరంగా జరుపుతూ అన్నాడతను.
"చెట్టుమీదకెక్కి ఆ లైట్లు వెలగడం లేదని సరిచేశాడు. దిగేటప్పుడు సరిగ్గా అక్కడ రాయి వుండడంతో నుదుటికి బలంగా కొట్టుకుంది" అన్నాడు వాచ్ మెన్.
ధృతి కట్టుకట్టినా ఆగకుండా నవీన్ నుదుటినుండి ఇంకా రక్తం కారిపోతూనే వుంది.
"నీకు చాలా తొందర! చూసుకోవు" అంటూండగానే ఆమెకంట నీరు గిర్రున తిరిగింది.
"ఏమైంది?" అసహనంగా విన్పించింది ప్రేమ్ గొంతు.
ఎవరో జరిగినదంతా తిరిగి చెబుతున్నారు.
గాయత్రీదేవి ధృతిని కాల్చేసేటట్టు చూడసాగింది.
ధృతి చేతిలో ఇంకా నవీన్ భుజం బంధింపబడే వుంది.
"ఇంతకీ ఎవరండీ అతను?" గాయత్రీదేవిని ఎవరో స్నేహితురాలు అడిగింది.
"కారు డ్రైవర్" ఠక్కున చెప్పింది ఆవిడ. ఆ వెంటనే వెనక్కి తిరిగి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెనకాలే చాలామంది వెళ్ళిపోయారు. ప్రేమ్ కూడా.
నవీన్ కూడా నెమ్మదిగా తన భుజం ధృతి చేతిలోంచి విడిపించుకుని, గేటుదాటి వెళ్ళిపోయాడు.
ఆమె ఒంటరిగా నిలబడిపోయింది.
"చాల్లే చేసిన నిర్వాకం! ఇంకా పద" అని వినిపించి వెనక్కి తిరిగి చూసింది.
సుభద్రా, సీతారామయ్య తీక్షణంగా చూస్తూ ఎదురుగా కనిపించారు.
* * *
తల్లీ, తండ్రి వెళ్ళిపోయాక ఒక్కర్తే కూర్చుని ఆలోచించసాగింది ధృతి. "తను చేసిన మహాపరాధం ఏమిటి? తన కళ్ళముందే ఒక మనిషి గాయపడితే, రక్తం ధారగా కారిపోతుంటే చూస్తూ వూర్కోగలదా? అందులోనూ నవీన్ లాంటి ఆప్తుడు. తను చేసిన చర్య అంతగా గర్హించవలసిందేమీ కాదే! ఎందుకు తల్లిదండ్రులు అంత నోరు చేసుకున్నారు?"
"వాడితో ఇంకోసారి కలిసి తిరిగినా, మాట్లాడినా నా మీద ఒట్టే తల్లిదండ్రులు లేరు అనుకుంటే ఆ పని చెయ్యి" నాటో తెగ ఆవేశపడిపోయింది సుభద్ర.
ఆయాసంతో ఊపిరందక నరకం అనుభవిస్తూ, డాక్టరుని వెంట పెట్టుకొచ్చిన నవీన్ ని కృతజ్ఞతగా చూస్తూ చేతులు జోడించినది ఈవిడేనా? అనిపించిందామెకి.
