భుజంగరావు లేచాడు 'ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళిందో - ఎందుకెళ్ళిందో నీకు తెలియదు కదా - ఆ ముసలాయన రాజారావు ఎలావున్నాడో - ఎవరు కార్లో వచ్చారో, ఎవరు తీసుకెళ్ళారో నీకు ఎలా తెలుసు. "అదే వాడు చూసానని చెప్తుంటే" --
"అది లేచిపోయిందని వాడు చెప్పాడా - పిలు, ఆ కిరణ్ గాడిని" భుజంగరావు అరిచాడు.
"ఆ పిల్ల, నా పిల్ల, నీ పిల్లకాదు - ఎవరిగురించయినా తెలియకుండా మాట్లాడద్దు - నీకు తెలుసా లేచిపోయిందని - ఎప్పుడు, ఎవడితో, ఎక్కడికి చెప్పునాకు - ఆ పిల్ల రేపు వాళ్ళ అన్న ఊరో, నాన్న ఊరో వెళ్ళిందని తెలుస్తేనీ మనసు నిన్ను ఎంత శపిస్తుందో తెలుసానీకు - ఆడపిల్లని గౌరవించాలి - ఆడపిల్లకి చదువు సంస్కారం నేర్పించాలి. ఆడపిల్లని మగపిల్లాడితో సమంగా పెంచాలి. నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది, భగవంతుడు నాకు ఒక్క ఆడపిల్లనే ఇచ్ఛాడేమిటి - నలుగురు ఆడపిల్లల్ని ఇస్తే ఎంత ఆనందించేవాన్ని అనీ.
సుబ్బలక్ష్మి ఫక్కున నవ్వింది. 'చాల్లెండి. నవ్విపోతారు ఎవరైనా వింటే - ఇదిగో మీరుగొప్పగా మాట్లాడుతున్నా ఆ బంగారు తల్లి, అదేమీగారాల పిల్ల ఆ శారద - ఇలారండి అరుస్తేబాగోదు' అంటూ సుబ్బలక్ష్మి భుజంగరావు చెవిలో చెప్పింది - విన్నారా - అలాటిది అది - నాకు అంతా రాజమ్మ చెప్పిందిగా" అంది సంతోషంగా, భర్తను ఎదిరించానన్న తృప్తితో.
"దానికి కారణం నీలాంటి ఆడవాళ్ళే, మీరే మిమ్మల్ని కించపరుచుకుంటారు -మీరే మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు. అడవిలో మానుట, అరిటాకుల ! ఇలా ఎన్నో కానీ, మీకు సమానత్వం కావాలి - మీకూ గుర్తించే సమాజం కావాలి - మీరు బానిసలుకారు, వంటింటి కుందేళ్ళు కారు అని మీ భుజం తట్టే సంఘంకావాలి - మీకాళ్ళమీద మీరు నిలబడి బతికేరోజురావాలి - ఒకరిపై ఆధారపడని ఆర్ధిక స్తోమత, వ్యక్తిత్వంకావాలి. అంతేకానీ, ఆడపిల్ల పుడుతుందాని తెలిసి అబార్షన్ చేయించుకున్నాను, మగపిల్లాడినే దత్తత చెసుకుంటా ఆడపిల్లయితే వద్దు - ఏమిటివన్నీ - ఆ శారద రానీ, రోజూ ఓ గంట ఆ అమ్మాయికి సంఘంలో ఆడది ఎలా వుండాలో, ఏమికావాలో, ఎలా పెరగాలో, ఎలా ఎదుర్కోవాలో - ఇలాటి విషయాలెన్నో చెప్పి ఆ అమ్మాయిని గొప్పవ్యక్తిగా తీర్చిదిద్దుతా. తల్లి - ఇందిరా - ఈ ఉపన్యాసం అంతా ఎవరికోసమనుకుంటున్నావు - మీ అమ్మకోసం కాదు - నీ కోసము అర్ధమయిందా ఆడపిల్లకోసమూ"
'నిజమేనాన్నా నేను అమ్మకి ఎప్పుడూ ఇదే చెబుతున్నాను - ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులంటే ఇదేనని - ఆ అమ్మాయికి మన మెవరమూరవ్వంత సాయం చేయలేదు ఇంతవరకు. ఒక్కరూపాయి ఆ అమ్మాయిమీద ఖర్చుపెట్టలేదు. కానీ ఆ అమ్మాయిని అంటున్నని మాటలు మరెవరినీ అనటంలేదు. అమ్మ -నాన్నగారు చెప్పిందంతా నిజమే - ఆ అమ్మాయిని పల్కరించి ఆ అమ్మాయి మనసులో బాధ ఏమిటో కనుక్కోలేదు - అందరమ్మాయిలూ అసూర్యం పస్యలల్లే నీడపట్టునవుండి, భర్త పోషిస్తుంటే చీరలుకట్టుకు సింగారించుకునేరోజులు పోయాయి. ఆడది ఎప్పుడయితే ఆర్ధిక స్వాతంత్రం సంపాదించిందో అప్పుడే ఆమె వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది. ఆ రోజు శారద, పిన్నిని, నాన్నని అప్పటికప్పుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది అన్నావు - ఏ పరిస్థితులు ఆ అమ్మాయిచేత అలాచేయించాయోపాపం, కాకపోతే, ఆడపిల్ల తండ్రిని ఇప్పుడేమీరు వెళ్ళిపొండి అని అంటుందీ ? - నువ్వు చెప్పు - 'ఇందిరా అడగ్గానే సుబ్బలక్ష్మి ఆలోచనలోపడింది.
'ఇందూ తల్లీ, ఈ మధ్య అదేదో సినిమాలోచూసాను. అది వాస్తవంగా జరిగిన సంఘటననేనట - ఒక అమ్మాయితో స్నేహం చేసి, ప్రేమించి, గర్భవతిని చేసాడు ఒకడు. ఆ తర్వాత తండ్రి అండదండలతో, నువ్వెవరో, నాకేం తెలియదు పొమ్మన్నాడు. అమ్మాయి అలనాటి శకుంతలాలా తనుకన్నబిడ్డని వెంటపెట్టుకుని, అతని ఇంటి దగ్గరే ధారణా జరిపింది. ఆఖరివరకూ పోరాడి నిజయం పొందింది - మరి ఆ అమ్మాయి ధైర్యంగా అలా బిడ్డతో సహా వచ్చేసి నాకు న్యాయం చేయండి అని ఏడుస్తే, అరిస్తే, కొట్లాడితే ఆ అమ్మాయికి న్యాయం జరిగింది - ఆ అమ్మాయే భయపడి తాను జరిగిన అన్యాయం చెప్పకుండా దాచేసుకుంటే, ఆ పుట్టిన బిడ్డ ఏమురికి కాలువలోనో, ఏ చెత్తకుండీలోనో కళ్ళు మూయాలిసిందేకదా! - "భుజంగరావు మాటలు వింటున్నా సుబ్బలక్ష్మి 'అయ్యో, పాపం" అంది వెంటనే.
'అందుకని అమ్మా - ఆడపిల్ల, ఆడపిల్ల అని మీరోజుల్లో అనుకొనేటట్లు అనుకోడం మానేయి. ఆడపిల్ల చదువుకోవాలి - సమర్దురాలుగావుండాలి. ఆడవాళ్ళే లేకపోతే ప్రపంచమేలేదుగా - సృష్టే లేదుగా - మరి అలాటి ఆడపిల్లని గౌరవించటం, రావాలి - ఇప్పుడు సమాజంలో ఆలోచించాల్సింది అమ్మాయిలగురించే - మగవాడి గురించి ఆలోచించటం, వాడికే విద్యాబుద్దులు చెప్పించాలనుకోటం, వాడే మగధీరుడనటం, మగమహారాజు అనడం, నేను మగాన్ని నాకేం అని వాడనుకోటం - వాణ్ణి పెంచి పెంచి ఆకాశమంత ఎత్తున కూర్చోపెట్టడం అయిపోయింది. ఇప్పుడు అదంతా ఆడవాళ్ళవైపు మళ్ళిద్దాం, ఆడపిల్ల చదువు, పెళ్ళి, ఆరోగ్యం, ఉద్యోగం, పిల్లలు, ఆస్తి - అన్నీ అన్నీ ఇక ఇటువైపుకే తరించాలి. ఇప్పుడు త్రాసులో తూస్తే మొగ్గు కొంచం కూడా ఇటువుండదు. అందుకని, ఆడమగ ఇద్దరినీ త్రాసులో సమానం చేద్దాం. ఆడదంటే అబలకాదు. ఆదిశక్తి అని నిరూపించాలి. భగవంతుడు సృష్టిలో పెట్టిన పిల్లల్నికనే శారీరకస్థితి ఒక్కటే ఆడకిమగకి తేడా కావాలికానీ, అన్నిట్లోనూ ఎందుకూ - మొన్ననా స్నేహితురాలి చెల్లెలికి మెడిసన్ చదువుకి డొనేషన్ కట్టమంటే వాళ్ళింట్లో వాళ్ళు, నీకు పెళ్ళి చేయద్దా, కట్నమివ్వద్దా అని ఆ అమ్మాయిని తిట్టి డిగ్రీలో చేర్పించారట. అదే సంవత్సరం తమ్ముడికి డొనేషన్ కట్టి చేర్చారు.....ఈ తల్లితండ్రులు అబ్బాయిలకు కట్నం తీసుకోరామళ్ళీ ఎన్నయినా చెప్పండి నాన్నగారూ. ఇంట్లో నుంచి ఇది మొదలవాలి - ఆడపిల్ల, మగపిల్లాడు ఒకటేననే భావం - నాన్నగారూ, నాకర్ధంకాదు కొరివిపెట్టడానికి కొడుకులుండాలని, పున్నామ నరకం నుంచి కొడుకులుంటేనే రక్షింపబడతారని చెప్తారు - స్వర్గాలు నరకాలు నాకు తెలియవు కానీ, మగ పిల్లలు లేని తండ్రికి ఆడపిల్ల దహన సంస్కారం చేస్తే తప్పా' - ఇందిర అంటుంటే 'సుబ్బలక్ష్మి నోరునొక్కుకుంది. భుజంగరావు నవ్వి' అమ్మా - ఇందు, నాకు కొరివి నువ్వే పెడుదువుగాని. నేను అరవైఏళ్ళు వచ్చేవరకు బతికితే, అదే ఇంకోరెండేళ్ళు - విల్లురాస్తాను. అందులో ఈ విషయం రాస్తాను. ఎవరూనోరెత్తడానికి వీల్లేదు. అంతే" అన్నాడు ఇందిర పొరబాటుగా మాట్లాడానని బాధపడింది. అందుకు కాదు నాన్నగారూ."
"అవునమ్మా ఇది నీ సమస్య మాత్రమేనా. మగ పిల్లలు లేని తల్లి తండ్రులందరిదీ - ఈ విషయం నేను తీవ్రంగా ఆలోచిస్తున్నా - ఇలాటి సమస్యలెన్నో" - భుజంగరావు గుమ్మంలోపడిన పేపరు తీసుకున్నాడు. సివిల్ సర్వీస్ పరీక్షలకి చదువుకుంటున్న ఇద్మ్హిర మనసులో ఇలాటి సమస్యలు గుంపులుగుంపులుగా వచ్చి తలలో దూరి కూచున్నాయి. సుబ్బలక్ష్మి తండ్రీ కూతురు అన్నదాంట్లో వున్న విషయాలేవీ అర్ధంకాకకోపంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది.
* * *
20
రాజారావు కాళ్ళకి నూనిరాయించుకుంటున్నాడు వెంకడిచేత.
"నెమ్మదిగా రాయి. కాలునొప్పిపుడుతోంది. 'అన్నాడు, అంతలో వీధి గేటు తీస్తున్నారెవరో
'ఎవర్రా - ఎవరు'
'అమ్మాయిగారండి'
