Previous Page Next Page 
త్రీ ఇన్ వన్ పేజి 46

    "ఫరవాలేదు కూర్చో... వాడి మాటలకేం... అంతగా ఇవ్వాలని అనుకుంటే రేపో బుట్టడు యాపిల్సు తెండి.. ఇప్పుడేం అర్జంటు కాదుగా.... హి...హి...హి..." అన్నాడు జోగారావు.

    "ఎద్దుల్లా ఉన్నారు.... పళ్ళు తేవాలని తెలీదు..." అని గొణుక్కుంటూ స్వీట్సు పాకెట్ విప్పతీయసాగాడు ఆ అబ్బాయి.

    "ఒరేయ్ చంటీ...నువ్వు లోపలికి వెళ్ళమ్మా..." అన్నాడు జోగారావు ఆ పిల్లవాడి తల నిమురుతూ "ఎద్దుల్లా ఉన్నారు... పళ్ళు తేలేదు... ఎద్దులు... ఎద్దులే..." గొణుక్కుంటూ లోపలికి వెళ్ళాడు చంటిగాడు.

    నా ప్రాణం తేలిక పడింది.

    "మీరేం అనుకోకండి... వాడంతే. ఎవ్వరిని కేర్ చెయ్యడు... పేద్ద విప్లవ వీరుడు అవుతాడు... హా... హా... హా..." జోగారావు పళ్ళమీద పిడికిలి బిగించి ఓ ఫైట్ ఇవ్వాలనిపించింది నాకా క్షణంలో.

    "సరేగానీ... మీరొచ్చిన పని చెప్పండి..."

    నేను వివరంగా చెప్పాను.

    ".... కాబట్టి మీరు మీ మంత్రిగారికి చెప్పి ఫిలిప్స్ కి ఫోన్ చేయించి మా ఆఫీసరు కొడుక్కి లోయర్ కె.జిలో సీటిప్పించాలి...." అన్నాడు చేతులు నలుపుకుంటూ.

    "అబ్బే... సెయింట్ డన్స్ స్కూలా?... లాభంలేదు. ఇది జరిగే పని కాదు-" అన్నాడు జోగారావు సోఫాలో వెనక్కి కూలబడుతూ.

    "ఏవండీ..." అన్నాను నేను నీరు కారిపోతూ.

    "ఆ ఫిలిప్స్ తమ్ముడు మా మినిష్టరు గారి చెల్లెల్ని లేవదీసుకెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు. ఆ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది.

    ఈ లేవదీసుకెళ్ళేవాళ్లు ఇతరుల ఇబ్బందుల్ని ఆలోచించరు కదా!... థూ...

    "ఏంటయ్యోయ్... నట్టింటో అలా ఉమ్ములు వేస్తున్నావ్..." అన్నాడు జోగారావు నా వంక కోపంగా చూస్తూ.

    "అబ్బే... పొరబాటైందండీ... ఏదో ఆలోచిస్తూ... మరి మరి నా సీటు..."

                                         

    "నేనింకేం చేయలేనబ్బాయ్... నువ్వేమీ అనుకోమాకు చంచల్రావు..." అంటూ సోఫాలోంచి లేచాడు మమ్మల్ని కూడా లేవమనే అర్థంతో.

    తప్పదన్నట్టు ఇద్దరం లేచి నిలబడ్డాం.

    "మన స్వీటు మనకిచ్చెయ్యమని అందాం..." అన్నారు ఉక్రోషంగా చంచల్రావు చెవిలో.

    'ఛస్ నోర్ ముయ్... బావుండదు... పద..." అని నా చెవిలోనే కసిరి నా రెక్కపట్టి బయటికి లాగుతూ "ఇంక ఉంటామండీ..." అన్నాడు జోగారావుతో.

    "మంచిది బాబూ... వెళ్ళిరండి..." లోపలి నుండి చంటిగాడు రివ్వున బయటికి వచ్చి "రేపు పళ్ళబుట్ట తెండి.... మర్చిపోకుండా...." అన్నాడు.

    "ఒకటి కాదు, రెండు తెస్తాం...." గావుకేక పెట్టాను నేను.

    చంచల్రావు రెక్కపట్టుకుని బయటికి లాక్కొచ్చేశాడు.

    మర్నాడు ఆఫీసులో ఆఫీసరుగారూ పట్టుకున్నాడు. "సీటు సంగతి ఏం చేశావ్?" అన్నాడు.

    "ప్రయత్నిస్తున్నా... హి హి..." అన్నాను ఏడవలేక నవ్వుతూ.

    "సాయంత్రం గదికి రా..." అంటూ చంచల్రావుకి ఫోన్ చేశాను. సాయంత్రం అయ్యింది. నేను గది తలుపులు తెరిచే ఉంచాను. చంచల్రావు వస్తే తలుపు చెక్కలూడేలా కొడతాడని.

    "హాలో.... ఏమిటోయ్ షేక్స్ పియర్ మొహం వేలడేశావ్?.... అన్నాడు చంచల్రావు గదిలోకి అడుగు పెడ్తునే.

    "నాకు కె.జి.కాస్లులో సీటు దొరికే వరకూ మొహం అలా వేలాడేసే ఉంటుంది. నిన్న నువ్వేదో ఎడ్యుకేషన్ మినిష్టరు పీయే అన్నావ్... సీటొస్తుందన్నాన్ స్వీట్సు క్షవరం చేశావు... రాత్రి నా మానాన నన్ను వదిలేసి వెళ్ళిపోయావు... నాకు మార్గం చూపించేదేమైనా ఉందా?...." అన్నాను వాడిని పట్టి కుదిపేస్తూ.

    "నాకు తెలుసు నువ్విలా అడుగుతావని అందుకే మరో ప్లాస్ సిద్దం చేసుకుని వచ్చాను..."

    "ఏమిటి... ఏమిటి... ఏమిటి... ఏమిటి???" కుతూహలం పట్టలేక పోయాను.

                                                 

     ఈవాళ్ల మా ఆఫీసులో ఎంక్వైరీ చేయగా తెలిసింది. నాతో పని చేసే ఒకతనికి మన చీఫ్ మినిష్టర్ పి.ఏ. చాలా క్లోస్ ఫ్రెండ్ని... అతని చేత మనకు హెల్ప్ చేయమని చీఫ్ మినిష్టర్ పి.ఏ.కి ఉత్తరం వ్రాయించుకున్నాను..."

    చెంచుగాడు మళ్ళీ ముద్దొచ్చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS