Previous Page Next Page 
విశిష్ట పేజి 46

    "మీ అమ్మ వట్టి వెర్రిబాగుల్దిరా! ఆమె మాటలు పట్టించుకోనక్కర లేదు."

                                            *    *    *

    రిజిస్ట్రారు ఆఫీసులో పృధ్వీ, విశిష్టల పెళ్ళి జరిగింది.

    విశిష్ట సంతకం పెట్టాక పృధ్వీ సంతకం పెట్టాడు.

    సంతకం పెట్టాక చూసింది పృధ్వీ ముఖంలోకి .

    బిగ్ సైజ్ నల్లకళ్ళద్దాలు అతడి ముఖంలో కొత్తగా ఏర్పడిన అందవికారాన్ని తమ వెనుక దాచుకొంటున్నాయి.

    అద్దాలు కవర్ చేయనిచోట కుడి బుగ్గమీద, ముక్కుమీద అమ్మవారి మచ్చల్లా నల్లని గుంటలున్నాయి.

    సాక్షి సంతకాలు కూడా పూర్తి అయ్యాక మాధవరావు ఆర్డరిచ్చి తయారుచేయించిన పెద్ద పెద్ద దండలు పరస్పరం మార్చుకున్నారు. ఎవరో యిచ్చిన పుష్పగుచ్చాలు పట్టుకొని కెమెరాలకు, వీడియోలకు పని కల్పించారు.

    మాధవరావు ఇంటి దగ్గర ఫంక్షన్! భారీగా ఏర్పాట్లు జరిగాయి.

    విందుకు ముందు విలేఖరులు చుట్టుముట్టారు మాధవరావునూ, నవవధూవరులను.

    ప్రశ్నలమీద ప్రశ్నలు గుప్పించి వాళ్ళను తికమకపెట్ట చూస్తున్నారు.

    "కొద్దిరోజుల క్రితం మీరు సి.ఎం. ప్రసంగిస్తున్న బహిరంగసభలో వేదిక ఎక్కి మీ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న పృధ్వీగారు సెక్సు వల్ హెరాస్ మెంట్ కి గురిచేశాడని, కాలేజీలో సతాయించడమే కాకుండా మిమ్మల్ని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్ లో రేప్ చేయబోయాడని, మీరు తెలివిగా అతడి ముఖం మీద ఏసిడ్ పోసి తప్పించుకు వచ్చానని చెప్పారు.

    దోషిని శిక్షించి మీకు న్యాయం కలుగజెయ్యమని కోరారు సి.ఎం. గారిని. ఆ తర్వాత పత్రికలకిచ్చిన ఇంటర్వ్యూలో సైతం అతడికి శిక్ష పడేవరకు పోరాటం ఆపేది లేదన్నారు.

    ఇప్పుడేమో ఆ దోషినే వివాహం చేసుకున్నారు ఎందుచేత? మీరు ఏదయినా ప్రలోభానికి లొంగిపోయారా? లేకపోతే ఎవరి బెదిరింపులకయినా లొంగిపోయారా?"

    "సి.ఎం. ఆ రోజు నాకు పూర్తి రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చారు. దోషులకు కఠినంగా శిక్షపడేలా చేస్తామన్నారు.. కాని.... ఆయన తన మాట నిలబెట్టుకోలేదు. ఆయన హామీ మాటలకే పరిమితమైంది. ఈ పరిస్థితిలో మాధవరావుగారు నన్ను తమ కోడలిగా చేసుకోడానికి ముందుకు వచ్చారు. మాబోటివాళ్ళకు న్యాయం దొరకని న్యాయస్థానాల్లో న్యాయంకోసం పోరాడటంకంటే పరిస్థితులకు తలవంచడమే మంచిదనిపించింది. నావల్ల గాయపడి, తను చేసిన పనికి మనస్థాపం చెందుతున్న పృధ్వీగారిని క్షమించడమే ఉదాత్తమనిపించింది.

     ఒక మగవాడు మోహావేశంతో పక్కమీదికి లాగిన ఆడదాన్ని చేసుకోటానికి ఏ మగాడూ ముందుకు రాడన్న నిజం నాకు తెలుసు. జీవితమంతా పెళ్ళి పెటాకులు లేకుండా, జనం అవహేళనలకు గురి అవుతూ బ్రతుకీడ్చడం అర్దంలేదనిపించింది.

    అందుకే మాధవరావుగారి ప్రపోజల్ ని అంగీకరించాను. ఇందులో ఎవరి బలవంతం, బెదిరింపులు లేవు. నా యిష్టపూర్తిగానే ఈ పెళ్ళి చేసుకున్నాను.

    మరో ముఖ్య విషయం మీకు చెప్పడం మరిచాను. ఇంతకుముందు కూడా అంటే కిడ్నాప్ సంఘటన జరగకముందు కూడా నన్ను వివాహం చేసుకుంటానన్నారు పృధ్వీగారు. అప్పుడాయన మీద సదభిప్రాయం లేని నేను ఆయన కోరికను తిరస్కరించాను. అప్పుడలా చేసివుండకపోతే ఈ కిడ్నాప్ సంఘటనా....... ఇదంతా జరిగేది కాదు........"

    "ఏయ్! నిన్ను నేను కిడ్నాప్ చేయలేదు. నువ్వే నీ యిష్టపూర్తిగా నా గెస్ట్ హౌస్ కి వస్తానని, కారు పంపమనీ చెప్పావు. ఆ రావడంలో అంత పెద్ద పథకం వేసుకుని వచ్చావని గ్రహించలేకపోయాను......." విశిష్ట మాటలకు అడ్డువచ్చి ఆగ్రహంగా అన్నాడు పృధ్వీ.

    "ఇప్పుడు కూడా ఏదయినా పథకంతోనే మీ జీవితంలో అడుగు పెట్టిందేమో ఆలోచించారా పృధ్వీగారూ.....?" ఒక గడుసు విలేఖరి అడిగాడు.

    "నిజంగా అలాంటి పథకం ఏదయినా వుంటే అది ఆమెకే బెడిసి కొడుతుంది. ఈసారి విజయం మాత్రం ఆమెది కాదు!" "పాము, ముంగిసల్లా పోట్లాడుకున్న మీరు, ఎంతో యుద్దం జరిగాక ఇప్పుడు చిత్రంగా భార్యాభర్తలు అయ్యారుకదా! మీది అన్యోన్య దాంపత్యమౌతుందంటారా? ఇదివరకులాగే పోట్లాడుకుంటూ వుంటారా?" ఒక లేడీ జర్నలిస్ట్ విశిష్టను అడిగింది చురుగ్గా.

    "ఏమో! ఇప్పుడే ఏం చెప్పగలం? అంతా రాసిపెట్టినట్టు జరుగుతుంది. లేకపోతే ఈయనతో నా వివాహం జరుగుతుందని నేను అనుకున్నానా?"

    "అలా విధి మీద తోసివెయ్యకండి మేడమ్! మీ మనసులో వున్న మాట చెప్పండి."

    "వైవాహిక జీవితంలో తొలి అడుగు వేసిన ఏ ఆడపిల్ల అయినా తన వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుందనే ఆశిస్తుంది."

    "అందరాడపిల్లల్లాంటిది కాదు మీ పెళ్ళి. మీ యిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేదికదా? ఇప్పుడు.......?"

    "ఎండుగడ్డి వేసినా భగ్గుమనదు. ఎందుకంటే మేం యిద్దరం పవిత్రమైన వివాహబంధంతో బంధింపబడ్డాం. ఈ బంధంలోని విశిష్టతవల్ల రెండు మనసులు ఏకమౌతాయనే ఆశిస్తున్నాను...." ప్రశాంతంగా చెప్పింది విశిష్ట.

    ఈసారి మాధవరావుగారిని పట్టుకున్నారు.

    "ఆమెవల్ల మీ పదవి పోయింది. పరువు పోయింది ఆమెనే మీ కోడలిగా చేసుకోవడంలో మీ ఉద్దేశ్యమేమిటో చెబుతారా?"     "ఆమెనే కోడలిగా చేసుకోవడం వల్ల పోయిన పరువు నిలుస్తుందని పించింది. మీకో నిజం తెలుసో తెలియదో.......మొదటి నుండీ మా పృధ్వీకి ఆమె అంటే యిష్టం. ఆ యిష్టంవల్లే ఆమె వెంటపడ్డాడు. ఆ యిష్టంవల్లే ఆమె వెంటపడ్డాడు. ఆ యిష్టంవల్లే ఆమెను వివాహమాడాలని అనుకున్నాడు.

    దురదృష్టవశాత్తూ వాడి ప్రపోజల్ ను ఆమె తిరస్కరించింది. ఆ తిరస్కారం ఎలాగయినా ఆమెను పొందితీరాలన్న పట్టుదలను ప్రేరేపించింది. విపరీత పరిణామాలకు దారి తీయించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS