నా రూపం మారిపోయింది. నేను నల్లబడ్డాను. నా మొగం చిక్కిపోయింది. నా జుట్టు ఊడిపోయి కోడిజుట్టులా అయింది. నా నుదురులో గీతాలు బ్రహ్మరాతలా కఠినమై, స్పష్టమై, చెరపరాని తీవ్రత తాల్చినవి కాబోలు!
నే నద్దం చూచుకోవడమే మానేశాను. నాకు బట్టలవిషయంలో శ్రద్ద సంపూర్ణంగా మాయమైపోయింది. ఏ దుస్తులు ధరించేవాణ్ణో, అవి మాసినవో, శుభ్రంగా ఉన్నాయో, లేవో అనే భావమేలేదు.
మా సుబ్బులు ''ఒరే బావా! అన్ని మంచి బట్టలున్నాయి, ఈ మాసిన బట్ట లెందుకు కట్టుకుంటావురా?'' అన్నాడు.
'' ఏ బట్టలైతే నేమిలేరా? ఇప్పుడు నే నందంగా కనబడకపోతే కొంపలు మునిగిపోలేదు!''
''ఏమిటో, నువ్వు తెలిసినవాడవూకావు. తెలియనివాడవూకావూ. '' తెలిసీ తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే? '' అని చెప్పినట్లు ఉంది నీ వ్యాపారం. నీకు నేనేం చెప్పగలను?? నీసంగతి చూచి, అత్తయ్య కుళ్ళిబోతోంది!''
'' సుబ్బులూ! మీరంతా నామీద ఎందుకు ఆపేక్షగా ఉంటున్నారో నాకర్ధం కావడంలేదు. నేను లోకానికి క్షయపురుగును. నేను పరమ చండాలాన్ని. నన్ను లోకమంతా కలిసి వెలేసి నిర్జనారణ్యానికి తోలివెయ్యాలి. నాకు చావనేది లేదు. ఇలా ఏదో మొండివాడిలా కఱ్ఱలా, మొద్దులా పురుగులా బ్రతికి నా అన్నవారినల్లా ఏడిపించి, ఏడిపించాక, ఎక్కడో పనికిమాలిన చావు నానొసట రాసివుంది. దానికి నువ్వు బెంగ పెట్టుకోవడ మెందుకు, అమ్మ కుళ్ళిపోవడ మెందుకు? ''
'' నీ ఉపన్యాసం పూర్తి అయితే అంతే చాలురా, నీ ఇష్టం సుమా! నువ్వు ఏ భగవంతుని దయవల్లనైనా మామూలు మనిషివైతే, తిరుపతివెళ్ళి నూరురూపాయలు అర్పించుకుంటాను.''
'' ఓ వెఱ్ఱికాయా! భగవంతు డెక్కడున్నాడురా? మనుష్యునిలోని నీరసత్వంవల్ల దేవుడున్నాడని, తమకు తెలియని, తమకు మించినవీ, వాడికి పేర్లు పెట్టి అర్ధంకాక తప్పుకుంటున్నారు. ఎవరా దేవుడు? ''
'' మనుష్యులలో పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ, తెలివైనవాళ్ళూ, తెలివితక్కువవాళ్ళూ అని తేడాలున్నాయంటావా? ''
'' ఆ !''
'' అలాగే మనుష్యులకు మించిన వ్యక్తులుండ వచ్చునంటావా? ''
'' అన్నీ ఉండవచ్చును, లేందే? ''
'' లేరని నీ కెల్లా తెలుసును? ''
'' ఉన్నారని నే కెల్లా తెలుసును? ''
'' ఉన్నారని అనేకమంది పెద్దలు చెప్పుతున్నారు.''
'' లేరనీ చెపుతున్నారు.''
'' మనం ఇంగ్లండు వెళ్ళలేదు; అయినా ఇంగ్లండు ఉందని మనం ఒప్పుకుంటున్నామా? ''
'' వంకాయలు ఈ రైలులో లేవు. అయినా వంకాయలనేవి ప్రపంచంలో ఉన్నాయని ఒప్పుకుంటున్నామా? ''
'' అల్లాగే ప్రపంచంలో కొందరు దేవతల్ని దర్శించారు. కొందరు దర్శించలేదు, దర్శించినవాళ్ళు దర్శించినట్లు చెప్పారు, దర్శింపని వాళ్ళు లేరని వాదించారు! ''
'' అంత చవకగా లేదు వాదన. లోకంలో వంకాయలున్నాయని ఎరగనప్పుడు వాదనేరాదు. కొందరు చూచారు, తిన్నారు. వానిని గూర్చి ఇతరులకు ఋజువు చేశారు. ఆ ఋజువుచేసే విధానం, జ్ఞానంకల ప్రతివాడూ ఒప్పుకునేది. కాబట్టి లోకం అంతా ఒప్పుకుంటుంది.''
'' అయితే మనం నమ్మదగిన పెద్దలు __రామక్రిష్ణ పరమహంస, వివేకానందుడు, రమణమూర్తి, అరవిందఘోష్ , మహాత్మాజీ మొదలైన వారు స్పష్టంగా దేవుడు ఉన్నాడనిన్నీ'' తమ కా అనుభవం కలిగిందనీ చెప్తారే. అంతకంటే ఋజువు ఏం కావాలి? ''
'' ఓయి పిట్టపిడుగా! ఆ పెద్దలు మంచివాళ్ళే! కాని వాళ్ళు ఓ విధమైన పిచ్చివాళ్ళు. పిచ్చివాళ్ళకు మనస్సులో అనేకమైన భావాలూ ఉదయిస్తూ వుంటాయి. అవన్నీ వాళ్ళకు నిజంగానే కనబడతాయి. అంతమాత్రంచేత దేవుడూ, దెయ్యమూ వుందని ఏల నమ్ముతాము?''
లాహోరు నుంచి సాయంకాలం బయలుదేరి తెల్లారేసరికి సక్కర్ (మనవాళ్ళు సుక్కూర్ అంటారు) చేరాము. సక్కర్ లో మూడు రోజులుందామనుకున్నాము. అక్కడ నా పశుత్వానికి తృప్తినిచ్చింది స్నానాలరేవు. సింధ్ లో ముసల్మానులు ఎక్కువ, హిందువులు తక్కువ. వీళ్ళకు పూర్వ పారశీక యవన పహ్లవాదుల సంపర్కం ఎక్కువ వుంటుంది. సింధ్ లో పరదాలేదు. కొద్దిమంది నవాబుల కుటుంబాలలో వుందేమో? సింధు స్త్రీలవి చంద్రబింబాలలాంటి గుండ్రటి మొహాలు. వాళ్ళు పైజామాలు ఉపయోగిస్తారు. కాశ్మీర్ పంజాబులలో సిల్వాల్ లాగు ఉపయోగిస్తారు, అవి వదులుగా వుంటాయి.
సుక్కూరులో సింధునదికి స్నానానికి పోయాము. అక్కడ ఆడవాళ్ళు ఎంత పెద్ద కుటుంబాల వాళ్ళయినా స్నానం చేసేటప్పుడు పైనున్న చొక్కాలన్నీ తెసేస్తారు. ఒక చిన్న తుండు కట్టుకొని నీళ్ళలోకి దిగుతారు. జవ్వనుల బంగారు వక్షోజాలు కాశ్మీర పూవులలాంటి చూచుకాయలతో నీళ్ళతో మేలమాడుతాయి. ఒక స్నానం కాగానే మెట్లమీదకు వచ్చి కూర్చొని, సబ్బుతోగాని, పిండితోగాని సిగ్గు లేకుండా ఒళ్ళంతా రుద్దుకుంటారు. ఆడవారికీ , మొగవారికీ ఘట్టాలు ఒక్కటే! స్నానమంతా అయి ఒళ్ళు మొగవారి ఎదుట సిగ్గు లేకుండా శుభ్రంగా తుడుచుకొని చొక్కా వేసుకొని, పైజమా తొడుక్కొని ఆపైన కండువా (దుప్పటా అంటారు) వేసుకుంటారు.
మూడు రోజులనుకున్న మకాము ఆరు రోజులయింది. రోజూ స్నానాల ఘట్టానికి ఉదయమే వెళ్ళి, పదింటికి, పదకొండింటికి ఇంటికి వచ్చేవాణ్ణి. మా సుబ్బులు ఆడవాళ్ళ ఆ దృశ్యాలు చుస్తే ఎవరైనా తంతారేమోనని భయపడ్డాడు. మా అమ్మ నానాటికి చిక్కిపోతోంది. ఓనాడు నన్ను '' నాన్నా! లక్నో, హరిద్వారం, హృషీకేశం చూద్దామురా? '' అన్నది.
మే రెండవ వారంలోనే సుక్కూరు నుంచి షికార్ పూర్, కరాచీ, క్వెట్టా చూడకుండానే చిన్న బండిమీద ఢిల్లీ, అక్కడనుంచి ఆగ్రా, ఆగ్రానుంచి కాన్పూరు, లక్నో చేరుకున్నాము. లక్నో అయోధ్యలు చూచి హరిద్వారం చేరుకున్నాము. ఎండలో మాడిపోయాము.
