గంటలతరబడి సుందరం శకుంతలకు పట్టిన ఈ దుస్థితిని గురించి తప్ప ఇంక దేన్నిగురించీ ఆలోచించలేకపోయినాడు. వచ్చే నెలలోనే ఎప్పుడో ఆ పిల్ల కాపరానికి వెళుతుందనికూడా ఇంటో జానకీ తనతల్లీ అనుకోవటం విన్నాడు. ఇంకేంకాపరానికి పోతుందీ? రేపో ఎల్లుండో జానకి కాపురానికి పోతుంది. పిల్లల్ని కంటుంది. చీరెలు కట్టుకుని, పూలూ, నగలూ పెట్టుకుని, పేరంటాలకూ, వాటికీ పోతూ ముత్తయిదువుగా వుంటుంది. జానకితోటిదే శకుంతల ఇవేమీ చెయ్యదు.
"అన్నట్టు శకుంతలకు జుట్టుతీసేసి కోరామల్లు కట్టి రాత్రిపూట అన్నంబందులు పిండి తినిపిస్తారు గామాలు" అనుకున్నాడు సుందరం గాభరాగా. వాడి రక్తమంతా ఒక్కసారి చల్లబడ్డట్టయింది. ఈ సందేహం ఎట్లా నివర్తిచేసుకోవటం? తల్లినడిగితే అందరికీ తెలిసిపోయి అందరూ తననుచూసి నవ్వుతారేమో.
"నాకేదో దివ్యదృష్టి ఉండివుంటుంది. శకుంతల మొహంలో ఎప్పుడూ__ నవ్వుతూన్నాకూడా__ ఏదో దైర్యం కనబడేది. ఆ పిల్లమొహం అట్లా దిగులుగా వుంటుందేమని అంటే అమ్మ, 'చాల్లే. ఆ పిల్లది చక్కని కళగల మొహం' అన్నది" అనుకున్నాడు సుందరం.
వాడి మనస్సు ఇంకా అనేక రకాల పోయింది. తన తండ్రి చచ్చిపోయినప్పుడు తల్లి ఏడవటం జ్ఞాపకంవచ్చి, శకుంతలకూడా అట్లాగే ఏడిచివుంటుందా? అని ఆశ్చర్యపడ్డాడు. ఈసారి శకుంతల కనిపిస్తే ఆమెను చూడటానికి తనకు భయంవేస్తుందనుకున్నాడు.
"ఈ పరీక్షలైన తరవాత నా బతుక్కూ నాగేశ్వరావు బతుక్కూ మధ్య ఎంత తేడా ఏర్పడుతుందో ఇకముందు జానకికీ శకుంతలకూ అంత తేడా వుంటుంది" అనుకున్నాడు సుందరం. శకుంతలతోపాటు నాగేశ్వరావు మీదకూడా వాడికి చాలా జాలికలిగింది. ఎందుకంటే తాను బియ్యే డిగ్రీ తెచ్చుకుని పెద్ద ఉద్యోగాలూ సంపాదిస్తే, పాపం నాగేశ్వరావు, ఇంతటితో చదువు కట్టిపెట్టి ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటాడు.
నేను అభిమానించేవాళ్ళెవరికీ అదృష్టం ఉండదు గామాలు. ఏం జాతకం నాది? అనుకున్నాడు సుందరం.
వ్యధపడటంలో కూడా ఆడదానికీ మగవాడికీ తేడా ఉంటుందిగద. శకుంతలకు ప్రాప్తించిన వైధవ్యం గురించి సుందరం లోపల కుమిలితే జానకీ, సీతమ్మగారూ కూడా ఈ విషయం రోజులతరబడి మాట్లాడుకుని తమ ఆవేదన ఉపశాంతి చేసుకున్నారు. వాళ్ళు తమతో తము మాట్లాడుకునే ప్రతి మాటా సుందరం వింటూనే ఉన్నాడుగాని విననట్టు నటించాడు. వాళ్ళకు నిజంగా మనస్సులో విచారంఉంటే ఏ సర్కసుగురించో, సినిమా గురించో మాట్లాడుకున్నట్టు అట్లా మాట్లాడుకుంటారా? దీనికితోడు వాళ్ళు ప్రకటించే భావాలూ, శకుంతలపై చూపే అభిమానమూ అమిత కృత్రిమంగా__అబద్దంగా కపటంగా కనిపించాయి.
"అయ్యో, పాపం ఆ పిల్లంటే నాకు మా జానకిని చూసినట్టే ఉండేదండోయ్. ఇద్దరూ ఎప్పుడూ విడవని జంటగా ఉండే వాళ్ళుకాదూ?" అన్నది సీతమ్మగారు భ్రమరాంబతో.
"నే నెరగనూ?" అన్నది భ్రమరాంబ.
ఆవిడ శ్లేషగా మాట్లాడిందేమోనని కూడా సుందరానికి అనుమానం తట్టింది.
తన తల్లి ఆవిడతో అంత అతిశయోక్తులాడకపోతే ఏమనుకున్నాడువాడు.
శకుంతల భర్తచావు వివరాలుకూడా సుందరానికి ఆడవాళ్ళ సంభాషణద్వారానే తెలియవచ్చాయి. శకుంతల రజస్వలా అయినప్పుడు కొద్దిపాటి శాంతి కావాలనుకున్నారు. శకుంతల భర్తకు శాంతుల్లోనూ, శాపనార్దాల్లోనూ నమ్మకంలేదు. గర్బాదానప్పీటలమీదే నూనెలో మొహాలు చూసుకుంటారు లెమ్మనుకున్నారు. కాని ఏదీ? అతనికి మామూలు జ్వరమే వచ్చింది మందులిస్తే ఎక్కువయింది. బరువుగా ఉందని టెలిగ్రామిస్తే నిన్నరాత్రే శకుంతలా, ఆమె తల్లిదండ్రులూ బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పటికే దాదాపు అంతా అయిపోయింది. వార్త ఇవాళ తెలిసింది. భార్యనూ, పిల్లనూ అక్కడే వొదిలేసి శకుంతల తండ్రి తిరిగి వచ్చాడు.
"దిక్కుమాలిన ఉద్యోగాలాయె మరి. అల్లుడు చచ్చినా శలవు పుచ్చుకోక తప్పదుగా?..... ఇం కేముందీ? ఇవాళో? రేపో వాళ్ళూ వస్తారు. దహనం ఉదయమే అయిపోయి ఉంటుంది. ఇంక వాళ్ళక్కడ ఉండి చేసేదిమాత్రమేముంది, నెత్తి బాదుకు ఏడవటం తప్ప. అదెట్లాగూ జన్మల్లా రాసిపెట్టి ఉన్నదేనాయె! హుఁ!" అన్నది సీతమ్మగారు.
"ఇక ఆ పిల్ల ఆ తల్లిదండ్రులకు రొమ్ములకుంపటే గాదుటండీ? ఇంకేమన్నా ఉన్నదా?" అన్నది భ్రమరాంబ.
తన తల్లి మాటలకన్నా భ్రమరాంబగారి మాటలే హృదయంలోంచి వస్తున్నట్టు తోచింది సుందరానికి.
సుందరం పైకి అనటానికి భయపడినమాట జానకి అనేసింది.
"అయితే, అమ్మా, శకుంతలకు జుట్టు తియ్యరుగా?" అన్నది జానకి.
"జుట్టొకటి తియ్యకపోతే ఏంతల్లీ? ఇంత విపత్తు ఆ బిడ్డకు మళ్ళీ జన్మలో కలగబోదుగదా!" అన్నది భ్రమరాంబ.
సుందరం హృదయంలో ఉన్న భారంతో సగం దించేసినట్టయింది. భ్రమరాంబకు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఆవిడ ఋణం తీరదని వాడు తన అంతరాత్మలో అనుకున్నాడు.
ఆ రాత్రి అన్నం తినేటప్పుడు సుందరం అకస్మాత్తుగా తలఎత్తి "అమ్మా, మొగుడు పోయిన వాళ్ళందరికీ జుట్టు తీస్తారు కదా, శకుంతలకు తియ్యరా?" అన్నాడు. వాడి గొంతులో తీస్తే బాగుండునన్న ద్వని పైవాళ్ళకు వినిపించింది.
"నీదంతా సోద్దెంరా, కాపరానిక్కూడా వెళ్ళని పిల్లకు జుట్టుతీయించి కూచో బెడతారా ఏం? పాపం, చిన్నపిల్ల! జానికి ఈడుదేగద__ ఖర్మ ఇట్లా కాలిందిగాని!" అన్నది సీతమ్మగారు.
జానకి పైకేమీ అనలేదుగాని, సుందరంకేసి ఒక్కసారి చూసి మళ్ళీ "ఏం మనిషి" అనుకున్నది.
* * * *
మర్నాడు పరీక్షకు చదువుదామని కూర్చున్నాడు సుందరం. చదువుమీద దృష్టి నిలవలేదు.
"ఎందుకీ చదువు? అంతా తెలిసినదే. ఆత్రం కొద్దీ చదవటమేగాని, ఇవాళ కొత్తగా తలకు పట్టించుకునేందుకేముంది? వెధవ చదువు, వెధవ జీవితం, రేపేం జరిగేదీ తెలీదు. అన్నీ తెలిసినట్టుగా ప్రయత్నాలు చేస్తాం" అనుకున్నాడు వాడు విరక్తిగా పుస్తకంమీదినుంచి ఆలోచన ఎటో పోసాగింది.
