అందరూ హాహాకారాలు చేశారు.
నాగేశ్వరావుతో ఇంటికి తిరిగివచ్చే సుందరానికి ఈ ప్రదర్శనం గురించి ఎట్లా మాట్లాడుకోవాలో కూడా సరీగా తెలియలేదు. ఇద్దరూ కలిసి చూసిన వింతనే ఒకరికొకరు పదేపదే చెప్పుకున్నారు.
"ఇంత విద్య వాళ్ళదగ్గిర ఉండికూడా కానీ, అర్ధణా ఇమ్మని పిల్లల్ని ఎట్లా బతిమాలారో! ఎట్లా దణ్ణాలు పెట్టారో!" అన్నాడు సుందరం.
"నాకే అటువంటి విద్య ఉంటేనా పదిహేనురూపాయలు టిక్కెట్టు పెట్టి ఏ నాటకంహలులోనో చూపించిఉందును" అన్నాడు నాగేశ్వరరావు.
* * * *
స్కూలు ఫైనలు పరీక్షలు దగ్గరపడ్డాయి. సుందరం ఇంటి దగ్గర చాలా కొద్దికాలమే గడుపుతున్నాడు. వాడూ నాగేశ్వరరావు కలసి ఏకదీక్షగా చదివేస్తున్నారు. నాగేశ్వరావు షార్ట్ హాండ్ వాడు గనుక లెక్ఖలూ, సైన్సుకూడా సుందరం ఒంటరిగా చదువుకోవలసిందే. అయినాకూడా సుందరం నాగేశ్వరావింటోనే చదవటానికి సిద్దపడ్డాడుగాని కృష్ణమూర్తితో చదవటానికి ఒప్పుకోలేదు. ఆ విషయం కృష్ణమూర్తి ఆటే బలవంతం చెయ్యలేదు కూడానూ.
ఒకరోజు శేషగిరి వచ్చాడు.
"ఎట్లాగో ఈ యేడుతో పిల్లవాడు మెట్టునపడ్డాడు. ఇక ముందెట్లాగో తెలియటంలేదు. వాడికేమో కాలేజికి వెళ్ళి చదవాలని ఉన్నది. కాలేజీచదువంటే మాటలా? పిల్ల పెళ్ళికి చేసిన అప్పుమీద ఏటా నూరురూపాయలు వడ్డీ పెరుగుతున్నది." అన్నది సీతమ్మగారు.
సీతమ్మగారి చిక్కులు శేషగిరికి సహజమైనవిగా కనిపించాయి. వాటిపట్ల ఆయనకు సానుభూతిలేకపోగా, వాటిని గురించి ఆలోచించే ఓర్పుకూడా లేదు. "ఆ పోనిస్తూ, వాడు చెప్పటానికేం? చదువుమాని ఏదన్నా ఉద్యోగం చూసుకోమను. లేదూ, ఇంటిపట్టున కూచుని ఉన్నపొలం చూసుకోమను. అసలే అంతంతమాత్రంగాఉంటే ఇంకా కాలేజి చదువెక్కడ చెప్పిస్తావు? కాకపోయినా ఎందుకొచ్చిన కాలేజీ చదువులు, ఏమిటో?" అన్నాడాయన.
'నీ జీవితం నువ్వు నిరర్ధకపరుచుకున్నావు. అందుచేత నీకు ఎవరి జీవితంగురించీ నిజమైన ఆసక్తిలేదు.' అని శేషగిరితో ఎవరన్నా అనిఉంటే ఆయన ఒప్పుకుని ఉండేవాడుకాడు. ఫై పెచ్చు ఆయనకు కోపంకూడా వచ్చిఉండేది. "దేశం కోసం త్యాగం చెయ్యటం తప్పా?" అని ఆయన ఎదురు ప్రశ్నించి ఉండేవాడు. అందుచేత ఆయన ప్రస్తుత పరిస్థితినిగాని మనస్థితినిగాని విమర్శించి లాభంలేదు. కాని వాటిని అర్ధం చేసుకోవాలంటే మాత్రం ఆయన తన జీవితాన్ని నిరర్దక పరుచుకున్నవాడి స్థితిలో ఉన్నాడన్నది గుర్తించితీరాలి.
'రోలు మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది' అనుకున్నది సీతమ్మగారు తనలో.
ఎవరితోనూ చెప్పుకుని లాభంలేని ఈ సమస్యగురించి ఆవిడకు చాలా బాధగా ఉన్నది. ముందు చదువు విషయమై ఉన్న చిక్కులు సుందరంతో మాట్లాడాలని ప్రయత్నించింది. వాడు చదువు మనటానికి ఎంతమత్రమూ ఒప్పలేదు. పైపెచ్చు చాలా బాధపడ్డాడు. కాస్త గింజుకున్నాడు కూడానూ. "పరీక్షలు పూర్తికావటం మటుకు దేనీకీ? ఇప్పుడే మానేస్తాను" అన్నాడు కళ్ళనీళ్ళ పర్యంతమై.
తన నోటితోనే "ఇక చదువు చాల్లే నాయనా. ఎక్కడన్నా నాలుగు రాళ్ళు తెచ్చుకునే దారిచూడు" అనవలసి రావటం సీతమ్మగారిక్కూడా కష్టంగానే ఉంది.
ఈ చదువువల్ల కొడుకు తనకు దూరమవుతున్న సంగతి కూడా ఆవిడకు తెలుసు. అయినా దాని క్కూడా సమాధానపడింది. తనకు మించిపోయి తనకే చెప్పగల స్థితిలోకి కొడుకు వస్తున్నాడు. గదా అని సంతోషించింది. కాని వాది చదువుకు డబ్బుచూపించే బాధ్యత తనమీద ఉన్నప్పుడు తన అసమర్ధత కొడుక్కు చెప్పుకోకుండా ఎట్లా?
"అయినా ఆ విషయమై ఇప్పట్నించీ మధనపడటం దేనికి? పరీక్ష అయిన తరువాత ఏదో చూడవచ్చు. ఈ వేసవికాలం వాడికిపెళ్ళిచేసేస్తే కాబోయే మామగా రేమన్నా..." అనుకున్నది సీతమ్మగారు.
౧౭
సుందరం స్కూలు ఫైనలు పరీక్షలకు కూచుంటున్నాడు. ఆయేడే పరీక్షాపత్రాలలో కొన్ని కొత్త మార్పులు వచ్చాయి. కొద్దిమంది విద్యార్ధులను ఇది కంగారుపెట్టింది గాని, సుందరానికి ఎట్టి ఇబ్బందీ కలగలేదు. పరీక్షలకు చదవటంలో సుందరం నోట్సు సహాయం తీసుకోవటంగాని, రాబోయే ప్రశ్నలు ఊహించటంగాని, సుగమమార్గాలు అవలంబించటంకాని చేసేవాడు కాడు. ప్రతి సబ్జెక్టూ సాంతం చదివేవాడు. ఏ ప్రశ్నవచ్చినా, తనకున్నంతలో తెలివితేటలు ఉపయోగించి, సమాధానం రాయడానికి సిద్దంగా ఉండేవాడు.
సుందరం లెక్కల పరీక్ష రాసివచ్చినరోజున ఇంటికి రాగానే జానకి, "విన్నావా? శకుంతల మొగుడు పోయాట్ట!" అన్నది.
"ఏ శకుంతల ?" అన్నాడు సుందరం ఏమీ ఆత్రంగానీ, విచారంగానీ, లేకుండానే.
"నా స్నేహితురాలు శకుంతలే, ఇంకెవరున్నారూ?" అన్నది జానకి. సుందరం మొహంలో మార్పేమీ లేకపోవటం చూసి జానకి, "ఏం మనిషి" అనుకున్నది.
శకుంతల కింతగతి పట్టినందుకు లోపల రాయిపెట్టినట్టున్న సుందరం తన చెల్లెలిని చూసి, "ఏం మనిషి?" అనుకున్నాడు. జానకి తన స్నేహితురాలిని గురించి కించిత్తయినా విచారిస్తున్నదని సుందరానికి నమ్మకం లేకపోయింది.
