అందరూ నిద్రపోతున్నారు. శకుంతల మొగుడు పోయినాడన్న సత్యం ఒకటే మేలుకుని నిశ్చలజ్యోతిలాగా వెలుగుతున్నది. రాత్రి పదకొండయింది.
తలవైపున స్టూలుమీద ఉన్న లాంతరుదీపం తగ్గించి పుస్తకం మూసేసి దిండుకిందపెట్టి గుండె మీద చేతులు ముడుచుకుని సుందరం కళ్ళు మూసుకుని వెల్లికిలా పడుకున్నాడు. ఇప్పుడు వాడి ఆలోచనలు తిన్నగా ఒక ధోరణికి రాసాగాయి.... ఎవరు చూశారు. శకుంతలకు వాళ్ళు వాళ్ళు మళ్ళీ పెళ్ళి చెయ్యొచ్చు. ఏం తప్పులేదు. మొగుళ్ళుపోయిన చిన్నపిల్లలంతా పెళ్ళి చేసుకోవాలిసిందే. అయితే ఎవరూ చేసుకోరు. భయం. ఎక్కడన్నా ధైర్యంగలవాళ్ళుంటే చేసుకుంటారు..... ఒకడికి పెళ్ళయినదాన్ని మళ్ళీ ఇంకోడు చేసుకోవాలంటే ఎట్లాగయినా కొంచెం సిగ్గుగానే ఉంటుంది. అందరికీ తెలుస్తుందాయే. వాళ్ళంతా ఏమీ అనకపోయినా లోపల అనుకుంటారుగా! వాళ్ళేమనుకుంటున్నారో మనకు తెలుసుగా!.... అదీగాక అటువంటి పెళ్ళిళ్ళు చిన్నతనంలో పెళ్ళిచేసుకునే కుర్రాళ్ళూ, చదువు కుంటున్నవాళ్ళూ చేసుకోరు, బాగా పెద్దయినవాళ్ళూ, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళూ, డబ్బున్నవాళ్ళూ చేసుకోవాలి. అన్నట్టు రెండో పెళ్ళివాళ్ళు చేసుకుంటే భలే బాగుంటుంది!....
ఎవరో రెండోపెళ్ళివాడు వచ్చి శకుంతలను తప్పక పెళ్ళి చేసుకుంటాడని క్షణంపాటు సుందరానికి గట్టినమ్మకం కలిగి అంతలోనే ఆలోచన మరోదారిలో పడ్డది.
ఒకసారి పెళ్ళి అయేటప్పటికి ఆడదానికి ఇంటిపేరు మారుతుందిగదా. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే రెండోసారి మారుతుంది. గామాలు... శకుంతల తన మొగుడు పోయినందుకు తప్పక ఏడిచి ఉంటుంది. అట్లా ఏడిచినమనిషి ఇంకోణ్ణి పెళ్ళిచేసుకోవటానికి ఒప్పుకుంటుందా? పోయిన మొగుడుకోసం? ఏడిచినసంగతి జ్ఞాపకం వుండదూ?.... ఇటువంటివి ఎందుకు జరగాలీ? హాయిగా మొగుడు పెళ్ళాలు ఒక్కసారేపోతే ఎంత బాగుండును, ఈ చిక్కులన్నీ లేకుండా!.....
మర్నాడు సుందరం నిద్రలేచేసరికి ఎనిమిదయింది. బయట ఎండ చూసేసరికి ఏదో గొప్ప తప్పిదంచేసినట్టు భావన కలిగింది వాడికి. సామాన్యంగా ఆరింటికల్లా లేచేవాడు. తాను పరీక్షకు అరగంట ఆలస్యంగావెళ్ళి పరీక్షాధికార్లు హాలులోకి రానివ్వటమంటే తాను పేపరు రాయటానికి లేకుండాపోయి పరీక్షతప్పి ఇంకో సంవత్సరం చదవవలసివస్తే ఎంత బాధపడవచ్చునో అంత బాధా కొద్దిక్షణాలపాటు, సుందరం పక్కమీదనుంచి అడావుడిగా లేస్తూ అనుభవించాడు. ఆదరాబాదరా మొహం కడుక్కుని, బావిదగ్గరకు వెళ్ళి గబగబా నాలుగు బొక్కెనల నీళ్ళుపోసుకుని, ముక్కులా నోటా అన్నం కొట్టుకుని స్కూలుకు చేరుకునే సరికి పరీక్ష కింకా అరగంట టైమున్నది. దాంతో పెద్ద ఆపద గడిచి పోయినంతగా మనస్సుకు భారం తగ్గిపోయింది. కాని ఇంకేదో భారం మనస్సుమీద వుండనే వున్నట్టు మనసు పూర్తిగా తేలికపడలేదు. ఆ భారం ఏమిటో సుందరం పరీక్షించి చూసుకోలేదు. ఎవరెవరు ఏయే ప్రశ్నలు వస్తాయనుకుంటున్నారో విన్నాడు. ఒక ప్రశ్న వస్తుందని ఒకరూ, చచ్చినారాదని ఇంకొకరూ, వస్తే రావచ్చునని మరొకరూ, ఎంత పందెం కడతావని వేరొకరూ శషభిషలు చెయ్యటం చూశాడు. కొందరు పుస్తకాలను తదేకధ్యానంతో చూస్తూ మధ్యమధ్య కళ్ళుమూసి , ఆ పుస్తకంలో తాము చూసింది. మనస్సులోకి దట్టిస్తూ పరీక్ష నెగ్గాలనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నారు. మరికొందరు తమకు పరీక్షను గురించిన చింతేలేనట్టు ఇంకేదో కబుర్లు చెప్పుకుంటున్నారు.
వీళ్ళంతా సుందరానికి వట్టి బుద్దిహీనులుగా కనబడ్డారు. నిజమైన మానవుడు పరీక్షనుగురించి విచారించకుండానే విచార సముద్రంలో మునిగివుండాలని సుందరానికి అనిపించింది. పరీక్షకు పొయ్యే విద్యార్ది పరీక్షగురించి ఎందుకు ఆదుర్దా పడగూడదో, ఇంకేకారణంచేత విచారసముద్రంలో మునిగి ఉండాలో వాడికి స్పష్టంగా తెలీదు.
సుందరం ఆరోజు పరీక్షలో ఏంరాశాడో ఎట్లా రాశాడో వాడి పేపరు దిద్ది పాసుమార్కులు వేసిన పెద్దమనిషికీ, భగవంతుడుకి మాత్రమే తెలుసు, మూడో వాడికి తెలీదు.
పరీక్ష పూర్తి అయి సుందరం ఇంటికి వెళ్ళేసరికి ఇంటో జానకిలేదు. సీతమ్మగారుకూడా లేదు. వాళ్ళిద్దరూ శకుంతలను చూడ వెళ్ళినట్టు పక్కభాగంలో అద్దెకున్నవాళ్ళు చెప్పారు. సుందరం ఒక నిట్టూర్పువిడిచి, వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చాక ఏమి భయంకరమైన విషయాలు చెబుతారో అని భయపడసాగాడు. కాని తీరావాళ్ళు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టినాక ఆ భయం నిరాధార మనిపించింది.
జానకి అన్నది, శకుంతల మామూలుగానే ఉన్నదట. తలకొచెం రేగిఉందిట. మొహాన బొట్టు లేదుట, అంతే, శకుంతల ఏడవలేదుట. వాళ్ళమ్మ మాత్రం ఎవరన్నా వచ్చినప్పుడల్లా చప్పుడు కాకుండా కంటతడి పెట్టుకుంటున్నదట. "మీ అన్నయ్య పరీక్షలు అయిపోయాయా?" అని శకుంతల జానకిని అడిగిందట కూడా! ఇద్దరూ గదిలో ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఏవేవో మాట్లాడారుట. తన మొగుడు చావటంగురించి అంతా చెప్పిందట.
"పైవాళ్ళు చేసే పరామర్శ చూస్తే ఒళ్ళు మండిపోతుంది" అన్నది జానకి." శకుంతలకు వెంట్రుకలుతీసి ముసుగు వెయ్యటానికి ఎవరో సిద్దంగా ఉన్నట్టు, ఇంకా రెండేళ్ళ దాకా జుట్టుంచుకో నివ్వండి; పాపం అంటారు! అది బతికినన్నాళ్ళూ 'రామాకృష్ణా' అంటూ బతకాలిట! ఎవరో ఆయన తత్వోపదేశం చేస్తాట్ట! ఆయనదగ్గర ఉపదేశమైతే తరిస్తుందట. చూస్తూ ఉండు, వాళ్ళనాన్న దానికి తప్పక మళ్ళా పెళ్ళిచేస్తాడు. ఏం చేసుకుంటే? చేసుకునేవాళ్ళే ఉండాలిగాని!" అన్నది జానకి.
* * * *
ఆవేసవిలో సుందరానికి రెండు సంబంధాలు వచ్చాయి. పిల్లవాడికి పెళ్ళి వెంటనే చెయ్యటమా, కొంతకాలం ఆగటమా అన్నవిషయం సీతమ్మగారు అడ్డమైనవాళ్ళందర్నీ సలహా అడిగింది.
"పదిహేనేళ్ళు నిండినవాడికి పెళ్ళికి తొందరనిగాదు, గాని వీడి చదువెట్టాగా అని నాకు పెద్దదిగులు పట్టుకుంది. కాలేజీ చదువంటే ఇంకోవూరు పోవలసిందే గదా? నేను కూడా వెళ్ళాలాయె. కాస్త డబ్బూ అదీ చూసి పెట్టాలన్నా, సమయానికి అందించాలన్నా మగదిక్కన్నది లేకపోయె. పెళ్ళిచేస్తే మామగారైనా కనిపెట్టి ఉంటాడేమోనని!" అన్నది సీతమ్మగారు. ఒకప్పుడావిడ పాపం, దేనికైనా శేషగిరిమీద ఆధారపడటాని కుండేది. ఇప్పుడాయన స్థితి ఏమీ బాగాలేదు.
