Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 46

    విశ్వమంతా మరింత శూన్యంతో నోరు తెరుచుకునేలా-ఈ పాత్రను చంపినా నెలరోజుల్లో ఆ పాత్ర ద్వారా__ఆ సృష్టి బ్రహ్మ చంపబడతాడు...

    అశ్రువు రాల్చిన అభ్యర్దనను కాలరాసిన క్షణాన_నా కురూపితనం విశ్వరూపం దాల్చి__దారుణంగా.... మరే రచయిత కలమైనా భయంతో ఇంకు ఇంకిపోయి.....యుగయుగాలు కుచించుకుపోయేలా- చంపబడతావు.

                                                                                                                                     నీ మౌనిక.....!!"

    ఆ లెటర్ చుట్టూరా....ఏవేవో హస్త భంగిమలు దించి వున్నాయి రకరకాలుగా__

    అమితేష్ చదవటం పూర్తిచేసి "విచిత్రంగా వుంది. ఇదెటు దారి తీస్తుందో గానీ ఈ హస్తభంగిమ లేమిటి?" అన్నాడు స్వగతంలా.

    "నా నవల్లో నాట్యం చేయాలన్న తృష్ణ అధికంగా వుంటుంది మౌనికకు. ఎప్పుడూ ఏకాంతంగా కూచుని అలాంటి తప్పుడు భంగిమలు పెడుతుందన్నట్టు వర్ణించాను. అదంతా నాట్య కళ పట్ల తృష్ణ వుండి__కురూపి తనంలోని మనోవ్యధను వర్ణించాను గానీ___ఇలా మరణయాతన పెడుతుందనుకోలేదు."

    "సీరియల్ గానీ ఆపుచెయ్యాలనుకుంటున్నావా?"

    "ఆపుచెయ్య దల్చుకోలేదిప్పుడే! మీకు ఆ అమ్మాయికీ సంబందించిన సరయిన ఆధారాలు దొరికి ఆచూకీ తెలిసేంత వరకూ సీరియల్ పెంచుతాను. ఒకవేళ ఆపేస్తే__పాఠకులంతా నా మీద, పత్రికాఫీసు మీద దాడి చేస్తారు ఈ స్థితిలో. ఎందుకంటే అంతటి సంచలనం సృష్టిస్తోందీ సీరియల్" అన్నాడు భార్గవ.

    వేణు కూడా ఉత్సాహంగా వింటున్నాడు.

    "సార్! కుడిచేతికి బొటన వేలే లేనప్పుడు ఆ అమ్మాయి ఎలా రాయగలుగుతుంది? ఈ రైటింగ్ తోనే మనకా అమ్మాయి దొరికిపోవాలి" అన్నాడు వేణు.

    "మిగతా నాలుగు వ్రేళ్ళతో కూడా ప్రయత్నిస్తే సాధ్యం కావచ్చు. అందుకే రైటింగ్ ఇంత అగ్లీగా వుందేమో" అన్నాడు అమితేష్.

    "బాగా చూడండి సార్! రాయాలనే చిక్కు చిక్కుగా రాసినట్టు లేదూ" అన్నాడు వేణు.

    "నాలుగు వేళ్ళతో వ్రాసినా ఇలానే వుండొచ్చు. ఏమైనా సరే__కొందరి చేతివ్రేలు కూడా మనం పరీక్షించాలి" అని అమితేష్ ఆ హస్త భంగిమలన్నీ నిశితంగా పరిశీలించాడు. అవి చూస్తుంటే ఆ ఉత్తరంలోని ఆమె మనోవేదనకు ప్రతిరూపాలుగానే కనిపిస్తున్నాయి తప్ప ఏ ఆధారమూ దొరకలేదు.

    "నాట్యం చేసేటప్పుడు పెట్టే భంగిమలు పెట్టరాక పెట్టేస్తుంది పిచ్చి పిచ్చిగా. ఇవేనేమో? కళా తృష్ణను చంపుకోలేక దించినట్టుంది" అన్నాడు భార్గవ దీర్ఘాలోచనగా.

    అన్యమనస్కంగా వుందతడి మనసు.

    ఒక వైపు ఆ నవల సంచలనం__మరోవైపు ఈ హెచ్చరిక మరింత సంచలనం.

    ఎందుకో అసంకల్పితంగా....అతడి ఒళ్ళు జలదరించి, ఆ ప్రకంపనాలకు ఓసారి మెడమీది వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

    అతని మనసు కీడు శంకిస్తోంది.

    వేణుని ఆ ఉత్తరం ఫైల్ చెయ్యమని చెప్పి, మళ్ళీ అమితేష్ ఆలో ఆలోచనల్లోపడి, కవర్ మీది పోస్టల్ ముద్ర గుర్తొచ్చినవాడై, చప్పున ఏదో లోచన వచ్చి, "భార్గవా! నేనంతా చూసుకుంటానులేరా! నువ్వెళ్ళు" అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడు మోటార్ బైక్ మీద.

    ....కానీ ఆ ఉత్తరాన్ని ఆదుర్దాతో కాకుండా-మరో అయిదు  నిముషాలు నిశితంగా చూసి సూక్ష్మంగా ఆలోచించక- ఒక మంచి ఆధారాన్ని తృటిలో కోల్పోయారు వాళ్ళు ముగ్గురూ.
   


                              *    *    *    *


    ఆ వీధిలో పోస్టాఫీసు ముందాగింది డిటెక్టివ్ అమితేష్ మోటార్ బైకు. అక్కడ ఎందరో బాధల గాధల్ని తన కడుపులో దాచుకున్న సహనశీలిళా వుంది పోస్ట్ డబ్బా. ఆ డబ్బా ప్రక్కనే కూచొని రోజూ లెటర్స్ వేయడానికి వచ్చిన వాళ్ళని పైసలడుక్కునే ముష్టి కుష్టువాడివేపు చూసాడు తర్వాత తిన్నగా పోస్ట్ మాస్టర్ దగ్గరికెళ్ళాడు. తనని తాను పరిచయం చేసుకున్నాక అసలు విషయం చెప్పాడు.

    'అలాగయితే మమ్మల్నేం సాయం చెయ్యమంటారు?" అన్నాడు పోస్ట్ మాస్టర్.

    "ఏం లేదు....నిన్న ప్రొద్దున్న టైంలో ఆ బాక్స్ లోని లెటర్స్ ఎవరు తీసారో పిలిపిస్తారా?" అన్నాడు.

    "జస్ట్ ఎ మినిట్...." అని ఒక పోస్ట్ మాన్ ని పిలిపించి అడిగాడు.

    "అవున్సార్! నేనే ఆ బాక్స్ విప్పాను" చెప్పాడు పోస్ట్ మాన్.

    "అప్పుడందులో ఎన్ని ఉత్తరాలున్నాయ్? ఐ మీన్ కార్డ్స్ ఎన్ని? ఇన్ లాండ్ లెటర్స్ ఎన్ని? ముఖ్యంగా కవర్స్ ఎన్ని?"

    "మార్నింగ్ కదా! తక్కువే పడ్డాయి. ఎన్నో గుర్తులేదు. దాదాపు అన్నీ కలిపి ముప్పయ్ వుండొచ్చు"

    "కవర్లెన్నుంటాయో అయిడియా వుందా?"

    "పోస్టల్ కవర్సా? స్టాంపులంటించిన కవర్సా సార్?" అడిగాడు పోస్ట్ మాన్.

    "మాకొచ్చింది పోస్టల్ కవరే."

    "చాలా తక్కువ సార్.....! బహుశా ఏడెనిమిది వున్నట్టున్నాయి సార్!"

    "థాంక్యూ!" అని చెప్పి పోస్టాఫీసు బయటికి వచ్చాడు. కుష్టువ్యాధి వాడి దగ్గరికొచ్చి అయిదు రూపాయలుంచాడు. వాడు ఆశ్చర్యంతో నోరు తెరిచి....అనుమానంగా చూసాడు ముందు. అమితేష్ వాడిముందు మోకాళ్ళ మీద కూచుని....

    "చూడు....నువ్వీ డబ్బా ప్రక్కన కూచున్నప్పట్నించి నిన్న ఎవరయినా అమ్మాయిలు లెబర్లేసిపోయారా? ఇందులో...." అన్నాడు.

    "బాగానే మంది ఏసిపోయిండ్రు బాబయ్యా." అన్నాడు వాడు కొద్దిగా భయపడుతూనే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS