దగ్గరలో కూర్చున్న ప్రయాణీకులంతా ఇద్దరి వైపూ చూడసాగారు ఆశ్చర్యంగా.
"ఎండమ్మోయ్! మర్యాద గిర్యాద అంటున్నావ్?" ఆశ్చర్యం నుండి కోలుకుంటూ అన్నాడు కండక్టర్.
"నే నేవరనుకున్నావ్?"
"నువ్వేవరయితే నాకేం?" మిసెస్ కైలాసం మాట పూర్తీ కాకుండానే అన్నాడు కండక్టర్ కూడా వాల్యూం పెంచుతూ.
"నేను తల్చుకుంటే రిపీ పాటికీ నీ ఉద్యోగం పీకించేయగల్ను . జాగ్రత్త ." రెచ్చిపోయి అంది మిసెస్ కైలాసం.
"నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను" అన్నాడు కండక్టరు .
"ఏం జరిగిందమ్మా?" పక్క సీటులో కూర్చొని వున్న ఓ వయస్సు మళ్ళిన పెద్దమనిషి ప్రశ్నించాడు.
"టికెట్ చేతిలో పెడుతూ కావాలనే అంటుకున్నాడు. గజెటెడ్ ఆఫీసర్ని, నాతోనే ఇలా ప్రవర్తించేవాడు పాపం చిన్న ఉద్యోగాలు చేసుకొనే మామూలు ఆడపిల్లలతో ఎలా ప్రవర్తిస్తాడో మీరే ఆలోచించండి !" తను గజెటెడ్ ఆఫీసరని బస్ వాళ్ళందరికీ తెలియజెప్పే అవకాశం లభించినందుకు అంత అవమానంలోనూ సంతృప్తి కలిగింది. కాని ఆమెకు లభించిన ఆ కాస్త ఆనందాన్ని కూడా ఈ పాపిష్టి లోకం ఎక్కువసేపు దక్కనివ్వలేదు.
"ఎవరు గజెటెడ్ అఫీసరో, ఎవరు కాదో వాళ్ళకెలా తెలుస్తుందమ్మా!" అన్నాడు మొదటి పెద్దమనిషి వచ్చే నవ్వును ఆపుకుంటూ . అయన చాలా పెద్ద ఉద్యోగమే చేసి ఆ మధ్యనే రిటైర్ అయ్యాడు.
"ఎద్దును - ఆబోతు ఎద్దును చెయ్యటానికి కాల్చి వాత వేస్తారు. అలాగే నాన్ గజెటెడ్, గజెటెడ్ కాగానే ముఖం మీద ఏదైనా ముద్రను వేసే పద్దతిని అమల్లో పెడితే బాగుంటుంది." అన్నాడు డబల్ ఎం.ఏ. చదివి ఎల్.డి గుమస్తా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు వళ్ళు మండి.
నలుగురూ ఘోల్లున నవ్వారు. మిసెస్ కైలాసం పని అర్ధ నగ్నంగా నడి బజారులో నిల్చున్నట్లయింది.
"లేకపోతే ఏంటమ్మా! మా అమ్మకున్న వయస్సుంది. నీ చెయ్యి నేను పట్టి లాగినట్లు మాట్లాడుతున్నావు ?" అన్నాడు ప్రయాణీకుల అండ చూసుకున్న కండక్టరు.
"షటప్!"
"జాగ్రత్త , మళ్ళీ అంటాను ."
ఆ వయస్సు మళ్ళిన ఆయనే మళ్ళీ కలుగజేసుకొని కండక్టర్ని మందలించాడు. కండక్టరు కిక్కురు మనకుండా టికెట్లు ఇష్యు చేసుకో సాగాడు.
మిసెస్ కైలసానికి తను కూర్చున్న బస్సే తనను మోసం చేసినట్లు అనిపించింది. జానకి ఆ బస్ లోనే వుందని గుర్తు రాగానే గుండెలోని మంటను ఎగతోసినట్లయింది. వద్దనుకుంటూనే జానకి వైపు చూసింది.
"నవ్వొస్తుందీ నవ్వు! పద ఆఫీసుకు నీ పని పడతాను!" అనుకొంది మిసెస్ కైలాసం బహుశా జానక్కి నవ్వు వస్తూ ఉంటుందని ఊహించుకొని . జానకి కొరకరాని కొయ్య. తను ఏం చెయ్యగలదు! భయపడేవాళ్ళను భయపెట్టగలం గాని జానకి లాటి వాళ్ళను ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు ? మిసెస్ కైలాసం ఆలోచనలో పడింది.
మొదటిరోజే కష్టాలతో ప్రారంభం అయిన మిసెస్ కైలాసం గజెటెడ్ ఉద్యోగం దిన దినగండంగా సాగుతోంది. ఆఫీసులో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా మిసెస్ కైలాసం వాళ్ళు తనను అడిపోసుకుంటున్నారనుకొనేది. ఇద్దరు ఎన్.జీ.ఓ లు ఒకచోట చేరితే ఆఫీసర్లనుఆడిపోసుకోవటం తప్పించి వాళ్ళకు మాట్లాడుకోవటానికి వేరే విషయాలు ఏమీ ఉండవని ఆమె గాడ నమ్మకం. ఆఫీసరమ్మకు , ఎప్పుడూ ఆఫీసులో వాళ్ళు మాట్లాడుకుంటూ వుంటారనీ , పని చెయ్యరనీ చెవిని ఇల్లు కట్టుకొని పోరి చివరకు ఓ ఆఫీసు ఆర్డరు "ఆఫీసులో ఎవరితో ఎవరూ మాట్లాడకూడదు" అని ఇష్యు చేయించింది. ఆ ఆర్డర్ను ఎంతవరకు పాటిస్తున్నారో తెలుసుకోవటానికి మిసెస్ కైలాసం ప్రతి అరగంటకూ ఓసారి ఆఫీసులోకి జోరబడుతుంది.
ఆమె ఆఫీసులో చేస్తున్న పనీ, చెయ్యవలసిన పనీ ఏమిటండీ అంటే -- ఆమె దృష్టిలో ఆమె ఈ చెత్త డెస్కు వర్క్ చెయ్యటానికి పుట్టలేదు. తప్పదు కాబట్టీ, అసలు ఆర్డరు పాసు చెయ్యవలసింది. తన పై ఆఫీసరు కాబట్టీ పైల్సులో ఓ సంతకం పారేసి పైకి నెట్టేస్తుంది. ఫ్యూను ఫైలు తెరిచి పట్టుకుంటే తను వెయ్యాల్సింది పెద్ద సంతకమో, చిన్న సంతకమో అడిగి ఓ సంతకం పారేస్తుంది. ఫెయిర్ కాపీ మీద పెట్టేది పెద్ద సంతకమని, ఆఫీసు కాపీ మీద పెట్టేది చిన్న సంతకమనీ అనుభవం మీద తెలుసుకుంది. అప్పటి నుంచి వెధవ ఫ్యూన్ గాణ్ణి అడగవలసిన అవసరం కూడా తీరిపోయింది.
మిసెస్ కైలాసం గజెటెడ్ అయిన మరునాటి నుంచి ఆఫీసుకు ఓ గంట ఆలస్యంగా వచ్చేది. ఓ గంట ముందే బయలుదేరి వెళ్ళిపోయేది. ఎన్.జీ.ఓ లతో పాటు బస్ లో ప్రయాణం చెయ్యటమే కాకుండా, కరెక్టుగా సమయానికి రావటం ఆమెకు తల కొట్టేసినట్లుండేది.
ఇలా ఉండగా ఒకనాడు ఏం జరిగిందీ అంటే ..... ఐదు గంటలకు శీలా, సరస్వతీ, రాజ్యం, జానకీ బస్ బస్టాండ్ కు వెళ్ళేప్పటికి మిసెస్ కైలాసం అక్కడ నిల్చొని ఉంది. వస్తున్న వాళ్ళను చూసి మిసెస్ కైలాసం అశాంతిగా కదలటం, మళ్ళీ అంతలోనే కర్రలా బిగుసుకొని నిల్చోవటం జానకి చురుకైన కళ్ళలో పడింది.
"ఎందుకో అంత బాధ! సుఖంగా బ్రతకలేక?" అనుకుంటూ మిసెస్ కైలాసం వైపు జాలిగా చూసింది జానకి.
అఫీసరుగార్ని పలకరించకపొతే బాగుండదని వినయంగా నమస్కరించింది, ఎప్పుడూ మంచి పేరుకోసం తాపత్రయపడుతూ వుండే రాజ్యం. ఆమెకు దగ్గరగా వెళ్ళి , నమస్కారానికి జవాబుగా ఓ చిరునవ్వును విసిరింది మిసెస్ కైలాసం.
"మీరు ఈ మధ్య బస్ స్టాండ్ లో కనిపించటం లేదు. ఆలస్యంగా వెళ్ళుతున్నారా?" ప్రశ్నించింది మాటకు ముందు ప్లీజింగ్ గా నవ్వే అలవాటు వున్న శీల.
"ఆలస్యంగా కాదు. ఓ గంట ముందే వెళ్ళిపోతున్నాను. అఫీసరమ్మగారి పర్మిషన్ తీసుకున్నాను." సగర్వంగా అంది మిసెస్ కైలాసం వంగి శీల ముఖం పెట్టి అదోలా నవ్వుతూ.
"రోజూ గంట ముందే వెళ్ళిపోతున్నారా? ఎందుకూ?" ఆశ్చర్యంగా అడిగింది జానకి. జానకి స్వరం వినగానే పాము పడగ తిప్పినట్లే తమాషాగా ముఖాన్ని జానకి వైపు తిప్పింది.
"ఎందుకేమిటి? ఐదయితే బస్సులు దొరకటం చాలా కష్టంగా వుంది. బస్ స్టాండులో గంటలకొద్దీ ఎన్.జీ.ఓ లతో పాటు "టీ" తాగుతూ , వేరుశనగపప్పులు తింటూ నేనెలా నిల్చోగలను?" ఈ దెబ్బతో జానకి అహంకారం చచ్చిందే అన్నట్లు విజయగర్వంగా చూసింది మిసెస్ కైలాసం.
