Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 46


                            సోములు చెప్పిన కథ
    
    సోములు వెనుక ఎప్పుడో పోగొట్టుకొన్నది గాక మిగిలిన
    దతనికి ఒక్కడే కన్ను (అయితే నేమి తళుకు మంటుంది.
    రెండో కన్ను లోపం నేను తీర్చుకుంటానన్నట్లు.) దానితోనే
    సోములు గొప్ప దొంగ చూపులు విసురుతుంటాడు.
    నలుగురు కూర్చొన్నప్పుడు డా కంటికి తీరికే లేదు. చూచిన
    విధంగా చూడకుండ దానితోనే తమాషా చూపులు చూస్తాడు.
    అతడి కన్ను మా చెడ్డదని లోకప్రసిద్ధి కూడాను.
    యధావిధంగా సోములు తనుబోలు పెద్దమనుష్యుల మధ్య కూర్చున్నాడు ఒక రోజున నోటికి, నోటిలాగే ఒకటైన కంటికి తెరిపిలేదు. ప్రసంగము స్త్రీ విషయకము. మహోత్సాహంతో మాట్లాడి వేస్తున్నాడు. ఒక మూల చుట్ట - చాల పొడుగాటిది -ఊదివేస్తూనే ఉన్నాడు. ఒకమూల రైంయిమని వాక్పరంపర కురిపిస్తున్నాడు. రెండు మూలలనుండి కన్ను కాంతులు జల్లుచున్నది.
    "స్త్రీల సంగతి అదో చిత్రం" అన్నాడు ఒక పెద్దవాడు. మురికి మొగం. చింపిరి జుట్టూ అతని వ్యక్తికి ఆనవాళ్ళు.
    "నిజం నిజం" అని ఒక చిన్నవాడు పలికినాడు. ఎవరేమన్నా ఒప్పుకోవడమే అతగాడి పని.
    ఈ వేదాంత గోష్టికి పిదప చిన్న నిశ్శబ్దము తరువాత సోములు ఆలోచనా పూర్వకంగా "ఆడవాళ్ళకంటే చిత్రమైనవి లేకపోలేదు -" అని పలికి చుట్ట పీల్చి పెద్ద పొగ వదలినాడు.
    "అయ్యా! మీకు పెళ్ళి అయిందా" అని మురికి మొగము భోగట్టా చేశాడు.
    "చెప్పలేనండి" అని వెంటనే సోములు జవాబిచ్చాడు. అందరూ నవ్వి విరగబడ్డారు చిన్నవాడు కూడా!
    "చూశారూ! మనుష్యుడి జీవితానికి "స్త్రీ" ఊతకర్ర వంటిది. మగాడి సుఖానికి ఆడదే కారణభూతం." అని ఎవరో ఎక్కడనుండో అన్నారు.
    చిన్నవాడు దీనిని తప్పకుండా వప్పుకొన్నాడు. "వాళ్ళతో మంచిగా వున్నంత సేపే." అని మరెవరో మరెక్కడనుండో అన్నారు.
    చిన్నవాడు దీనికీ "ఊ" అన్నాడు.
    "అదేమన్నమాట. నే నొప్పుకోను. ఆడదాన్ని దూషించే మనుష్యున్ని నాకు చూపించండి. వాడు మనుష్యుడే కాదని నిరూపిస్తాను." అని మొదటివారు కడువేడిగా కేకవేశారు.
    "ఓహో" బహుబాగుంది అని చిన్నవాడు మెచ్చుకొన్నాడు. రెండోవారు తమ మాట తెలియజేశారు. చిన్నవాడు "అందులోనూ నిజం లేకపోలేదు." అని పలికినాడు.
    అప్పుడు సోములు "చిన్నలూ, పెద్దలూ ఇలాగు వినండి. ఇప్పటి ప్రసంగం నాకు చిత్రమైన కథ జ్ఞాపకం తెస్తున్నది. మా తాత నాకెన్నోమార్లు చెప్పేవాడు. అందుచేత ఆడవాళ్ళకంటే చిత్రమైనవి లోకంలో లేకపోలేదన్నాను" అన్నాడు.
    "ఆ కథ నాకు వినాలని ఉంది."
    "నాకూ అదే ఉద్దేశం" అని చిన్నవాడు.
    "మీ కుతూహలానికి భంగము కలిగించడము నా ఉద్దేశము కాదు. కాని కథంతా విని 'మాకు నమ్మకం లేదు. అబద్దం, అని ఎవరైన అనబోయే వాళ్ళుంటే ఇప్పుడు యిక్కడనుండి సెలవు పుచ్చుకోవచ్చు." అని సోములు ఉపోద్ఘాతము మొదలుపెట్టారు. ఆ సమయంలో అతని ఏకాక్షి మరీ చిత్రముగా మెరిసింది. అందరూ నోరు మూసుకొని ఊరుకుంటామన్నారు. సోములుకి నమ్మకం లేక అందరిచేత ఓట్లు వేయించుకొని ఆ మీదట యీ విధంగా చెప్ప మొదలుపెట్టినాడు.
    "ఒక చలికాలపు సాయంకాలమున అయిదుగంటల ఆ ప్రాంతాలలో ఒకానొక పెద్దమనిషి ఒకానొక చిన్న బండి తోలుకుంటూ అలసిపోయిన గుర్రానికి ఆయాసము కల్గిస్తూ యెకాయెకిని ప్రయాణము చేస్తున్నట్లు ఆ క్షణంలో ఆ దారినిపోయే మరెవ్వరికైనా  (గ్రుడ్డివాళ్ళకి తప్ప) తప్పకుండా కనబడి వుండును. కాని ఆ సాయంకాలము ముఖ్యమూ మరీ చలిగా వుండడము వలన అటువంటి సమయంలో ఆ పెద్దమనిషికీ, అప్పుడు కురుస్తున్న వానకీ తప్ప మరెవ్వరికీ ఇవతల పని లేకపోవడము చేతనూ, ఇంకా నాకు తెలియని ఏవో కారణాల చేతనూ ఆ దారి అంతవరకు నిర్జనంగా ఉండెను. అందువల్ల ఆ పెద్దమనిషి, అతడెక్కిన చిన్నబండి, ఇద్దరినీ లాగుతున్న బుచ్చిగుర్రం నిరాఘాటంగా తమ రహస్యం తమకే ఉంచుకొని సాగిపోతున్నారు.
    "ఆ పెద్దమనిషి పేరు భీమశంకరం బండికీ, గుర్రానికీ వేరే నామకరణం లేదు మా తాత ఎప్పుడూ ఆ పెద్దమనిషినే స్మరిస్తూ వుండేవాడు. రెండక్షరాలు తగ్గినా తగ్గినట్టే అని శంకరం అని వ్యవహరించేవాడు. నా బుద్ధి ఉపయోగించి నేను కూడా శంఖమూ శంకూ అని అంటూ వుండేవాడిని కాని యిది అతడి పరోక్షాన లెండి. ఎందువల్లనంటే ఇప్పుడు చెప్పబోయేది జరిగి అప్పుడే అనేక దశాబ్దాలు గడిచినవి. మా తాతలాగే అతడూ మరోలోకానికి ప్రయాణం కట్టాడు. అందుచేత అతడి యెదుట నేనీలాగు అవడానికి వీలులేకపోయింది. కాని భయంచేత మాత్రం ఎంతమాత్రం కాదు.
    "సరే-శంకరం పనిమీద బయలుదేరాడండి. ఈ పని యేమిటో మా తాత చెప్పలేదు. మొత్తము మీద ఆ చలికాలపు సాయంత్రము దారికాని దారిబట్టి జారూ బురదా మెరకా పల్లమూ ఆనక, హోరుమని ముంచుకు వస్తున్న వానలో పాపం శంకరం బయలుదేరిన మాట నిజం! ఇన్ని చిక్కులు అన్నీ ఒక్కమారు కూడిన చోటుకంటే ఇంత శుష్కమైన లోకంలో సహా యింకే స్థలమైనా యింతకంటే బాగుండక పోదని నా మనవి కావలసి వస్తే మీరు మాటవరసకి అటువంటి పరిస్థితులలో పడి నా మాట లెంతమట్టుకు నిజమో సరిచూచుకోవచ్చును. లేక నా మాట మీద మీకు నమ్మకమే ఉంటే కిక్కురుమనక ఊరుకోవడం కూడా మంచిదే.
    "తీవ్రమైన గాలి వేసింది. అలాగూ, యిలాగూ కాక అడ్డుగా కొట్తున్న గాలివల్ల వర్షధార వంకరగా బడి పిల్లల కాపీ పుస్తకాలలో రూళ్ళరూపం పొందింది. మళ్ళీ ఒక్కమారు గాలి ఆగింది. పోనీగదా అని బండి బయలుదేరగానే పూర్వంకంటే జోరుగా కొట్తుంది. అటువంటి క్లిష్టపరిస్థితిలో శంకరం తోలుతుండే గుర్రం పంచభూతాలూ పెద్దమనిషి తరహాగా ప్రవర్తించనందుకు విసుగుకొంటున్న విధంగా, విసురుగా వెళ్ళ మొదలుపెట్టింది. ఇంతలో వెనుకటికంటే వెయ్యి రెట్లు బలంగా గాలి విసురుటచేత ఎగిరిపోకుండా వుండటానికి గాను గుర్రం నాలుగు కాళ్ళూ భూమిలో పాతిపెట్టి ఒక్కమారుగా ఆగింది. దేముడి దయవల్ల దాని కాలాంటి బుద్ది పుట్టడంవల్లగాని లేకపోతే 'గుర్రం తేలిక, బండీ తేలిక శంకరం నా ఉద్దేశంలో మరీ తేలిక అయిన కారణంచేత, ఈ ముగ్గురూ ఆ గాలికి దొర్లి దొర్లి భూలోకపు చివరకు పోయే వుందురు. అట్టి అవస్థే తటస్థించడమే అయితే ఆ గుర్రము కాని, బండికాని, శంకరము కాని మరెప్పటికీ ఏ పనికీ ఉపయోగించక పోవడమే జరిగివుండును.
    "సరి." గాలి ఆగింది. తోడనే గుర్రం సాగింది. ఆహాహా ఏమి గాలి! ఏమి వాన! అని శంకరం సకిలించాడు. గుర్రం కూడా తనకీ అలాగే తోస్తున్నదని ఒక సకిలింపుతో తెలియబరచింది. "మరి లాభం లేదు." ఆ నిర్జన ప్రదేశం దాటి ఎక్కడ మంచి ఇల్లు కనబడితే అక్కడ ఆగమని గుర్రాన్ని శంకరం చరచరా అతని మాటలు నిజంగా బోధపడడము చేతనో, లేక ఆ చలిలో నిలబడి చిక్కబడడముకంటే పరుగే మొదలుపెట్టితే కొంత వెచ్చగ వుంటుందని దానికి తోచడము చేతనో చెప్పలేను కాని మొత్తంమీద శంకరం మాటలు చెవిని బడగానే గుర్రం వాయువేగ మనోవేగాలని కథలలో చెప్పుకొన్నట్లు పరుగెత్తింది.
    ఆ విధంగా ఒక మైలో, మైలున్నరో (మా తాత చెప్పలేదు కాని) మొత్తానికి మైలుకి పైగా పాపమా గుర్రం పరుగెత్తగా బండీ శంకరం ఒక యింటి ముందు చేరినారు. ఆ యిల్లు తనకు స్వాగతమిస్తున్నట్లుగా శంకరం ఊహించుకొన్నాడు. లోపల కళకళలాడుతూ దీప మొకటి కనిపించింది. కళకళలాడుతూ కొందరు తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితులలో మొగమాటానికి అవకాశము లేదు. కాబట్టి శంకరం ఆనాటి కక్కడ ఆతిథ్యం పొందడానికి సిద్దపడ్డాడు. నిజానికి అతని కక్కడ ఆతిథ్యంలోపం జరగలేదని మీకే తెలుస్తుంది.
    ఇంటి యజమానురాలు కష్టసుఖాలు తెలిసిన మనిషి కాబట్టి శంకరానికీ, బండికీ, గుర్రానికీ నాడక్కడ నివాసం దొరికింది. "చాలా బాగుందిరా" అని శంకరం అనుకొన్నాడు. కాని బాగున్నది ఈ మాత్రమే కాదు. మేడమీద అతని కోసం మంచి గది చూపించారు. "ఇదీ బాగుంది" అనుకొన్నాడు శంకరం! కాని యింతకంటే బాగున్నవి వంటియింటి వాసనలు. శంకరం కాదు అతని ముక్కు ఈసారి తృప్తిపడింది. 'నిజంగా ఇవే బాగున్నవి అనుకొన్నాడు - శంకరం! కాని బాగున్నవి యింతటితో అంతము కాలేదు. దీపాలు వెలిగిస్తూ ఒక దాసి తనవేపు చక్కని రెండు కళ్ళల్లో నుండి చల్లని లెక్కలేనన్ని చూపులు పరగిస్తున్నది. అటువేపు చూడనట్లు చూస్తూ శంకరం "బాగున్నవాట్లో ఇది ప్రధానమైనది" అని నిశ్చయించుకొన్నాడు. కాని అతని హృదయంలో ఏ మూలనుండో 'అన్నిటికంటే బాగున్నది ఇంటి యజమానురాలే' అన్న ఘోష ధ్వనిస్తున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS