ఈ తరం యువకులకు యితర విషయాల మీద ఉన్నంత శ్రద్ద శరీర సౌష్టవాన్ని కాపాడు కోవటం మీద ఉండదు దుర్బలమయిన దేహాలు అర్భకమయిన ఆలోచనలతో చాలినంత శక్తి లేనివారుగా తయారవుతున్నారు.
అలాంటి సమయంలో అంతటి బలశాలి, కృత్రిమంగా పెంచుకున్న శరీరంకాక ప్రకృతిసహజంగా స్వేచ్చగా అమరిన అద్భుతమయిన అతని ఆకృతి పార్వతి గుండెల్ని పట్టిలాగుతోంది. కెప్టెన్ మాలతి అతన్ని బిడ్డలా లాలించింది.
భారీ శరీరంతో దుర్భలమయిన, నాజూకయిన ఆడపిల్లల మధ్య ఆడభీముడల్లే కన్పించే పార్వతి మాత్రం అతన్ని ఒడిలోకి తీసుకుని లాలించాలని కోరుకుంది. కాని తల్లిలా కాదు. ప్రియురాలుగా!
ఆలోచనల మధ్య కూరుకు పోయిన పార్వతి ఉలికిపడి చూచింది. డిస్కో డాన్స్ చూచేందుకు అందరూ బయలుదేరుతున్నారు. వారితో పాటుగా అర్ధ మానవుడుకూడా లేచాడు.
అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలన్న ఆశ తీర్చుకునే ప్రధమ ప్రయత్నంగా అతని దగ్గరగా వచ్చింది పార్వతి.
"హలో!" అంటూ పలకరించింది. నవ్వింది కళ్ళలోకి చూస్తూ.
"హా......ల్.....లూ" అన్నాయి అర్ధ మానవుడు.
"నమస్తే" అంది పార్వతి.
"నా.......మ్......స్........త్" అన్నాడతడు.
"డిస్కో ఎప్పుడూ చూడలేదు నువ్వు. అవునా?" అడిగిందామె.
'ఢిస్.......ఢిస్......ఢిస్" అన్నాడతడు. పార్వతికి అతని సగం సగం మాటలు భలేముచ్చట అన్పించినాయి. అంతే కాక ఎదుట వ్యక్తి ఏదిమాట్లాడితే అర్ధ మానవుడు అదే మాట్లాడాలని అతడు ప్రయత్నిస్తాడు. పసిపాపాయి మనస్తత్వం అతనిది. నిర్మలమయినది మందాకినిలా అతిపవిత్ర మయినది. పసిపాపలు అనుకరించటం ద్వారా తల్లిదండ్రుల నించి అనుభవాలను సంపాదించుకుంటారు.
అనుకరించటం ద్వారా అతడు సామాజిక చైత్యన్యానికి అలవాటుపడుతున్నాడని, అనుకరించటం ద్వారానే ఎదుటి వ్యక్తితో మైత్రీభావాన్ని ఆకాంక్షిస్తాడని అర్ధం కాగానే అతని మీద అభిమానం పెంచుకుంటున్న పార్వతి మనసులో ఒక చిలిపి ఆలోచన చోటు చేసుకుంది.
డిస్కోడాన్స్ చూచే ఆసక్తితో అప్పటికే అందరూ మెట్లు దిగివెళ్ళిపోయారు. అర్ధ మానవుడు అందరి కన్నా పై మెట్టు మీదున్నాయి. అతని వెనుక ఉంది పార్వతి.
ఆమె మనసులో ఎప్పుడయితే చిలిపి ఆలోచనలు చెల రేగినాయో వెంటనే అతని చేయి పట్టుకుంది పార్వతి. అతన్ని తన పెదవులతో స్పృశించాలని ఆమె ఆకాంక్ష. అలా చేస్తే అనుకరణ ద్వారా ప్రక్క వారినించి అనుభవాలను సంపాదించుకుంటున్న అర్ధ మానవుడు తనను ముద్దు పెట్టుకుంటాడని ఆమె ఆశ.
అయితే అతడు చాల ఎత్తరి. అందునించి కుర్చీ మీదో మోల్దా మీదో నిలబడితే కాని అతని చెంపలు ముద్దాడలేదు. తనకోసం అతడు సౌకర్యం కలిగిస్తూ వొంగడు.
అందునించి అతనిభుజం మీద పెదవులానించి గాఢంగా ముద్దు పెట్టుకుంది పార్వతి. అతని మీద తనకున్న ఆకాంక్షను ఆ ముద్దుతో అభివ్యక్తీకరించుకుంది.
అర్ధ మానవునిలో చైతన్యం పురివిప్పి నాట్యం చేసింది. ముద్దు అనేది మాటలకందని భాష. ప్రేమిపొంగారి నప్పుడు ముక్కులతో గోరాడు కుంటాయిపక్షులు. తనువు లానించుకుని ముట్టెలు కలుపు కుంటాయి పశువులు.
ప్రాణమున్న వాటన్నింటికీ అర్ధమయే భాష ముద్దు ఒక్కటే! అందువల్ల పార్వతి చేసిన పని అతన్ని జాగృతం చేసింది.
అయితే ఆమె ఆశించిన విధంగా అతడు తిరిగి ఆమెను అనుకరించలేదు. తన బాహువుల్లో బంధించి బలాన్ని ప్రయోగించి ఉక్కిరి బిక్కిరి చేయలేదు. పార్వతి అతనినించి ఆశించిన దాన్ని అందించలేదు.
బలిష్టమయిన తన బాహువుల్ని బిగించి పట్టుకున్న ఆమెను విదిలించుకుని పరుగు తీశాడు అతడు. మాలతి స్నేహితురాళ్ళ మధ్యలో జోక్స్ వేసుకుంటూ నడుస్తోంది.
అర్ధ మానవుడు ఆమెను చేయిపట్టి నిలువరించాడు. పార్వతి వంక చేయెత్తి చూపించాడు. కెప్టెన్ మాలతి భుజం మీద ముద్దు పెట్టి "ఆ......ఆ......క్......"అంటూ పార్వతి వంక చేయెత్తి చూపటం ప్రారంభించాడు. తల్లికి మాటలు రాని బిడ్డ మరొకరి మీద నేరారోపణ చేసినట్లుగా ఉంది అతని ప్రవర్తన! అతని చేష్టలకు మిగిలిన వారంతా నిశ్చేష్టులయినారు. వారందరికీ ముందు భాగాన నడుస్తున్న మధు, ఫిజోలు కూడా నిలిచిపోయినారు.
వారికీ అతని చేష్టలు అర్ధం కాలేదు.
కాని కెప్టెన్ మాలతికి విషయమేమిటో అర్ధమయింది. తల వొంచుకోవటం ద్వారా చేసిన నేరాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తున్న పార్వతి వారి మధ్యకు వచ్చింది.
"దొంగా! ఈ అమాయకునికి మాటలు రావని మోసం చేస్తావా? నువ్వు చేసిందేమిటో నాకు అర్ధమయిందిలే!" అన్నది మాలతి పార్వతి మరింత సిగ్గుపడింది.
భుజం మీద వేలు పెట్టి చూపుతూ, పార్వతిని గుర్రున చూస్తూ "ఆ......ఆ......క్" అంటున్నాడు అర్ధ మానవుడు.
"ఆ ముచ్చట తీర్చుకుందుకు అభంశుభం తెలియని ఈ మనిషే దొరికాడా నీకు" అంది మాలతి నవ్వుతూ.
పార్వతి కూడా ఎలాగా దొంగతనం బయట పడింది కాబట్టి యిక ధైర్యం తెచ్చుకుని నవ్వింది.
"అతనికి నా మీద కోపం ఎందుకు స్నేహంగా ఉండమని చెప్పు ప్లీజ్' అంది అర్ధంపుగా మిత్రమండలిలో అందరూ నవ్వటం ప్ర్రారంభించారు.
"భగవంతుడు దీనికి భారీశరీరం యిచ్చాడు కాని బుర్రపెట్టటం మర్చిపోయుంటాడే!" అంది ఒక స్నేహితురాలు. అందరూ విరగబడి నవ్వటం ప్ర్రారంభించాడు.
