ఆయనకు అలా చెప్తేకాని అర్ధం కాకపోవటం మల్లమ్మకు విచారం కలిగింది. కేవలం పౌరుషాన్ని, పరాక్రమాన్ని పాలించాలని కోరుకుంటున్న యీ ప్రభువులకు ధర్మబుద్ధి ఒక బలహీనత ఆ బలహీనత పరాసువాళ్ళకి ఆంగ్లేయులకి లేదు. కాబట్టి వీళ్ళు మారకుండా యిలాగే వుంటే వాళ్ళ చేతుల్లో పిండి పిండి అవటం. ఖాయం అనుకుంటే ఆమెకు దిగులయింది.
యినుగంటి నరసారాయుడు మరికొందరు పెద్దల్ని వెంటపెట్టుకుని మల్లమ్మను పెళ్ళిపీటలమీదికి ఆహ్వానించేందుకు వచ్చాడు.
అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది. కమలక్క వచ్చి మల్లమ్మను లోపలగదుల్లోకి తీసుకుపోయింది.
"నీ మేధస్సుకు తోడు మన మహారాణి ఆలోచనలు తోడు అయితే యిహ యీ బొబ్బిలివంక వీరభద్రుడుకూడా కన్నెత్తి చూడలేదు." అంటూ ప్రశంసించాడు పాపారాయుడు. నరసారాయుడు సగర్వంగా నవ్వాడు.
"అవును ఆమె ఆలోచనలు కళింగరాజ్యాలకు కంచుకోటలు" అన్నాడు.
పెళ్ళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
మల్లమ్మకు వొళ్ళంతా వెన్నరాచి పసుపుముద్దలతో నలుగుపెట్టారు. పసుపు రాచిన ముఖంతో కనకదుర్గాలా కాస్సేపు చెలికత్తెల కోడిగాలకు నవ్వుయు తెల్లని ముఖంతో పాలసముద్రంనించి ప్రభవించిన లక్ష్మీదేవిలా కాస్సేపు, మొలనూలుకు పతకా బిగించి కత్తి అమర్చుకుంటూ వుంటే రాణి రుద్రమ్మలా కాస్సేపు, వేదస్వరంతో సంస్కృత ప్రార్ధనా శ్లోకాలు చదువుతూ సరస్వతీదేవిలా కాస్సేపు కన్పించింది చుట్టూ వున్నవారికి.
మంత్రముగ్ధులైపోయి ఆమె ప్రతి కదలికనీ ఆపేక్షతో, ఆత్మీయతతో అలాగే కళ్ళప్పగించి చూస్తున్నారు చుట్టూ వున్నవాళ్ళు.
అలంకారం అయ్యాక ఆమె పెళ్ళి పీటలమీదికి నడిచింది. జగ్గమాంబ ప్రతిఒక్కరినీ పలకరించి కోడిగం ఆడి, కవ్వించి నవ్విస్తోంది.
పెళ్ళితంతు యధాక్రమంగా పూర్తి అయింది. అప్పగింతలు అయినాయి. వెంకమాంబ, రామరాయుడు కన్నీరు పెట్టుకున్నారు రక్తం పంచి యిచ్చి, పెంచి విద్యాబుద్ధులు చెప్పించి, ప్రాణంలో ప్రాణం అనుకున్న కూతురు పరాయిది అయిపోయింది. యికనించీ ఆమె రాజ్యం, ఆమె రాణీతనం, ఆమె తల్లితనం అన్నీ క్రమంగా ఆమెని తమనించి దూరంగా తీసుకుపోతాయి. రక్తబంధం రవ్వంత కట్టడి చేసినా మళ్ళీ కంటిచూపు ఎన్నాళ్ళకో! తల్లి మనసుకి గాయం అయింది. తండ్రి తన సహజ గాంభీర్యం చాటున దుఃఖంలో దాగుడుమూతలు ఆడుకుంటున్నాడు. జగ్గమాంబ గొల్లున యేడ్చింది, అక్కని కావిలించుకుంది.
పాడ్యమినాడు తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. అయిదు రోజుల పెళ్ళిరోజు సందడి సృష్టించి అలసిపోయింది జగ్గమాంబ పౌర్ణమినాటి రాత్రి పెందలాడే తిని పడుకుంది. కాస్తంత ప్రొద్దుపోయాక మెలుకువ వచ్చింది గదిలో అవుతున్న అలికిడికి. కళ్ళు విప్పి చూచింది జగ్గమాంబ.
అక్కని అలంకరించుతున్నారు ఆ అలంకారాలలో అక్కమోహినిలా వుంది. తల వొంచుకుని యేదో ఆలోచించుకుంటోంది. యంత్రవతుగా యెవరిపని వాళ్ళు చేస్తున్నారు. కొందరు కాళ్ళకు పారాణి దిద్దుతున్నారు. ఒకామె తలకట్టుకు మెరుగులు దిద్దుతోంది.
ఒకామె రక రకాల అడవిపూలు వండి తయారుచేసిన నూనెను మల్లమ్మదేవికి రాస్తోంది కమలక్క రత్నాలు పొదిగిన బంగారుగాజులు అక్క చేతికి తొడుగుతోంది. అందరూ ముసి ముసిగా నవ్వులు నవ్వుకుంటున్నారు.
ఏదో తంతు నడుస్తోంది. అమ్మ పెందరాడే తిని పడుకోమని తనని తొందరపెట్టింది యిందుకా? తనకు తెలియకుండా నడుస్తున్న యీ తంతు అంతా దేనికోసమో! అని నిద్రకళ్ళతో ఆలోచిస్తోంది జగ్గమాంబ.
అలంకారం పూర్తి అయింది. ఒక పరిచారిక యెంతో వుత్సాహంతో వచ్చి కమలక్క చెవిలో యేదో రహస్యంగా చెప్పి వెళ్ళింది.
"మహారాణీగారూ! మీరింక లేవాలి" అంటూ చేయి అందించింది కమలక్క. ఆ చేయిని అందిపుచ్చుకుని యెంతో భారంగా విరగపూచినా పొన్నచెట్టులా, కళ కళలాడే కడిమివృక్షంతో, గుబురుల్లో కోయిలల్ని దాచుకుని వసంతలక్ష్మికి స్వాగతగీతాలు పాడే రసాలవృక్షంలా లేచింది మల్లమ్మ.
ఆమె నడుస్తోంది.
గల గల సెలయేరు ప్రవహించినట్లు, దివినుండి భువికి వెన్నెల కిరణాలు దిగి వచ్చినట్లు; పాలపుంతలో వెలుగుదారాలు నడిచినట్లు, వంశధార ప్రవహించినట్లుగా నడుస్తోంది మల్లమ్మ.
అటువంటి సమయంలో యెవరి నోరు మూతపడుతుంది. యెవరో ఒక కోడిగం విసిరారు. మల్లమ్మదేవి, మహారాణి మల్లమ్మ, గోపాలకృష్ణ రంగారావుతో తన తొలిరాత్రి పంచుకుంటానికి పోతున్న మల్లమ్మ, ఒళ్లంతా అందమూ, ఆడతనమూ నిండారిన మల్లమ్మ నవ్వింది.
ఆ నవ్వులో మల్లెలున్నాయి. వెన్నెల లున్నాయి. కలలున్నాయి కోరికలున్నాయి. తీయదనం వుంది. మకరందాన్ని మధుపాలకు పంచి యిచ్చే పూవులా పారవశ్యం వుంది. యీ భూమిమీద వున్న ఆనందమంతా వుంది.
ఇటువంటి దృశ్యాన్ని చూస్తూ యిహ పడుకోలేకపోయింది జగ్గమాంబ. చివాలున లేచి ప్రక్కనే కూర్చున్న తల్లిని అడిగింది.
"అమ్మా, యెక్కడికే అక్కయ్య పోతోంది?"
"నువ్వు నోరుమూసుకు పడుకో" అని తల్లి జవాబు కసురుకున్న మరుక్షణమే కూతురు తలమీద చేయివేసి నిమిరింది.
పెద్దకూతురు పరాయిది అయిపోయింది. యీ చిన్నకూతురే యిప్పటికి తనది. రేపు పెళ్ళి అయితే యిదిమాత్రం పోదూ! అనుకుని పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది తల్లి.
