Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 46


    "ఇదుగో చూడండీ! మా వెంకటపతి వుండే ఇల్లెక్కడండీ?" అడిగాడు. ఆ పని అర్ధగంటముందే చూస్తే ఈ తిప్పట తప్పివుండేదిగా అనుకున్నాడు.
    "ఏ వెంకటపతీ?" ఆ పెద్దమనిషి ఆగి, సాంబయ్య దగ్గరకు వచ్చి అడిగాడు.
    "ఊరుబోయిన వెంకటపతి. మా అసలు ఇంటిపేరు చెప్తే మా ఊళ్ళో వాళ్ళకే తెలియదు. ఊరుబోయిన వారంటేనే తెలుస్తుంది." వివరించసాగాడు సాంబయ్య.
    "ఏం చేస్తుంటాడూ?"
    "వ్యవసాయమే!" అనాలోచితంగా చెప్పాడు సాంబయ్య.
    "ఇక్కడ వ్యవసాయం చేసే వెంకటపతి ఎవరండీ?" దీర్ఘం తీస్తూ అన్నాడు ఆ పెద్దమనిషి.
    "నా కుమారుడే!"
    "నీ కుమారుడే లేవయ్యా! అసలు అలాంటి మనిషి ఈ వీధిలో ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను."
    ఈ లోపల మరో ఇద్దరు ఆగి విచారించారు.
    "ఇక్కడేం పని చేస్తుంటాడన్నారు మీ అబ్బాయి?" మళ్ళీ మొదటి పెద్దమనిషే అడిగాడు.
    "ఇక్కడ ఏం చేస్తుంటాడూ? భార్య కాన్పుకోసం వచ్చి వున్నాడు." సాంబయ్యకు మాటలు అతికష్టం మీద వచ్చాయి.
    ఆ పెద్దమనిషి పెదవి విరిచి "నాకు తెలియదండీ!" అన్నాడు.
    అక్కడ చేరిన వాళ్ళలో ఒక యువకుడు ముందుకువచ్చి "ఇల్లు అడ్రసు వుందా?" అని అడిగాడు.
    "గుర్తులు తెలుసు" అన్నాడు సాంబయ్య.
    "ఎక్కడని చెప్పారూ?"
    సాంబయ్య గుర్తులు చెప్పాడు.
    "మీరు చెప్పిన గుర్తుల ప్రకారం అయితే, అదుగో - ఆ బజారు అవతల బజారు వుంది చూడండి! ఆ వీధిలో వుండొచ్చు మేముండేది ఆ వీధిలోనే. పేరేమన్నారూ?"
    "వెంకటపతి!"
    "వెంకటపతా? ఆ పేరున్న వారెవరూ మా వీధిలో లేరే!"
    సాంబయ్య దిగాలుపడిపోయి చూశాడు. ముందుకు వెళ్ళబోతున్న ఆ కుర్రాడు క్షణం ఆగి "మీరు చెప్పిన ఇంట్లో వరూధిని అనే ఆమె ఉంటుంది మరి!" అన్నాడు.
    "ఆఁ! ఆ అమ్మాయి మా కోడలే!" సాంబయ్య సంతోషంగా అన్నాడు.
    "అలా చెప్పావు కాదేమయ్యా? వరూథనమ్మ ఇల్లంటే ఈ పేటలో ఎవరైనా చెప్తారు. వెంకటపతి- చలపతి- అంటే ఎవరికి తెలుస్తుందయ్యా?" అన్నాడు మొదటి పెద్దమనిషి, సాంబయ్యమీద నిందారోపణ చేస్తున్న ధోరణిలో మిగతా ఇద్దరు తమాషాగా నవ్వుకున్నాడు.
    సాంబయ్యకు తల కొట్టేసినట్టయింది. మొగుడిపేరు చెబితే ఇంటిపక్కవాళ్ళకు కూడా తెలియదా? పెళ్ళాం పేరు చెబితే పేటంతా తెలుసా? ఏం బతుకు? వాడి బతుకు తగలెయ్య! తన తలకోసి మురుక్కాలవలో పడేసినా ఇంత అవమానంగా ఉండేది కాదు. 'వ...రూ....థి...ని' ఆ కుర్రవాడి వెంట వెళ్ళుతూ అనుకున్నాడు సాంబయ్య కసిగా!
    "ఇదేఇల్లు!" కుర్రాడు సాంబయ్యను ఓ ఇంటి,ముందు వదిలేసి వెళ్ళిపోయాడు.
    సాంబయ్య తలెత్తి చూశాడు. ఎత్తయిన వీధి గుమ్మాలు. వెనక పెద్దమేడ. ఇంటి ముందుకు వచ్చిన రిక్షాలు వచ్చినట్టే వున్నాయి. ఉన్న కుటుంబాలలోని మనుషుల్లాగే వున్నారు. ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగినాయన మల్లెపూవులాంటి తెల్లటి బట్టలు వేసుకొని విలాసంగా లోపలకు వెళ్ళాడు. సాంబయ్య ఎత్తుగా వున్న వీధిగుమ్మం మెట్లెక్కి లోపలికి చూసి నివ్వెరపోయాడు. ఇదేదో పెళ్ళి ఇల్లులా వుంది ఇల్లంతా అలంకరించబడి వుంది. జనం కిటకిటలాడి పోతున్నారు. పట్టుచీరెలూ, సిల్కు పంచెలూ, గజిబిజిగా సాంబయ్య కళ్ళముందు తిరిగిపోతున్నాయి. తను పొరపాటు పడ్డాడు. ఇదేదో గొప్పవాళ్ళింట్లో జరిగే పెళ్ళిలా వుంది. ఇది వెంకటపతి వుండే చోటుకాదు. వరూధిని ఇల్లే కావచ్చు కాని వెంకటపతి పెళ్ళాం వరూధిని ఉండే ఇల్లు కాదు.
    సాంబయ్యకు తల తిరిగిపోతోంది. కళ్ళు మసకలు కమ్మినయ్. గుమ్మం పట్టుకొని, లోపలకు వెళ్ళలేకా, కిందకు దిగలేకా నిలబడిపోయాడు.
    "మామయ్యా! లోపలకు రండి!"
    మసక చీకట్లోనుంచి వెలుగులోనికి వచ్చినట్టయి సాంబయ్య తలెత్తి చూశాడు.
    "లోపలకు రండి మామయ్యా! ఇదే మన ఇల్లు!"
    ఈ అమ్మాయి తన కోడలా? ఎంత మారిపోయింది? దేవలోకంలో నుంచి దిగివచ్చిన దేవకన్యగానో, నాగలోకంనుంచి యెక్కివచ్చిన నాగకన్యగానో కన్పించింది వరూధిని సాంబయ్యకు.
    "నీ కోసమే చూస్తున్నాం. తాతయ్య లేకుండా మనవడు బారసాల చేసుకోనంటున్నాడయ్యా!" సాంబయ్యను చూసి లేచి గబగబా వచ్చాడు కనకయ్య. ఇంటికి వచ్చిన తండ్రిని చూసి వెంకటపతి ఉప్పొంగిపోయాడు.
    కాళ్ళు కడుక్కొని సాంబయ్య ఇంట్లో ప్రవేశించాడు. కనకయ్య తప్ప తనకు తెలిసిన ముఖమే కన్పించలేదు సాంబయ్యకు. కనకయ్యమీద ఎంత అయిష్టం ఉన్నా ఆ రోజు కనకయ్యే ఆప్తుడుగా కన్పించాడు సాంబయ్యకు.
    కొడుకూ, కోడలూ తనవాళ్ళు కానట్టే, కొత్తవాళ్ళలా అనిపించారు సాంబయ్యకు. సాంబయ్యకు జరుగుతున్న ప్రత్యేక మర్యాదలకు చూసినవాళ్ళ కళ్ళన్నీ అతనిమీదే ఉండిపోయినై.
    "వీరు పిల్లవాడి తాతగారు." దగ్గిర వున్నవాళ్ళకు పరిచయం చేసి చెప్పాడు కనకయ్య.
    రామనాథబాబు తనంతట తానే వచ్చి సాంబయ్య పక్కన కూర్చొని పలకరించాడు. యోగక్షేమాలు విచారించి చాలా గౌరవంగా మాట్లాడాడు.
    బారసాల తంతుమొదలైంది. ఆహుతులు కుర్రాడికి తెచ్చిన బహుమతులు వరూధిని కందించి, కుర్రాడ్ని ముద్దాడి, భోజనాల దగ్గిర కూర్చున్నారు.
    జనం పల్చబడ్డాక సాంబయ్య ఉయ్యాలతొట్టి దగ్గరకొచ్చి,  ఉయ్యాలతాళ్ళు పట్టుకొని వొంగి చూశాడు.
    సాంబయ్య గుండెల్లో రక్తం వేగంగా ప్రవహించింది. మనిషిలో తరతరాలుగా జీర్ణించుకొన్న మమకారం ఉప్పెనలా పొంగివచ్చింది. పసివాడు కాళ్ళూ చేతులూ గాల్లోకి విసురుతూ సాంబయ్య ముఖంలోకి చూశాడు. సాంబయ్యకు వళ్ళు పులకరించింది. తోట్లోకి బాగా వంగి చూపుడు వేలు వాడికి అందించాడు. పసిపాపడు సాంబయ్య వేలు గట్టిగా పట్టుకొన్నాడు. ఆ స్పర్శలో సాంబయ్య ఈ ప్రపంచాన్నే మరిచాడు. ఇది తరతరాల బంధం. ఆ బంధం అవిచ్చిన్నంగా అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. పసివాడు లేత చేత్తో సాంబయ్య కవచాన్ని బద్దలు కొట్టాడు. పాషాణం కరిగి నీరయిపోయింది.
    "అన్నీ తాతయ్య పోలికలే!" వరూధిని ఉయ్యాలకు అంత ఎడంలో నిలబడి అన్నది.
    "అవును సాంబయ్యా! నీ పోలికే!" అన్నాడు కనకయ్య సాంబయ్యను భుజంపట్టి కుదుపుతూ సాంబయ్య ఆనందంతో ఊగిపోయాడు.
    "వీడప్పుడే నా చెయ్యి వదలడంలేదు!" పసివాడిలా అయిపోయి అన్నాడు సాంబయ్య.
    "ఓహో! అప్పుడే మనవడు తాతయ్యను బుట్టలో వేసుకొన్నాడన్నమాట!" కనకయ్య అన్నాడు. వరూధిని ఎర్రటి పెదవులమీద తెల్లటి పలువరుసల్లోనించి వెలుగు జారి నిలిచింది. వెంకటపతి తండ్రినీ, కొడుకునీ నిండారా చూసుకొని "నా కొడుకు నన్ను తండ్రి దగ్గిరకు చేరుస్తాడు!" అనుకున్నాడు.
    "మరి బుద్ధులు ఎవరివి వచ్చాయో?" సాంబయ్య మాటవింటూనే కొడుకూ కోడలూ ముఖముఖాలు చూసుకొన్నారు.
    "అవి కూడా మీవే వస్తే-" సాంబయ్య ముఖం చూసిన కనకయ్య నాలుక కరచుకున్నాడు. తెప్పరిల్లుకొని మాట మార్చాడు.
    "ఇంతకీ మనవడికేం తెచ్చావయ్యా?" అన్నాడు కనకయ్య.
    సాంబయ్య గుండెలు జారినై. డొల్లయిపోయాడు. అది తనకు తెలియలేదు. అసలు తను రావాలనే అనుకోలేదు. కొడుకు కాళ్ళావేళ్ళాపడి బిక్కముఖం వేస్తే వచ్చాడు. అంతవరకూ మనవడ్ని చూడాలన్న కోర్కె కూడా తనలో లేకపోయింది. అయిష్టంగానే వచ్చాడు. కాని మనవడు తనను కట్టిపడేసుకున్నాడు. తను వట్టి చేతుల్తో వచ్చాడు. అయినా తను ఇచ్చేదేమిటి? వాడు తన మనుమడు. తన వాడికి తను ఇచ్చేదేమిటి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS