Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 46


    "నేను చెప్పిన వెంటనే బయలుదేరి పోయివుంటే ఇంత దూరం వచ్చేదా?"
    "ఎంత దూరమో నాకు తెలీదు కానీ, నిజంగా మీతోపాటు బయలుదేరివుంటే, ఈ దూరాలన్నీ ఎవరిళ్ళలో వాళ్ళం కూర్చొని కొలత బద్దలతో కొలతలేసుకుంటూ కూర్చునేవాళ్ళం. మీరు ఇకక్డికి వచ్చే అవకాశమే వుండేదికాదు".
    "నాకేంటి సరోజా! ఈ డబ్బింగ్ పిక్చర్లు లేకుంటే నేనేం చచ్చిపోను"
    "అయితే ఎందుకొప్పుకున్నారండీ"
    "నువ్వున్నావని"
    "చూడండి. నా పరువు ఏం వుంచారని? మీరు మాట్లాడకండి. నన్ను మాట్లాడించకండి. మీ కేవరి లక్ష్యమూ లేదు. నాకుంది. మనిద్దరికీ పొసగదు. నేనేదో తప్పులెక్క వేశాను. పొరపాటే. దయాదాక్షిణ్యం లేనివాళ్ళ దగ్గర పనిచెయ్యడం కష్టం. మీలాంటివాళ్ళ దగ్గర పని చెయ్యాలంటే, మానం, మర్యాదా, సిగ్గూ, లజ్జా అన్నీ చంపుకొని చెయ్యాలి. ఆ పని నా వల్లకాదు. మీ మూడ్స్ తో నేను వేగలేను. క్షమించండి" - అన్నాను. "-అయిపోయిందా? ఇంకా ఏమైనా వుందా? - అగ్గిపెట్టె అయిపోయింది ఇస్తావా?".
    "నే నివ్వను".
    "ఏవండీ" అని మా అమ్మని పిలిచి అడిగి తీసుకున్నారు.
    దమ్ములాగుతూ, "అదికాదు సరోజా! నా మాట కాదని నన్నే ఎదిరిస్తావేమిటి? అసిస్టెంట్ అంటే అర్ధం ఏమిటి?".
    "చీవాట్లు, చెప్పుదెబ్బలు తినడం".
    "అబ్బా! నన్ను మాట్లాడనీయ్ సరోజా! నేను నందినిచూసి పంది అంటే - నువ్వు కూడా అది పందే అనాలి. అది పంది కాదు నందని నాకు తెలీదూ? నేనూ కాకిని చూసి కోకిలంటాను. కాదండీ అది కాకని నువ్వెందుకంటున్నావు? కోకిలని వీడంటున్నాడే. మనమూ కోకిలే అందమని ఎందుకనకూడదు?" - అని వివరించారు.
    "ఎలాగంటానండీ?".
    "నే ననమంటున్నాను కనుక".
    "నావల్ల కాదండీ" అన్నాను.
    "సరే కొంచెం మంచినీళ్ళిస్తావా?" అనడిగారు.
    "నేనివ్వను" అన్నాను.
    "ఏవండీ! కొంచెం మంచినీళ్ళిస్తారా?" అని  మా అమ్మని అడిగారు. అమ్మ యిచ్చింది.
    "సరే మధ్యాహ్నం రెండు గంటలనుండి తొమ్మిది గంటల వరకూ కాల్ షీట్ నేను రావడంలేదు. నువ్వే వెళ్ళి చెయ్యాలి" అన్నారు.
    "నేనా? నేను మీ దగ్గర పనిచెయ్యనండి. నేను స్టూడియోకి వెళ్ళను. మీ దగ్గర పని నాకొద్దు" అన్నాను.
    "అంతేనా?".
    "ఆఁ అంతే" అన్నాను.
    "ఏమో! నేను స్టూడియోకి రావడంలేదు. మధ్యాహ్నం అందరూ వస్తున్నారు. ఇదిగో స్క్రిప్ట్, పోర్షన్లు తీసుకొచ్చేశాను. నీ యిష్టం. నువ్వు  వెళ్ళకపోతే మనకీ పిక్చర్ పోతుంది" అన్నారు.
    "మనకా? పదిమందిలో బైటకి గెంటినప్పుడు ఈ 'మన' అనే మాట ఏమయింది సార్!" అన్నాను.
    "అదిగో! 'సార్' అని అనకు. నాకసహ్యం. కింద కార్లో ప్రొడ్యూసర్లు కూర్చున్నారు. వాళ్ళు నీతో మాట్లాడాలట. నేను వెళుతున్నాను" అన్నారు.
    "చూడండి. నాతో ఎవరూ మాట్లాడొద్దు. నేను పనిచెయ్యను" - అని అంటూ వుండగా కిందికి దిగిపోయారు.
    ప్రొడ్యూసర్లు మేడమీదకొచ్చారు. చాలాదూరం డిస్కషన్ లు జరిగాయి. "శ్రీశ్రీగారి సంగతి తెలీందేముందమ్మా! వారికి కోపం రాదు. వస్తే పట్టలేం. కానీ ఆమరుక్షణంలోనే అన్నీ మరచిపోతారు. ఇప్పుడే మీరే చూశారుగా!
    మీరు వెళ్ళిపోయారు. శ్రీశ్రీగారి మూడ్ పూర్తిగా అవుటయిపోయింది. చాలా ఫీలయ్యారు. ఎవ్వరి బుర్రలూ సరిగ్గా పనిచెయ్యలేదు. ఆలస్యం అయినందుకు జగ్గయ్యగారు క్షమాపణ కోరుకున్నారు. సావిత్రి, కన్నాంబ, జగ్గయ్య, రంగారావుగార్లు మీ గురించి చాలా బాధపడ్డారు. మధ్యాహ్నం మీరు రాకుంటే ఎవ్వరం పనిచెయ్యమని శ్రీశ్రీగారితోనే చెప్పేశారు. 'మధ్యాహ్నం ఆవిడే వస్తుంది. నాకు వేరే పనుంది. నేను రాను' - అని శ్రీశ్రీగారు కూడా వాళ్ళతో చెప్పేశారు.
    ఆయన మాటలు పట్టించుకుంటే ఎలా చెప్పండి? మేమంతా వున్నాంగా! టైము లేదు. సిద్దంగా వుండండి" అని కిందకి వెళ్ళారు.
    కిందకి వెళ్ళి చ హూస్తే కారూలెదు, శ్రీశ్రీగారూ లేరు.
    "శ్రీశ్రీగారు దిగి బహుశా కారు పంపుతారేమో! మీరు వెళ్ళి భోంచేసి సిద్దంగా వుండాలి" అని ప్రొడ్యూసర్లు అన్నారు.
    నేను మేడ మీదకి వచ్చేశాను.
    "ఇప్పుడేం చేస్తావే" అని ఇంట్లో అందరూ అడిగారు.
    "ఏం చేస్తాను! అవమానించినా దానికి తగిన గౌరవం వెంటనే ఇస్తున్నారు. ఇప్పిస్తున్నారు కూడా. ఆయన తిక్క ఏమిటో నాకు అర్ధం కాలేదు..." అని అంటూ వుండగా దమ్ము చప్పుడు వినిపించింది.
    వెనక్కి తిరిగి చూస్తే - శ్రీశ్రీగారు!
    
                           *    *    *

                                అదృష్టం ఎవరిది?


    
    మళ్ళీ ఇంటికొచ్చిన శ్రీశ్రీగారిని చూసి, "ఇంటికి వెళ్ళిపోయారనుకున్నాం." అన్నాను.
    "లేదు, సిగరెట్లు కొనుక్కోడానికి లజ్ వరకూ వెళ్ళాను. స్టూడియోకి వస్తానన్నావటగా థేంక్స్" అన్నారు.
    "మరోమారు గెటవుట్ చెయ్యడానికి మీకు అవకాశం వస్తోంద"న్నాను.
    "ఇక ఆ సంగతి మరచిపో, నేనీపూట ఆ చుట్టుపక్కలకి కూడా రాను. రేపు ఉదయం కలుసుకుందాం. ఈలోగా నీ కోపం కూడా తగ్గుతుంది" - అని సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయారు.
    "ఈ మనిషితో ఏం దారే సరోజాని" అమ్మ అంది.
    "ఓకే దారి! ఇష్టమయితే పనిచెయ్యడం, లేదంటే మంగళం పాడెయ్యడమే" - అన్నాను ఇంతలో
    కారొచ్చింది ఈ తతంగాలతో అరగంట లేటయ్యింది.
    
                           *    *    *
    
    జగ్గయ్యగారూ, సావిత్రిగారూ, కన్నాంబగారూ అందరూ థియేటర్లో అడుగుపెడుతూనే నేను కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చారు. అందరికీ నమస్కారం చేశాను. అందరూ నన్ను ఊరడించారు.
    "నే నప్పుడే మరచిపోయానండి" అన్నాను.
    అందరూ మంచి హుషారుగా వున్నారు.
    నాకు మాత్రం బెంగగానే వుంది. శ్రీశ్రీగారు లేరు. అంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎలా మెయిన్ టెయిన్ చేస్తానోనని భయం.
    ఆరోజు సావిత్రిగారూ, జగ్గయ్యగారూ పోటా పోటీల మీద వర్క్ చేస్తున్నారు. సావిత్రిగారి డైలాగ్ రెండు పేజీలు , ఆవిడేమనుకున్నారో తెలీదు. ఒకే ఊపున మొత్తం డైలాగ్ ఒకే టేకులో మాట్లాడతానని కూర్చున్నారు.
    సాయంకాలం ఆరుగంటలయ్యింది. రెండుసార్లు రిహార్సల్స్ చూసుకున్నారు. ధైర్యంగా ఒకటి రెండుచోట్ల లిప్ కోసం డైలాగ్స్ మార్పులు చేశాను.
    సావిత్రిగారు ఒకే టేకులో అంత పెద్ద క్లయిమాక్స్ డైలాగ్ మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోయారు.
    టేక్ ఓకే అయిపోయింది. హాల్లో సంచలనం ఏర్పడింది. వెంటనే జెమినీ గారికి ఫోన్ చేసి రప్పించాం. కొంతసేపయ్యాక ఆవిడ తేరుకొని మళ్ళీ వర్క్ చేస్తానని  చెప్పారు. మేం ఎవ్వరం ఒప్పుకోలేదు. ఆమెను యింటికి పంపించేశాం.
    శ్రీశ్రీగారు ఆరోజంతా ఆ చుట్టుపక్కలకి రాలేదు. నా మనసు మనసులో లేదు. ఏ నిముషంలోనైనా రావచ్చనే ఆశతో కళ్ళు ఎదురు చూస్తున్నాయి.
    మర్నాడు ఉదయం, సాయంకాలం కూడా ఏడుగంటలవరకూ రాలేదు. ఆయనెక్కడుంటున్నారో ప్రొడ్యూసర్లకి తెలుసు.
    ఏడు గంటలకి కాల్ షీట్ ఆపుచేసేశాను. ఇది ఆఖరి రోజు కాల్ షీట్ శ్రీశ్రీగారు లేకుండా నేను ఫినిష్ చెయ్యనన్నాను.
    అప్పుడు శ్రీశ్రీగారు విశ్వశాంతిలో వున్నారు. ఫోన్ చెయ్యగానే వచ్చారు. వారి అనందానికి మేరలేదు. విశ్వాసఘాతకురాల్ని కానన్న నమ్మకం కలిగింది వారికి. డబ్బింగ్ పూర్తిచేసేశాం. అందరూ ఆనందంతో శ్రీశ్రీగారికి బ్రహ్మరథం పట్టారు.
    ఈ 'తలవంచని వీరుడు' చిత్రంతో మా దశ తిరిగింది. పిక్చర్లు రావడం ప్రారంభించాయి. దేవదాసు చిత్రం తీసిన డి.ఎల్.గారు 'తంగమలై రహస్యం' అనే తమిళ పిక్చర్ తెలుగులోకి డబ్ చేస్తామని వచ్చారు.
    అలా..... తంగమలై రహస్యం (రత్నగిరి రహస్యం), చక్రవర్తి తిరుమగళ్ (రాజకుమారి రహస్యం), యార్ ఫైయ్యన్ (ఎవరబ్భాయి), అన్నై (అమ్మ) అనే పిక్చర్లు వరసగా వచ్చేశాయి. అమౌంట్ పన్నెండు వేలదాకా పెంచాం. నాకు బాగా అమౌంట్ ముడుతూ వుండేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS