Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 46


    దరిదాపుల్లో రంభ లేదుకాని రంభ వున్నట్టయితే అది దేవలోకమే అనుకునేవాడు.
    "దామోదరం భాయ్! నీ చరిత్ర ఏమిటో నీవేమిటో మొత్తం నాకు తెలుసు. అందువల్ల నీ గురించి చెప్పే అవసరంలేదు. నా గురించి....నా పేరు పాండే. ఈ భవంతి కాక ఇలాటివి ఇంకో నాలుగు భవంతులు, రెండు మేడలు ఈ వూళ్ళో ఉన్నాయి నాకు వీటిల్లో రెండింటిని ఇదిగో ఇలా అవసరాలకి ఖాళీగా వుంచేశాను. నా సంసారం గురించి  ప్రస్తుతం చెప్పడం అనవసరం. అవసరం ఉన్నంత వరకూ చెప్పాను. కొద్దిసేపట్లో మరో విషయం చెప్పబోతున్నాను. నీకిష్టమయితే నాతో చేయి కలుపవచ్చు. లేకపోతే తక్షణం ఇక్కడినుండి వెళ్ళిపోవచ్చు. నేనేమీ అనుకోను. నిన్నే మీ అడ్డగించను." అంతవరకూ చెప్పి మౌనంగా ఉండిపోయాడు.
    "ఇంత పెద్దమనిషి తనతో చేతులు కలపడం ఏమిటి?" ఏమీ అర్ధం కాలేదు దామోదరానికి.
    పాండే రెండు గ్లాసులలో రెండు పెగ్గులకి సరిపోను విస్కీ వంపాడు. అందులో ఐస్ ముక్కలు వేశాడు. ఒకటి దామోదరానికి ఇచ్చి. ఒకటి తను తీసుకున్నాడు. "ఇది తాగకూడదు. ఎంత నిదానంగా చప్పరిస్తూ తాగితే అంత టేస్ట్ గా వుంటుంది. అరుదుగా లభించే అతి ఖరీదైన విస్కీ." అని గ్లాసు పైకెత్తి 'ఛీర్స్' అన్నాడు.
    దామోదరం కూడా వెంటనే గ్లాసు తగిలించి 'ఛీర్స్' చెప్పాడు. "నిజమే దీని రుచి వేరుగా వుంది" చప్పరిస్తూ అనుకున్నాడు దామోదరం.
    రెండు నిముషాలసేపు జీడిపప్పు నోట్లో వేసుకుంటూ, విస్కీ చప్పరిస్తూ మౌనంగా గడిపారు.
    "దామోదరం భాయ్! నీవు బీడీ తాగకుండా అర నిమిషం కూడా ఉండలేవు. నా దగ్గర మొహమాటం అక్కరలేదు. కాల్చుకోవాలని అనిపించిన తక్షణం నీవు బీడీ కాల్చుకోవచ్చు." అన్నాడు పాండే.
    అలాగే అని తల వూపటం తప్ప దామోదరం నోటినుండి మాట రాలేదు.
    "ఒక ఖరీదయిన పెద్దమనిషి తనతో చేయి కలుపుతున్నాడూ అంటే విషయం ఏదో చాలా క్లిష్టమయినది తప్పనిసరి అయినది అయివుంటుంది" దామోదరం అనుకున్నాడు.
    "ఇలాంటి ఇల్లు ఎప్పటికీ నీకు సొంతంగా కావాలా!" పాండే చిరునవ్వుతో అడిగాడు.
    దామోదరం అయోమయంగా చూశాడు.
    "ఇప్పుడు మనం ఎక్కివచ్చాము, అలాంటి కారు, ఎప్పటికీ నీదిగా కావాలా!
    "పాండే పిచ్చివాడు కాదుగదా!" అన్నట్లు చూశాడు దామోదరం.
    "వీటన్నింటికంటే బెటర్ క్యాషయితే బాగుంటుందేమో!
    "మీరనేది ఏమిటో ఒక్కముక్కా నాకర్ధంకావడం లేదు. అదేదో నాకు విడమర్చి చెబితే..." నాన్చుతూ ఆగాడు దామోదరం.
    "ఆల్ రైట్...ఆల్ రైట్.....విషయమేదో పూర్తిగా వివరిస్తాను. బంగారు తాడో, కర్రపేడో నువ్వె తేల్చుకో." అని క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు పాండే.
    "డై రెక్టుగా రంగంలోకి దిగుతున్నాను. కిరణ్ కి రసిన బ్లాక్ మెయిలర్ ని నేనే. రావుగారి ఏకైక గారాలకొడుకు చేసేవన్నీ వెధవ పనులే. ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆటలాడి వాళ్ళు ఎదురు తిరిగితే చంపటం కూడా జరిగింది. కిరణ్ శాలినీని హత్యచేస్తుండగా ఫోటోలు తీశాను. అంతక్రితం వాళ్ళిద్దరూ వాదులాడుకుంటూండగా వాళ్ళిద్దరి మాటలు రికార్డుచేశాను. ఓ విచిత్రమయినపరిస్థితిలో నా చేయిజారి ఆ క్యాసెట్, ఫోటోలు ఉన్న కవరు కామినీ చేతిలోకి వెళ్ళిపోయాయి. వాటి ఆధారంతో కిరణ్ ని బెదిరించి పెళ్ళిచేసుకుంది కామిని.
    కామినీ వాటినెక్కడో రహస్యంగా దాచింది. అవి నాకు కావాలి. కామిని బాబాయిని అయిన నీకు ఆమె రహస్యాలు బాగా తెలిసే వుంటాయి. ఆమె వాటిని ఎక్కడదాచిందో కనుగొని వాటినితెచ్చి నాకిస్తే, ఈ బంగ్లా కావాలంటే ఈ బంగ్లా, మనం ఎక్కివచ్చిన కారు కావాలంటే కారు, క్యాష్ గా కావాలంటే లక్ష పాతికవేలు. నీవు ఏది కోరితే అది తక్షణం ఇచ్చేస్తాను." సూటిగా అసలు విషయం చెప్పాడు పాండే.
    బంగ్లా, కారు, లక్షా పాతికవేలు. దామోదరం గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకోవడం ప్రారంభించింది.
    "అయితే కిరణ్ హత్య చేశాడన్నమాట అయితే ఇదీ రహస్యం అన్నమాట. ఆ రహస్యం కామిని చేజిక్కించుకొని కిరణ్ ని బెదిరించి పెళ్ళి చేసుకుని ఉంటుంది. ఫోటోలు, క్యాసెట్ తెచ్చి యిస్తే రావుగారు లక్షరూపాయలు ఇస్తానన్నాడు. ఈ మహానుభావుడు ఏకంగా లక్షా పాతికవేలు, దానితోపాటు కారడిగినా ఇచ్చేటట్టు ఉన్నాడు. కొడుకుని రక్షించుకోటానికి తండ్రి ఆ సాక్ష్యాధారాలు అడిగాడన్నా అర్ధం వుంది.
    ఈయన కెందుకు అవి. ఇదేదో పెద్ద విషయమే. తను ఒళ్ళు దగ్గిరపెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే లక్షలకు అధికారి అయిపోవచ్చు. కిరణ్ కి లెటర్ రాసిన బ్లాక్ మెయిలర్ వీడే. ఇప్పుడు తనకి రెండు విషయాలు బాగా తెలిశాయి. కిరణ్ ఏ నేరం చేశాడన్నది ఒకటి. వీడే బ్లాక్ మెయిలర్ అన్నది మరొకటి.
    "ఏమిటి దామోదరం ఆలోచిస్తున్నావ్!"
    "నేను కొన్ని ప్రశ్నలు అడిగితే మీకు అభ్యంతరమా!"
    "అదేంలేదు నిక్షేపంగా అడగవచ్చు." అంటూ మరో రెండు పెగ్గుల విస్కీ దామోదరం గ్లాసులోకి వంపాడు పాండే.
    "ఆ క్యాసెట్ తోనూ, ఫోటోలతోనూ మీకేమిటి అవసరం?"
    "ఆ తండ్రి కొడుకులని వాటి సహాయంతో ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించవచ్చు."
    "ఇదంతా డబ్బుకోసమా!" దామోదరం అడిగాడు.
    "కాదు! రావుగారిలాంటివారిని నలుగురిని కొని పారేయగలను. కసి కేవలం కసితో చేస్తున్న పని ఇది."
    "కసా! ఆయన ఏం చేశాడని ఆయనమీద అంత కక్ష కట్టారు?"
    "ముందీ విషయం చెప్పు భాయ్. నువ్వు ఎవరివద్ద పని చేయదలచుకున్నావ్!"
    "ఎవరు ఎక్కువ డబ్బుయిస్తే వారివైపు." దామోదరం వెనుకాడకుండా చెప్పేశాడు.
    "గుడ్! తెలివిగలవాళ్ళ లక్షణం ఇది. విషయం నువ్వు ముక్కుసూటిగా చెప్పావు కాబట్టి నేనూ చెబుతున్నాను. రావు గారు తన కొడుకు ప్రాణం రక్షించుకోడానికి లక్ష పణంగా పెడితే, నేను రెండు లక్షలు పణంగా పెడతాను. అతను రెండు లక్షలు పెడితే నేను నాలుగు లక్షలు పెడతాను. కనుక నీవు నా ప్రక్క పనిచేస్తున్నట్టే కామినీని ఆశపెట్టాను. కానీ వినలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS