Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 46


    "పుదియపాదై అనే సినిమా తమిళంలో డైరెక్ట్ చేసిన పార్టీఅని తెలుసుగా? చాలాకాలం అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేశాడు. ఆదిలో ఆ కథ పట్టుకుని చాలామంది నటుల దగ్గరికి తిరిగాడు. అంతా తిరస్కరిస్తే నీకంటే ఎక్కువ నిరుత్సాహపడ్డాడు. ఆఖరికి ఏం చేశాడు. తిక్కరేగి తనే హీరోగా కూడా నటించి అదే సినిమాతో దర్శకుడిగా, నటుడిగా ప్రభంజనాన్ని సృష్టించాడు.....శివా....." ఆవేశాన్ని అదిమిపెట్టుకుంటూ అన్నాడు. నచ్చచెబుతున్నట్టుగా "నీకు నటన వృత్తిగా తీసుకోవడం యిష్టం లేకపోవచ్చు. కేవలం దర్శకత్వం మాత్రమే నీ ధ్యేయం కావచ్చు. ఈ సినిమా వరకూ సరే అను. డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకో. ఆ తర్వాత నటన్ని విడిచిపెట్టెయ్."
    "ఎందుకో మనస్కరించడంలేదు రాఘవా."
    "గంగలో దూకు" ఉక్రోషంగా అరిచాడు రాఘవ. "లేదూ వెళ్ళి మీ వూర్లో డ్రామాలు డైరెక్ట్ చేసుకుని బ్రతుకు. అసలు నిన్ను కాదు అనాల్సింది. నీలాంటి ఈడియట్ మీద యింత నమ్మకాన్ని పెంచుకుని నీ కోసం యింత చేసిన ఆ పిల్లని అనాలి."
    ఉలిక్కిపడ్డట్టుగా చూశాడు శివ. "ఎవరూ..... నా కోసం ఏదో చేసిన ఆ అమ్మాయి ఎవరు?"
    ఇప్పుడు నీళ్ళు నమలడం రాఘవ వంతైంది. జరిగిందేమిటో అలివేలు ద్వారా తెలుసుకుని ఏ స్థితిలోనూ సుకృతి సంగతి చెప్పనని ఆమెకు ప్రమాణం చేసిన రాగహవ యిప్పుడు అలివేలుకిచ్చిన మాట తప్పాడు అసంకల్పితంగా.
    "నాకు జవాబు కావాలి రాఘవా."
    ఇదంతా నారాయణశెట్టికి కేవలం తన ప్రతిభ మీద ఏర్పడ్డ నమ్మకమే అనుకుంటే యిప్పుడే మరో కొత్త విషయం విన్నాడు శివ.
    "నిన్నే"
    "ఏ.....ఏం లేదు శివా..... ఊరికినే ఏదో అనేశానలా" రాఘవ మాట దాటేయబోయాడు.
    "నువ్వు అనాల్సిందే అంటావు తప్ప వూరికే ఏదీ అనవని నాకు  తెలుసు రాఘవా. నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. శెట్టి నాకీ అవకాశం యివ్వటానికి కారణం ఎవరు? మాట్లాడు."
    ఇక చెప్పక తప్పదని తెలిసిపోయింది రాఘవకి "సుకృతి."
    షాక్ తిన్నట్టుగా చూశాడు శివ.
    సుకృతికి, శెట్టికీ పరిచయం ఏమిటీ? ఆమె మాటని శెట్టి అంత బలంగా ఎలా తీసుకున్నాడు.
    ఇక్కడ రాఘవ వూహించనిది శివ ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం గురించి.
    అదే రాత్రి సుకృతి ఫ్లాట్ కి వెళ్ళాడు రాఘవ వారిస్తున్నా వినకుండా.
    రాత్రి పదిగంటలు కావస్తున్నా ఆ సమయంలో సుకృతిని కలవడం అనుచితమో ఉచితమో అతడు ఆలోచించలేదు.
    కానీ అతడు వెళ్ళేసరికి నారాయణశెట్టి సుకృతి ఫ్లాట్ లో నుంచి బయటికి వస్తున్నాడు.
    అప్రతిభుడవుతూ చీకటిలోకి జరిగాడు శెట్టికి కనిపించకుండా.
    కారులో వెళ్ళిపోతున్న నారాయణశెట్టికి వీడ్కోలు చెప్పిన సుకృతి అప్పుడు చూసింది ఎదురుగా నిలబడ్డ శివని.
    అంతే....అదిరిపడింది.
    కన్నీళ్ళతో కడిగినా కరగని శిలలా చూస్తున్నాడు శివ రెప్పలార్పకుండా.
    "మీరా" తొట్రుపడింది శివని పలకరిస్తూ "రండి."
    సంకోచించలేదు శివ లోపలికి వెళ్ళాడు. ఆధునాతనంగా వున్న గడిని చూసేక ఏమీలేని స్థితిలో సినీ రంగంలో అడుగుపెట్టిన సుకృతి యింత స్వల్ప వ్యవధిలో చాలా సమకూర్చుకోటానికి కారణం ఏమిటో బోధపడిందేమో.
    అడగడం సభ్యత కాదనిపించిందో లేక అది తనకు అవసరంకాని విషయమనిపించిందో "నేను వచ్చింది మిమ్మల్ని యిబ్బంది పెట్టటానికి కాదు. కాబట్టి మీరు మామూలుగా వుండొచ్చు" అన్నాడు.
    "మీరింకా కూర్చోలేదు" గుర్తు చేసింది సుకృతి.
    శివ రావటాన్ని అలివేలు చూసినా వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో తను మధ్య వుండటం సమంజసం కాదన్నట్లుగా లోపలికి వెళ్ళి పోయింది. వెళ్ళినా ఓ మూల కూర్చోలేదు......ఇలాంటి సమయంలో వచ్చి శెట్టిని చూసిన శివ యిప్పుడెలా రియాక్టవుతున్నదీ తెలుసుకోవలన్నట్టుగా ద్వారం వారగా నిలబడింది.
    "నరేంద్ర కేరక్టరు వెయ్యనన్నాడని మీకు తెలుసనుకుంటాను?"
    "విన్నాను" చెప్పింది సుకృతి. "ఆ పాత్రని మీరే వేస్తున్నట్టుకూడా శెట్టి చెప్పాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS