Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 47

 

    "నేను మారిపోవడం ఏమిటి భవానీ........నేనేం మారలేదు. నువ్వే కొత్తగా మాట్టాడుతునావంతే!" స్థిరంగా వున్నాయి అతని మాటలు.
    కొత్తగా మాట్టాడుతున్నది నేను కాదు......నువ్వే.......మనిద్దరం ఒకరంటే ఒకరం ఇష్టపడుతున్న సంగతి మీ అమ్మగారికి తెలియదూ.......నేను చిన్నప్పటినుంచి "అంటీ" అనే పిలిచాను తప్ప ఎప్పుడన్నా "అమ్మా" అని పిలిచానా? మనసులో ఇంకొక అభిప్రాయం వుంచుకుని పైకి అలా నటించడము నావల్ల కాదు. అందుకే నా మనసులోని మాట నీ తల్లి తండ్రులకు ఎప్పుడో చెప్పేశాను.....
    "మంచి మనసులు కలిగిన అది దంపతులు కాబట్టి నా నిర్ణయాన్ని దురాశగా భావించలేదు. మనిద్దరి మనసులు కలిశాయి అని తెలుసుకున్న అవధానిగారు కూడా మన పెళ్ళికి అడ్డు చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు అసలు నన్ను ప్రేమించనే లేదంటున్నావంటే నువ్వు చెప్పేవన్నీ అబద్దాలే అని తెలిసిపోతున్నాయి....... అసలు ఇన్ని అబద్దాలు ఆడి ఏం సాధిద్దామనుకుంటున్నావు?" రోషంగా అడిగింది.
    "ఏది ఏమయినా నా పెళ్ళి మరొకరితో జరిగిపోయిందనేది నిజం. కలలు కనే హక్కు మాత్రమే మనకు వుంటుంది భవానీ.....అవి దక్కించుకోవడం కేవలం అదృష్టం మీద ఆధారపడి వుంటుంది. ఇక నన్నేమీ ప్రశ్నించవద్దు.......నీ జీవితం నీది.......నా జీవితం నాది......మనిద్దరి గమ్యాలు వేరయినాయి కాబట్టి మనం ఇక కలుసుకోవడం కూడా అనవసరం.
    "దయచేసి ఇక ముందెప్పుడూ నా ముందుకు రావడానికి గానీ, నన్ను కలుసుకోవడానికి గానీ ప్రయత్నించవద్దు. నా అన్న వాళ్ళందరూ నాకు దూరమైపోయారు. అది నా తలరాతే కావచ్చు.....ఇక నువ్వు అంతే.....నాకంటూ ఎవరూ లేని ఒంటరివాడిని నేను"
    విష్ణు వాడి వడిగా వెళ్ళిపోయాడు.
    అంత కర్కశంగా మాట్టాడి , నిర్దయగా తన హృదయంలో నుంచి కూడా దూరమై పోతున్న విష్ణు రూపాన్ని చూస్తూ అచేతనంగా నిలిచిపోయింది భవానీ.
    ఆమె కనుకొలకులలో నిలిచినా కన్నీటి పొరలు అతని రూపాన్ని స్పష్టంగా మరుగుపరిచాయి.
    భవానీ హృదయంలో బడబాగ్ని ప్రజ్వరిల్లి ఏ క్షణంలోనయినా లావా వెదజల్లడానికి సిద్దంగా వుంది.

                                                   *    *    *    *

    ఆ గదిలో విష్ణు ఒంటరిగా వున్నాడు.
    అతని మనసు మాత్రం ఒంటరిగా లేదు....ఎన్నో సమస్యలు.....పరిష్కారం లేని సమస్యలు.....చివరకు తన జీవితమే సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఏ అలల తాకిడికి చిన్నా భిన్నమైపోతుందో తనకే తెలియని నిర్వీర్యం అతన్ని నిలువెల్లా ఆవహించి వున్నది.
    నందిని అంటే ఏమిటో.....ఆ ఇంట్లో తన స్థానం ఏమిటో పూర్తిగా అర్ధం కావడానికి అతనికి పదిరోజులు పట్టింది.
    వాయిదా పడిన శోభనం తిరిగి జరపనేలేదు.....
    అసలు కారణం విష్ణుకు తరువాత తెలిసింది.
    నందిని కావాలనే ఆ రోజు శోభనాన్ని తప్పించుకోవడానికి అలా అబద్దం చెప్పింది. కేవలం ఆమె తండ్రి పట్టుదల వలన తనను పెళ్ళి చేసుకుంది. కాని తానంటే ఎందుకో అయిష్టత , ఏదయినా ఆ ఇంట్లో ఆమె ఇష్టప్రకారమే అన్నీ జరగాలి తప్ప ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదని తెలుసుకున్న విష్ణు మౌనం వహించాడు. అతని మనసు మూగబోయింది.
    గోవిందయ్య అల్లుడి విషయం అసలు పట్టించుకోవడమే మానేశాడు.
    విష్ణు మానసికంగా రోజు రోజుకు నలిగిపోతున్నాడు.
    అందుకే ఏ చిన్న అవకాశం దొరికినా......ఆ ఏకాంతంలో గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఒంటరిగా గడపడం అలవాటు చేసుకున్నాడతను.
    తనవాళ్ళు సుఖంగా వుంటే చాలుననుకుని, చివరకు తను ప్రేమించిన ప్రియురాలిని సయితం మర్చిపోయాడు. తనను పిచ్చిగా అభిమానించే వారిని అసలు కలుసుకునే ప్రయత్నమే చేయలేదు.....
    తోడబుట్టిన అక్కల జీవితాలను ఆనందమయం చేయాలనే తలంపుతో చివరకు తన జీవితాన్నే నరకం చేసుకున్నాడు.
    కానీ తను తలిచింది ఒకటి, జరిగింది మరొకటి.
    తనెలా వున్నా,.....తనవాళ్ళన్నా తన కంటి ఎదురుగా సుఖ సంతోషాలతో ఆనందంగా వుంటే చాలుననుకుననాడు ......ఆ విషయంలోనూ విధి తననే వెక్కిరించింది.
    తనను వేలివేసినట్టు తనకు కనిపించనంత దూరం......అగ్రహారానికి వెళ్ళిపోయారు.
    వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా తనంతట తను తీసుకున్న నిర్ణయం వాళ్ళకు ఆగ్రహం కలిగించి వుండవచ్చు.......అందుకే దూరమై పోయారేమో!
    కాని, వాళ్ళకోసమే తనిలా త్యాగం చేశానని గొంతు చించుకుని ఇప్పుడు అరిచినా నివిపించనంత దూరంలో వున్నారే.......!
    ఆ విషయం తలచుకున్న కొద్దీ విష్ణు హృదయం రంపపుకోతకు గురవుతున్నది.
    అదే సమయంలో అతని గదిలోకి వచ్చింది నందిని.
    ఆమెను చూసి లేచి బయటకు వెళ్ళిపోయాడతను.
    'అగు......నేను నీకోసం వస్తే నువ్వు వెళ్ళిపోతావే....."
    మాట్లాడకుండా మౌనంగా నిలుచున్నాడు విష్ణు.
    "నిన్నే పిలిచేది....వినిపించడంలేదా...' నందిని మాటలు విసురుగా వచ్చాయి "ఏమిటో చెప్పు.'
    "ఏదో ఉద్యోగం వచ్చిందట......."
    "అవును.......కాలేజీలో లెక్చరర్ జాబు వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS