Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 46

 

    పంటి బిగావున దుఃఖాన్ని ఆపుకోవడం వల్లనేమో ముఖమంతా వాచీ ఉబ్బిపోయినట్టయింది.
    చాలా సేపటి నుంచీ ఆమె అలానే రోదిస్తున్నది.
    ఆమెకు కొంచెం దూరంలో కూర్చుని ఉన్న విష్ణు ఆమె వైపు మౌనంగా చూస్తుండిపోయాడే తప్ప పెదవి విప్పి ఆమెను అనునయించే ప్రయత్నం చేయడం లేదు.....
    ఆ ఇద్దరిలో ముందుగా నోరు విప్పింది భవానీయే.....
    "విష్ణు........నా హృదయాన్ని తూట్లు పొడిచి కూడా నువ్వింత ప్రశాంతంగా ఎలా వుండగలుగుతున్నావు?" ఒక్క అక్షరం ఒక్కొక్క చాకులా అతని హృదయాన్ని తాకుతున్నా చాలించలేదను.
    "భవానీ .........నేనేం చేశానో ఎందుకు చేశానో......ఎవరి కోసం చేశానో అప్రస్తుతం. ఇందరిని బాధపెట్టిన నేను నిజంగానే స్వార్ధపరుడినే .......అయినా ఎవరి నుదుట యెలా రాసిపెట్టి వుంటే అలానే జరుగుతుంది....."
    "విష్ణు ఆ మాట అనడానికి నీకు మనసు ఎలా ఒప్పింది, నువ్వే నా సర్వస్వమని ఇంతకాలం నుంచీ కలలు కంటూ వచ్చిన నా జీవిత సౌధాన్ని నీస్వర్ధంతో కూలదోశావు. అదేమంటే ఇప్పుడు వేదాంతం చెబుతున్నావు. మరొక ఆడదాని మెడలో తాళి కట్టేటప్పుడు చిన్ననాటి నుంచి కలిసి తిరిగిన నేను గుర్తురాలేదా? అవునులే......అవేమీ గుర్తు రానంత మహత్యం నీ కళ్ళ ముందు కనిపించి వుంటుంది.
    'అందుకే నేను, నా ప్రేమ నాతో పంచుకునే జీవితం నీకు గడ్డి పోచలా కనిపించి వుంటాయి. న కోసం కలలు కనే నా నెచ్చెలి జీవితం ఏమవుతుందో అనే ఆలోచన కూడా లేకుండా మరొకరిని జీవితంలోకి ఆహ్వానించావే.......నిన్ను తప్ప మరొకరికి నా హృదయంలో స్థానం లేదని తెలిసి కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నావంటే నీది స్వార్ధం అనాలో........ప్రేమ అనాలో.......నాకు మాటలు రావడం లేదు..."
    "ప్లీజ్ స్టాపిట్.....ను.వ్వు......నువ్వు పోరబడుతున్నావు భవానీ.......నన్ను సరిగా అర్ధం చేసుకో.......లేదు నువ్వు....."
    "లేదు విష్ణు.........అర్ధం చేసుకున్నాను కనుకనే నీ అసలు రూపం తెలుసుకోగలిగాను.....నీ కళ్ళ పొరలను డబ్బు మైకం కమ్మేసింది. నీ దృష్టిలో డబ్బు కున్న విలువ మనిషికి లేదు. డబ్బు పారేసి కన్నవాళ్ళను దూరంగా తరిమేశావు. లక్షాధికారికి అల్లుడయ్యావు. నీ జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి అయినవాళ్ళు ఆత్మీయులను చివరకు ప్రియురాలి ప్రేమను సయితం సమాధి చేసుకుని, మనసుని చంపుకుని.......ఆస్థి ఐశ్వర్యాలున్న ఇంటికి ఇల్లరికపుటల్లుడిగా వెళ్ళిపోయావు......"
    ఆమె స్వరంలో ఉక్రోషం వుంది.
    "భవానీ......నేనేమిటో నా మనసేమిటో పూర్తిగా తెలిసిన నువ్వు కూడా నన్ను అపార్ధం చేసుకుంటావనుకోలేదు......అసలు నేనెందుకు ఇలా చేశానో అర్ధం చేసుకునే స్థితిలో లేవు నువ్వు......' విష్ణు బాధగా అన్నాడు.
    'అవును చిన్నతనంలోనే నా ఊహ తెలిసిన తరువాత నేను తాకినా తోలి మగవాడివి నువ్వే.....నువ్వు న పట్ల చూపే ఆప్యాయత వలనే నువ్వు విద్యాదికుడవు అవుతున్న కొద్ది.......కనీసం నీ అంత చదువుకోకపోయినా నీ కోసం కాలేజీ చదువులకు వెళ్ళాను. నా ఊహలలో ఆశలు రేకెత్తించిన తోలి పురుషుడివి నువ్వే. ప్రేమ అంటే ఏమిటో.......జీవితం ఎంత ఆశాజనకంగా వుంటుందో , నాకు నేర్పింది నువ్వే. చివరకు ఇప్పుడు నా మనసును ముక్కలు చేసింది కూడా నువ్వే."
    భవానీ కంట కన్నీరు చిప్పిల్లింది.
    "భవానీ....... సరే, ఇంతదూరం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను.......నువ్వు ఏదేదో ఊహించుకుని నాపై ప్రేమ పెంచుకోవడానికి నేను బాధ్యుడ్ని ఎలా అవుతాను......నేను ఎప్పుడయినా నిన్నే పెళ్ళి చేసుకుంటానని కానీ.....మనిద్దరం పెళ్ళి చేసుకుందామా అని అడగటం కానీ చేశానా........మనసును రాయి చేసుకుంటూ కావాలనే రెట్టించి అడిగాడు.
    తుపాకీ తూటా వచ్చి హృదయాన్ని తాకినట్టు విలవిలలాడిపోయింది భవాని.
    "ఏ....మీ....టి......ఏమిటి......నువ్వంటున్నది?"
    ఎలాగో గొంతు పెగాల్చుకుని అక్షరాలను కూడగట్టుకుంటూ అనగలిగింది.
    "ఎస్......నిజమే చెబుతున్నాను నేనెప్పుడూ నిన్ను పెళ్ళి చేసుకుంటానని నీకు ప్రామిస్ చేయలేదు. నా చనువు చూసి నువ్వు వుహించుకున్న దానికి నేను సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు. నేనేదో నిన్ను మోసం చేసినట్టు నాపై నింద వేయడం తప్పు. నీ అమాయకత్వానికి జాలిపడుతున్నాను."
    ...నే...ను... ఏం వింటున్నాను విష్ణు...అసలు ....ను...వ్వే....నే ...ఇలా మాట్టాడుతుంది."
    ఇంకా అశ్చర్యం నుంచి ఆమె కోలుకోలేకపోతున్నది.
    "ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాధను తెచ్చి పెంచి పెద్ద చేశాడు నా తండ్రి.....నా అయిదుగురు అక్కలతో కలిసి నీకు కూడా గోరు ముద్దలను తినిపించింది మా అమ్మ. నిన్ను కుతురిలాగానే భావించింది తప్ప ఏనాడూ కోడలిగా చూడలేదు. నువ్వు అనాధవు కాబట్టి నువ్వంటే నాకు జాలి, ఇష్టం, ప్రేమ.......అన్నింటా కొంచెం ఎక్కువగానే వుండేవి . నా ప్రవర్తనను నువ్వు మరోలా భావించి నిన్ను ప్రేమిస్తున్నట్టు ఊహించుకుని కలలు కానీ, ఇప్పుడు తప్పంతా నాదేనన్నట్టు నిందలు వేస్తున్నావు......"
    "అపు విష్ణు........అపు....ఇక వినలేను.....ఇంతవరకు నువ్వు పరిస్థితుల ప్రాబల్యంవలనో, లేక ఇంకే కారణాల వలనో నువ్వు ఇలా ప్రవర్తించి వుంటావని సర్ది చెప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు చెప్పావే....అవన్నీ అబద్దాలే.....ఆ విషయం నీకూ తెలుసు. నా మనసుకూ తెలుసు....అసలు నీకు నువ్వే ఎందుకు ఆత్మద్రోహం చేసుకుంటునావు! ప్రేమించిన ప్రియురాలిని పెళ్ళాడాకాపోతే పోయే ప్రేమించిన వ్యక్తిని వరసమార్చి పిలవాలనుకోవడం కన్నా ఘోరం ఇంకొకటి వుంటుందా? అసలు ఎందుకిలా మారిపోయావు నువ్వు......"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS