Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 46

 

    
    స్వప్న సమాధానం చెప్పకుండా విశ్వేశ్వరంగారిచ్చిన ఓ ఉత్తరం అతని చేతికిచ్చింది. అది మద్రాసు మహానగరంలో ప్రఖ్యాతిగాంచిన ఓ సినీ నిర్మాతకి రాసింది. ఆయన టి.నగర్ లో బాలాజీ ఎవెన్యూలో వుంటున్నాడు.
    "ఏమిటి?"
    "మనల్ని అక్కడ దిగమన్నారు అంకుల్."
    "ఎందుకు?"
    "ఏమో!"
    రవి మౌనం వహించాడు.
    "వెళదామా?"
    "స్వప్నా! మనం యితర్లకి ఎందుకు బరువు కావాలి. ఇక్కడ చాలా ఖరీదైన హోటళ్ళున్నాయి. అధునాతన సౌకర్యాలు అన్నీ వుంటాయి. అక్కడికి వెళదాం."
    స్వప్న సమాధానం యివ్వలేదు.
    "సరే! నీ యిష్టం వాళ్ళింటికే వెళదాం."
    తలూపింది స్వప్న.
    టాక్సీని కేకెయ్యబోయాడు రవి.
    "ఆగండి. టాక్సీ వద్దు. ఇదిగో ఈ కవరు మీదే ఆయన ఫోన్ నంబరు వుంది. రింగ్ చేయండి. కారు పంపిస్తారట!"
    ఇబ్బందిగా ముఖం పెట్టేడు రవి. అతనికి మొదటినుంచీ ఎవరినీ, దేనికీ యిబ్బంది పెట్టటం యిష్టంలేదు.
    "అంకుల్ చెప్పారు. ఆయన కోసం వెళ్ళేవాళ్ళు టాక్సీలో వెళితే ఆయనకి కోపమట. ఆయన యింటికి బంధువులు వస్తే ఆయన వెళ్ళమనేదాకా వెళ్ళకూడదు. అక్కడ వున్నన్ని రోజులూ ఆయన చెప్పినట్టే వినాలిట. అదీ ఆయన తత్వం__"
    "బావుంది. ఇంకేం__" మరేమీ అనకుండా ఫోన్ చేశాడు రవి. అక్కడ ఆయన పి.ఏ. ఫోన్ చేశాడు. ఇలా హైద్రాబాద్ నుంచి వచ్చారనీ, లాయర్ విశ్వేశ్వరంగారు పంపారనీ చెప్పగానే వెంటనే కారు పంపుతున్నాననీ, వీళ్ళు వచ్చేలోగా అయ్యగారికి చెబుతాననీ అన్నాడతను.
    ఇద్దరూ స్టాండులో వెయిట్ చేస్తూ వుండగానే వాళ్లు చెప్పిన కారు వచ్చేసింది. నంబర్ చూసి కారు వద్దకి నడిచారిద్దరూ. పెద్దగా లగేజ్ లేదు. పోర్టరు తెచ్చి పెట్టేడు. కారు కదిలింది.
    ఇంతకు పూర్వం యిద్దరూ మద్రాసు చూళ్ళేదు. అప్పుడప్పుడే నిద్దర్లేచినట్టుగా వుంది నగరం. ఇంకా బాగా వెలుతురు పరుచుకోకముందే అంతా తయారైపోతున్నారు బస్సులో.
    "మద్రాసులో నాలుగింటికే తెల్లవారుతుంది ప్రజలకి. ఆరింటికంతా బస్సు క్యూలో వుంటారు. హైద్రాబాద్ లో లాగా కాదు!" అన్నాడు రవి.
    "గుడ్ హాబిట్!"
    "మనం తమిళుల నుంచి నేర్చుకోవలసింది యెంతో వుంది!"
    "అవును!"
    "స్వప్నా! సింప్లిసిటీ అంతా వాళ్ళకే స్వంతం. తిండిలో బట్టలో అంతా జస్ట్ ఫర్ లివింగ్ అన్నట్టుగా వుంటారు."
    "ఊఁ"
    "వీళ్ళకి పేటెంట్ ఇడ్లీ సాంబారు!"
    "ఊఁ"
    "లుంగీ, అరచేతుల చొక్కా వీళ్ళ డ్రస్!"
    "ఇంకాఁ"
    "చాప, దిండు, దుప్పటి వీళ్ళ బెడ్డింగ్ అంతే."
    ఫక్కున నవ్వింది స్వప్న.
    "ఏం నవ్వుతున్నావ్?"
    "బాగా స్టడీ చేసినట్టుగా చెబుతున్నారే!"
    "అవును విన్నాను__"
    "వినేదానికి చూసే దానికి ఎంతో దూరం__"
    "ఇప్పుడు చూస్తాం కదా!"
    అంతలో కారు కాంపౌండ్ లోకి ప్రవేశించటంతో మాటలు ఆగిపోయాయి.
    వీళ్ళు కారు దిగేసరికి నాయుడు గారు కారిడార్ లో నుంచుని వున్నారు.
    "నమస్తే" ముందుగా ఆయనే నమస్కరిస్తూ పలుకరించారు.
    ఇద్దరూ తిరిగి నమస్కారం చేశారు.
    "ఈమె స్వప్న! అమ్మమ్మగారి మనవరాలు కదూ?"
    "అవునండీ!"
    "నువ్వామె బెస్టు సెలక్షన్ రవి!"
    నవ్వుతూ తలూపేడు రవి.
    "లోపలికి రండి!" కదులుతూ అన్నాడు. "మా విశ్వేశ్వరం రాత్రి ఫోన్ లో చెప్పాడు. లక్కీగా రాత్రి దొరికేను. నిన్ననే బాంబే నుంచి వచ్చాను. పదిహేను రోజులుగా వూళ్ళో లేను. హిందీ పిక్చర్ ప్రారంభిస్తున్నాను. కాస్టింగ్ కోసం వెళ్ళేను!"
    సినిమా సెట్టింగ్ కంటే అందంగా కళాత్మకంగా వుంది యిల్లు.
    "మీరు లాడ్జిలో దిగాలనుకుంటున్నట్టుగా చెప్పాడు విన్ను. నేనుండగా యింకా లాడ్జి ఎందుకు? మా యింట్లో మీకు లాడ్జిలో లాగే అన్నీ అమరుస్తాను. ఓ బాయ్ ని మీ కోసం వదిలేస్తాను. మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. టాప్ ఫ్లోర్ లో ఓ గది వుంది. అది నాకోసం మా ఆర్ట్ డిజైనర్ డిజైన్ చేశాడు. చూస్తారా?"
    "అలాగేనండీ!"
    "విస్సు నాకు బెస్ట్ ఫ్రెండ్! అంతేకాదు ఓ విషయంలో నన్ను చాలా బాగా సేవ్ చేశాడు. ఓ డిస్ట్రిబ్యూటర్ నా ఫిల్మ్ ని తీసుకుని దగా చేయబోతే ముక్కుతాడు వేసి బిగించి లాగినట్టు డిఫర్మేషన్ కి దావావేసి ఆరు లక్షలు వసూలు చేశాడు. లేకపోతే నేను ఆ కేసులో దాదాపు టెన్ లాక్స్ నష్టపోయేవాడిని. పైగా హైద్రాబాద్ ఏరియాలో పిక్చర్ డిస్ట్రిబ్యూట్ అయ్యేది కాదు" లిఫ్ట్ లో వెళుతూ చెప్పారు నాయుడుగారు.
    లిఫ్ట్ దిగి నడుస్తూ "అదిగో అదే రూమ్! కొత్త పిక్చర్ కి ప్లాన్స్ వేసుకోవాలన్నా, కొత్త కథని ఆలోచించాలన్నా యిక్కడికి వస్తాను. నేను రిలాక్స్ కావాలంటే యిక్కడికి వస్తాను. సమ్మర్ లో ఎక్కడికీ వెళ్ళను. ఇదే నా ఊటీ, ఇదే నా కాశ్మీర్__ఇదే నా సిమ్లా__" అన్నాడు.
    "వెరీ కంటెండెడ్ అన్నమాట."
    "ఊఁ"
    ఇద్దరూ వెంటరాగా తలుపు వద్దకి వెళ్ళాక "ఈ గది పేరు సర్గమ్_చూడండి. ఇవి సప్తస్వరాలు. వీటిపై అవరోహణ క్రమంలో నొక్కితే తలుపు తెరుచుకుంటుంది." అన్నాడు.
    సప్తస్వరాలు నొక్కాడు. తలుపులు మధుర స్వరాన్ని సృష్టిస్తూ విడిపోయాయి.
    "అద్భుతం" అంది స్వప్న.
    "ముందుగా నువ్వు లోపలికి అడుగు పెట్టు!"
    స్వప్న అడుగు పెట్టగానే షెహనాయ్ మ్రోగింది. రవి అడుగు పెడుతూనే మరో షెహనాయ్ తో కలసి జంట నాదస్వరాలు దేవగాంధారిలో పలికాయి.
    విస్తుబోయారిద్దరూ.
    "మీరు ఈ కార్పెట్ పై అడుగుపెడితే ఆ ప్రెషర్ కి అవి మోగుతాయి. మీకు స్వాగతమన్నమాట" నవ్వుతూ అన్నారు నాయుడుగారు.  
    ఆ గది ఇంద్ర భవనంలా వుంది.
    "ఆ సోఫా మీద కూర్చోండి." తనో చిన్న సోఫాలో కూర్చుంటూ అన్నాడాయన. ఇద్దరూ కూర్చోగానే జంట కోయిలలు "కుహూ కుహూ" అన్నాయి.
    "ఆ సోఫాకి స్విచ్ వుంది నొక్కండి. క్రింద కిచెన్ రూంలో మోగుతుంది. వెంటనే అతను ఇంటర్ కం ఎత్తుతాడు. దీనికి స్పీకర్స్ ఎరేంజ్ చేశాను. మీ మాటలు వినిపిస్తాయి. మీకు వాడి మాటలు రిసీవర్ ద్వారా వినిపిస్తాయి. ఆర్దరిస్తే వెంటనే తెస్తాడు!"
    మాయా మంత్ర తంత్ర మందిరంలా అనిపించింది.
    "దీనికి ఎటాచ్డ్ బాత్ రూం వుంది! ఒక్క మాటలో చెప్పాలంటే మీరు యిక్కడి నుంచి క్రిందికి వెళ్ళక్కరలేదు."
    "థాంక్స్."
    "బాగా రిలాక్స్ అవ్వండి. తర్వాత కలుద్దాం. అన్నట్టు షూటింగ్ చూస్తారా."
    "ఊహూఁ"
    "సరే! మీ యిష్టం. రికార్డింగ్ చూద్దామంటే జెమినీకి వెళదాం. సాయంకారం సుశీలగారు పాడతారు."
    తలూపింది స్వప్న.
    "రేపు ఓ ఫంక్షన్ వుంది. మనం వెళదాం. అక్కడ ఫిల్మిం ఇండస్ట్రీ అంతా వుంటుంది చూద్దురుగాని."
    తలూపారు ఇద్దరూ__
    వాళ్ళకి ఆయనతో ఏం మాటాడటానికి తోచటం లేదు.
    "సరే వస్తాను. నాకూ కొంత పని వుంది." లేచారాయన.
    ఆయన వెళ్ళగానే తలుపులు ఆటోమేటిక్ గా మూసుకున్నాయి.
    ఇద్దరూ ముఖా ముఖాలు చూసుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS