"అయితే, ఈ ప్రాసెస్ లో ఒక్కోసారి పోలీసులను చూసిన భయంతో కూడా అలాంటి ఒత్తిడికి మనిషి గురయ్యే అవకాశ ముందని ఈ లై డిటెక్టర్స్ ను న్యాయబద్దం కాదని నిర్ణయించిన దేశం ఆస్త్రేలియా. అసలు అమెరికాలో 1980 ముందు దాకా జాబ్స్ రిక్రూట్ మెంటు లో కూడా ఉపయోగించే ఈ లై డిటెక్టర్ ను కంట్రోవర్షియల్ గా కొందరు ఎంటర్ ప్రిన్యుర్స్ నిర్ధారించటానికి కారణం న్యూయార్క్ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో జరిగిన సంఘటన. ఉద్యోగంలో చేరిన షామా హోల్ మన్ అనే ఓ అమ్మాయి డ్రగ్ డీలర్ గా కొంత కాలం జైలులో ఉండి వచ్చినట్టుగా లై డిటెక్టర్ కంట్రోల్ క్వశ్చన్ లో తేలింది. అయితే ఆ తర్వాత పరిశోధనలో అది అబద్దంగా నిరూపితమైంది. అప్పటి నుంచి....." చెబుతున్న వాడల్లా ఆగిపోయాడు.
కిన్నెర లేదక్కడ. టాయిలెట్ లో నుంచి సన్నని మూలుగు వినిపించింది.
పరుగున వెళ్ళి చూసేసరికి కిన్నెర కడుపు పట్టుకుని మూలుగుతుంది.
"ఏమైంది?" అందోళనగా అడిగాడు. "చెప్పు కిన్నెరా!"
కొన్ని క్షణాల పాటు తల వంచుకుని నిలబడ్డ కిన్నెర "సారీ!" అంది నిరాసాన్ని అభినయిస్తూ. "నేను ఓడినా అంగికరించలేకపోతున్నాను. ఎందుకంటే ఓ మూడు రోజులు మీరు నాకు దూరంగా వుండాలి కాబట్టి....."
నమ్మేశాడు మనస్పూర్తిగా. "ఫరవాలేదు. మరి ఏదో నొప్పిలా అలా మూలుగుతున్నావేమిటి?"
"ప్రతి నెలా ఇది నాకు మాములే.'
"డాక్టరు దగ్గరికి వెళదాం." చాలా సహజంగా అడిగాడు కాని, వారిస్తున్నట్టుగా అంది....."ఫర్వాలేదు. తగ్గిపోయింది."
"నా మాట విను, డాక్టరు దగ్గరికి" బలవంతంగా అమెను ఒప్పించబోయాడు.
"చెబితే అర్ధం చేసుకోరేం? నేను ఓ.కే......." కొంచెం విసుగు ప్రదర్శించింది.
ఒకవేళ నిజంగా డాక్టరు దగ్గరికి తీసుకెళితే తను ఆడింది నాటకమని అర్ధమైపోతుంది. ఆ తర్వాత రాఘవకు తను మొహం చూపించలేదు.
"పోనీ బామ్మకు చెబుతాను.'
కిన్నెర అపబోయినా వినకుండా వేగంగా బయటికి నడిచాడు. రెండు నిమిషాలలో బామ్మతో గదిలోకి వచ్చాడు.
"ఎమైందమ్మా?" ఇప్పుడు రాఘవను మించి బామ్మ కంగారు పడిపోతుంటే, ఇది క్రమంగా ఓ ఘోరం జరిగినట్టు లోగిలిలోని అందరి వ్యక్తులకి చేరేట్టుందనిపించింది కిన్నేరకు.
రాఘవను చూస్తూ అంది బామ్మ "ఓరి బడుద్దాయి! నువ్వు బయటికి నడు!"
క్షణం పాటు అచేతనంగా నిలబడిపోయిన రాఘవ ఆ తర్వాత డాబా పైకి నడిచాడు.
"ఏమిటే, పిచ్చి పిల్లా?" రెట్టిస్తుంది మాణిక్యమ్మ.
"ఏం కాలేదు బామ్మా!"
"ఏం కాకుండా వాడంత కంగారెందుకు పడతాడు? కడుపు నొప్పి దేనికి? బయటున్నావా?"
ఆ 'బయట' నే పదం కిన్నేరకు తెలినిది. అందుకే సీరియస్ గా అంది. "లేదు లోపలే వున్నాను.'
అంత కంగారులోను నవ్వేసింది బామ్మ- "పిచ్చిపిల్లా! బయటంటే-- చెవిలో చెప్పింది రహస్యంగా.
"లేదు. యింకా వారం. పది రోజులు టైముంది, బామ్మగారు!"
"మరేం జరిగింది?"
"ఏదో నొప్పి, అంతే!"
"అందుకేనే పిచ్చిపిల్లా, నీలా సుకుమారంగా పెరిగిన ఆడపిల్లలు బయట భోజనం చేయకూడదు. మీరిద్దరూ ఎక్కడో భోంచేశారనగానే అనుకున్నాను యిలాంటిదేదో జరుగుతుందని అయినా వీడిది మరీ చోద్యమమ్మా రెండు చెంచాల అల్లం కషాయంతో పోయేదానికి యింత హడావుడి చేశాడు. కషాయం తెమ్మంటావా?"
"వద్దు బామ్మా! తగ్గిపోయిందిగా?"
"నిట్టుర్పులా అంది బామ్మ. "సరేలే.....పడుకోండిక."
బామ్మ వెళ్ళిన పది నిమిషాలకు గదిలోకి వచ్చాడు రాఘవ. "ఇప్పుడు ఎలా వుంది?" పక్కపై ఓ వారగా పడుకున్న కిన్నెర పక్కన కూర్చుని అనునయంగా అడిగాడు.
"ఇంకా కాస్త నొప్పిగానే వుంది. తగ్గిపోతుంది- బామ్మ మంత్రం వేసిందిగా!" నవ్వేసింది.
ఇక ఆ రాత్రికి ఆమెను తాకలేదు రాఘవ.
వెల్లకిలా పడుకుని పై కప్పు కేసి చూస్తున్న రాఘవను చూస్తూ రెండు నిమిషాల తర్వాత అడిగింది --"బాగా డిజప్పాయింటయ్యారు కదూ!"
