Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 45

 

    ఈ వేళ మరీ రెచ్చిపోతున్నాడు రాఘవ. పడక గదిలో అడుగు పెట్టడానికే భయంగా ఉంది.


    అయినా తొమ్మిది నలభై అయిదు నిమిషాల కల్లా లోపలికి వచ్చింది. ఏదో చదువుతున్న రాఘవ నవ్వుకుంటున్నాడు తనలో తానే.


    "ఏమిటి?"


    "వారపత్రికలో జోక్."


    "బాగుందా!" అంది అతడి సమీపంలో కూర్చుంటు.


    మాటలతో తప్ప రాఘవను మభ్యపెట్టడం కష్టమనిపించి, "ఏమిటది?" అంది తనూ ఆసక్తిని చూపిస్తున్నట్లుగా.


    "వెనుకటికి ఓ చాదస్తపు తల్లికి నా లాంటి కొడుకు ఉండేవాడు. పెళ్ళి చేసుకోరా అబ్బీ అంటూ తెగ వెంటపడేదట. అయితే పెళ్ళి చూపులకు వెళ్ళిన ప్రతిసారి ఈ అమ్మాయి నాలాగా పాతకాలంది కాదు, మరో అమ్మాయి కట్టూ, బొట్టూ నాలా లేదు, ఇంకో అమ్మాయి నాలాగా వంట తెలిసిన దానిలా లెదూ అంటూ తనే సంబంధాలు సెటిల్ కాకుండా అడ్డుపడేదట! ఆలాంటి సమయంలో ఓ స్నేహితుడు ఆ అబ్బాయికి సలహా ఇచ్చాడట. మీ అమ్మలాంటి అలవాట్లున్న ఆమ్మాయినే కట్టుకుంటే సమస్య పరిష్కారమవుతుంది కదరా అంటే, చాలా గాలించి ఓ పిల్ల నచ్చింది అన్నాడట. వాళ్ళమ్మ ఓ.కే. అంది. అంతే! ఈసారి తండ్రి అడ్డం పడ్డాడట.'


    "ఎందుకు?"


    "మీ అమ్మలాంటి ఆడపిల్లను కట్టుకుంటే నాలాగే జీవిత మంతా ఇబ్బంది పడాల్సివస్తుంది అని."


    పకాలున నవ్వింది.


    "ఇప్పుడు నేనూ అలా సఫర్ అవుతున్నానని కాదు కిన్నెర కనీసం ఈరోజన్నా కరుణించేశావనుకో.....!"


    "అదేం కుదరదు. మన ఒప్పందం ప్రకారం మీరు నన్ను ఓడించాలి."


    "ఓడిస్తాను.' ధీమాగా చెప్పాడు. "కాని, నువ్వు ఒట్టోడియాలు ఎలా చేస్తారు, గుత్తొంకాయ కూర గుజరాత్ లో ఎలా చేస్తారంటూ పిచ్చి ప్రశ్నలు వేయకూడదు.'


    "ఓ.కే.!" నిబ్బరంగా అంది కిన్నెర.

    
    అసలు అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆమె ఎంత గట్టి కృషి చేసి ప్రశ్నలు సేకరించింది రాఘవకు తెలియదు.


    మధ్యాహ్నం బ్యాంకుకు వెళ్ళేముందు లైబ్రరీలో చాలా పకడ్బందిగా ప్రిపెరయిపోయింది.


    "కానియ్!" తొందర చేశాడు రాఘవ ఇక ఆలస్యం తాళలేనట్టుగా.


    "ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను.'


    "వెరి గుడ్!"


    అమ్మవారికి మనసులోనే మొక్కుకుంది కిన్నెర.


    "ఒక మనిషి అబద్దం చెబుతుంటే తెలుసుకోవటానికి పోలీసులు 'లై డిటెక్టర్స్ ' అని వాడుతుంటారుగా. అది యిప్పటికి అమెరికా లాంటి దేశాలలో క్రిమినల్స్ నుంచి నిజాన్ని రాబట్టటానికి పోలిస్ ఫోర్సెస్ ఉపయోగిస్తున్నా, ప్రపంచంలో ఓ దేశం దాన్ని అన్యాయంగా నిర్ణయించింది. ఆ దేశం ఏది? అసలు తొలిసారి ఈ లై డిటెక్టర్ ని ఎప్పుడు, ఎవరు కనుగొన్నారు? 1980 దాకా అమెరికా లాంటి దేశాలలో జాబ్ రిక్రూట్ మెంట్స్ లై డిటెక్టర్స్ ని వాడే కంపెనీలు ఎందుకు, ఏ కేసుతో లై డిటెక్టర్స్ సక్రమం కాదని వాడటం మానేశాయి. ఈ కేసు వివరాలు ఏమిటి?"


    ఒకటని చెప్పి పది ప్రశ్నల దాకా అయినా ఒకే ప్రశ్నలో ఇమిడ్చింది. చెప్పలేడని బలంగా నమ్మింది కాని, "వహ్వా!" అన్నాడు రాఘవా జవాబు తెలిసినట్టుగా.


    భయంతో కంపించిపోయింది కిన్నెర.


    "ఇదెంతని కిన్నెరా! అర నిమిషంలో చెప్పేస్తాను!"


    కిన్నెర అడిరిపడుతూ అడ్డం పడింది. "ఒక్క అక్షరం పొల్లు పోయినా నేను అంగికరించను.!"


    "ఆ సమస్యే లేదు. అసలే ఐయ్యేయెస్ కి ప్రిపేరైన వాణ్ణి ఈ ప్రశ్నేంతని?"


    కిన్నెర నుదుట స్వేదం పేరుకుంటుంది.


    "నువ్వు ప్రశ్న ఎక్కడో ప్రారంభించి , మరెక్కడికో వెళ్ళావు. నేను క్రమంలో చెబుతాను కిన్నెరా!" రాఘవకు ఎంత ఉత్సాహంగా ఉందంటే , కిన్నెర ఈ రోజు పూర్తిగా ఓడిపోతుందన్న సంతోషంలో అడిగిన దానికి మించి జవాబు చెప్పాలన్న ఆవేశం వచ్చేసింది.


    "మొట్టమొదటి మోడరన్ 'లై డిటెక్టర్ ను డెవలప్ చేసింది 1921 లో . ఆ వ్యక్తి పేరు జాన్ ఎలార్సన్. కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెడికల్ స్టూడెంట్. కనిపెట్టింది అడిగితే డెవలప్ చేసిన వ్యక్తీ పేరు చెప్పినందుకు మీరు ఓడిపోయారు అంటావు కాబట్టి, అసలు దీనికి కారణం కూడా చెబుతాను. అబద్దం చెప్పేవాడు ఎమోషనల్ గా ఒత్తిడికి గురవుతాడని, ఆ ఒత్తిడి ఉచ్వాస నిశ్వసాలా వేగాన్ని, పల్స్ రేట్ ని పెంచి చెమట పట్టిస్తుందని, వాటిని రిక్కర్డ్ చేయడం ద్వారా అబద్దం చెప్పే వాడిని గుర్తించొచ్చని గ్రహించి, అలాంటి యంత్రాన్ని తొలిసారి కనిపెట్టింది ఇటలీకి చెందిన క్రిమినాలజిస్ట్ సీఆర్ లాంబ్రోసో.......! 1890 లో."


    ఇప్పుడు కిన్నెర పల్స్ రేట్ పెరిగిపోతుంది భీతావహంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS