"చెప్పండి మధూళీ....నేను కూడా మరో యిష్టపడ్డ మగాడితో శారీరకంగా కలిస్తే నా మాజీ భర్త నన్ను క్షమించగలడా?"
మధూళీ భ్రుకుటి ముడిపడింది.
"ఒక దీపంతో మరో దీపం వెలిగించమని చెప్పగలనే తప్ప హత్యకి జవాబు హత్యే అనగల సాహసం లేనిదాన్ని సామ్రాజ్యంగారూ! అసలు యిలాంటి ప్రశ్న మీరెండుకడిగారో నాకు తెలిదు. 'ఎంగర్ ఈజ్ బ్రిప్ మెడ్ నెస్' అన్న వాక్యానికి ఇప్పటి మీ ఆలోచన ఉదాహరణయితే పర్వాలేదు కానీ అలా చేయడం ద్వారా మీరు అహం చల్లార్చుకోవడం ఆనిపించుకుంటుంది."
తను నోరు జారి పొరపాటు చేసిందా?
సామ్రాజ్యం ఆలోచిస్తున్నది.
అసలది నోరు జారడం ఎలా అవుతుంది?
ఎప్పుడో వదిలేసిన సంజీవి అనే వ్యక్తీ జ్ఞాపకాల నుంచి తేరుకోవటానికి ధన్వికి ముందు స్నేహితురాలైంది, ఆ తరువాత అతడి వ్యక్తిత్వాన్ని యిష్టపడి మానసికంగా దగ్గరైంది. ఇప్పుడు అతడి బిడ్డకు తల్లిగా మారి ఎవరికి భార్య కాకపోయినా ఫర్వాలేదు,కోరిన మగాడి బిడ్డకి తల్లిగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటుంది.
ఈ ఆలోచనలో అనాగరికత వుండొచ్చు. కానీ అలా జీవించటాన్ని ఆమె మనస్పూర్తిగా కోరుకుంటుందా? లేక కోరుకుంటున్నట్టు నటిస్తుందా?
"నేను చెప్పింది నాకు తోచిన జవాబు సామ్రాజ్యంగారూ! అంతే తప్ప అది అందరూ చెప్పే జవాబు మాత్రం కాదు."
సామ్రాజ్యాన్ని చూస్తూ నిశ్శబ్దాన్ని భంగపరిచింది మధూళీ.
"అసలు యిలాంటి సమస్యలకి జవాబులు మనుష్యుల వ్యక్తిత్వాన్ని బట్టి మారిపోతుంటాయి.....సో....మీరు విచక్షణ గల వ్యక్తే కాబట్టి మంచి చెడులు నిర్ణయించుకోవాల్సింది మీరే. అయినా మీ ఫ్రెండ్ నీ ఓ మాట అడగాల్సింది."
సామ్రాజ్యం సాలోచనగా చూసింది.
"నేను చెబుతున్నది ధన్వి గురించి." క్లారిఫై చేసింది మధూళీ. "ఆయనైతే ఖచ్చితమైన జవాబు చెప్పగలరేమో!"
జవాబే ధన్వి అయినప్పుడు ధన్వి నుండి మరో జవాబు ఎలా రాబట్టగలదని?
"మధూళీ......" విసుగేత్తుతున్న ఏకాంతం నుంచి బయటపడి ఏ అజ్ఞాత అతిధి తలపు కోసమో గుండె తెరిచి మొండిగా ఆలోచిస్తున్న సామ్రాజ్యం అంది నిర్లిప్తంగా "ధన్విని తరచూ కలుస్తూ ఒక రచయిత్రిగా ధన్వి వ్యక్తిత్వాన్ని చాలా కోణాల్లో చూడగలుగుతున్నరుగా. సో.....ఇదే సమస్యకి ధన్వి అయితే ఏం జవాబు చెబుతాడో మిరుహించగలరా?"
మధూళీ విచ్చుకున్న పెదవులతో ధన్వి రూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది. జ్ఞానదాహంతో ఖగోళంలో అనవరతము కదిలే కాంతి బిందువులా అనిపించే ధన్వి తలపుల ధ్యానంలో నుంచి తేరుకుని చెప్పింది--
"ధన్విలా ఖచ్చితంగా నేను చెప్పగాలనో లేదో నాకు తెలిదు సామ్రాజ్యంగారూ! అసలు ధన్వి యిలాంటి విషయాలకి అంతగా ప్రాధాన్యతనిస్తాడన్నా నేను నమ్మలేను. నాకు తెలిసి ధన్వి దృష్టిలో పతనమంటే స్వాభిమానాన్ని చంపుకుని బ్రతకడం. అలా చంపుకోవదాన్ని కూడా అభిమానించే వ్యక్తులు ఎదురయితే సక్రమంగా బ్రతకడం చేతకాని వాళ్ళు అనుకుంటాడే తప్ప అక్రమంగా బ్రతికే వ్యక్తులని అసహ్యించుకోడు....."
"కానీ నైతిక విలువల్లేని వాళ్ళన్నా అవినీతిపరులన్నా అయిష్టపడతాడుగా" గుర్తుచేసింది సామ్రాజ్యం.
"అలా ఆవేశపడేది సంఘమితంగా విస్తరించి ఆలోచించేటప్పుడే తప్ప నైయుక్తికమైన జీవితానికి పరిమితమైనాప్పుడు కాదు."
ఉదయం ధన్వితో జరిగిన చర్చలో వచ్చిన అతి ముఖ్యమైన అంశాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పింది మధూళీ.
సామ్రాజ్యానికి అదోలా వుంది.
అదికాదు....
నిన్నగాక మొన్న ధన్వికి పరిచయమయిన మధూళీ తనను మించి అతడి గురించి ఆలోచించటాన్ని , విలక్షణంగా విశ్లేషించడాన్ని తట్టుకోలేకపోయిందేమో" ధన్విని ప్రేమిస్తున్నావా మధూళీ!"
మధూళీ ముందు ఉలిక్కిపడింది.
తలపుల ద్వారాల్ని మూసుకుని అమావాస్య చీకటిలో కనుసైగాలా నుంచి ధన్విని తను ప్రేమిస్తుందా! ఇప్పటిదాకా పూర్తిగా రూపమేర్పడని చిత్రాన్ని సామ్రాజ్యం ఏ ఉపనిషద్వాక్యాలతోనో ఆశీర్వదించి క్షణాలను ఏకాంతంతో నింపేసింది ఎందుకని?
తనువుని ఏ పూలధనువో తాకి యోగ్యనిద్ర నుంచి మేల్కొలిపినట్టు వింతగా వుంది.
"ప్రేమించాను అనటానికి సంకోచించను సామ్రాజ్యంగారూ......మనసు ఒత్తిడికి వ్యక్తిత్వాన్ని పెట్టుబడిగా పెట్టని అతని ఆలోచనలే నేను కోరుకునే భిన్నత్వమే కనిపించిందో నాకు తెలిదు కానీ అతడ్ని యిష్టపడుతున్నాను. అదొక్కటే కాదు, తట్టుకోలేనంత విషాదాన్ని నింపే సంఘటనల్ని కూడా సహజలుగా భావించే అతడి వుహల్ని వింటూ, చితిమంటల్ని కూడా చీకటి చిల్చే వెలుగు రేఖలుగా మార్చొచ్చు అనే అతడి ఆశావాదం చూస్తూ అతని మీద అరాధన్ని పెంచుకుంటున్నాను, అక్కగా మీ ఆశిస్సులు నాకుంటే అతడ్ని నా మనిషిగా మార్చుకుంటాను."
సామ్రాజ్యం విస్మయంగా చూసింది.
అక్కగా మీ ఆశీస్సులు కావాలంటూ మధూళీ తనని ఆమె ప్రేమలో ఓ పాత్రగా మలిచేసరికి అవాక్కయిన సామ్రాజ్యం తన గొంతు విచిత్రంగా వినిపిస్తుంటే నవ్వుని అభినయిస్తూ అంది "ష్యూర్..... నా సహకారం ఎప్పుడూ వుంటుంది మధూళీ."
"అర్జెంట్ గా మీరు నాకింకో సహకారానికి సిద్దపడాలి."
"చెప్పండి" అంది సామ్రాజ్యం అర్ధం కానట్టు చూస్తూ.
