ఆ ప్రశ్నకు జవాబు దొరికితే నాకు సుబ్బరామయ్య రెండు బస్తాల ధాన్యం ఇంటికి పంపిస్తాడు.
ఆ మరుసటి రోజు నేను ఒక్కదాన్నే సుబ్బరామయ్య ఏటిభూముల దగ్గరికి వెళ్ళాను.
అక్కడికి ఎవరూ రాలేదు. ఏ స్త్రీ గానీ అక్కడ అనుమానం పరిస్థితుల్లో తిరగాడలేదు.
ఇంటికి తిరిగి వచ్చాక గోకుల్ తో అవీ ఇవీ మాట్లాడుతూ కూర్చున్నాను.
అతను నేనడిగిన దానికి పాపం తీరిగ్గానే జవాబులు చెబుతున్నాడు.
"మన వూరి నుంచి కూలీలు బాగా వస్తున్నారా?" అనడిగాను.
"లేదు ఆ పొలంలో పని చేయడానికి మన ఊరి వాళ్ళను పిలవడం లేదు. అంతా అటు పక్కనున్న ఊరినుంచే పిలుచుకొస్తున్నాను...." అతను ఏదో చెబుతున్నాడు గానీ నేను మాత్రం అక్కడే ఆగిపోయాను.
అయితే రహస్యం తాలూకు వేర్లు పక్క ఊర్లో వున్నాయన్న అనుమానం మొదలైంది.
ఆ వూర్లో అమ్మాయే గోకుల్ మనసు దోచుకుని వుంటుందని అర్ధమైంది.
ఆ రోజు సాయంకాలమే ఆ వూరు వెళ్ళాను.
గోకుల్ పొలంలో పనిచేసిన వాళ్ళలో కొందరితో మాట్లాడాను. వాళ్ళల్లో ఎవరూ కారు. అయితే వాళ్ళతో మాట్లాడడం వల్ల నాకు మరో కొత్త విషయం తెలిసింది.
"మమ్మల్ని అతను ఏ రోజూ కూలీకి పిలవలేదు. పార్వతమ్మ పద్మజ వచ్చి పిలిచేవాళ్ళు కూలీడబ్బులు కూడా వాళ్ళే అతనిచేత తీసి ఇచ్చేవాళ్ళు" అని చెప్పడంతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు గోకుల్ స్నేహితురాలు అయి వుండే అవకాశం వుంటుందని తోచింది.
లేదంటే అంత అభిమానంతో కూలీల్ని పిలిచి పనులు చేయించరు.
వెంటనే పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాను.
"ఉప్పుడు బియ్యం కావాలి డబ్బులకి" అని అడిగాను. ఏదో ఒక కారణం చెప్పకుండా మాటల్ని కలపలేం గదా.
"నేను అమ్మను స్టోర్స్ రాజు అమ్ముతాడు" అని పార్వతమ్మ చెప్పి ఇంట్లోకి వెళుతున్నప్పుడు "కాసిన్ని మంచినీళ్ళివ్వు- అలిసిపోయాను" అని అడిగి అవీ ఇవీ మాట్లాడుతూ కూర్చున్నాను.
ఆమెని చూసినప్పుడు ఆమె అయివుండదని ఎలా అనిపించిందో పద్మజకు చూసినప్పుడు ఖచ్చితంగా ఈమె అయివుంటుందనిపించింది.
అంత చక్కటి అమ్మాయిని, అంత నెమ్మదస్తురాలిని ఏ మగాడూ వదులుకోడు.
మాటల్లో కూడా ఆమె గోకుల్ స్నేహితురాలని అనిపించింది. అయితే దీనిని నిరూపించడం ఎలా? కన్ ఫర్మ్ గా తెలుసుకోవడం ఎలా?
రోజులు గడుస్తున్నాయి.
వాళ్ళిద్దరూ ఎక్కడా చిక్కడం లేదు. నేను ఆ ఆలోచనలో వుండగానే పద్మజ వూర్లోంచి నాకు పెళ్ళి పిలుపు వచ్చింది.
ఆ ఊర్లో రామచంద్రయ్య అనే రైతు వున్నాడు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయన కూతురికి పెళ్ళి ఆ ఊర్లోనే పెళ్ళి జరిపిస్తున్నారు. తెల్లవారుజామున ముహూర్తం గనుక అంతకు ముందురోజు రాత్రి విందు.
పెళ్ళి పద్మజ ఊర్లో కాబట్టి వెళ్ళదలుచుకున్నాను.
రామచంద్రయ్య మన పల్లెలో కూడా చాలామందికి పెళ్ళి పత్రికలు ఇచ్చాడు. కాబట్టి పెళ్ళి విందుకు చాలామందే బయల్దేరారు.
నేనూ కొందరమ్మ లక్కలతో కలిసి వెళ్ళాం. మరీ ఎక్కువ కాదు కానీ జనం బాగానే వున్నారు.
నేను వెళ్ళేటప్పటికి రెండో బంతి జరుగుతోంది.
మూడో బంతికి నేను కూర్చున్నాను.
కలిసొచ్చిన అంశం ఏమిటంటే పద్మజ కూడా అదే బంతికి వచ్చింది.
ఒక వరసలో ఆడవాళ్ళం కూర్చుంటే ఎదురుగా వున్న వరసలో మగవాళ్ళు కూర్చుంటున్నారు.
ఆ బంతికి జనం ఎక్కువగా లేకపోవడంతో అక్కడక్కడ ఖాళీగా వున్నాయి.
వడ్డన ప్రారంభమైంది.
ఓ స్వీటు, ఓ హాటుతో పాటు చిత్రాన్నం కూడా వేశారు.
కూరలు వడ్డిస్తున్నప్పుడు గోకుల్ వచ్చి మా ముందు వరసలో కూర్చున్నాడు.
వాళ్ళిద్దరూ ఒకర్ని చూసి ఒకరు పలకరింపుగా నవ్వుకోవడం గమనించాను.
గోకుల్ అప్పుడే వచ్చాడు గనుక అతని విస్తర్లో స్వీటు, హాటూ వేయలేదు. అప్పుడు వడ్డిస్తున్న కూరలు మాత్రం వేశారు.
"రేయి సుబ్బరామయ్య కొడుకు గోకుల్ కి స్వీటూ, హాటూ పట్టుకురండర్రా" అని వడ్డనను పర్యవేక్షిస్తున్న ఓ వ్యక్తి అరిచాడు.
కొంతసేపు చూశాడుగానీ ఎవరూ రాలేదు.
ఏదో పనిమీద అతను వెళ్ళిపోయాడు.
గోకుల్ కి స్వీటూ హాటూ రాలేదు.
అతని పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న ఓ వ్యక్తి కూడా చెప్పాడు గానీ ఎవరూ దాన్ని పట్టించుకోలేదు.
అప్పటికే మిగిలినవి వడ్డిస్తూ వడ్డనగాళ్ళు బిజీగా వున్నారు.
ఇదంతా చూస్తున్న పద్మజ యిక నిలవలేక పోయింది.
తింటున్నది మధ్యలో ఆపి పైకి లేచింది. అలా అర్దాంతరంగా ఎందుకు లేచిందో నా కర్ధం కాలేదు.
నేరుగా లోపలికి వెళ్ళి తిరిగొచ్చింది.
ఓ ప్లేటులో స్వీటూ, హాటూ, చిత్రాన్నం తీసుకొచ్చి గోకుల్ కి వడ్డించింది.
తిరిగి తన ఆకు దగ్గరికి వచ్చి తినడం ప్రారంభించింది.
అందుకన్న మాట మధ్యలో లేచింది.
ఇక సందేహం లేదు. గోకుల్ ప్రేయసి పద్మజే.
పెళ్ళినుంచి నేరుగా సుబ్బరామయ్య యింటికి వెళ్ళి చెప్పేశాను.
కాబట్టే కొత్త సంబంధం బయటపడకుండా వుండాలంటే తీసుకోవాల్సిన మూడో జాగ్రత్త ఏమిటంటే పబ్లిక్ గా అవతలి వ్యక్తి మీద మన ప్రేమను వ్యక్తపరచకూడదు.
