Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 46


    ధృతి వెనక్కితిరిగి వారికి నమస్కరించింది.
    
    వాళ్ళు ఆమెని రెప్పవెయ్యకుండా చూశారే తప్ప ప్రతిస్పందించలేదు.
    
    "మీ నాన్నగారు ఏం చేస్తూ వుంటారు?" అతని తండ్రి అడిగాడు.
    
    "బడిపంతులు ఉద్యోగం చేసి రిటైరైపోయారు" చెప్పింది ధృతి.
    
    "నువ్వు పాటలు పాడతావుట కదా! ప్రోగ్రామ్స్ అవీ ఇస్తూ వుంటావా?" ప్రేమ్ తల్లి అడిగింది ధృతిని ఎగాదిగా పరిశీలనగా చూస్తూ.
    
    ధృతి తెల్లబోయి "లేదు" అంది.
    
    "ఉత్తరంలో ఈ అమ్మాయి గురించి తెగ రాశావుగా!" అంది ఆమె ప్రేమ్ ని చూస్తూ.
    
    ప్రేమ్ సిగ్గుపడినట్లుగా చిన్నగా నవ్వాడు.
    
    నవీన్ కొనకంట ధృతి వైపు చూశాడు.
    
    అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది. "నాకేం తెలియదు. నన్ను నమ్ము ఇంత కుట్ర జరుగుతున్నట్లు నేను ఊహించలేదు" అంటూ ఆ నిమిషంలోనే నవీన్ కి చెప్పెయ్యాలని ఆమెకి ఎంతగానో అనిపించింది.
    
    ఆ తరువాత వెనక సీట్లో తండ్రీ కొడుకులు వాళ్ళ వ్యాపార గొడవల్లో పడిపోయారు.
    
                                                                   * * *
    
    ఆ రోజంతా ధృతి ఆలోచిస్తూనే వుంది. జరుగుతున్న కధలో తన పాత్ర గురించి ఆమెకేమీ పాలుపోలేదు. ప్రేమ్ తో ముఖాముఖంగా "నీ అభిప్రాయం ఏమిటి?" అని అడుగుదామంటే అతను ఎక్కడా బయటపడటం లేదు.
    
    "ఏదో స్నేహితురాలినని మా అమ్మానాన్నలకి పరిచయం చేశాను. అంతే! పెద్ద పెద్ద ఊహలు అల్లుకుంటున్నట్లున్నావే" అంటేనో!
    
    పోనీ నవీన్ తో ఈ విషయం చర్చిద్దామంటే అతను అస్సలు విడిగా దొరకటంలేదు.
    
    ధర్మానందరావుగారు ఉదయం చీర గురించి అలా మాట్లాడినప్పుడు చాలా కోపం వచ్చింది. ఉక్రోషంగా ఏదేదో అనేసెయ్యాలనిపించింది. కానీ అనలేకపోయింది. ఏదో అశక్తత.
    
    ప్రేమ్ తల్లి గాయత్రీదేవి, తను కారు దిగి వస్తున్నప్పుడు ఎగాదిగా తననీ, తన చీరనీ గమనించడం ఆమె దృష్టిని దాటిపోలేదు. ఆవిడ నొసలు కాస్త చిట్లించడం కూడా గమనించి, ఎందుకో కాస్త ఆనందంగా అనిపించింది.
    
    సరే! ఏం జరగాలో, ఎలా జరగాలో కాలమే నిర్ణయిస్తుంది. ఏదైనా వ్యక్తం చెయ్యడానికీ, పరిస్థితులని అదుపులోకి తీసుకురావడానికీ తగిన సమయం రావాలి.
    
    ఆమెకి ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తొచ్చాయి.
    
    "ప్రమాదాన్ని ముందుగానే ఊహిస్తే అధిగమించినట్టే.
    
    విజయాన్ని ఎలా సాధించాలో ఓటమి నేర్పిస్తుంది."
    
                                                                   * * *
    
    "ఇంట గెలిచి, రచ్చ గెలవమంటారు పెద్దలు కానీ నా ఓటమి ఇంట్లోనే మొదలయింది."    

    నవీన్ చిన్నగా నవ్వి - "ప్రయత్నంలో అడుగడుగునా ఎదురయ్యేవి అవరోధాలు మాత్రమే! ఓటమి అనేది ఒకేసారి, అది చివరికి నీ శక్తి అంతా హరించుకుపోయాకే వస్తుంది" అన్నాడు.
    
    ధృతి తల విదిల్చి లేచి నిలబడుతూ-
    
    "అమ్మా, నాన్నగారూ ఎంత సంతోషంగా వున్నారంటే, ప్రేమ్ వచ్చి పిలవగానే, ఇదేదో అపూర్వ అవకాశం అన్నట్లూ, ఇది జారవిడుచుకోవడం అంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి వుండదన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు."
    
    అతనేమీ అనకుండా విని వూరుకున్నాడు.
    
    ఆ రోజు ధర్మానందరావుగారు ఇంట్లో పెద్ద పార్టీ యిస్తున్నారు. గాయత్రీదేవి హడావిడికి అంతేలేదు. ఆమె భర్త మాత్రం ఏమీ పట్టించుకోకుండా అవకాశం దొరికినప్పుడల్లా ధర్మానందరావుగారితో వ్యాపారసంబంధమైన విషయాలేవో చర్చిస్తున్నారు.
    
    ప్రేమ్ ప్రొద్దుటినుంచీ ఇంట్లోలేడు. ఆ రోజు ఆదివారం సాయంత్రం ధృతి ఇంటికి వెళ్ళి, ఆమె తల్లితండ్రుల్ని పార్టీకి ఆహ్వానించి, ఆమెని కూడా బలవంతం చేసి కార్లో తీసుకొచ్చేశాడు.
    
    నవీన్ కాస్త తీరుబడిగా కనిపించగానే, ధృతి అతని దగ్గరకి వేగంగా వచ్చి "ఓసారి ఇటురా!" అని పిలిచి ఔట్ హౌస్ కి తీసుకెళ్ళి మాట్లాడసాగింది.
    
    ఇంతలోనే ప్రేమ్ హఠాత్తుగా వచ్చి వాళ్ళిద్దర్నీ అదోరకంగా చూసి, "ధృతీ! అమ్మ పిలుస్తోంది. ఓసారి వెళ్ళిరా" అని అజ్ఞానపూరితంగా చెప్పాడు.
    
    ఆమె కాస్త అసహనంగా మొహంపెట్టి నిలబడింది.
    
    ప్రేమ్ నవీన్ వైపు తిరిగి, "అంకుల్ ఎక్కడికో వెళ్ళాలంట. నీ కోసం ఎదురుచూస్తున్నారు" అన్నాడు.
    
    నవీన్ వెంటనే అక్కడినుండి కదిలి వెళ్ళిపోయాడు.
    
    ఆ నిమిషంలో ధృతికి ప్రేమ్ చెంపమీద ఈడ్చి కొట్టాలన్నంత కసిగా అనిపించింది.
    
    "కమాన్!" నాటో అతను వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు.
    
    ధృతి అతనివెంట వెళ్ళలేదు. ఉన్నచోటనుంచి కదలకుండా, కిటికీ లోంచి బయట జరుగుతున్న తతంగాన్ని చూడసాగింది.
    
    పార్టీకి ఆఫీస్ స్టాఫ్ ని కూడా పిలవడంవలన లీల కూడా వచ్చింది. ఆమె వస్తూనే ప్రేమ్ తో సరదాగా కబుర్లు చెపుతూ ఆ పనీ, ఈ పనీ అందుకుని చెయ్యసాగింది.
    
    ధృతి తల్లీ, తండ్రీ కూడా వచ్చారు.
    
    సుభద్ర ధృతి దగ్గరకొచ్చి - "పట్టుచీర కట్టుకో" అంటూ సంచిలోంచి తియ్యబోయింది.
    
    "వద్దు" వీలయినంత సౌమ్యంగానే చెప్పాలనుకుంది కానీ విసుగు మొహంమీద కనబడిపోయింది. దాంతో సుభద్ర మరోసారి చెప్పే ధైర్యం చెయ్యలేకపోయింది.
    
    ప్రేమ్ సుభద్రనీ, సీతారామయ్యని తన తల్లితండ్రులకి పరిచయం చేశాడు.
    
    వాళ్ళోసారి వీళ్ళని క్రిందినుంచి మీదిదాకా పరీక్షగా చూసి "నమస్కారం!" అని చెప్పి, తిరిగి వాళ్ళ గొడవలో వాళ్ళు పడిపోయారు.
    
    సీతారామయ్యకి కాస్త చివుక్కుమన్నట్లయింది కానీ, సుభద్ర పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు. ఇద్దరూ ఓ మూల టేబుల్ దగ్గర కూర్చుని వచ్చేవాళ్ళ ఆడంబరాన్నీ గాయత్రీదేవి దర్జానీ కళ్ళు విప్పార్చుకుని చూడసాగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS