"ఏమిటది - హాయిగా విశ్రాంతిగా కూచో నీతో నేనూరానా' - ఒక్క నిముషంలో రెండు చీరలు నీ సూట్ కేసులో పడేస్తా - వచ్చేస్తా దినేష్ - ఎవరు ఏమన్నా అనుకోనీ మహా అనుకుంటే తెల్లవారేసరికి లేచిపోయాననుకుంటారు. అనుకోనీ - ఒక్కర్తినీ ఉండలేను - నువ్వెక్కడుంటున్నావో, ఏం చేస్తున్నావో నాకేం తెలియటం లేదు. అసలు నాకేమీ అర్ధంకావటంలేదు - నేనూ నీతో వచ్చేస్తా - శారద ఇంక ఆగలేకపోయింది -మోకాళ్ళపైన తలాన్చి వెక్కివెక్కి ఏడ్చేసింది. దినేష్ మాట్లాడలేదు.
"నేనెంత ముఖ్యమయిన పనిమీద వెడుతున్నానో నీకు చెప్తే అర్ధంకాదు -నేనుమళ్ళీరానా నాలుగు రోజుల్లో వచ్చేస్తా. తిన్నగా ఇక్కడికే వస్తాను. నిన్నునాతో తీసికెడతాను" - శారదకేసి చూసాడు.
"నీ అడ్రసు ఇయ్యవా" బతిమాలింది శారద.
'నాకు తెలుసా. ఎక్కడో ఎక్కడో వెళ్ళాక రాస్తాగా" - ఈమాట అంటుంటేనే తలుపునెమ్మదిగా తోసారెవరో దినేష్ ఒక్కదూకుతో బయటకెళ్ళిపోయాడు, శారద చిన్నన్న డబ్బుతోసహా. శారద బయటకొచ్చింది. చీకటిలో చిన్నకారుకదిలింది. వెనకసీట్లో ఎవరో అమ్మాయిలాగుందే - బహుశా నీరజ అయిండొచ్చు. కారు అతివేగంగా ఆ అర్ధరాత్రి పరుగుతీసింది. శారద తలుపు వెయ్యకుండానే లోపలకొచ్చేసింది.
శారదకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. దినేష్ ప్రవర్తన తనకి అర్ధంకాలేదు. ఎక్కడికెడుతున్నాడో, ఎందుకెడుతున్నాడో -ఏమీ వివరంగా చెప్పడెందుకని తనెంత పిచ్చిది చిన్నన్నయ్య డబ్బు సూట్ కేసులో దినేష్ దాచిన విషయమే తెలుసుకోలేదు - ఇప్పుడు అతను దానికోసమే వచ్చాడన్నమాట - ఇప్పుడయినా ఆ డబ్బు యివ్వకుండా వుంటే ఏమయ్యేది - ఆ డబ్బులు నా అన్నయ్యకి మిగిలేవిగ. ఇప్పుడేమిటి, అంతా గందరగోళం - తనెక్కడుందో - అరణ్య మధ్యంలో వుంది - ఓ పాడుపడిన బావికూడా లేని అరణ్య మధ్యంలో వుంది - దూకి చావడానికి కూడా లేదు -
ఎందుకులేదూ -శారద అప్రయత్నంగా సీలింగ్ ఫాన్ కేసి చూసింది. తను ఎన్నోసార్లు పేపరులో చదివింది - సీలింగ్ ఫాన్ కి చీరతో ముడివేసుకుని ఉరివేసుకున్న వాళ్ళ సంగతి !!
తనకేం ఖర్మ - ఆత్మహత్య చేసుకునేందుకూ ? ఇంకా ఆశకి కొనఊపిరివుంది అయినా ఇంక నిరాశదేనికి, దినేష్ నాలుగు రోజుల్లో రానేవస్తాడు. తనను బొంబాయి తీసికెడతాడు - ఒకవేళ తీసికెళ్ళకపోతే - పోతే, పోనీ, తానీ ప్రపంచంలో బతకలేదా - ఎవరికి ఎవరుకాపలా - దినేష్ నిజంగా తనని మోసం చేస్తే, అతన్ని మరొకరు చేయరా. ఒకవేళ నీరజ దినేష్ లు వాళ్ళలో తనని కలుపుకోవద్దనుకుంటే తనని కలుపుకొనే వాళ్ళులేరా - ఇప్పుడెళ్ళి రామం కాళ్ళమీదపడి తప్పులు క్షమించమంటే, క్షణంలో మనసుకరిగిపోయి రామం తనని క్షమించాడా లలితా, ఎన్నిపొరబాట్లు చేశాను క్షమించవే అంటే లలిత క్షమించి విశాఖపట్నంలో తనని తనింట్లో ఉండనీయదా - అయినా పెళ్ళికాని ఆడవాళ్ళు, భర్తలేని ఆడవాళ్ళు, విడాకులు, పొందిన ఆడవాళ్ళు ఎందరెందరీలోకంలో లేరు - తనెందుకు భయపడటం - సీలింగ్ ఫాన్ తన్నేం చేస్తుంది - తిరగనీ - శారదకి అంత ఆవేదనలోనూ నవ్వొచ్చింది. నిజంగా తను నిస్సహాయురాలుగా నిలబడిపోతే నాన్న, అక్కలు, అన్నలు, స్నేహితులు, రామం - ఇంతమంది ఉండగా సీలింగ్ ఫాన్ అవసరం ఏమిటీ - శారద గడియారం వంక చూసింది - మూడు గంటలయింది - ఇంకా మూడు గంటలయితే కాని తెల్లారదు -
శారద అప్పుడేలేచి ముఖం కడుక్కుంది. ఫ్రిజ్ లో పాలువున్నాయి. కాఫీ కలుపుకుతాగింది. రామం ఏంచేస్తూ వుండివుంటాడు - కొత్త భార్యని కౌగిలించుకు పడుకుని వుంటాడు! - ఆ రోజు ఆటోలోతనని ఇంటి దగ్గరదించి వెళ్ళాక మళ్ళీరానే లేదే - అసలు గొడవ ఏమిటని అడగలేదే - ఎందుకడుగుతాడూ - అతనికీ తనకీ ఏం సంబంధముందిప్పుడు? గడియారం ముందుకు కదలటంలేదు - ఇవన్నీ ఇలా వదిలేసి తను నరసాపురం వెళ్ళిపోతే ఏమవుతుంది - నాన్నతనని ఇంట్లోకి రానిస్తాడు రెండురోజులుండి వచ్చేయచ్చు. నిజంగానే ఊరెళ్ళిపోవాలని ఆలోచన వచ్చింది శారదకి ఎన్నో బస్సులు తన ఊరికి ఎవరికి చెప్పాలీ తను - రెండుచీరలు గబగబా మడతపెట్టి సూట్ కేసులో పెట్టింది. పెట్టెలోవున్నా జీన్స్ పాంట్లు తీసిపారేసింది. తలదువ్వుకుని, ముఖాన బొట్టుపెట్టుకుంది - మసక మసకగా ఇంకా చీకటి వుంది. రోడ్డుమీద కెడితే ఎన్నో ఆటోలుంటాయి. భయందేనికీ - శారద తనకు తనే ధైర్యం చెప్పుకుంటా ఇల్లు తాళం వేసి బయలుదేరంది.
బస్సులో ఎన్నో గంటలు నిద్రపోయింది శారద మైండ్ పనిచేయటంలేదు. తను చేస్తున్న పనిలో అర్ధం కనిపించటం లేదు. నరసాపురం ఎందుకిప్పుడెడుతోందో తనకే తెలియదు.
* * *
19
వీడి గేటు బార్లా తీసుంది సుబ్బలక్ష్మి లేచి చూసేసరికి 'ఇదేమిటీ - రాత్రి తలుపువేయటం మరిచిపోయిందన్నమాట ఈ పిల్ల అనుకుంటూ మేడమీద నుంచి కిందికి దిగింది. శారద తలుపుతాళం వేసుంది. ఎక్కడికిపోయిందో - ఏమో - ఈ పిల్ల రాగానే ఇంక ఏ ముఖమాటమూ లేకుండా ఇల్లు ఖాళీ చేయించేయాలి - ఇంట్లో వుందో లేదో ఎప్పుడూ ఎవరికీ తెలియదు. ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది - అయినా ఆడపిల్లకి అంతకుదురులేక పోతే ఎట్లా - వీధి గుమ్మంలో నిలబడింది సుబ్బలక్ష్మి పక్కింటివాళ్ళ అబ్బాయి. అదే మనమడు దీపావళి పండగొస్తోందని ముందుగానే కొన్నటపాకాయలు కాలుస్తున్నాడు.
'ఆంటీ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకి మీ ఇంటికి ఒక కారు, తెల్లకారు వచ్చింది. ఆ కారులోంచి పెద్దమీసాలాయన ఒకాయన గదిలోపలకొచ్చాడు నేనేమో వన్ కెళ్ళాలని లేచాను.....ఒకవేళ దొంగేమో చూద్దామని అలాగే రాహస్యంగా ఎవరికీ కనిపించకుండా మాగోడదగ్గర దాక్కొన్నా నాకేం భయం - మా యింట్లో లైటు వెలుగుతోందిగా కొంచం సేపయ్యాక ఆకారు వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచం సేపయ్యాక వచ్చింది - ఈ శారద ఆంటీ ఆకార్లో వెళ్ళిందనుకుంటా. దొంగకాదు లెండి భయపడకండి - సుబ్బలక్ష్మి ముక్కున వేలేసుకుంది. ఎనిమిదోతరగతి చదివే కిరణం చెప్తున్నమాటలు మారోప్రశ్న వేయకుండా వింది. కిరణ్ మళ్ళీటపాకాయలు కాల్చటం మొదలుపెట్టాడు.
సుబ్బలక్ష్మి గబగబాలోపలకెళ్ళిపోయింది "చూసారా, చూసారా - నేను అనుకుంటూనే వున్నాను. ఇలాంటి పని ఏదో చేస్తుంది అనీ మిమ్మల్నే - లేవండి' మంచి నిద్రలోవున్న భుజంగరావును నిద్రలేపింది "ఆ పిల్ల లేచి పోయింది. అర్దరాత్రి ఎవరోకార్లో వచ్చారుట. ఇది వాళ్ళతో వెళ్ళిపోయిందిట - పాపం, ఎంతో పరువైనకుటుంబం - ఏం చేస్తాం - పిల్లలు శత్రువులంటే ఇదే - మా రాజమ్మ భయపడుతూనే వుంది ఇలాటి పనిఏదో ఆపిల్లచేస్తుందని' - సుబ్బలక్ష్మి అలా మాట్లాడుతూనే వుంది -
'ఏమిటి గోల పొద్దున్నే ఆ పిల్లలేచిపోయిందీ - పోతేనీకేం" - మళ్ళీ దుప్పటికప్పుకున్నాడు భుజంగరావు.
'అదికాదండీ. ఇల్లుతాళ మేసిపోయిందిగా - ఆ తాళం బద్దలు కొట్టకూడదు కదా మనం' -
