చంచల్రావు కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయాడు. వాడు అలా కళ్ళు మూసుకున్నాడంటే మార్గం దొరికినట్టే.
"పద..." అన్నాడు హఠాత్తుగా లేచి నిలబడి.
"ఎక్కడికి?"
"జోగారావని" ఎడ్యుకేషన్ మినిష్టర్ కి పి.యే.... అతనితో మినిష్టరుకి చెప్పించి మినిష్టరు చేత ఫిలిప్స్ కి ఫోన్ చేయిద్దాం... అంతే,డొనేషన్ కూడా కట్టే అవసరం లేకుండా మీ ఆఫీసరు కొడుక్కి స్కూల్లో సీటొస్తుంది..." అన్నాడు చంచల్రావు చిద్విలాసంగా నవ్వుతూ.
చెప్పొద్దూ... ఆ సమయంలో చంచల్రావు నాకు విపరీతంగా ముద్దొచ్చేశాడు.
ఇద్దరం జోగారావు ఇంటికి బయలు దేరాం. దారిలో ఒక కిలో పుల్లారెడ్డి స్వీట్స్ కొన్నాం.
"అందరూ అయిదారు వేలు ఖర్చుపెడ్తే వచ్చే సీటు నీకు కిలో స్వీటుతో వచ్చేస్తుంది... చుశావా?..." అన్నాడు కాలరెత్తుతూ చంచల్రావు.
నాకు మళ్ళీ ముద్దొచ్చేశాడు చంచల్రావు
"మూతి ముందుకు పెడ్తున్నావ్... చూడబోతే నువ్వు మళ్ళీ ముద్దు పెట్టుకునే ఉద్దేశంతో ఉన్నట్టున్నావ్... ఇది బజారు. బావుండదు" కోపంగా చూశాడు చంచల్రావు.
జోగారావు ఇల్లు వచ్చేసింది.
"ఆయన మంత్రిగారితో కలిసి హేర్ కటింగు సెలూన్ ఓపెనింగుంటే అక్కడికి వెళ్ళారు..." అన్నది జోగారావు భార్య.
"ఎప్పుడొస్తారు?...." చంచల్రావు అడిగాడు.
"తొమ్మిదికి"
నేను టైంచూశాను. ఏడుగంటలైంది.
ఇద్దరం కాస్సేపు రోడ్డుమీద పచార్లు చేసి కాస్సేపు హోటల్లో దూరి కబుర్లు చెప్పుకుని రెండు గంటలూ గడిపేశాం.
మేము జోగారావు ఇంటికి వెళ్లేసరికి అతను ఇంట్లోనే ఉన్నాడు.
"ఏమిటోయ్ చంచల్రావూ.... ఎలా ఉన్నావ్? చాలా కాలానికి కనిపించావ్... మీ వాళ్ళంతా కులాసాయేనా?" అన్నాడు జోగారావు.

"హి హి హి ... అంతా కులాసాయే నండీ..."
"కూర్చోండి! ఏమిటి సంగతి? ఈ వేళప్పుడొచ్చారు?" అన్నాడు కూర్చుంటూ. మేము అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాము.
"మీతో చిన్న పనుండి వచ్చామండీ.... ఇతను నా స్నేహితుడు బుచ్చిబాబు...." అన్నాడు చంచల్రావు నన్ను పరిచయం చేస్తూ.
నేను స్వీట్ పాకెట్ అతని ముందున్న టీపాయ్ మీద ఉంచి నమస్కారం పెట్టాను.
"నమస్తే.... నమస్తే.... హిహిహి.... ఏమిటో ఇవన్నీ తెచ్చేశారు... అయితే పని ఇతని కన్నమాట?..." అన్నాడు జోగారావు నన్ను చూపుతూ.
"అవునండీ...."
ఇంతలో లోపలినుండి మూడేళ్ళ కుర్రవాడు వచ్చాడు.
చంచల్రావు నెమ్మదిగా నా చెవిలో "జోగారావుగారి ఆఖరి అబ్బాయి" అన్నాడు. నాకు అర్థం అయింది.
గబుక్కున లేచి ఆ అబ్బాయిని ఎత్తుకుని "చిచ్చీ...బాబూ...బాబూ.... నీ పేలేంతమ్మా..." అన్నాడు ముద్దుగా.
"నానా... ఈయనెవరూ?.... ఎద్దులా ఉండి ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు?" అన్నాడు ఆ అబ్బాయి.
నాకు ఒళ్ళుమండి పోయింది... వాడిని నేలమీద కుదెయ్యాలని అనిపించింది... కానీ అవసరం - ఏం చేస్తాం?
"హి...హి...హి... మీ వాడు చాలా చురుకైన వాడు సుమండీ" అన్నాడు ఏమీ అనలేక.
"సరేగానీ ఏం తెచ్చావ్ నాకు?" అన్నాడు. నా గడ్డంపట్టి ముఖాన్ని తనవైపుకు త్రిప్పు కుంటూ.
"స్వీటు తెచ్చా బాబూ...తింటావా?" అన్నాను టీపాయ్ మీద స్వీట్సు వాడికి చూపిస్తూ.
వాడు చెంగున నా ఒళ్లోంచి కిందికి దూకి స్వీట్సు డబ్బా చేతిలోకి తీసుకుని "హు... ఒక్క డబ్బయేనా?... మా ఇంటికి వచ్చేవాళ్ళు బోలెడు తెస్తారు. పళ్ళు తేలేదా?..." అన్నాడు .
"బాబూ... నువ్వు లోపలికివెళ్ళు..." అన్నాడు జోగారావు.
నేను చెప్పులు కాళ్ళకి తొడుక్కున్నాను.

"ఎక్కడికి?...." చంచల్రావు ఆశ్చర్యంగా చూశాడు.
"పళ్ళు తేవడానికి..."
