Previous Page Next Page 
విశిష్ట పేజి 45

    "ఎంత వెర్రోడివి పంతులూ! జరుగుతున్నది చూసినా నీకు జ్ఞానోదయం కలుగలేదన్నమాట. నీ కూతురు బహిరంగసభలో స్టేజీ ఎక్కి మైకు పుచ్చుకుని 'నన్నో మగవాడు రేప్ చేయబోయాడు' అంటూ సిగ్గువిడిచి చెప్పుకొందే! ఏం ఒరిగింది మీకు?

    మా వాడి అరెస్ట్, నా పదవికి రాజీనామా అంతా ఒక డ్రామాగా ముగిసింది. హోం మినిస్టరుగా నేను రాజీనామా చేస్తే ఏమైందట?మరో వారం పదిరోజుల్లో విద్యాశాఖామంత్రిగా పదవీ ప్రమాణం చేయబోతున్నాను. ఇక మా వాడికి శిక్షా? అంత దమ్మెవరికుంది? పోలీసులూ, చట్టాలూ మా ఇంటిముందు కుక్కలు. నేను కొంచెం ఉసిగొల్పానంటే మిమ్మల్ని చీల్చి చెండాడుతాయి.

    నేను గూండాలను పంపి మిమ్మల్ని చంపించక్కరలేదు. పోలీసులే ఏదో అబద్దపు నేరం మోపి తీసుకుపోయి లాకప్ డెత్ కి గురిచేసి, శవాలను తీసుకుపోయి ఏ రోడ్డుమీదో పడేసి ఏక్సిడెంట్ గా చిత్రీకరిస్తారు. మీ బోటి బక్క పీనుగులు చట్టాలనూ, పోలీసులనూ నమ్ముకుంటే ఇంతే సంగతులు."

    "పైన ఒక న్యాయస్థానం వుంది. మాధవరావ్! నమ్మినా, నమ్మకపోయినా, అప్పీల్ చేసుకొన్నా, చేసుకోకపోయినా ఆ న్యాయస్థానం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ తప్పించుకున్నా దోషులు అక్కడ తప్పక శిక్షింపబడతారు."

    "అయితే అక్కడికే పోయి నా సంగతేదో అక్కడే చూచుకొంటావన్నమాట. మంచిది పంతులూ!" మరోసారి వ్యంగ్యంగా నవ్వాడు మాధవరావు.  "అక్కడ నా కోసం వెయిట్ చేస్తూండు"

    విశిష్ట అంది -"అన్యాయంగా ఈ హంతకుల కిరాతకానికి బలై ఏం సాధిస్తాం నాన్నా! పరలోకంలో జరిగే న్యాయం సంగతి ఎవరికి తెలుసు? ఎవరు చూడబోయారు? న్యాయం న్యాయమని మనం ప్రాకులాడే కంటే ఈయన చెప్పినదానికి ఒగ్గడం ఉచితమని నా ఉద్దేశ్యం పృద్వీ వట్టి నీచుడూ, దుర్మార్గుడే!

    అందులో సందేహం ఏమీ లేదు. నా సాహచర్యంలో అతడు మారే అవకాశం వుందేమో చూస్తాను. అర్ధాంతరంగా, అన్యాయంగా ఈయన చేతిలో రాలిపోయేకంటే జీవితాన్ని ఒక దుర్మార్గుడిని సంస్మరించడంలో హారతి కర్పూరం చేసుకున్నా ఫర్వాలేదు. నేను పృధ్వీని పెళ్ళిచేసుకోడానికే నిర్ణయించుకున్నాను. ఇక తిరుగులేదు."

    "ఇదే నీ నిర్ణయమైతే నా నిర్ణయం కూడా విను. నా పెద్దకూతురు నాకు చచ్చినదానికిందే జమ. ఇలాంటి నీచుల ఇంట్లో కోడలిగా ఎలా అడుగు పెట్టాలనుకున్నావు. అదీ నిన్ను మానభంగం చేయాలనుకున్నవాడి సాహచర్యం ఎలా భరించగలననుకున్నావు?"

    "పరిస్థితులకు తలవంచక ఎంతటి వాళ్ళకూ తప్పదు కద నాన్నా!"

    "నాకు తెలిసే నువ్వు చావుకు భయపడ్డావు. ఇలాంటి నీచమైన బ్రతుకు బ్రతికేకంటే చావు గౌరవప్రదం కదా?"

    మాధవరావు కల్పించుకుని అన్నాడు -

    "నాలుగు గోడలమధ్య పిల్లలకు పాఠాలు బోధించి బోదించి నీ బుద్ది కురుచనైపోయింది పంతులూ! నీ కడుపున పుట్టింది నీకంటే లోకాన్ని బాగా అర్ధం చేసుకోగలదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టగలదు. బ్రతకడం నేర్వని జ్ఞానం ఎందుకు పంతులూ!"

    అతడు చేసిన ఎగతాళికి కంపరమెత్తినట్టుగా అయింది రామకృష్ణకు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత! కూతురే తన మాట వినడంలేదే!

    "నువ్వు సామాన్యురాలివి కాదని నాకు తెలుసులే పిల్లా! నీ మెదడులో ఏమైనా క్రిమినల్ వూహలు మెదులుతున్నాయేమో ఇప్పుడే తుడిచేసుకో! పిచ్చిపిచ్చిగా తోకాడిస్తే మాత్రం నీ తోక కత్తిరించడానికి నేనున్నానని గుర్తుపెట్టుకో! అనుక్షణం నిన్ను నేను కనిపెట్టి వుంటాను. ఎక్కడయినా తేడా కనిపించిందా -సఫా!"

                                                                          *    *    *

    "నీ ముఖం కాల్చి నిన్ను అందవికారంగా మార్చిన ఆ పిల్లతో నీకు పెళ్ళి ఖాయం చేసుకువచ్చాడురా మీ నాన్న. ఆ దుర్మార్గురాలు ఈ ఇంటికి కోడలుగా రావడానికి వీల్లేదని ఎంత మొత్తుకున్నా ఆయన వినలేదు. వెళ్ళి ఆ పిల్లనూ, వాళ్ళవాళ్ళనూ బెదిరించి పెళ్ళికి ఒప్పించి వచ్చాడు" కాంతం చెప్పింది కొడుకుతో.

    "నన్నింత పరాభవంపాలు చేసిన దానితో నాకు పెళ్ళా!? అది చేసుకుంటానన్నా దాన్ని చేసుకునేదెవడు? అది చేసింది గుర్తుకువస్తేనే నాలో ప్రతీకారజ్వాల భగ్గుమంటూందే! అది నా చేతికి చిక్కాలీ నల్లిని నలిపి నట్టు నలిపి వేస్తాను" పళ్ళు పటపట కొరికాడు.

    అంతకుముందే అక్కడికి వచ్చిన మాధవరావు కొడుకు మాటలు విని అన్నాడు దాని మెడలో మూడు ముళ్ళు వేస్తే నీ చేతికి చిక్కినట్టే కదా! అప్పుడు నల్లిలా నలిపివేస్తావో, పిల్లిలా ఆమె చుట్టూ తిరుగుతావో నీ ఇష్టం."

    "దాన్ని నల్లిలా నలిపివేయడానికి దాన్ని పెళ్ళెందుకు చేసుకోవాలి నాన్నా! ఏ గూండాలనో పంపి దాన్ని గాంగ్ రేప్ చేయించి చంపిపడేస్తే సరి. నా మనసు శాంతిస్తుంది."

     "నీ ఆలోచనలు మొదటినుండి ఇంత దరిద్రంగా వున్నాయి కాబట్టే నిన్నో వెధవను చేసిందిరా నీ ముఖాన ఏసిడ్ పోసి చాలా తెలివిగా దెబ్బ కొట్టింది. దాన్ని మనమూ తెలివిగా దెబ్బకొట్టడానికే ఈ పెళ్ళి అన్న నాటకం ఆడుతున్నాం.

    ఈ పెళ్ళివల్ల మనకు లాభాలేగాని నష్టాలుండవు. కాకుల్లా అరిచే మహిళా సంఘాలు, పనికట్టుకుని మనమీద బురదజల్లే పత్రికలూ టక్కున నోరు మూస్తాయి. కొడుకు ముఖం మీద ఏసిడ్ పోసి గాయపర్చిన పిల్లనే ఉదారంగా క్షమించి తన కోడల్ని చేసుకున్న గొప్ప మనసు మాధవరావు గా పబ్లిసిటీ చేయించుకుంటాను.

    పోయిన పరువును మనం ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు ఆ పిల్లను గప్ చిప్ గా మన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చును. ఈ పెళ్ళిని కొన్నాళ్ళు విచిత్రంగా చెప్పుకుని మరిచిపోతుంది లోకం. అప్పుడు చాప క్రింద నీరులా మనం చేయాలనుకున్నది చేయాలి. సైలెంట్ గా లేపేయాలి"

    "ఛీ.......ఛీ.......ఇంత పాడు ఆలోచనలున్నాయా మీలో?" జుగుప్సగా చూసింది కాంతం.  "అనవసరంగా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోకండి. అది మీకే మంచిది కాదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS