''ఒరే మూర్తి బావా! ప్రపంచంలో అనేక కష్టాలు పడ్డవాళ్ళూ ఉన్నారు. భార్యలు పోయినవాళ్ళూ ఉన్నారు. వాళ్ళు మతులు పోగొట్టుకుంటారురా! పోనీ ఏమీ తెలియని పిచ్చికాదు, ఇదేమి పిచ్చి నీకు?''
'' సుబ్బులూ, నా వ్యవహారాలలో నువ్వు జోక్యం కలుగజేసుకోకు. నేను చావడానికి సిద్దంగా ఉన్నప్పుడు, మీ నాన్న వచ్చి నన్ను బ్రతికించాడు, ఆ పని నవ్వు పూర్తి చేసావు. మామయ్యకూ, నీకూ నా దేహం వలిచి ఇచ్చినా బాకీ తీరదు. నిజమే. అంత మాత్రాన నా జీవితానికి మీరు నాథులు కారు, నేను మీకు బానిసను కాను.''
''అల్లా నువ్వు మాట్లాడితే, నేనేం చెప్పను?''
'' నువ్వేం చెప్పక్కరలేదు. నేను వినక్కరలేదు. లేనిపోనివన్నీ కలుగజేసుకొని నాకు ఈ కాస్త సంతోషం లేకుండా చేయకు.''
''అయితే సరే! నేను రేపే బయలుదేరి మా ఇంటికి వెడ్తాను. నువ్వు ఏమయితే, నాకేం గావాలి? కాని నీ విషయం తలచుకొని అత్తయ్య పడే వేదన చూస్తూంటే నా గుండె తరుక్కు పోతుంది.!''
''మా అమ్మా, మీనాన్నా నన్ను కాశీలో చచ్చిపోనివ్వకపోయారూ, బాధ విరగడై పోవునుగా? మీ కందరికీ ఒకటేమాట చెప్తున్నాను. నేను బతకాలని మీకుంటే నా దారిని పోనీయండి, లేదంటారా, ఇంత విషం తెచ్చి నాకు పెట్టండి!''
మా సుబ్బులు ఒక్కసారిగా లేచి బొటబొట కన్నీళ్ళు కారుతూ ఉండగా క్రిందకు వెళ్ళిపోయాడు. నా కోపం ఆర్థ రాత్రి పన్నెండు గంటలవరకూ చల్లారలేదు.
'' ఓయి వెధవ దేవుళ్లోయి ఈ అవస్థ నాకేమిటఱ్ఱా!'' అని పొలికేక పెట్టాలని బుద్ది పుట్టింది నాకు.
26
ఇక కాశ్మీరంలో ఉండలేకపోయాను. మే నెల రెండవవారం ప్రవేశించింది. దేశం ఏమయితే నాకేం కావాలి? కాంగ్రెసు విజయం పొందకపోతే ఏమి కావాలి? స్వరాజ్య పార్టీ వారు శాసనసభల్లో మొగ్గలు వేస్తోంటే ఏమి కావాలి?
మా అమ్మ మరీ చిక్కిపోయింది. కాశ్మీరంనుంచి తిన్నగా బయలుదేరి లాహోరు వచ్చాము. లాహోరులో హిరానుండీ వెళ్ళి చూశాను. ప్రపంచంలో అంత ఘోరమైన భోగంవీధి లేదనుకుంటాను. ఆ మండీలోకి టంగామీదనే లాహోరు చేరిన మధ్యాహ్నం వెళ్ళాను. టంగావాడు ఒక శిక్కు సోదరుడు, నా వైపు దయార్ద్రదృష్టులు పరపి,
'' బాబూజీ! కీఖరాబ్ రాస్తే దేవిచ్ ఫజ్ర్ దేయా?'' (బాబుగారూ! చెడ్డతోవ పట్టారేమిటి?)
నేను మౌనం.
''త్వడ్డీ జిందగీ దీలోడ్ నై?''(జీవితం బాగుచేసుకోవాలనే ఉద్దేశము నీకు లేదా?)
నేను: చుప్ రాహ్. అప్ నీ కిస్మత్ దా బాదుషా మై యా తూ? (ఊరుకో, నా భాగ్యాన్ని నిర్మించేవాణ్ని నేనా, నువ్వా?)
టంగామనిషి పెదవి విరిచి ఊరుకున్నాడు. మే మా గల్లీలో ఆగాము. నే నాతనికి డబ్బిచ్చి దిగాను. బండిమనిషి బండితోలుకు వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు. నేను దిగి ఇటూ అటూ చూస్తూ ఉన్నాను. వెంటనే ఎదురుగా ఉన్న మేడలోంచి నలుగురు ముసల్మాను భోగం పిల్లలు నన్ను చుట్టుముట్టారు.
ఒకతె: తు కిన్నా సోణా ఐ! అప్నేమకాందేవిచ్ ఆ సడ్డీకూవ్ సూరతీ వేక్. (ఎంత అందంగా వున్నావయ్యా నువ్వు, మా ఇంట్లోకి వచ్చి మా అందాన్ని చూడు.)
నేను తెల్లబోయాను!
ఇంకొకతె: అపనే సడ్డాగీత్ సుణు! నాచ్ నా వేక్! అపనేఘర్ మే ఫలోందేవిచ్, కిసీ ఏక్ నూ చుణ్ లే! (మా సంగీతం విను! మా నాట్యం చూడు, మా ఇంట్లో మంచి పండ్లలో ఒక పండు రుచి చూడు)
అని అంటూ ఆ నలుగురూ నన్ను బరబరా తమ మేడమీదకు లాక్కొని పోయారు. అక్కడ నన్ను నలిపేశారు. నా జేబులో చేయిపెట్టి ఒకతె నా పర్సు లాగేసింది. అయిదారుగురు నాకు ఊపిరాడకుండా నులిమివేశారు. తుదకు ఒకతె ''ఓ సోణియో! త్వన్ను కాదేఢర్?''(ఓ అందకాడా! ఎందుకు నీకు భయం) అంటూ దరిజేరింది. తక్కినవాళ్ళు నవ్వుకుంటూ తలుపు వేసేశారు. నాకు ముచ్చెమటలు పట్టాయి.
ఎలా లేచానో ఆ అమ్మాయిని తోసేసి; నాకేతెలియదు. గది గుమ్మం తెరచి, అక్కడ ఎవరూ లేనందుకు సంతోషిస్తూ, సగం ఏడుస్తూ వీధి గుమ్మం దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాను. అక్కడ ఆ సిక్కుటాంగా సిద్దంగా ఉంది. అందులోకి ఉరికాను. ఆ చుట్టు ప్రక్కల మేడ వరండాలాలోనికి ఆడవాళ్ళందరూ మూగి పక పక నవ్వడం ప్రారంభించారు. ఆ శిక్కు టాంగామనిషి మాట్లాడకుండా మేం ఉన్న సత్రం దగ్గరకు తీసుకొని పోయాడు.
నేను ఇంట్లోకి వెళ్ళి ప్రాణం పోయినట్లు భావించుకొని, నా పరుపు వాల్చి, పండుకొని వెక్కివెక్కి ఏడ్చాను. నాకింతటి అవమానం కలగాలా? ఇది నాకు పరాభవమా? అవమానమా? నాలోని కోపం నన్ను దహించివేసింది, ఏం ప్రతీకారం చెయ్యగలను? కూడా పట్టుకువెళ్ళిన యాభై రూపాయలు పోతేపోయేయి, కాని వాళ్ళని నేను ఏమి చెయ్యగలను? ఆ హీరామండీ (రత్నాలవిఫణి) ఏమి రత్నాల బజారు?
ఆ నాడు నే ననుకోకపోయినా తర్వాత నన్ను నేను తర్కించు కొన్నప్పుడు మహాత్మాజీ స్త్రీ విషయంలో అన్న ముక్కలూ, మహాత్మాజీకి స్త్రీ మండలివారు సమర్పించుకొన్న మనవీ ఎన్నిసార్లో జ్ఞాపకం వచ్చాయి. ఆ రోజుల్లో పశువునై ఉన్న నాకు క్రోధమే ప్రధానమై నన్ను పూర్తిగా మండించింది.
27
లాహోరులో మూడురోజులు మాత్రమే ఉన్నాము. అక్కడినుంచి బయలుదేరి సింధునదీతీరంలో ఉన్న సుక్కూరుకు వెళ్ళాము. నా ప్రయాణాలకు అర్ధంలేదు. యాత్రావిశేషాలు చూడాలనీ కాదు, దేశంలోని ప్రసిద్ద ప్రదేశాలను చుద్దామనీ కాదు. నాలోని భరింపరాని వేదనే నన్ను ఎక్కడికో తరిమివేస్తున్నది. ఎక్కడికో అంతుదొరకని యాత్ర? ఎందుకీ అనంతమైన వేదన? నా శకుంతల నాకు ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది?
