Previous Page Next Page 
చదువు పేజి 45

   

   సరుసుకూ జానకికీ పెళ్ళిఅయింది. పెళ్ళికి సీతమ్మగారు ఏడువందలు అప్పుతెచ్చి ఖర్చుచేసింది. ఇందువల్ల ఎవరు సంతోషించారో తెలీదు. సుందరానికీ పెళ్ళి ఎంతమాత్రం ఇష్టంలేదు. తన చెల్లెలు ఇంత ఖర్చుచెయ్యటం శేషగిరికి అసలే ఇష్టంలేదు. "ఎందుకు పెట్టుకున్నా వింతమేళం? అసలే దేశం అధోగతిలో ఉంటేనూ!" అన్నాడాయన. పెళ్ళి చూసినవాళ్ళు మహా వైభవంగా జరిగిందని అనుకోనేలేదు. పెళ్ళి పడిమింటకూచుని చుట్టపక్కాలు, వైభవంగా జరిగిన ఇతర పెళ్ళిళ్ళనుగురించి తనివితీర కుండా చెప్పుకున్నారు.

    ఈ పెళ్ళికీ, ఈ ఖర్చుకూ సంతోషించింది సీతమ్మగారొక్కతే "ఏమోనమ్మా, ఆయన లేకపోయినా, దేవుడల్లే కరణంగారు అప్పు ఇప్పించబట్టీ పెళ్ళి ఈ మాత్రంగానన్నా చెయ్యగలిగా. మళ్ళీపెళ్ళి  చెయ్యబోయినానా? పిల్లవాడున్నాడంటే వాడిదారి వేరూ? ఎట్లాగయినా వాడు మగవాడూ!" అన్నదావిడ.

    అప్పు తెచ్చిఅయినా అల్లుడికి వెండికంచమూ, వెండిచెంబూ పట్టుబట్టలూ  పెట్టినందుకు సీతమ్మగారు సంతోషించింది. తన భర్త ఆస్తి అచ్చగా సుందరమే కాకుండా తన కూతురు కూడా తింటున్నదిగదా అన్న సంతృప్తి ఆవిడకు పూర్తిగా కలిగింది. శేషగిరి సూచించినట్టు నూర రూపాయల్లో పెళ్ళి అయేదే కాని జానకమ్మకు  తండ్రి ఆస్తిలో దమ్మిడీ కూడా ముట్టేదికాదు. తరువాత సుందరం ఉద్యోగంచేసి డబ్బు సంపాదించేటప్పుడు చెల్లెలుకు పెట్టుకుంటే పెట్టుకుంటాడు, మానుకుంటే మానుకుంటాడు. కాని తన హయాంలో జరిగే ఈ అక్కరసమయంలో తాను తనకూమార్తెకు ఆ మాత్రం ఇచ్చుకునే అధికారం లేకపోలేదు. ఈ విధంగా సీతమ్మగారు జానకి పెళ్ళిఖర్చు గురించి తన అంతరాత్మనూ, కొందరు అమ్మలక్కలనూ  ఒకేసారి సమాధాన పరచయత్నించింది.
 
    పెళ్ళిగురించి అపరిమితానందం చెందినప్రాణి మరొకడు కూడా ఉన్నాడు_ సరుసు. వాడీ పెళ్ళిచూసి చాలా గర్వపడ్డాడు, తన పెళ్ళాన్నిగురించి గర్వపడ్డాడు, తన బావమరిదిని గురించి గర్వపడ్డాడు. ఈ సంగతి సరుసు దాచలేదు_ దాచాలని వాడికి తట్టనూలేదు.

    "అసలే దగ్గిరచుట్టాలమా, ఇంకా దగ్గిర అయినందుకు నాకు బలే సంతోషంగా ఉందిరా, సుందరం. మన బంధువు లందర్లోకి నువ్వంటే నా కెప్పుడూ ఎందుకో ఎక్కువ అభిమానం" అన్నాడు సరుసు.

    ఈ మాటవిని ఏడవాలో, సరుసును చూసి జాలిపడాలో సుందరానికి తెలీలేదు.

    సరుసు తన పెళ్ళిచూసి సంతోషించటమేకాక పెళ్ళివారందరూ ఉండగానే నాటకాల్లో పద్యాలు పాడాడు. పాడితే పాడాడు. అంతటితో పోనివ్వక తన పద్యాలను గురించి జానకి ఏమనుకున్నదీ కనుక్కుని చెప్పమని సరుసు సుందరాన్ని బతిమాలాడు.

    "భగవంతుడా, జానకి ఏంపాపం చేసుకుని ఈ పిచ్చివాడికి పెళ్ళామయింది" అనుకున్నాడు సుందరం.

    సుందరాన్ని చూసి సరుసు  ఎంత గర్వపడ్డాడో, సరుసును చూసి సుందరం అంత సిగ్గుపడ్డాడు.
 
    ఊళ్ళో కొందరు పెద్దలు సినిమా ఒకటి పెట్టారు. అందులో వరసగా అమెరికన్ స్టంటుపిక్చర్లు సీరియల్స్ వెయ్యసాగారు. సుందరం తల్లితో పోట్లాడి ప్రతివారం సినిమాకు డబ్బులు పుచ్చుకుని వెళ్ళసాగాడు. ఎడ్డీపోలో, విలియం డెస్మాండ్, డగ్లస్ ఫెయిర్ బాంక్స్, ఎల్మోలింకస్ మొదలైన నటులు_ సుందరం దృష్టిలో గొప్ప నటులు_ నటించిన సినిమాలు వేశారు.

    నిజానికి సుందరం అప్పటికే బళ్ళారి రాఘవాచారినీ, స్థానం నరసింహారావునూ స్టేజీమీద చూచి తన్మయుడైనాడు. రాఘవాచారి "ఫఠాస్" స్థానం "రోషనారా" చూచినప్పుడు సుందరం ఉక్కిరి బిక్కిరైనాడు. అయినా నటనను గురించి వాడి అభిప్రాయాలింకా పాకానికిరాక  ఈ  స్టంట్ నటుల కుప్పిగంతులు కూడా నటనే అనుకున్నాడు.

    అయితే రానురాను  ఈ సినిమావాళ్ళు హాలీవుడ్ నుంచి అనేక మంచి సినిమాలుకూడా తెప్పించి వేశారు. చార్లీ చాప్లిన్ హాస్య చిత్రాలు డజన్లకొద్ది వేశారు. చార్లీ చాప్లిన్ వింత నడకా, సగం మీసాలూ సుందరాన్ని బలంగా ఆకర్షించాయి.

    ఈ రోజుల్లోనే సుందరం ఇమి టేష నాచారి ప్రదర్శనమూ, మాస్టర్ మన్ హర్ బర్వే సంగీత ప్రదర్శనమూ కూడా చూశాడు. తన చదువూ, తనకు సన్నిహితంగాఉండే  జానకి పెళ్ళిలాటి సంఘటనలూ, తప్పిస్తే ఇవే_ ఈ ప్రదర్శనాలే, ఈ సినిమాలే_ సుందరానికి మానసిక వాతావరణం, వాటిని గురించి మాట్లాడేవాడు, ఆలోచించేవాడు.

    కాని వీటన్నిటినీ తలదన్నారు  విప్రవినోదులు. ఒకరోజు స్కూల్లో వాళ్ళ ప్రదర్శనం ఏర్పాటు చేశారు. స్కూలు పిల్లలంతా వాళ్ళచుట్టూ నిలుచున్నారు, కూచున్నారు. మేష్టర్లకు మాత్రం కుర్చీలు వేశారు.

    అసలు ముగ్గురు విప్రవినోదులు. అందులో ఒకడుమటుకు ప్రదర్శనం ఆరంభంలోనే ఇసకలో నాలుగుపుల్లలు నిలబెట్టి వాటి చుట్టూ గుడ్డ ఒకటి చుట్టి, పైనకూడా గుడ్డ కప్పి, అందరూ చూస్తుండగానే అందులోకి ఒకడు చేరాడు. మిగిలిన ఇద్దరూ రకరకాల విద్యలు ప్రదర్శించారు. ఇసకలో తేలుబొమ్మ గీసి దాని కొండిమీద స్కూలు ప్యూనును వేలు పెట్టమని వాడికి తేలుకుట్టినంత బాధా తెప్పించారు. వాడు వేలు చేత్తో గట్టిగా పట్టుకుని, "అమ్మో, బాబో" అని ఏడుస్తుంటే మొదట కుర్రాళ్ళు నవ్వారు. కాని అంతకంతకూ వాడి బాధ జాస్తి అయింది. చివరకు మేష్టర్లు కూడా జోక్యం కలిగించుకుని వాడికి బాధ పోగొట్టమని విప్ర వినోదులను అడగాలిసొచ్చింది. వాడికి బాధ ఎట్లా వచ్చిందో అట్లాగే పోయింది.

    తరువాత కుర్రాళ్ళు కొందరు వాణ్ణి ఎడంగాపిలిచి, "ఏంరా, పోలాయ్? నిజంగా నీకు బాధపుట్టిందా? లేక దొంగవేషం వేశావా?" అని అడిగితె వాడు నిజంగానే బాధపెట్టిందన్నాడు. తేలు కుట్టినచోట ఇంకా చిమచిమ   లాడుతున్నదా అంటే లేదన్నాడు.

    విప్రవినోదు లింకా చాలా తమాషాలుచేశారు. అందులో కొన్ని వీధిగారడీవాళ్ళు చేసేవి. మరికొన్ని కనుకట్టు లాటివి.

    అన్నిటికన్నా సుందరానికి జన్మలో మరపురాని విస్మయం కలిగించిందేమంటే గుడారంలోనుంచి దేవాతార్చనగంట వినిపించింది. ఆ మరుక్షణం హారతి వెలుగుతున్నట్టు గుడ్డలోనుంచి కనిపించింది. గుడారంలోకి వఠ్ఠిచేతులతో వెళ్ళినమనిషి. హారతి పళ్ళెంతో, రెండోచేత గంట వాయించుకుంటూ  గుడ్డతోసుకుని బయటికొచ్చాడు, తరువాత గుడ్డతీశాడు. లోపల మూడు విగ్రహాలు అమర్చిఉన్నాయి. వాటి పాదాలవద్ద పూలు పూజచేసి ఉన్నాయి. విగ్రహాలముందు రెండు పళ్లాలలో కొబ్బరిమూక్కలూ అరటిపండు ముక్కలూ ప్రసాదం ఉన్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS