భార్గవ పదినిమిషాలు తీవ్రంగా ఆలోచించి.....తల విదిలించి 'నాకెవరూ శత్రువుల్లేరు' అన్నాడు.
"నీ పెళ్ళికి ముందు ఏ అమ్మాయినైనా ప్రేమించావా?"
"లేదు. నేనసలు ప్రేమల జోలికే వెళ్ళలేదు. నాన్నగారు చూసిన సంబంధమే బుద్దిగా చేసుకున్నాను. కానీ ణా దురదృష్టం....." బాధగా చెప్పాడు.
"అప్పుడు గానీ, యిప్పుడు గాని నీ మీద మనసు పెట్టుకున్న అమ్మాయి లెవరయినా వున్నారా? అఫ్ కోర్స్! నీ అభిమానుల్లో ఎవరయినా పెళ్ళి చేసుకుంటానంటే నువ్వు తిరస్కరించావా?" సూటిగా అడుగుతున్నాడు అమితేష్ కాఫీ త్రాగుతూ.
"నో. నో. ణా వ్యక్తిత్వం ఎలాంటిదో నా పాఠకులకు తెలుసు. నే నెవర్నీ ప్రేమించలేదు. నన్నెవరూ ప్రేమించరు. అలాంటిది జరిగే అవకాశామే లేదు" భార్గవ కళ్ళలో రోజు రోజుకూ భయం తాలూకు బెల స్పష్టమవుతుంది.
"ఈసారి పెద్దగా రాసినట్టుందే- ఏమిటి?" అంటూ అమితేష్ ఆ ఉత్తరాన్ని చదవటం ప్రారంభించాడు.
"నా ప్రియమైన భార్గవా!
ఒకో మనిషికి ఒకో వయసులో ఆలోచించే శక్తి పెరిగినా-నా కురూపితనానికి నువ్వే శక్తినీ ఆపాధించలేదు....
వర్షపు చినుకునై తామరాకు మీద పడి తళుక్కుమనలేకపోయినా....దాన్ని సృష్టించిన బురదగుంటలో కల్సిన బ్రతుకును పేర్చావు.......
మొహానికి మశూచి పెట్టినా.....కుడిచేతికి బొటన వ్రేలు తీసినా....అంగవైకల్యంతో నా రూపాన్ని అష్టవంకర్లు త్రిప్పి వదిలినా__మల్లెలాంటి తెల్లనైన మనసు మాత్రం ఎందుకు పెట్టావయ్యా....ఆ మనసుకు కళాభిమానం సృష్టించి__ పదిమందిని చేర్చి కురూపితనాన్ని మాటల సూదులతో కుళ్ళు కుళ్ళు పొడుస్తున్నప్పుడల్లా__నీకు తెలియని మనోవేదన ఎంతసుఖవించానో నీకు తెలీదేమే-?
భార్గవా! నాకేదీ సంతోషం__?
నాకేదీ స్వతంత్రం__?
నువ్వు మిగులుస్తున్న విషాదం తప్ప!!!
నువ్వు చీకట్లను బాగా అల్లగలవ్. ఆ చీకటికి కాటుకను పూసి మసి బొగ్గుతో రీకోటింగ్ చెయ్యగలవ్.
ఏ విషాదపు చీకట్లలోంచి నేను నేనుగా రాస్తున్నానిది?
నాకు తెలుసు...ఈ ఉత్తరాలు ప్రపంచమంతా అచ్చెరువొందేనని.
ఒకడి జీవితాన్ని శాసించే హక్కు ఏ సమాజానికీ లేదని మీరంతా రాస్తున్నప్పుడు___ఒక పాత్ర జీవితాన్ని శాసించే హక్కు రచయితలకు మాత్రమెక్కడిది??
నా జీవితాన్ని నలుపుతూ...పాఠకుల గుండెల్ని పిండాలని నీ కలానికెంత తాపత్రయం???
సెలయేటి ఒడ్డుల ఏకాంతాల్ని వెన్నెల్లో ఇసుకతిన్నెల మీద పరుండే కోరికలు మిగతా పాత్రల్లాగా నాకెందుకుండవనుకున్నావ్?
మంచుసొనల్లో తడిసి ఎడబాటు విరహంలో జ్వలనోజ్వలంగా ఒళ్ళు విరుచుకొనే ఎదురు చూపుల కళ్ళను... కలంతో పొడిచిన కళ్ళు గుణంలో కురూపితనాన్ని ఆపాదించావే___ఎలా చెప్పను? నీకెలా చెబితే అర్ధమవుతుంది భార్గవా!
"గత మివ తవ పరి రంభ సుఖాయా....
సావిరహే తవదీనా...." అన్నట్టుగానే!!!
అజంతా అందాల్ని కోరలేదు__
గుండెను ఎల్లోరా గుహను చెయ్యమనలేదు__
రామప్ప సౌందర్యాలన్నీ రంగరించి రంజింప చేయమనలేదు__
తరతరాలు భూమిపొరల్లో పొదిగిపోయిన క్రీస్తుపూర్వపు శిలాజంలా సృష్టించి...ఈ కృత్రిమ మనుష్యుల మధ్య ఆడించటం-నీకు భావ్యమా?
అష్టకష్టాల అగాధాల్లోంచి పుట్టుకోస్తున్న అంతఃస్రవంతిది!
రూపానికి కురూపాన్ని పులిమి__ గుండెకు కళాభిమానాన్ని పూసి ఈ వ్యవస్థలోకి నన్ను జారవిడువటం నీకు న్యాయమా?
నవలికలో నన్నెంత దారుణంగా చిత్రించావు...
ప్రక్కింటి పిల్లలు ఆడ నెమళ్ళులై నర్తిస్తుంటే- నేనెంత బాధ పడ్డాను. తన్మయత్వంతో నే చేసిన భంగిమలు చూసి__రాక్షస నృత్యమని....రాళ్ళతో తరిమి తరిమి కొట్టారా పిల్లలు నీ నవలికలో..
ఒకమ్మాయి మాత్రం నను ఓదార్చినా తపనతో తపస్సు చేయించి తపస్సుకు ఆశల ఉషస్సుతో పారద్రోలడానికి ప్రయత్నించి హస్తభంగిమలు పెట్టమన్నప్పుడు...బొటనవ్రేలు లేక రాక్షస భంగిమల్లా ఉన్నాయని-ఆ పాప తుర్రుమన్నప్పుడు ఎంత మధనపడ్డాను?
నాలో ఎంతటి ప్రగాఢమైన కోరిక? అజంతా శిల్పమై....అమరావతీ అందాన్నై...అపురూప హస్తభంగిమలు పెట్టాలని__
ఏవీ ఆ కుంకుమ కుసుమార హస్తాలు?
ఇవిగో ఈ సృష్టికర్తకు మొండి చేతుల నీరాజనాలు....!!
ఈ విశాల విశ్వమంతా శూన్యమై__చుక్కలు మాత్రమే తోడై నప్పుడు...ఆ వెన్నెల్లో ఎన్ని హస్తభంగిమలు పెట్టాను__? కళామతల్లి తప్పులు తప్పులు తాళాలని నవ్వేంత వరకూ- ఎన్ని తప్పుల హస్తభంగిమలు? ఆ వూహల్లో బొటనవ్రేలు చూసుకున్న భంగిమలు....
నీకెలా అర్ధం చేయను?
రచయిత కలం....డబ్బుతో సమాగమ మైనప్పుడు పాత్రల సృష్టి తెలుసుగానీ వాటి మనోదృష్టి మీరెరుగరు.
అందుకే__
ఓ నా సృష్టికర్తా! నన్ను చంపకు....నా నరాలు తెంపి, నా గుండెను ఖైమా చేసి__డబ్బు కోసం పాఠకులకు పంచిపెట్టాలనే నీ కోరికకు స్వస్తి చెప్పి నన్ను చంపొద్దు.
ఇది కోరిక__
ఇది అభ్యర్ధన__
ఇది ప్రార్ధన__
ఈ ప్రార్ధనను కాలరాసిన్నాడు__మంటలు.....మంటలు...గ్రీష్మం కక్కిన చీతాగ్ని కీలతై - సాహితీ ప్రపంచాన్ని చుట్టుముట్టి- నాశనం చేయక తప్పదు.
